రాత్రి – పగలు

రాత్రి – పగలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: పి. వి. ఎన్. కృష్ణవేణి

నాకు చిన్నప్పుడు ఎన్నో కథలు అమ్మ మరియు మా తెలుగు మాస్టారు చెప్పేవారు. అవి ఇప్పటికీ కొన్ని నా మనసులో తీపి జ్ఞాపకాల లాగా అలా నిలిచిపోయాయి. అందులోని ఒక కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. అతనికి పేరు కంటే కూడా బద్దకస్తుడా అనే పేరు స్థిరపడిపోయింది. అతని బద్దకాన్ని వదిలించడానికి ఎవరితరం కాలేదు. ఇది ఇలా ఉండగా అతనిని చూసి తనను పుట్టించిన ప్రకృతి కూడా అసహ్యం పుట్టింది. ప్రకృతి మాత ఆలోచించి, మానవులను ఇలాగే వదిలేస్తే, భవిష్యత్ లో అందరూ ఇలాగే తయారు అవుతారు అని బాధ పడసాగింది. అందుకే రాత్రి, పగలు అనే అక్కచెల్లెళ్ళను సృష్టించింది. వారి ద్వారా రోజు గడుస్తుంది. రోజూ ఉదయాన్నే పగలు అనే ఒక అందమైన అమ్మాయి వచ్చి, రాముకి సపర్యలు చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి చాలా అణకువగా ఉంటూ, అవసరాలు అన్నీ తీరుస్తూ, ఆనంద పరుస్తూ ఉండేది. ఇంక రాత్రి విషయానికొస్తే, చూడడానికి భయంకరంగా ఉంటూ, చిత్రహింసలు పెడుతూ ఉండేది. అతని చేత చాకిరీ  చేయించి, ఆ పైన ఘడియకు ఒక దెబ్బ చొప్పున వీపు మీద వాతలు పడేలా కొడుతూ ఉండేది. ఆ వాతలతో గడియలు లెక్కపెట్టుకుంటూ, పగలు రాగానే రాత్రి వెళ్ళిపోయేది. పగలను చూస్తే రాత్రికి చాలా భయం. ఎందుకంటే, పగలు వచ్చేసరికి రాత్రి వెళ్ళిపోవాలి. లేదంటే ఆ రేయి పగలు వెలుగుకి కరిగిపోతుంది.
ఆ వాతలకు, తగిలిన దెబ్బలకు వెన్న రాస్తూ సపరియాలు చేస్తూ ఉంది పగలు అతని బాధ చూడలేక విలవిలలాడిపోయింది. దానికి ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె ఇచ్చిన సలహా ప్రకారం, అతను గడియ ఒక దెబ్బ కొట్టగానే పగలు ఇచ్చిన నెమలి ఈకతో ఆ దెబ్బను చెరుపేసుకునేవాడు అప్పుడు రాత్రికి ఎన్ని దెబ్బలు కొట్టిందో ఎన్ని గడియలు గడిచాయో లెక్క తెలియలేదు. ఆ నెమలీక మహిమ వల్ల, రాత్రి ఉండగానే పగలు వచ్చేసింది. ఆ వెలుగు చూడలేక రాత్రి, తట్టుకోలేక పోయింది. వెన్నెలగా మారిపోయింది. అది గ్రహించిన రాము చాలా సంతోషించాడు. ఇంక అంతా సంతోషమే కానీ దుఃఖం లేదు అనుకుంటూ గర్వించసాగాడు.
అప్పుడు పగలు వచ్చి కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కష్టం లేనప్పుడు సుఖమెక్కువయితే, అది మనిషి జీవితానికి అనర్థకం తెచ్చిపెడుతుంది. కనుక నేను నీకు స్వాంతన ఇవ్వలసిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది. రాముకి కష్టసుఖాల యొక్క సుఖదుఖాల యొక్క విలువ తెలిసి వచ్చింది. మానవుని జీవిత విధానం గమనించగా, అందరూ తమ పనిలో తాను నిమగ్నమై ఉండడం చూసి తన నడవడిక మార్చుకున్నాడు. ఎవరి జీవితాన్ని వారే సంరక్షించుకోవాలి. ఇహంలో పుణ్యం చేస్తే, పరంలో సుఖపడవచ్చు. అలాగే వర్తమానంలో కష్టపడితే భవిష్యత్తులో బాగుపడొచ్చు అని గ్రహించుకొని తన పని తను కుదుర్చుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!