“దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు”

రచన :కవిత దాస్యం

ఆనందమయ జీవితానికి స్వాగతం! 

ఒక ఊరిలో రంగయ్య అనే మధ్యవయస్కుడు ఉంటాడు. అతడు కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పని చేస్తుంటాడు! ఆ రోడ్డుకు ఎదురుగా పాండురంగని గుడి ఉంటుంది!  రోజు ఆ దేవుడిని చూస్తూ నీ పేరు రంగడు, నాపేరు రంగడు కానీ రోజు నువ్వు హాయిగా పూజలందుకుంటావు, నాకు మాత్రం ఈ రోడ్లు ఊడ్చే పని ఇచ్చావు! ఒకరోజు నా పని చేస్తే ఎంత కష్టమైనదో తెలుస్తుంది! అని రోజూ దేవుడిని అడుగుతూ ఉంటాడు!

        ఒకరోజు విని విని దేవునికి విసుగుచెంది రంగయ్య ముందు ప్రత్యక్షం అవుతాడు! అది చూసి ఆశ్చర్యం చెంది ఎవరు నువ్వు కొంపదీసి దేవుడివా, నా మొర ఆలకించి వచ్చావా! అంటే అవును రంగయ్య నీ మొర ఆలకించి, ఒకరోజు నీ స్థానంలో నేనుండి నా స్థానంలో నీకు ఉండడం సమ్మతమేనా! అని అడగగా రంగయ్య సంతోషంతో సరే అంటాడు! దేవుడు నా స్థానంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి- మాట్లాడకూడదు అని షరతు పెడతాడు! 

       తర్వాత రోజు ఇద్దరి స్థానాలు మారిపోయాయి!  సుఖంగా ఉంది అనుకుంటాడు రంగయ్య! ఒక వ్యాపారి స్వామి నా వ్యాపారాన్ని ఇలాగే నడిపించు హుండీలో డబ్బులు వేస్తాడు! అతని పర్సు కింద పడిపోవడం గమనించిన రంగయ్య దేవుని మాటలు గుర్తొచ్చే మౌనంగా ఉంటాడు! తర్వాత రిక్షా నడిపేవాడు వచ్చి ఎంత కష్టపడ్డా డబ్బు లోటు ఉంటుంది డబ్బులు ఇచ్చి ఆదుకోమని వేడుకుంటాడు! కళ్ళు తెరిచి చూసేసరికి అందులో డబ్బులు చూసి ఆశ్చర్యంతో స్వామి నను కరుణించావా అని తీసుకొని ఆనందపడతాడు! ఇది గమనించిన రంగడు ఓరి పాపి పర్సు దొంగతనం చేస్తావా! అని అరవబొగా మళ్లీ దేవుడు మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండాలని గుర్తొస్తుంది! మౌనం ఇంత కష్టమా అనుకుంటాడు! ఒక నౌక నడిపే నావికుడు వస్తాడు! నౌకలో దూర ప్రయాణం చేయాలి! ఇంతలో పర్స్ పోయిన వ్యాపారి పోలీసులను వెంట బెట్టుకొని వస్తాడు! ఇతడే అయ్యుండాలని నావికున్ని చూపిస్తాడు! నాకేం తెలియదు అన్నా వినిపించుకోకుండా ఏంటి  నిర్దోషిని దోషిని అరెస్టు చేస్తారా! ఇక మౌనం వహించటం నావల్ల కాదని రంగడు మాట్లాడడం మొదలు పెడతాడు! నీ పర్సు దొంగలించింది  ఇతను కాదు రిక్షా వాడు దొంగ అతను అరెస్ట్ చేయండి అని చెబుతున్నా స్వామి మాటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు రిక్షావాన్ని పట్టుకొని వెళ్తారు! రంగయ్య హమ్మయ్య నేను ఎంత న్యాయం చేశాను! అని మురిసిపోతాడు! ఒప్పందం ప్రకారం ఒకరోజు ముగుస్తుంది!

          దేవుడు వస్తాడు! ఏమైంది రంగయ్య నీ స్థానంలో రోడ్లు ఊడ్చాను చాలా తేలికగా ఉంది కష్టం కాలేదు! మరి నీకేం జరిగింది అని అడుగగా రంగయ్య జరిగిందంతా వివరిస్తాడు! అది విన్న దేవుడు ఎంతపని చేశావు నిన్ను మాట్లాడవద్దని చెప్పానుగా! నీ వల్ల ఎంత నష్టం జరిగింది తెలుసా! అనగా అదేలా అందరికీ నేను న్యాయం చేశానుగా! అంటే అలా కాదు ఆ వ్యాపారి అన్యాయంగా సంపాదిస్తూ నాకు దక్షిణ వేస్తున్నాడు! అందుకే అతని పర్స్ పడేలా చేశాను! దానివల్ల కొద్దిగా బుద్ధి వచ్చేది – అన్యాయంగా సంపాదిస్తే సులభంగా డబ్బు పోతుందని గ్రహించేవాడు! రిక్షావాడు నన్నే నమ్మేవాడు అతనికి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడేది – ఆపద తీర్చేది! వ్యాపారి పాపం కొంచెం అన్న తగ్గేది నావికుడుకి రోడ్డు ప్రమాదం ఉండేది! పోలీసులు అతన్ని పట్టుకుని ఉంటే ప్రమాదం తప్పేది! కానీ నువ్వు మాట్లాడడం వల్ల నావికుడు మరణించాడు! వ్యాపారి అహంకారం ఇంకా పెరిగింది! రిక్షావాడు కష్టాల పాలయ్యాడు! జరిగేదాన్ని జరగకుండా అడ్డుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి! అందుకే ఏది ఎలా జరగాలో మౌనంగా ఉండి నడిపిస్తాను! తెలిసిందా నా స్థానంలో ఉండడం ఎంత కష్టమో! అని, శారీరక కష్టం అన్నిటి కంటే సులభం! మాటని – మనసుని అదుపులో పెట్టుకోవడం కష్టం! ఇంకెప్పుడూ నిన్ను నిందించను! అని రంగడు స్వామికి సాష్టాంగ- నమస్కారం చేసి, తన పని తాను చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడపడం కొనసాగించాడు!

 నీతి :మన పని మనం చేసుకుంటూ పోతే ఆ కాలం తీర్పు చెపుతుంది! ఎవరి కర్మానుసారంగా వారి జీవితం ఆధారపడి ఉంటుంది! అది తెలుసుకొని మసలుకోవాలి! 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!