నువ్వు నేను అనాథలమే…

రచన – తపస్వి

“రా కార్తీక్… వచ్చి కూర్చో…” ఎడిటర్ గారు అనడంతో, మౌనంగా వెళ్లి ఆయన ముందు కూర్చున్న… అది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పేరు ఉన్న ఓ వారసంచిక హెడ్ ఆఫీస్…

“ఈ మంత్ కి కావాల్సిన స్టోరీస్ ఆల్రెడీ రాసి ఇచ్చేసా సర్…” బహుశా నేను రాసి ఇవ్వాల్సిన కథల గురించి అయి ఉంటుంది అనుకుని చెప్పాను.

“నీకో అవకాశం కార్తీక్… మొదటిసారి నీ పేరు సంచికలో చూసుకునే అవకాశం… ఉపయోగించుకుంటా అంటే చెబుతా…”

అదేంటీ కథలు రాస్తా అని చెపుతూ, మళ్ళీ మొదటిసారి నా పేరు చూసుకోవటం ఏంటి అనుకుంటున్నారా… అవును నేను రాస్తా, నేను రాసిన ప్రతిదీ ప్రింట్ అవుతుంది కాని, నా పేరుతో కాదు… ఓ పేరున్న రచయిత పేరుతో., కారణం నేను కొత్తవాడిని అవ్వడం… అతని పేరుతో ప్రింట్ చేస్తే జనాలు ఎక్కువ చదువుతారు అని, దీనికి నా ఆర్థిక పరిస్థితులు ఒక కారణం అయితే… ఇలా అయిన నేను రాసింది సంచికలో చూసుకోవచ్చు కదా అనేది ఇంకో కారణం.

“చెప్పండి సార్…” అన్నాను, మొదటిసారి నా పేరు బయటకి వచ్చే అవకాశం వస్తుంది అనే ఆశతో.

“ఓ కథ రాయాలయ్యా… కానీ…”

“పర్వాలేదు చెప్పండి సర్…” ఎందుకు ఆలోచిస్తున్నారా అని ఆలోచన కలిగింది.

“ఈ ప్రేమ కథలు… ఇవన్నీ కాదు… ఇంత వరకు నువ్వు రాయని విధంగా రాయాలి… నీ మార్క్ ఎక్కడ కనపడకూడదు…”

“ఎందుకని సర్…”

“సరే ఒక పని చెయ్… మన సంచికలోనే ఒక పోటీ ఉంది… అనాథ అనే కాన్సెప్ట్ మీద, ఒక కథ రాయగలవా ఈ పోటీకి…?”

“రాస్తా సర్…” నాకు తెలిసి ఎలాంటి టాపిక్ మీద అయిన, ఎలా అయినా… రాయగలిగిన వారే ఒక కంప్లీట్ రైటర్ అని మా గురువుగారు చెప్పినట్టు గుర్తు.

“గుడ్, రాయి… నీ పేరుతోనే సబ్మిట్ చెయ్… సెలక్షన్ ప్యానెల్లో నేను ఉన్న… నాకు నమ్మకం ఉంది నీ స్టోరీ సెలెక్ట్ అవుతుంది అని…”

నేను ఏదో ఒక రోజు రైటర్ ని అవుతా అని నాకు నేను ఎంత నమ్ముతానో, ఈయన కూడా నన్ను అంత నమ్ముతారు.

“సరే సర్… టూ డేస్ లో రాస్తా…” అంటూ అక్కడ నుండి బయలుదేరా.

ఆయనకి చెప్పినట్టు 2 రోజులు గడిచాయి కానీ, అనుకున్నట్టు కథ రాయలేకపోయా… దాదాపు ఒక పది కథలు రాశా కాని ఎందుకో ఏ ఒక్కటి నాకు పూర్తిగా నచ్చలేదు.

ఆలోచిస్తూ మా ఇంటికి వెళ్ళే రోడ్డులో నడుస్తూ ఉన్న… నేను ఆ ఏరియాకి వచ్చి 3 నెలలు అవుతోంది. అక్కడే మసీదు పక్కన ఒక ఇంటికి గేట్ బయట… గోడకు ఒక పక్కగా ఒక హ్యాండీకాప్ అతను… ఒక దుప్పటి మీద కూర్చుని అలాగే ఉండటం… ప్రతి రోజూ ప్రొద్దున, సాయంత్రం చూస్తూ ఉన్న. అతనికి పక్కగా… ఒక కర్ర… బహుశా నడవటానికి అయ్యి వుండొచ్చు, ఒక ప్లేట్… ఒక పాత చిరిగిన సంచి… నాకు గుర్తుండి అతను అక్కడ నుండి కదలటం కాని, ఆ దారిన వచ్చిపోయే వాళ్ళని ఏదన్నా అడగటం కాని చూడలేదు.

ఎందుకో అతని దగ్గర, నాకు కావాల్సిన కథ ఏమైనా దొరుకుతుందేమో అనిపించింది… ఒక రెండు రోజులు అటుగా వెళ్తూ, వస్తూ ఆయన దగ్గర ఆగి… మామూలుగా పరిచయం పెంచుకోవడానికి ట్రై చేశా… తినటానికి, ఏమైనా ఇవ్వటానికి ట్రై చేశా… తీసుకోలేదు. నేను అడుక్కునేవాడిని కాదు… అన్నాడు.

