ఉప్మా యుద్దం

రచన – తపస్వి

ఇది ఇంతకు ముందు నాకు తెలియని క్షణం…

ఇది నేను గెలిచానా…? లేదా…? అని నాకు నేనే పరీక్షించుకునే క్షణం…

స్పూన్ కూడా ఇంత బరువుగా ఉంటుంది అని ఇంతకు ముందు ఎపుడూ తెలియని క్షణం…

నా చేతిలో ఉన్న ప్లేట్ వణుకుతుంది…

అందులో ఉన్న ఉప్మా… నా వైపు ఆశగా చూస్తుంది. ఆశనా…? కాదు భయం కూడా అయి ఉంటుంది. ఇప్పటికైనా… నా కడుపులోకి చేరుతుందా? లేక మళ్ళీ డస్ట్ బిన్ లోకి వెళుతుందా అని కాబోలు…

ఎందుకో ఉప్మా పైన ఉన్న జీడిపప్పు నన్ను చూసి నవ్వూతూ ఉన్నట్టు ఉంది… నవ్వుతుందా…? ఎక్కిరిస్తుందా…? లేక భయపడుతుందా… ఉప్మా తిన్న… తినకపోయినా… దాన్ని మాత్రం ఏరుకుని తినేస్తా… అనా…!

కరివేపాకు నాతో పరాచికాలు ఆడుతున్నట్టు ఉంది… నువ్వు కాని ఈ పందెం ఓడిపోయావో… ఇక నీ పరిస్థితి నాలాగే అంటునట్టు ఉంది.

ఆవాలు… రా… రా… అని చంద్రముఖిలా పిలుస్తున్నట్టు…

జీలకర్ర చీర్ గర్ల్స్ లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టు ఉన్నాయి.

ఎప్పుడూ గర్వంతో, మా నాన్న హీరో అన్నట్టు చూసే నా కూతురు కళ్ళు… నన్ను జాలితో చూస్తున్నట్లు అనిపిస్తుంది.

ఇదంతా నిజంగానేనా…? లేక నాకే అలా అనిపిస్తుందా? దేవుడా నాకు ఎందుకు ఈ పరీక్ష…? అని గట్టిగా అరవాలని ఉంది.

మళ్లీ ఎక్కడ నువ్వు చేతులారా చేసుకున్న దానికి నేనేం చేశారా… అని ఒక్కటిస్తాడు అనే భయంతో ఆపేసా.

నా నోటిదూలతో వాగిన వాగుడు… ఆ ఒక్క మాట… ఈ రోజుని ఇంత టెన్షన్ గా… భయంకరంగా మారుస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు.

ఎప్పుడూ వంట గదిలోకి వెళ్ళని నేను, ఇప్పుడు ఆ వంటగదిలో ఉప్మా కోసం ఒక యుద్ధమే చేశాను.

మరి ఆ యుద్ధం నేను గెలిచానా…? లేదా…? అసలు ఆ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది, తెలుసుకోవాలి అంటే ముందు ఒక కథ తెలుసుకోవాలి.

“ఉప్మా…” నాకు నచ్చనిది అని చెప్పను కాని, విసుగు వచ్చినది అని మాత్రం అనగలను. చిన్నప్పటి నుండి… “టిఫిన్ ఏంటి” అంటే తేలిగ్గా అయిపోతుంది కదా అని, ఛాన్స్ దొరికితే “ఉప్మా చేసా…” అనే అమ్మ, పెళ్లి అయ్యాక పెళ్ళాం. ఇక ఎక్కడ చుట్టాల ఇంట్లో ఫంక్షన్స్ కి వెళ్ళిన తినడానికి ముందు పెట్టేది అదే. మళ్ళీ ఎర్ర రవ్వ, తెల్ల రవ్వ… అది… ఇది అంటూ అదో గోల. ఏదైన ఉప్మా… ఉప్మానే కదా… అలా అని ఉప్మా అసలు తినను అని కాదు, పెసరట్టు ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం.

నా యుద్దానికి మూల కారణం కూడా ఈ పెసరట్టు ఉప్మానే… ఇంట్లో గ్రైండర్ పాడైంది కదా అంటూ… మా ఆవిడ గత 5 రోజుల నుండి అదే పనిగా ఒక్కో రకమైన ఉప్మా చేస్తూ ఉంది, తిని తిని విసుగు వచ్చింది. ఇక నా వల్ల కాక లాక్ డౌన్ అయినా కూడా… క్రింద, మీద పడి… ఎక్కడో ఒకరిని పట్టుకుని గ్రైండర్ బాగు చేయించి తీసుకువచ్చా.       ‘ఆదివారం కదా పెసరట్టు ఉప్మా చేసి పెట్టు ప్రొదున్నే’ అని చెప్పి పడుకున్న శనివారం రాత్రి.

