మహాప్రస్థానం

రచన – తపస్వి

జీవితం ఒక్కోసారి మనల్నే మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. మనం ఊహించని, అనుకోని ఒక్క సంఘటన చాలు ఆ క్షణం వరకు మన అభిప్రాయాలు.. తప్పు, ఒప్పు అనుకునే ఆలోచనలు.. అన్నిటినీ మార్చటానికి. ఒక్కోసారి అలాంటి సంఘటనలోనే మనం కొత్తగా జన్మిస్తాం. నా జీవితంలో ఇపుడు నేను అలాంటి క్షణంలో ఉన్నానా? నా ప్రశ్న నాకే ఎందుకో కాస్త విచిత్రంగా ఉంది. నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నానా? లేక నాలో ఉన్న మరో నేనా ఈ ప్రశ్న అడిగేది…?

ఈ ప్రశ్నకి మూల కారణం మా నాన్న..! అవును.. ఆయనే..! ప్రతి బిడ్డకి తండ్రి మొదటి హీరో అంటారు. నాకు అంతే, నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచే రాజకీయనాయకుడు అవ్వడం వల్ల, వచ్చి వెళ్ళే జనాలతో ఇల్లు కళ కళలాడుతూ ఉండేది. మంచి, చెడు ప్రతి విషయంలో ఆయన జనాలకి అండగా ఉండడం, నా అనుకున్న వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, డబ్బు, పేరు కంటే మనుషులు ముఖ్యం అనుకునే మనస్తత్వం ఆయనది.

రాజకీయాల్లో ఉండి కూడా డబ్బు, పదవి సంపాదించడం తెలీదు ఆయనకి, ఎప్పుడూ జనాలు, సమస్యలు అంటూ ఉంటారు అని.. కొందరు అనే మాటలు నాకు వయసు వచ్చే కొద్దీ అర్థం అవ్వడం, మా నాన్నతో తిరిగిన వాళ్ళు, ఆయన అండతో రాజకీయాల్లో పైకి ఎదిగి మంత్రులు అవడం, మా నాన్న మాత్రం ప్రజాసేవ అంటే రాజకీయాలు అవసరం లేదు అంటూ ప్రజానాయకుడిగా ఉండిపోవడం నాకు నచ్చలేదు. ఎందుకో అది ఒక చేతకాని మంచితనంలా అనిపించింది యుక్త వయసులో.

ఆయన మాత్రం నన్ను ఆయన తరువాత వారసుడిగా చూసుకోవాలి అని, నాకు 20 సంవత్సరాల వచ్చే సమయానికి, నన్ను ఆయన చేసే పనుల్లో సహాయంగా ఉంచుకోవడం, అందరినీ పరిచయం చేయడం, నెమ్మదిగా నాకు కూడా ఆ రాజకీయాలు పరిచయం చేశారు. కానీ మా అమ్మకి మాత్రం నేను ఆయన రాజకీయవారసుడిని అవడం ఇష్టం వుండేది కాదు. సంపాదించడం తెలియకపోయినా పర్లేదు కానీ, ఉన్న ఆస్తిలో సగం ప్రజల కోసం ఖర్చు చేయడం అమ్మకి నచ్చలేదు, పైగా ఎప్పుడు ఎవరి వల్ల ఆయనకి ప్రాణహాని వస్తుందో అని భయపడేది.

నాకేమో జీవితంలో నా లక్ష్యం వేరుగా వుండేది. అందుకే చదువు అయిన తరువాత నేను, నా లక్ష్యం కోసం అని హైదరాబాద్ వచ్చేశా. అలా 3 సంవత్సరాలు బాగానే గడిచాయి. ఒక రోజు నేను అనుకోకుండా చిన్న సమస్యలో చిక్కుకోవడంతో మధ్యాహ్నం 3 గంటలకి మా నాన్నకి ఫోన్ చేశా.. “పనిలో ఉన్నారా, ఇంటికి వెళ్లి మళ్ళీ చేస్తా.. అమ్మ చెప్పింది నీ సమస్య గురించి, కంగారు పడకుండా ఉండు, నేను చూసుకుంటా..” ఇదే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు… అవును, నిజం…! ఆ క్షణం ఫోన్ పెట్టేసి, నా పనిలో ఉన్న.