మూడో రోజు ఆయన దగ్గర కూర్చుని నవ్వుతూ, మాట్లాడుతూ… ఇడ్లీ బండి వస్తే తీసుకుని ఆయన పక్కనే కూర్చుని తింటూ… ఆయనకి ఇచ్చా… ఏమనుకున్నాడో ఏంటో తీసుకున్నాడు. అలా అలా… నెమ్మదిగా మరో మూడు రోజులకే మా మధ్య మాటలు పెరిగాయి… సందర్భం చూసి అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని అడిగా.

అతనికి ముగ్గురు కొడుకులు… కొడుకులు మనవాళ్ళు అయినా… కోడళ్ళు మనవాళ్ళు కాదుగా… అది ఆయన జీవితంలో నిజం అయింది. కుట్టుమిషన్ కుడుతూ కొడుకులని పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాడు. భార్య 5 సంవత్సరాల క్రితం పోయింది, మానసికంగా కుంగిపోయాడు. అనుకోకుండా అతనికి పెరాలసిస్ రావడంతో పని చేయలేని స్థితి, మంచం మీద ఉన్న అతనకి కోడళ్ళు చేయరు… కొడుకులని చేయనివ్వరు. అలా… అలా ఎదో ఇంకా ఎందుకు బ్రతికి ఉన్న అనుకుంటున్న రోజుల్లో… గుండెనొప్పి వస్తే ఊరు నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తీసుకువచ్చారు, అక్కడ జాయిన్ చేసిన వాళ్ళు… ఆయన బ్రతికి వున్నది…లేనిది కూడా పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. దయలేని దేవుడు ఇంకా ఎందుకు బ్రతికించి వుంచాడో… అనుకున్న ఆయన… మళ్ళీ తిరిగి వెళ్ళి పిల్లలకి భారం అవ్వలేక… వాళ్ళని, వీళ్ళని సహాయం అడిగి ఇక్కడకి చేరాడు.

“మరి తిండి ఎలా…” అని అడిగా…

“రోజు మధ్యాహ్నం ఆ ఇంటి వాళ్ళు భోజనం పంపిస్తారు…”

“మరి, ప్రొద్దున… రాత్రి…”

“ఒక్క పూటదే… అలవాటు అయిపోయింది…”

మాటలు రాలేదు నాకు… ఎందుకో కంటతడి… నేనేమన్నా చేయగలనా? నాకు కుదిరింది చేయాలి అనిపించింది. ఆ ఇడ్లీ బండి అతనితో మాట్లాడి రోజు ప్రొద్దున ఇమ్మని చెప్పి కాస్త డబ్బు ఇచ్చి… నా ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చా…

ఇంటికొచ్చి కథ రాయటం… ఆ కథ పోటీలో గెలవటం జరిగింది. నేను అపుడపుడు వెళ్తూ వస్తూ పలకరిస్తూ ఉన్నాను. ఆ కథకి వచ్చిన డబ్బు అతనికే ఇద్దాం అనుకున్న.

అనుకోకుండా నాకు ఊరిలో పని పడటంతో ఒక వారం ఊరు వెళ్లి… వస్తూ వస్తూ…ఆ పెద్దాయన దగ్గరకి వెళ్ళి చూసా… కాని అతను అక్కడ లేడు… ఏమైంది అర్థం కాక… ఎదురింటికి వెళ్ళా…

3 రోజుల క్రితమే చలికి తట్టుకోలేక చనిపోయాడని, వర్షంలో తడుస్తూ ఉండటం వల్ల, GHMC వాళ్ళకి బాడీ అప్ప చెప్పాము అని చెప్పటంతో మనసులో ఎందుకో కాస్త బాధ వేసింది.

జేబులో అతనికి ఇవ్వాలి అనుకున్న డబ్బులు నన్ను చూసి వెక్కిరించాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి… అందరూ ఉండి అనాథలా పోయాడు. అవసరానికి ఉపయోగించుకుని, అవసరం అయినప్పుడు దగ్గరలేని, ఉపయోగపడని… అతని బిడ్డలు… నేను… ఒక్కటే అనిపించింది. వయసు పై బడిన తర్వాత పెద్దలు కూడా పిల్లలే అంటారు. ఈ లెక్కన అతను కూడా అనాథ బాలుడు. కానీ… నిజం చెప్పాలంటే, అతనే కాదు… మనం అందరం అనాథలమే.

బంధాలు… స్నేహితులు… ప్రేమ… అన్ని అవసరాల కోసం పెంచుకున్న ఆశలు… నమ్మకాలు. నిజంగా మనకి అవసరం ఉన్నపుడు మన అనుకునే మనిషి కూడా, మనకి తోడుగా లేకుండా వదిలేస్తే ఆ క్షణం  మన చుట్టూ ఎంత మంది వున్నా అనాథలమే.         నా టాలెంట్ ని దోచుకుని బ్రతికిన ఆ సీనియర్ రైటర్… ఇతని కష్టాల కథని తెలుసుకుని అది రాసి గెలిచిన నేను… ఇద్దరం అనాథలమే…

మానవత్వం లేని అనాథలం మేము… మనుషులు లేకపోవటం కాదు అనాథ అంటే… మనసు… మానవత్వం లేకపోవటమే అనాథ అంటే. రక్షణ కావాల్సింది… ముఖ్యంగా ఇలాంటి మనుషుల నుండే ఈ ప్రపంచానికి… ఎందుకంటే… మన విశ్వంలో మన భూమినే పెద్ద అనాథ…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!