ఆదివారం అయింది, తీరిగ్గా 9 గంటలకి అమ్మ ఫోన్ తో నిద్ర లేచా… ఫోన్ వచ్చినా లేవను అనుకోండి కానీ కరెంట్ పోయింది, సో అది అసలు కారణం. పలకరింపులు, అనవసరమైన విషయాలు అన్ని అయ్యాక నాన్నకి ఇచ్చింది ఫోన్. “ఏం చేస్తున్నారు నాన్న…” అంటే… “ఉప్మా తింటున్నా…” చాలా సంతోషంగా చెప్పేసరికి ఒళ్ళు మండింది నాకు.

“ఉప్మా…” అసలు ఈయన వల్లే కదా నాకు ఉప్మా అంటే సగం చిరాకు…, ఈయనకి ఇష్టం అనే కదా రెండు రోజులకీ ఒకసారి… నా కర్మ కొద్దీ రోజుకొకసారి, మా అమ్మ ఉప్మాతో… రకరకాల ప్రయోగాలు చేస్తూ ఆయనకి పెట్టడం. ఆయన లొట్టేసుకుంటూ తినటం… తప్పక మేము తినటం, అదో టార్చర్… ఒక్కోసారి అసలు అది ఏం ఉప్మా… ఏం పెట్టి చేసింది కూడా తెలిసేది కాదు.

ఆయన మాత్రం మా అమ్మ ముందు కూర్చుని, ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ మైమరిచిపోయి తినటం, ఈవిడ కొసరి కొసరి వడ్డించటం… దేవుడా…! ఏమైనా అంటే ఓ ఉప్మా ప్రేమకథ చెప్పటం… అది విని… విని ఆ కథ మీద , ప్రేమ మీద మాకు విసుగు రావటం. ఏంటి ఆ కథ అంటారా… చెబుతా…

మా అమ్మనాన్నలది ప్రేమపెళ్లి… పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. చేతిలో డబ్బు అయిపోయి… ఇంట్లో సరుకులు అయిపోయిగా మిగిలి ఉన్న ఉప్మా రవ్వతో… 3 రోజులు ఉప్మానే వండుకుని కడుపు నింపుకునేవారట… అప్పుడు కూడా ఆ ఉప్మా ఒక్కరికే సరిపోయేది, ఇద్దరు కలిపి చెరిసగం తిని, నీళ్ళు తాగి సంతోషంగా ఉండేవాళ్ళట. అందుకే కష్టకాలంలో తమని ఆదుకున్న ఆ ఉప్మా అంటే మా నాన్నకి, అమ్మకి అంత ఇష్టం. అది తింటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆ పాత రోజుల్లోకి వెళ్లి కొత్త ప్రేమికులుగా… కాదు, కాదు కొత్తగా పెళ్లి అయిన ప్రేమజంటలా ఫీల్ అయ్యేవారు.

సర్లే ఇంతకీ నా కథ ఎక్కడ ఆపా…?

హా… కరెంటు పోతే… లేచా కదా… ఫ్రెష్ అయ్యి, ఇక పెసరట్టు మీద పడాలని కోరికతో మా ఆవిడగారిని పిలిచి ఇక టిఫిన్ పెట్టు అన్నా…

కాని మా ఆవిడ చెప్పింది వినగానే… కరోనా….. నా పక్కింటి వాడికి వచ్చింది అన్నట్లు షాక్ తగిలింది.

“ఈ పూటకి ఉప్మా తినండిక…, సాయంత్రం పెసరట్టు తిందురు గాని…”

“ఉప్మానా…….”

అసలే మండిపోయి ఉన్న, అంతే నా కోపం కరోనాలా విజృంభించింది.

నా అరుపుకి ఉలిక్కిపడ్డ మా ఆవిడ షాక్ తో నా వైపు చూసింది.

“అంత గట్టిగా అరవక్కరలేదు… మీకేం వినపడింది తెలీదు. నేను అన్నది ఉప్మా…” అంది తాపీగా.

అదిగో మళ్ళీ ఉప్మా… నా పెసరట్టు ఆశల మీద శానిటైజర్ పోసింది కాక… ఛి… ఛి… ఈ కరోనా దెబ్బతో పోలికలు కూడా మారిపోతున్నాయి… నా ఆశలు మీద నీళ్ళు చల్లింది కాక… మళ్ళీ మళ్లీ ఉప్మా అంటదా…

“పెసరట్టు ఏది…?” అరిచినంత పని చేశా.

“కరెంట్ పోయింది కదా… పిండి వేయటం కుదరలేదు…” వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అన్నదా అని నాకు అనుమానం కలిగింది.

“ముందే వేసి పెట్టుకోవాలి కదా…” అడిగాను.

