ఎవరి గొప్ప వారిదే

ఎవరి గొప్ప వారిదే

రచన: : అలేఖ్య రవికాంతి

ఒరేయ్ రాము, నువ్వెంత ప్రయత్నించిన రేపటి పోటీలో గెలవ లేవురా అంటు హేళనగా మాట్లాడసాగాడు సోము.
ఎందుకురా, నేనెందుకు పోటీలో గెలవలేనో చెప్పు అంటు కోపంగా అన్నాడు రాము.
ఎందుకా! నువ్వు ఎంత పొట్టిగా ఉన్నావో చూడు. నీకు బాస్కెట్‌బాల్ ఎలా అందుద్ది… హ… హ… హ అంటు వెటకారంగా నవ్వాడు సోము.
సోము మాటలు విని రాము చాలా బాధపడి ఏడుస్తు తల్లి వద్దకు వెళ్లి సోము అన్న మాటలు చెప్పాడు.
తల్లి సోము వద్దకు వచ్చి, బాబు సోము తమ్ముడ్ని అలా పొట్టి వాడని హేళన చేయడం నీకు తగునా?దేవుడు ఎవరికిచ్చేది వారికిస్తాడు. ఎవరిలో ఏ ప్రతిభ ఉందో ఎవరికి తెలుసు. అందరిలోను కొన్ని లోపాలుంటాయి కొన్ని ప్రత్యేకతలుంటాయి. మనం తెలుసుకోకుండా మాట జారకూడదు.
ఇప్పుడు మీకో నీతి కథ చెబుతాను. పిల్లలు శ్రద్ధగా వినండి అంటు కథ చెప్పడం మొదలెట్టింది.
ఒకరోజు మనిషి చేతికున్న ఐదు వేళ్ళు వారిలో ఎవరు గొప్ప! అని చర్చించుకుంటున్నాయి.
మొదటగా బొటనవేలు అంది మిత్రులారా, నేను లేనిది ఎవరు దేనిని పట్టుకోలేరు, రాయలేరు కాబట్టి నేనే గొప్ప అంది బడాయిలుపోతూ.
ఇంతలో చూపుడువేలంది కాదు, నేను ఎదుటి వారి తప్పులను ధైర్యంగా ఎత్తి చూపే సత్తువగలదాన్ని కావున నేనే గొప్ప అంది అహంకారంగా…
అప్పుడు మధ్యవేలు అంది లేదులేదు మీ అందరికన్నా నేనే పొడువైనదాన్ని కాబట్టి నేనే గొప్ప అంది డాంభికాలు పోతూ.
అందరి మాటలు విన్న ఉంగరపు వేలు నవ్వుతూ మీ అందరికన్నా నేనే గొప్ప ఎందుకంటే వజ్రాలు, బంగారం పొదిగిన ఉంగరాలు నా వేలికే జనులు తొడిగి మురిసిపోతారు కాబట్టి నేనే గొప్ప అంది రాజసంగా…
అప్పుడన్ని వేళ్ళు లేదు మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదించుకుంటున్నాయి. అందరిని గమనిస్తున్న చిటికెన వేలు ఇలా అంది.
ఎందుకు మీరందరూ అలా పొట్లాడుకుంటున్నారు. ఎవరి అందం, గొప్ప వారిది. ప్రతి వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అనవసరంగా తగువు పడక మనందరం ఐకమత్యంగా ఉందాం అంది.
చిటికెన వేలు మాట విన్న మిగతా నాలుగు వేళ్ళు పగలబడి నవ్వుతూ ఇన్ని నీతులు చెబుతున్నావు అసలు నీవు ఉన్నా లేకున్నా ఒకటే ఎందుకంటే నీతో అంతగా పనేముంటుంది… నీకు ప్రత్యేకత ఏముంది పాపం అని హేళన చేసాయి.
చిటికెన వేలు నవ్వుతూ మీరందరు ఎన్ని పనులు చేసిన దేవుడికి మొక్కేటప్పుడు మాత్రం నేనే ముందుంటాను.మీరందరూ నా వెనుకాల అనుసరిస్తారు మరిచిపోకండి. అది చాలదా. దేవుడే చెప్పాడు మనలో ఎవరు గొప్పని అంది ఆనందంగా…
చిటికెనవేలు మాటలు విన్న మిగితా నాలుగు వేళ్ళు తమ తప్పును గ్రహించి సిగ్గుతో తలదించుకుని చిటికెనవేలుని క్షమాపణలు కోరాయి !!
మన కన్నా చిన్నవారిని చిన్నచూపు చూస్తూ హేళన చేయడం తప్పు. ప్రతి వారిలోని ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎవరి గొప్ప వారిది కదా! అంటు తల్లి అనేసరికి సోము తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి రాముని క్షమాపణలు కోరాడు. సోములో మార్పు రావడంతో తల్లి, రాము చాలా సంతోషించారు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!