ఆరు గంటలకి మా పిన్ని నుండి ఫోన్ “రేయ్ నాని, అర్జెంట్ గా నువ్వు బయలుదేరి ఇంటికి రా అమ్మమ్మకి ఒంట్లో బాలేదు..” కానీ పిన్ని అబద్ధం చెబుతుంది అని అర్థం అయ్యింది, అమ్మమ్మకి ఒంట్లో బాగోకపోతే పిన్ని కాదు అమ్మ ఫోన్ చేయాలి. ఎందుకంటే అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది. పైగా పిన్ని ఫోన్ మాట్లాడుతుంటే వెనుక మా బంగారం (పెంపుడు కుక్క) అరుపు వినపడుతుంది, అంటే పిన్ని మా ఇంట్లో ఉంది. “నిజం చెప్పు పిన్ని..”, కోపం అర్థం అయినట్లు ఉంది (నాకు కోపం ఎక్కువ అని అందరికీ భయం), “అది.. అదీ.. నాన్నకి ..”, పూర్తి చేసే లోపలే.. “చనిపోయారా?” నేను అడిగేసరికి, “అక్క కార్ బుక్ చేసింది, చెల్లిని తీసుకుని వచ్చేసేయ్..” ఫోన్ మూగబోయింది.

పని చేసే ఆఫీస్ లో ఉన్న, ఫోన్ పెట్టేసి బాత్రూంకి వెళ్ళా, ఏడవాలి అని ఉంది, ఎందుకు ఏడుపు రావటం లేదు అని కూడా తెలియటం లేదు. 2 నిముషాల్లో బయటకి వచ్చాను. నాతో పని చేసేవాళ్ళకీ ఏదో ప్రోబ్లం అయింది అని అర్థం అయింది.

“ఏమైంది ” అంది నా పక్కన ఉన్న అమ్మాయి,

“ఏం లేదు మా నాన్న చనిపోయారు.. అంతే, సరే రా పని కంప్లీట్ చేద్దాం..” అంటూ మళ్లీ కుర్చీలో కూర్చున్న. గొంతులో బాధ లేదు, ఏడుపు లేదు, కాని నా మాటల్లో ఉన్న నిస్సహాయ పరిస్థితి నాకే తెలుస్తుంది. నా మాటలకి, నా రియాక్షన్ కి, వాళ్ళకు షాక్ తగిలినట్టు ఉంది, అయోమయంగా నా వైపు చూస్తున్నారు.

“సారీ..” మళ్ళీ తను మాట్లాడే లోపు, “ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి అరగంట టైమ్ పడుతుంది, అలాగే నా రేసిగ్నేషన్ లెటర్ కాస్త రెఢీ చెయ్యి, మళ్ళీ ఇక రాలేను..” అంటూ నా పనిలో నేను పడ్డాను. ఇపుడు ఈ వర్క్ నేను చేయకపోతే, నాతో కలిసి నన్ను నమ్మి నా కింద పనిచేసిన టీం కష్టపడాలి. అందుకే అరగంటలో పని చూసి, రాజీనామా ఇచ్చేసి అక్కడ నుండి బయలుదేరి చెల్లి దగ్గరకి వెళ్ళాను.

అప్పటికే నాకోసం అక్క(పిన్ని కూతురు), చెల్లి కార్ తో సిద్ధంగా ఉన్నారు. మా మధ్య మాటలు లేవు, నిజం చెప్పాలి అంటే అసలు అక్కడ ఏం మాట్లాడుకోవాలి అని తెలియటం లేదు, చెల్లి ఏడుస్తూ ఉంది. నేను మౌనంగా కూర్చున్న. నిన్నటి వరకు ఈ కుటుంబంలో నేను ఒక పార్ట్. కాని ఈ క్షణం నుండి ఈ కుటుంబానికి నేనే పెద్ద. ఆ ఆలోచనే.. మోయలేనంత బరువు అనిపించింది.