“ఇది మరీ బాగుంది, మీరేగా కరెక్ట్ గా తినే అరగంట ముందు వేయాలి పిండి… అపుడే నాకు ఇష్టం అన్నారు… అలాగే కదా ఎప్పుడూ వేస్త… నేనేం చేయను కరెక్ట్ టైమ్ కి కరెంట్ పోతే…” కోపంగా అన్నదా? చిరాగ్గా అన్నదా? ఏమో, ఎండలతో మనుషులకి చెమటతో పాటు, చిరాకు కూడా పెరుగుతుంది కదా.

“సర్లే, పెసరట్టు లేకపోతే లేకపోయింది… ఉప్మా తప్ప ఇంకేదన్నా చేసి పెట్టు…”.

“కుదరదు… పెసరట్టులోకి అని, ఉప్మా కోసం అన్నీ రెఢీ చేసి పెట్టా… కాబట్టి ఈ పూటకి అదే తినండి…” వేరే ఛాయిస్ లేదు అన్నట్టు చెప్పింది.

“వాట్… నో… నేను తినను…” నేను తెగేసి చెప్పా…

“ఏ… ఎందుకు తినరు… పెసరట్టులోకైతే తింటారు కదా…” కనులు ఎగరేస్తూ అడిగింది.

“నేను తినను అంటే… తినను… అయినా అసలు మీ ఆడవాళ్లేంటే… సందు దొరికితే ఉప్మా అంటారు… ఏ… అదైతే… ఒళ్లు వంగకుండ తేలిగ్గా చేసి, మా మొహాన పడేయెచ్చు అనా…”

ఇదిగో… ఈ నోటిదూలే ఆఖరికి నా దూల తీర్చింది. అసలే మా ఆవిడ ఆడాళ్ళు, వాళ్ళ హక్కులు అంటూ సంఘాల్లో తిరిగే రకం… పైగా తను కూడా ఉప్మాకి బానిస. ఇంకేం ఉంది…, అటు ఆడాళ్ళని, ఇటు ఉప్మానీ కలిపి అనే సరికి… మా ఆవిడ మొఖం చూడాలి….. ఉగ్రరూపం ఎత్తిన కాళీలా మారింది. అపుడు కాని అర్థం కాలేదు నా నోటిదూలకి పనిష్మెంట్…

“ఏది మళ్ళీ అనండి…” రంకెలు వేస్తూ మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్న గంగిరెద్దులా ఉంది. ఇపుడు మళ్లీ అనాలా…? అనకపోతే ఇంకేమన్నా ఉందా…? నేను మగాడిని…, పెళ్ళానికి భయపడి గట్టిగా మాట్లాడలేకపోతే… నా ఈగో ఏమవ్వాలి?  పైగా 7 సంవత్సరాల నా కూతురు ముందు నేను చులకన అయిపోను…      మళ్ళీ అదే రిపీట్ చేశాను…, కాకపోతే అదే రేంజ్ లో కాదని… నా కూతురుకి అర్థమయ్యి పుసుక్కున నవ్వింది… హతవిధీ… నా రేంజ్ తగ్గినా… మా ఆవిడ రేంజ్ పెరిగింది…

“అవునా… అయితే ఒక పని చేయండి అంత తేలిక అయిన ఆ ఉప్మా ఏదో మీరే చేయండి… అపుడు నేను, మీ కూతురు తింటాం… లేదంటే, మీరు చేసి పెట్టే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము…”, మంగమ్మ శపథం చేసింది మా ఆవిడ…, తను ఏదన్న శపథం చేసింది అంటే… ఇక అంతే సంగతులు.

“అది కాదే…” అంటూ బుజ్జగించి చూద్దాం అనుకున్న… కానీ వర్క్ ఔట్ అవ్వలేదు… నా మగతనపు పొగరు బయటకి వచ్చింది… నా కూతురి నవ్వుకి…

“అంటే చేయలేను అనుకుంటున్నావా? అదేదో బ్రహ్మ విద్య అయినట్లు?”

“అయితే ఏ యూట్యూబ్ చానెల్ లో చూడకుండా చేసి చూపెట్టండి… అపుడు మీరు అన్నట్టే ఇక ఉప్మా జోలికి వెళ్ళను…”

“అవునా…” నా ఖర్మ కాకపోతే ఆశకి కూడా హద్దు ఉండద్దు. బాహుబలిలో ప్రభాస్… ఎవరు సిద్ధం అంటే నేను అన్నట్టు… ముందు వెనుక ఆలోచించకుండా “నేను రెఢీ ” అన్నా…

“సరే… అయితే, అన్నీ కిచెన్ లో ఉన్నాయి… కావాలంటే మీరు ఒక్క ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు… ఎవరో ఒకరికి మాత్రమే ఫోన్ చేసి ఎలా చేయాలి ఏంటి అని కనుక్కోవచ్చు…”

అబ్బా… ఎంత మంచి పెళ్ళాం…, ఎంతైనా ఆడళ్ళది విశాల హృదయం.

