ఓ సారి ట్రై చేసి చూడండి

రచన – తపస్వి

“ఎందుకే అంత మౌనంగా, డల్ గా ఉన్నావ్” కాఫీ అందిస్తూ అడిగింది స్వప్న, తన సిస్టర్ సుప్రజని. “ఏమో లైఫ్ అంటే విరక్తి వస్తుంది, బోర్ కొడుతుంది. పెళ్ళి, జీవితం అంటే ఇంతేనా? అనిపిస్తుంది” సుప్రజ మాటల్లో ఏదో తెలియని అసంతృప్తి. “పెళ్ళి అయిన 3 సంవత్సరాలకేనా?” నవ్వుతూ అడిగింది స్వప్న.

“ఏమోనే నువ్వు, బావ పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయినా ఇంకా కొత్తగా పెళ్లి అయిన జంటలా… ఎలా ఉంటారో అర్థం కావటం లేదు, మిమల్ని చూస్తే నాకు కుళ్ళు వస్తుంది, మేము ఎందుకు అంతా హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని…” కాఫీ తాగుతూ మద్య మధ్యలో చెప్తుంటే సుప్రజ కళ్ళలో నీళ్ళు.

“నువ్వే అన్నావుగా హ్యాపీగా ఉండటం లేదు అని, అక్కడే సమస్య ఉంది…” చాలా నార్మల్ గా అంది స్వప్న.

“అంటే….”

“మీది కూడా లవ్ మారేజ్ కదా…”

“అవును… అదే కదా సమస్య… అపుడు ఉన్నట్టు ఇపుడు లేదు…”

“నిజమే అలా ఉండరు, ఉండటం కుదరదు కూడా… కానీ ఎపుడైనా ఎందుకు ఇలా అని ఆలోచించావా…”

“ఏం ఆలోచించాలి…?” అర్థం కాక అడిగింది సుప్రజ.

“లవ్ లో ఉన్నపుడు కూడా మీరు జాబ్స్ చేశారు కదా! అపుడు కంటే ఇపుడే మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అని కానీ, ఎక్కడ సమస్య అని కాని…”

అర్థం కాలేదు అన్నట్టు చూసింది సుప్రజ..

“సరే… నేను మీ బావ కూడా లవ్ చేసే చేసుకున్నాం.”

“బావ అంటే రైటర్… ఆయన ఎక్కువ ఇంట్లోనే ఉంటారు…” సుప్రజ మధ్యలో అడ్డు తగిలింది.

“నీకు తెలిసింది అదే, ముందు నేను చెప్పేది విను. లవ్ లో ఉన్నపుడు.. లేవగానే Good Morning అంటూ మెసేజ్… కొంచెంసేపు చాటింగ్.. అవునా? దాని తర్వాత బ్రేక్ఫాస్ట్? మళ్ళీ మెసేజ్… తర్వాత కాల్… మళ్ళీ ఆఫీస్ వర్క్… మళ్ళీ లంచ్ టైమ్ లో కాల్.. మధ్య మధ్యలో మెసేజెస్… I LOVE YOU.., I MISS YOU… I NEED YOU… కలవాలి అని ఉంది.. అని అడగడాలు… ఇంకా కుదిరితే కాస్త టైమ్ స్పెండ్ చేయటం.. మళ్ళీ రాత్రి నిద్ర వచ్చే వరకు మాటలు…”

“నిజమే అక్కా… కాని అప్పుడే సంతోషంగా ఉన్నాం… ఇపుడు కంటే, ఎందుకని అంటావ్?”

“ఎందుకు అంటే సమస్య మీ ఆలోచన ధోరణిలో ఉండటం వల్ల…”

“అంటే…”

“అంటే… ముందు సిగ్గు పడకుండా ప్రొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏం చేస్తారు మీరు చెప్పండి.”

“చెప్పటానికి ఏముంది… ప్రొద్దున్నే లేస్తాం… ఫ్రెష్ అవుతాను.. కాఫీ తాగి.. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా… ఆయన రెఢీ అయ్యి వస్తారు… ఇద్దరం తిని ఆఫీసుకి వెళ్తాం… వస్తాం…” స్వప్న సుప్రజ చెప్పేది శ్రద్ధ వింటుంది.

***

“అది కాదు బ్రదర్, ఆఫీస్ వర్క్ ఎంత కష్టం మీకు తెలుసుగా… టెన్షన్లు… టార్గెట్స్… తనది అంటే ఏదో చిన్న జాబ్…”

“మరి ఇంట్లో పనులు…” కార్తీక్ ప్రశ్నించాడు మాధవ్ ని.