ఉదయానికి ఊరు చేరుకున్నాం. మా నాన్న మృతికి సంతాపంగా ఈ రోజు ఊరు బంద్ అని చెప్పారు. కార్ ఇంటి ముందుకి చేరింది, ఎలా చనిపోయారు? ఈ ప్రశ్నకి జవాబు నేను టి.విలో చూసి తెలుసుకున్న.

నిన్న నేను ఫోన్ చేసే సమయంలో ఆయన పనిలో ఉన్నారు, అంటే ఒక విషయంలో సెటిల్మెంట్ చేయటానికి వెళ్లారు. అక్కడ రెండు వర్గాల మధ్య అనే కంటే, మా నాన్న నమ్మి, మంచి చేసాను అనుకున్న కొందరు వెధవలు నమ్మించి, పని ఉంది అనే వంకతో మా నాన్నని, ఆయన స్నేహితుడిని పిలిపించి పక్కా ప్లాన్ తో నరికి చంపేశారు. ఇపుడు శవాలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాయి.

నిజం ఏమిటి అని తెలుసుకునే పనిలో పోలీసులు, మా నాన్న అనుచరులు ఉన్నారు. హంతకులను పట్టుకోవాలి అని పోలీసులు, దొరికితే చంపేయాలని మా మనుషులు వెయిట్ చేస్తున్నారు అని, ఇప్పటికే వాళ్ళ ఇళ్ళ మీద పడి విధ్వంసం చేశారు అని తెలిసింది. కార్ ఇంటి ముందు ఆగింది జనాలు ఉన్నారు. మేము దిగి లోపలకి వెళ్ళే లోపు నా దగ్గరకి కొందరు వచ్చారు “ఇలా వదిలేయకూడదు పెద్దొడ..” అందరూ అవేశంగా, కోపంగా ఉద్రేకంతో ఊగిపోతున్నారు.

కాని నా మొదటి ఆలోచన అమ్మ.. అవును అమ్మ ఈ వార్త విని ఎలా తట్టుకుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని ఉంది, కాని కాళ్ళు బరువుగా కదలను అంటున్నాయి. ఆడవాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు, ఎవరు ఏంటి అని, తెలుసుకునే పరిస్థితిలో కూడా లేను నేను. చెల్లి చెయ్యి పట్టుకుని వెళ్ళాను లోపలకి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మ మాత్రం బెడ్రూంలో మౌనంగా ఒకతే కూర్చుని నాన్న ఫోటో వైపు చూస్తూ ఉంది.

అమ్మని చూడగానే చెల్లి పెద్దగా ఏడుచుకుంటూ వెళ్లి అమ్మని కౌగిలించుకుంది, నాకు కూడా ఏడవాలి అని ఉంది. గట్టిగా బిగ్గరగా… కాని, కన్నీళ్లు నా కనురెప్పలు దాటి రాను అంటున్నాయి.

“నిన్న మధ్యాహ్నం నన్ను దించి వచ్చి తింటా అని వెళ్ళారు..” వాళ్ళ ఏడుపులో అమ్మ మాట తరువాత వినలేక బయటకి వచ్చేసా.

తెలిసిన కుర్రాడు గుమ్మంలో కనపడగానే “కుర్చీలు, షామియానాకి చెప్పలేదా” అని అడిగా “చెప్పాం, వస్తున్నాయి” అతని సమాధానం.

“టీ, టిఫిన్లు ఏర్పాట్లు చేసారా?” అడిగా.. మౌనం అతని సమాధానం.

వెంటనే డబ్బు తీసి, “వెళ్లి కావాల్సినవి చూడు, మా నాన్న చనిపోయారని, అందరికీ ఆకలి వేయకుండా ఉండదు కదా “అన్నాను. డబ్బులు తీసుకుని అతను, అతనితో పాటు నలుగురు వెళ్లారు.

