అతడు

అతడు

రచన:: నన్ద త్రినాధరావు

           ఆ బాలుడు తన కుటుంబంలో  14వ చివరి సంతానంగా జన్మించాడు. అతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేసాడు. ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా ఆ బాలుడి తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు ఇద్దరు  అన్నలు మాత్రం మిగిలారు.

ఆ బాలుడు చిన్నతనంలోనే ఎన్నో ఇబ్బందులు  ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అతడు నీళ్ళు తాగాలంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు. ప్యూన్ లేకపోతే అతడు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని ఆ బాలుడు క్లుప్తంగా – “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.

డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందించే మంగలి, చాకలి కూడా ముందుకు రాకపోవడం వలన అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అతడు 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912 లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత అతడు కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత “ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా” అనే పేరుతో  ప్రచురిత మయ్యింది.1917లో స్వదేశం వచ్చాడు.

అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక అంటరాని వ్యక్తి అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కల్గించింది. అతడు ఒక మహారాజు సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు సైతం కాగితాలు అతని చేతికివ్వకుండా బల్లపై ఎత్తివేసేవారు. 

32 సంవత్సరాల వయసులో అతడు, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీసు జవానులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూశారు.

1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగటానికి వారికి ఆ చెరువులో ప్రవేశం లేదు. కానీ అతని నాయకత్వంలో వేలాదిమంది. ఆ చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.

1927లో అతడు ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అతడు ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టి వుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని అనడు. ‘అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అతడు కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 

అతడు తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.1956 అక్టోబరు 14న నాగపూర్‌లో అతడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. హిందువుగా పుట్టిన అతడు హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అతడు పెక్కు గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి.

ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ అతడ్ని భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అతడు విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన అతడు 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన అతని స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి భారత ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డును ఇవ్వడం అత్యంత అభినందనీయం. అతడే డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!