“బట్టలకు వాషింగ్ మెషిన్… ఇంటి పనికి… పనిమనిషి ఉంది. వంట ఒక్కటే కదా తను చేసేది… ఎలాగూ కావాల్సిన సరుకులు, కూరలు అన్ని నేనే తెస్తా, ఆఫీస్ నుండి వచ్చేటపుడు…”

“మరి మీ మధ్య రొమాన్స్… అది…”

“అంటే… ఉంది… కాని తను అలసిపోయినా, నాకు అలసటగా ఉన్న… వీక్లీ ఒక్కసారి అయితే ఎక్కువే.”

“అది సరే మరి రొమాన్స్… ప్రేమని చెప్పుకోవడం…” కార్తీక్ అడిగిన ప్రశ్న మాధవ్ కి అర్థం కాలేదు.

***

“పెళ్ళి తర్వాత కూడా రొమాన్స్…?” అదేంటి అక్క.

“సరే… మీ కథ కాదు కానీ, ముందు మా కథ చెబుతా… విను… నీకేమన్న ఉపయోగపడవచ్చు…” అంటూ స్వప్న తన కథ చెప్పటం మొదలు పెట్టింది.

“మీ బావ రైటర్… నిజమే ఎక్కువ ఇంట్లో ఉంటారు… కాని తను ఇంట్లో ఉంటారు నాతో కాదు… ఆయన లోకంలో ఆయన, కాని… తేడా ఏంటో తెలుసా ఉన్న కొంచెం టైమ్ లో నాకు ఆయన ఎంతో ప్రేమ ఇస్తారు.

మా రోజు ఎలా మొదలు అవుతుందో తెలుసా.. నాకన్నా ముందు ఆయన లేస్తే.. టీ తాగి, పాలు బయట పెట్టి, టిఫిన్ ఏంటో చూసి కుదిరితే రెఢీ చేస్తారు. ఇక ఆయన పనిలో ఆయన పడిపోతారు. ఆయనకు ఒకవేళ బయటకి వెళ్ళే పని వున్నరోజు అయితే, నేనే ఆయన కంటే ముందు లేచి ఇవన్నీ చేస్తా. ఇక నేను లేచి ఆయన్ని పిలవగానే వచ్చి నా బుగ్గ మీద… శుభోదయం శ్రీమతి అంటూ ముద్దు పెడతారు.. మీరు లవర్స్ గా ఉన్నపుడు ఫోన్లో పెట్టుకునే వాళ్ళుగా అదే… ఓ క్షణం అలా నన్ను పట్టుకుని పడుకుంటారు పక్కన, ఓ హగ్ అన్నమాట..

ఇక ఈ లోపు పాలు కాగితే, వెళ్లి కాఫీ కలుపుతారు. నేను ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరం ఒక 10 నిముషాలు కాఫీ తాగుతూ ఇవాళ చేసే పనులు, అవీ, ఇవి మాట్లాడుకుంటాం. ఇక నా పని మొదలు, లేచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటే చేయటం, లేదంటే కలిసి తింటాం. ఇక ఆయన పనిలో ఆయన, నా పనిలో నేను. ఏదన్నా కూరలు కట్ చేయాలి అంటే చేస్తారు.

మధ్యలో ఒక గంట ఆయన నాకు కనపడకపోతే… ఎందుకో ఓ బాధ… ఆయన రూంకి వెళ్లి ఏదోకటి విసిగిస్తా… తిడతాడు… నేను నవ్వుతా… ఆయన నవ్వి, దగ్గరకి పిలిచి, 5 నిముషాలు మాట్లాడి… పో అంటాడు. నేను అలిగినట్టు వెళ్ళిపోతా. ఇక లంచ్ టైమ్ కి ఆయనే అన్ని సర్ధుతాడు. కలిసి తింటాం, బాగుంది అని ఆయన చెప్పే ఒక్క మాట… నాకు ఆ వంట కష్టం తెలియనివ్వదు.

స్నానం చేసి టవల్ అంటూ కావాలని పిలుస్తా, నుదుటి తిలకం ఆయనే పెట్టాలి, అపుడు ఒక ముద్దు.. ఒక హగ్… లంచ్ తర్వాత మళ్లీ ఆయన వర్క్ ఆయనది, కాసేపు పడుకుంటాడు, లేచి బెడ్ మీద నుండి పిలుస్తాడు. వెళ్లి కనపడి టీ ఇస్తా, మాట్లాడుతూ తాగుతాడు. ఏమన్న కావాలి అంటే ఈ టైమ్ లో వెళ్లి తెస్తాడు. ఒక్కోసారి ఇద్దరం బయటకి వెళ్లి కొనుక్కుని వస్తాం, లేదా ఆయనే వెళ్లి తెస్తారు, నాకు ఏది ఇష్టమో అడిగి మరీ తెస్తాడు. ఇక మళ్ళీ ఆయన వర్క్.. డిన్నర్, అంత అయిపోయి పడుకునే ముందు…”

తేడా ఏమీ అర్థం కావటం లేదు సుప్రజకి ఆలోచనల్లో మునిగిపోయింది..