“రేయ్ బావ” అని నా ప్రాణ స్నేహితుడు పలకరింపు. “హాస్పిటల్ కి వెళ్ళాలి ” అని చెప్పి అతని సమాధానం కోసం కూడా చూడకుండా మళ్ళీ లోపలకి వెళ్ళాను. అమ్మమ్మ, పిన్ని, అక్క, చెల్లి.. నాన్నమ్మ అందరూ ఏడుస్తూ ఉన్నారు. “లేచి బయలుదేరండి, హాస్పిటల్ వెళ్ళాలి..” అందరూ నావైపు వింతగా చూసారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఒక్కొక్కళ్లు లేచారు.

20 నిముషాల్లో కార్ లో బయలుదేరి హాస్పిటల్ కి వెళ్ళాము. మా నాన్న అనుచరులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ,ఎవరో కూడా తెలియని వాళ్లతో హాస్పిటల్ ప్రాంగణం నిండిపోయింది.

నన్ను చూడటంతోనే “పెద్దోడా..” అంటూ మా బాబాయి, ఇంకా కొంతమంది నా చుట్టూ చేరారు.

“నమ్మకంగా పిలిచి, పని ఉంది పెద్ద మనిషిగా వచ్చి చూడు అని పిలిపించి ఇలా చేసారురా, ఏదో కుట్ర ఉంది..” నిజమే, ఆ కుట్ర మూల కారణం ఏంటి కూడా తెలుసు.. నాకు.

“ఎక్కడ అని అడిగా…”

“రా…” అనడంతో వాళ్ళ వెనుక వెళ్ళ.

పోస్ట్ మార్టం జరిగే రూంలో, టేబుల్ మీద చాపలో చుట్టి ఉన్నాయి శవాలు.

కాళ్ళని చూసి మా నాన్న శవం ఏది అని, కిటికీ నుండి చూసి గుర్తుపట్టాను.

“రాత్రి అక్కడ ఒక ఇంట్లో నుండి పాత చాప అడిగి తీసుకుని వచ్చాము.. ఒళ్ళు అంతా రక్తం.. మొత్తం 16 చోట్ల నరికారు..” కోపం, ఆవేశం.. కిటికీ చువ్వలని పట్టుకున్న గట్టిగా..

“లోపలకి పంపటం కుదరదు అన్నారు..” పక్కన ఉన్న ఒక అతను అన్నాడు.

జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు.. చుట్టుపక్కల పల్లెల నుండి వస్తున్నారు అని అర్థం అయింది. నాకు గుర్తు ఉండి, మా నాన్నని నేను నలిగిన చొక్కాలో కూడా చూడలేదు, కాని ఇపుడు ఇలా పాత చాపలో.. ఇపుడన్నా కన్నీళ్లు వస్తాయా?? రావటం లేదు. వదలకూడదు, ఏదోకటి చేసెయ్యాలి.. అది, ఇది అంటూ మాటలు వినబడుతూనే ఉన్నాయి.

“కావాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కద చూడండి బావ”, అంటూ నా ATM కార్డ్ తీసి నా స్నేహితులకి ఇచ్చాను. నేనేం అన్నానో అర్థం అయ్యి మౌనంగా నలుగురు అక్కడ నుండి వెళ్లారు.. అంతలో ఒక పోలీస్ మా దగ్గరకి వచ్చాడు.. “DSP గారు మిమల్ని కలవాలి అంటున్నారు” ఏంటో అతని గొంతులో నాకు భయం కనిపించింది.

“ఎందుకు.. ఏం మాట్లాడాలి అన్నా”,

“మా దగ్గరకి వచ్చి మా ముందే మాట్లాడమనండి” ఒక అతను అన్నాడు..

“సర్.. ప్లీజ్…”, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారో నేను ఊహించగలను.