“ఇది చాలు” అంటూ వంటగదిలోకి దూరాను, ఇంతకీ ఎవరికి కాల్ చేయాలి? అమ్మకి…? వద్దు, పరువు పోతుంది, పోని చెల్లికి… ఇంకేమన్నా ఉందా…? వాళ్ళాయన కిచెన్ లో హెల్ప్ చేస్తాడనే ఏడిపిస్తా, ఇక ఇపుడు నేనే ఉప్మా… అమ్మో… వద్దు… మరి ఇంకా ఎవరు? హా… ఉన్నాడు ఒక ఫ్రెండ్… కానీ వాడు ఇక్కడ లేడు, ఇపుడున్న నా సర్కిల్ లో కూడా ఎవరికీ తెలీదు వాడు, కాబట్టి నా ఉప్మా కథ బయటకి వచ్చే అవకాశం లేదు. వెంటనే వాడికి ఫోన్ చేసి… కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మెల్లగా ఉప్మా దగ్గరకి వచ్చా…

“అదేంటి బావ ఇంట్లో చెల్లి లేదా? ఉప్మా చేసుకోవటం ఎందుకు… పోని మ్యాగి చేసుకో అన్నాడు…”

“అదేం లేదురా, మీ చెల్లికి ఉప్మా ఇష్టం… సరదాగా చేసి సర్ప్రైజ్ ఇద్దాం అని” అన్నా… లేని నవ్వుని తెచ్చి పెట్టుకుంటూ.

“ఓహ్ లాక్ డౌన్ ఛాలెంజ్ కాదుగా అన్నాడు నవ్వుతూ…, పోని అలాంటిదే అనుకోరా, చెప్పు చాలు అన్నాను. వాడు చెప్పేవి అన్ని జాగ్రత్తగా విన్నా, అయిన నాకు ఇంకా కాస్త తెలివి ఉండి ఉంటే రికార్డ్ చేసుకునే వాడిని… లేదా రాసుకునే వాడిని కదా… నా జ్ఞాపకశక్తి మీద నాకు ఓవర్ నమ్మకం.

సరే… ఇక అన్ని రెఢీ చేసుకుని పెట్టా… పోయి వెలిగించి, కడాయి పెట్టి ఆయిల్ పోసా…

ఫస్ట్ డౌట్… జీడిపప్పు ఎప్పుడు వేయాలి? అల్లం ఎపుడు వేయాలి… గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశా… గుర్తు తెచ్చుకుని, క్రింద మీద పడి 10 నిముషాల్లో ఉప్మా చేసా…

అది ఉప్మా అని నేనే నమ్మడానికి కష్టం అయింది అనుకోండి. మాడిపోయి… ముద్ద ముద్దగా… ఉప్పు ఎక్కువ… కారం లేదు… తాలింపు పచ్చిగా…

ఫస్ట్ ట్రైల్ ఫెయిల్…

“హీ హి హి… అని నవ్వి అది తీసి చెత్త కుప్పలో పడేసా…

నెక్స్ట్ రెండో ప్రయత్నం… కాస్త  జాగ్రత్తగా చేసా…, పోయిన సారి ఉండలుగా వచ్చింది అని, కాని ఈ సారి ఉప్మా గ్లాస్ లో పోసుకుని తాగేలా వచ్చింది… అన్ని నీళ్లలో తేలుతూ ఉన్నాయి…

“హా హా హా…” అని గట్టిగా నవ్వాను… ఏడవలేను కదా… ఇప్పటికే నా కూతురు జాలిగా చూస్తూ ఉంది…

ఉక్రోషం… కోపం వచ్చాయి…

రెండు సార్లు బాగా ఆలోచించా…

కళ్ళు మూసుకుని , ఊపిరి బాగా పీల్చా… నాకు నేను అన్ని గుర్తు తెచ్చుకున్న… వాడు చెప్పిన ప్రకారమే చేద్దాం అని…

ముచ్చటగా మూడోసారి అయింది… ఉప్మా చేసా… యాహూ… అని పెడదాం అంటే, అది గరిటెకి అతుక్కుని రావటం లేదు.

మళ్ళీ ఫెయిల్…

4th…..ఫెయిల్…

5th …ఫెయిల్…

11th….. ఇపుడు చేసిన ఉప్మా… కుదిరిందా…? లేదా…? ఉప్మా గోల అయిందా… లేదా…?

నోట్లో పెట్టుకోవటానికి నాకే భయంగా ఉంది…

ప్లీజ్ మీలో ఎవరన్నా ఇది తిని… ఉప్మా అవునో…? కాదో…? నేను గెలిచానా…? లేదా…? అని చెబుతారా… ప్లీజ్……!

***

You May Also Like

4 thoughts on “ఉప్మా యుద్దం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!