***

“చూడు మాధవ్… చిన్నదే అయినా తనది జాబ్, ఒక్కసారి ఆలోచించండి… మీకు కావల్సింది మీ మధ్య ప్రేమ… కాస్త సమయం… కలిసి పంచుకునే సంతోషం. అసలు మీరు ప్రేమించుకున్నారు, పెళ్ళి చేసుకుని కలిసి ఉంటున్నారు అంటే కారణం… ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే కదా.. మరి అది వదిలేసి.. ఇద్దరు హడావుడిగా జాబ్స్ అనుకుంటూ పరిగెడుతూ మీ ఇద్దరి జీవితాన్ని ఎందుకు మర్చిపోయారు.

ప్రేమించిన మనిషితో కాస్త సమయం కూడా కలిసి గడపలేనపుడు ఇంకా ఆ బంధం ఎందుకు? ఇన్ని కష్టాలు ఎందుకు? ఎంత సంపాదించి ఏం లాభం..? జీవితంలో ఏదైన తిరిగి పొందవచ్చు, కాని ఈ రోజు నీ ప్రాణం అనుకున్న వాళ్ళతో కాస్త సమయం కూడా గడపకుండా వెళ్లిపోతే, మళ్లీ ఆ క్షణాలు వెనక్కి తీసుకురాలేవు. ఒక పని చెయ్.. నేను మీ వదిన ఎలా ఉంటామో చెప్పా కదా.. అదే ఫాలో అవ్వు.

వంట చేస్తుందా.. దగ్గరకు వెళ్ళు, సరదాగా అక్కడ 2 నిముషాలు నిలబడి మాట్లాడు.. కుదిరితే వెనుక నుండి ఒక్క హగ్ ఇవ్వు.. మెడ వొంపున ఒక ముద్దు ఇవ్వు. అపుడు చూడు తన కష్టం తనకే తెలీదు, అలాగే మగాడిని అన్న అహంకారం వదిలేసి, తను చేసే పనుల్లో సహాయం చెయ్యి, బయట ఎవరో ఏదో హెల్ప్ అంటే చేస్తావుగా.. నీ జీవితం అయిన నీ పెళ్ళాం దగ్గర ఎందుకు నామోషీ?

మంచి, చెడు ప్రతిదీ మాట్లాడుకుంటూ ఉండండి. ఎక్కడైనా, ఎపుడు కుదిరితే అపుడు I LOVE YOU, I MISS YOU అంటూ.. ఒక ప్రియుడుగా ఉండి చూడు. ప్రతి రోజూ కూడా, అదే తనతో ప్రేమలో పడిన మొదటి రోజు అనుకో, అపుడు మీకు మీ బంధం, మీ లైఫ్ ఎంత కొత్తగా కనపడుతుంది చూడు…” కార్తీక్ మాట్లాడుతూ ఉన్నాడు. మాధవ్ కి తన సమస్యకి పరిష్కారం దొరికింది అనిపించింది.

***

స్వప్న 7 అవుతుందనగా లేచి కార్తీక్.. అని పిలిచింది.

ఫోన్ లో రాసుకుంటూ ఉన్న కార్తీక్ వంట గదిలోకి వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టాడు.

“మా అక్క లేచి ఉంటుందా? బావ లేచి ఉంటారా ఇవాళ ముందు?” సుప్రజ అడిగింది నవ్వుతూ..

“ఏమో నాకేం తెలుసు, కాని… రేపు నేను ముందు లేస్తా చూడు…” నవ్వుతూ అన్నాడు మాధవ్.

***

ప్రేమ, పెళ్ళి, స్నేహం.. ఏ బంధంలో అయిన మనం మన భావాలను చిన్న చిన్నగా అయిన, ప్రతి రోజు కాస్త సమయం చూసుకుని వ్యక్తపరిస్తే, ఎదుటి వారికి మన ప్రేమ చెప్పగలిగితే, కాస్త టైమ్ ఇవ్వగలిగితే, ఏ బంధం కూడా విడిపోవడం వుండదు, బోర్ కొడుతుంది అనే మాట కూడా వుండదు. ఆలోచించండి, ట్రై చేసి చూడండి ప్రతిరోజూ ఒక్కసారి, మీ జీవితం ఆనందంగా ఉండాలి అనుకుంటే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!