మా నాన్న అనుభవం నాకు వచ్చింది అని అందరూ అనుకునేవాళ్ళు.. ఇష్టం లేకపోయినా ఏదో గొప్పగా ఉంటుంది అని కాలేజ్ చదివే రోజుల్లో గాంగ్స్, గొడవలు.. అది ఇది అంటూ నేనూ కాస్త తిరిగా, నాకు మా నాన్నకి ఉన్నంత సహనం , మంచితనం లేదని మొండిగా ఉంటా, కోపం ఎక్కువ అని నా గురించి తెలిసిన వాళ్ళకి భయం. పైగా అనుకోకుండా ఒక రోజు ఒక పెద్ద లీడర్నీ రోడ్డు మీద కోపంతో ముందు వెనుక ఆలోచించకుండా కొట్టానని తెలిసి, నా జోలికి రావటానికి భయపడేవాళ్ళు.

నిస్సహాయంగా నా వైపు చూస్తున్న ఆ పోలీస్ కి సమాధానం ఇవ్వకుండా మౌనంగా అతని వెనుక నడిచా.. హాస్పిటల్లోనే ఒక రూంలోకి నన్ను తీసుకెళ్లారు, నాతో వస్తానన్న వాళ్ళని వద్దని నేను ఒక్కడినే లోపలకి వెళ్ళా. లోపల ఉన్న వారిలో మా MLA, MP, DSP.. ముగ్గురు నాకు తెలుసు, ఇంకా వేరే ఉన్నారు కాని నాకు తెలీదు వాళ్ళు.. నన్ను చూడటంతోనే MLA లేచి వచ్చి నన్ను కౌగిలించుకుని “మేము ఉన్నాము, ధైర్యంగా ఉండు” అన్నాడు. వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నాను.

“పోస్ట్ మార్టం చెయ్యడానికి ఒప్పుకోవడం లేదు రా” MP నోరు విప్పారు. ఆయన మా నాన్నకి మంచి స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్.

“తప్పదా…” నేరుగా అడిగా.

“ఫార్మాలిటీస్ తప్పవు…” DSP సమాధానం.

“సరే.. ఎంతసేపు పడుతుంది..” అడిగాను.

“అందరూ ఆవేశంగా ఉన్నారు, ఇప్పటికే బంద్ అని, బస్ అద్దాలు పగలగొట్టారు, ఇళ్లు తగలబెట్టారు..” MLA ఏదో చెప్పబోతుంటే..,

“ఎక్కడ ఏమీ జరగకుండా నేను చూసుకుంటా, మా నాన్న మరణం వల్ల జనాలకు ఏ కష్టం, నష్టం కలగకూడదు, నాన్నకి చెడ్డ పేరు రాకూడదు..”.

“మధ్యాహ్నం 3 గంటలకు బాడీ..”, మాట పూర్తి అవకముందే అటు చూసా.., నా కళ్ళలో కోపం అర్థం అయినట్లు ఉంది.

“3 గంటలకి అన్ని పూర్తి చేసి మీ నాన్నగారిని మీకు అప్పగిస్తే మీకు ప్రాబ్లం లేదుగా…”

“3 గంటలకు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువసేపు ఇంట్లో ఉంచటం మంచిది కాదు అని పోలీస్ వాళ్ళ ఉద్దేశం, భావోద్వేగాల వల్ల గొడవలు పెద్దవి అవ్వొచ్చు, వస్తున్న జనాల వల్ల…” MP మధ్యలో కల్పించుకుని చెప్పారు.

10 నిముషాల చర్చల తరువాత, నేను బయటకి వచ్చా.. నాతో వాళ్ళు ముగ్గురు ఉన్నారు.

వందల మంది, అక్కడ ఎదురు చూస్తున్నారు. నేను ఇపుడు అక్కడ ఒక్క మాట కోపంగా, అనాలోచితంగా, భావోద్వేగంగా మాట్లాడినా పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ హాస్పిటల్ మాత్రమే కాదు ఊరు ఊరంతా గొడవలతో అతలాకుతలం అయిపోతుంది.

“ఒక నాయకుడు లక్షణం ఎప్పుడు బయట పడుతుందో తెలుసా, పరిస్థితులు తనకి అనుకూలంగా లేనపుడు కూడా, ప్రశాంతంగా తప్పొప్పులు ఆలోచించి నష్టం ఎక్కువ జరగకుండా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసినప్పుడే..” ఇది మా నాన్న మాట.

“ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ వెనుక నిలబడిన వాళ్ళలో చాలా రకాల మనుషులు ఉంటారు. అందుకే క్లిష్ట సమస్యల్లో అయినా, ముఖ్యమైన విషయాల్లో అయినా నువ్వు నాయకుడిగా వేసే మొదటి అడుగు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి, అది తప్పు అయినా, ఒప్పు అయినా, ఎందుకు అంటే.. నువ్వు రెండో అడుగు వేసే సరికే నిన్ను నమ్మి, నీ వెనుక నిలబడ్డవాళ్ళు వంద అడుగులు వేసేస్తారు..” చెవుల్లో ఆ మాటలే మార్మోగుతున్నాయి. కళ్ళు మూసుకుని ఆయన్ని ఒక్కసారి తలుచుకున్న.

మౌనంగా జనాల మధ్యకి వెళ్ళా.. అక్కడ నిలబడి మాట్లాడితే నేను వాళ్ళ నాయకుడిని.. అదే వాళ్ళ మధ్య ఉండి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ బంధువును.

“ఏమన్నారు చిన్న…” ఒక పెద్దాయన అడిగాడు.

“3 గంటలకి అన్ని పూర్తి చేసి ఇస్తాం అన్నారు, అలాగే ఇక్కడ నుండి ఎక్కడకి తీసుకెళ్తారు, ఎంత సేపు.. ఏంటి అని అంతే.. ఇక నేను చూసుకుంటాను, మీరు అందరూ నాతో ఉండండి చాలు.” అంటూ, మళ్ళీ ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి అమ్మ వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోయా.

కేస్ గురించి మాట్లాడటం.. ఇంకా సంతకాలు.. మిగిలిన ఏవేవో విషయాలు పోలీసులుకి సంబంధించినవి చూడాలి కదా. 3 గంటలు అవుతుంది అనగా మా నాన్నని మాకు అప్పగించారు. అక్కడ నుండి మేము ఇంటికి వెళ్ళే మార్గం మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనం లెక్కపెట్టే స్థితి దాటి పోయారు.. పోస్ట్ మార్టం అయ్యి వచ్చినా, మా నాన్నని చూడటం నా వల్ల కాలేదు. ఎడమ చెయ్యి పూర్తిగా తెగి పోవడం వల్ల కట్లు వేసి కట్టారు, ఎడమ పక్క ముఖం మీద పెద్ద గాటు.. అక్కడిక్కడే పంచ చుట్టాను.

వ్యాన్ లో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాము. వేల మంది బండికి ముందు, వెనుక వస్తున్నారు.. “…..అమర్ రహే……” అంటూ… నాకు మాత్రం ఏమీ వినబడడం లేదు… అంతా స్మశాన నిశ్శబ్దం. ఇంటికి చేరాక, ఒక గంట పాటు అక్కడ ఉంచాము. వచ్చి చూసి, సంతాపం తెలిపిన వాళ్ళు ఎవరు ఎవరో అని కూడా తెలీదు, కానీ వాళ్ళు మా కుటుంబమే… మా నాన్న సంపాదించుకున్న కుటుంబం. చీకటి పడుతుందనగా స్మశానంలో జరగాల్సిన కార్యక్రమం జరిగింది. అందరం ఇంటికి వచ్చాము. ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు, వెళ్లిపోవల్సిన వాళ్ళు వెళ్లిపోయారు.

“ఇందులో ఉండి ఏం సాధించారు నాన్న?” ఒకసారి నేను అడిగిన ప్రశ్న..

“ఆత్మ సంతృప్తి..” ఆయన సమాధానం.

ఇవాళ ఇంతమంది ఆయన మృతి గురించి తెలిసి వచ్చి రోదించింది, మా కుటుంబం వెనుక నిలబడింది, మాకు అండగా ఉన్నది, మా కంటే ఎక్కువగా బాధ పడింది.. ఇదంతా చూసిన తరువాత ఆయన ఆత్మ శాంతించి ఉంటుందా. ఎందుకు నాకు.. మా నాన్న చనిపోయారు అని తెలిసిన క్షణం నుండి కళ్ళ నుండి ఎందుకు కన్నీళ్లు రావటం లేదు, ఎందుకు మనసారా ఏడవలేకపోయా… సంబంధం లేని వాళ్ళు కూడా ఏడ్చారు, మరి నేను ఏంటి?? నాది రాతి గుండెనా?? అలా ఆలోచనల్లోనే ఎపుడు పడుకున్నానో తెలియకుండా పడుకున్న.

3వరోజు.. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళే, ఒక్కరు తప్ప.. ఎవరో పెద్దావిడ, బహుశా 70 ఏళ్లు ఉంటాయి అనుకుంటా, నేను చూస్తూనే ఉన్న, ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది… మా అమ్మ, చెల్లికి వద్దు అన్న బ్రతిమాలి తినిపిస్తూ ఉంది.

3వ రోజు కార్యం అయ్యాక అందరూ వెళ్లిపోతున్నారు, మళ్ళీ 11వ రోజు వస్తాం అని.

ఆవిడ కూడా దగ్గరకు వచ్చి “వెళ్తా బాబు” అంది.

“అమ్మ ఏమనుకోవద్దు… మీరు నాకు బంధువులు అన్న విషయం నాకు తెలీదు… మీ పేరు, అడ్రెస్స్ చెబితే నేను కార్డ్ పంపుతా”.

“ఏమనుకోవద్దు బాబు, నేను మీకు బంధువును కాదు, అలా అని ఏ సంబంధం లేదు ” గొంతులో ఏదో బాధ.

నాకేం అర్థం కాలేదు.. ఏ సంబంధం లేకుండా మరి ఎందుకు ఈవిడ ఇక్కడ ఇలా ఉండి మాకు సేవలు చేసింది అర్థం కాలేదు.

“నా పేరు లక్ష్మీ.. నాకు ఒక్కడే కొడుకు కష్టపడి చదివించి పెద్దచేసి పెళ్ళి చేసా, నా భర్త లేరు, నా కొడుకు తన పెళ్ళాం వచ్చాక, తన మాట విని నన్ను రోడ్డు మీద పడేశాడు… అలా బయటకు వచ్చి, మీ ఊరి బస్టాండ్ దగ్గర అడుక్కుంటూ, దొరికింది తింటూ ఉండేదాన్ని, ఒకసారి ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే, మీ నాన్నే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి చూపించి, ఒక అనాథ శరణాలయంలో ఉంచారు. అప్పటి నుండి నాకు సంబంధించి ఆయనే నా కొడుకు, నన్ను ఒక అమ్మలాగానే ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. ఆయనకి నేను ఎలాగూ సహాయపడి రుణం తీర్చుకోలేను.. అందుకే ఇపుడు ఆయన కుటుంబానికి సేవ చేసి కాస్తన్న రుణం…” ఆవిడ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

నాకు కన్నీళ్లు వస్తున్నాయి.. చూపు కూడా కనపడని విధంగా కన్నీళ్లు నా కళ్ళని కప్పేశాయి… ఏడుస్తున్నాను.. అవును నేను ఏడుస్తున్నాను.. గట్టిగా.. బిగ్గరగా.. గుక్కపెట్టి ఏడుస్తున్నాను… ఈ కన్నీళ్ళు ఆయన మరణబాధతో కాదు… ఆయన కొడుకుగా పుట్టినందుకు సంతోషంతో…!

(మా నాన్నగారికి అంకితం.. ఈ మహాప్రస్థానం)

***

You May Also Like

One thought on “మహాప్రస్థానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!