బావతో నా పెళ్లి అలా.. అయింది

రచన – తపస్వి

“బాగా ఆలోచించుకొని అడుగు బయటపెట్టు, ఒక్కసారి ఇంటి నుండి బయటకి వెళ్ళావంటే మళ్ళీ నువ్వు కాళ్ళు పట్టుకున్నా లోపలకి రానివ్వను…” అణువణువునా మొగుడు అన్న అహంకారంతో నిండిన మాటలను ఆపుతూ.. అంటున్నాడు.

“కేవలం తాళి అనే ఒక్క బంధం వల్ల నువ్వు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఇన్నాళ్లు నిన్ను భరించాను, కాని ఏ క్షణం అయితే ఆ తాళిని కూడా నువ్వు అవమానించావో, ఆ క్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చినట్టే..” అని మెడలోని తాళి తీసి అతని మొహాన కొట్టి అడుగు బయటపెట్టాను.

నేను చేసేది తప్పా? ఒప్పా? ఎవరేం అనుకుంటారు? అనే ఆలోచన నాకు లేదు, ఎందుకంటే ఆ తప్పు పట్టే మనుషులకీ, ప్రపంచానికీ తెలియదు కదా, ఈ క్షణం వరకు నేను వీడితో పెళ్లయిన దగ్గర నుండి ఇప్పటి వరకు పడ్డ నరకం., ఎన్ని రాత్రులు మౌనంగా చీకటిలో కూర్చుని ఏడ్చింది, ఎన్నిసార్లు ఒంటికి అయిన గాయాలను… మనసుకి అయిన గాయాలను, ఎవరికి తెలియకుండా లోపల దాచుకున్నది, వాడు ఏ రోజుకి అయిన మారతాడు అనుకున్నాను, కానీ మనిషి మారకుండా తనని అర్థం చేసుకోకుండా, ఎపుడైతే నా శరీరాన్ని తన స్నేహితుడికి అప్పజెప్పాలి అనుకున్నాడో, ఆ క్షణమే నా దృష్టిలో ఒక మొగుడిగా, ఒక మనిషిగా చచ్చిపోయాడు. అందుకే నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేక, నన్ను నేను ఇంకా చంపుకుని అక్కడే బ్రతకలేక వాడికి బుద్ధి చెప్పి… అమ్మకు అర్థం అయ్యేలా చెప్పి ఆ ఇంటి నుండి బయటపడ్డాను.

ఆ ఆలోచనలతోనే పుట్టింటికి చేరాను. ఆరోజు పౌర్ణమి, నాకు పున్నమి వెన్నెల అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ఆస్వాదించే స్థితిలో నేను లేను ఇప్పుడు. అక్కడ నుండి రావడం అయితే వచ్చాను కానీ, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం మొదలయింది. అన్నీ తెలిసిన అమ్మ సరే వచ్చేయ్ అంది. కానీ నాన్న ఏమంటారో? ఆయనకి ఏమని చెప్పాలి? ఎలా అర్థం అయ్యేట్టు చెప్పాలి? ఆలోచనలు ఆగట్లేదు.

అలా ఆలోచిస్తూ గేటు లోపలకి అడుగు పెట్టి, ఇల్లంతా చీకటిగా ఉండటం గమనించి ఆశ్చర్యం వేసింది. పెరటి పక్కన ఉన్న చిన్న ఇంట్లో ఉండే లక్ష్మి కోసం పిలిచా, లక్ష్మి మా ఇంటి పనిమనిషి. తను, తన భర్త ఇక్కడే ఉంటారు. పిలిచిన నిముషానికి వచ్చింది లక్ష్మి , “వచ్చావామ్మా.. ఇప్పటి దాకా నీ కోసం ఇక్కడే ఉండి చూసా, ఈ లోపు మా మావ ఆకలేస్తుంది అంటే ఇపుడే లోపలకి వెళ్ళా..” అంటూ వచ్చి నా చేతిలో బ్యాగ్ అందుకుంది.

“ఏమైంది ఇల్లు అంతా చీకటిగా ఉంది.” నడుస్తూ అడిగాను. చుట్టూ పొలాలు, కొబ్బరి చెట్ల మధ్య ఉన్న ఇల్లు. పక్కన ఇళ్లు కూడా లేకపోవటంతో, పున్నమి వెన్నెల తప్ప మరో వెలుతురు లేదు అక్కడ.

“ఫ్యూజ్ పోతే మీ ఆయనకి చెప్పి వేయించకపోయావా?” అన్నాను మళ్లీ.

“ఇక్కడేం సమస్య లేదమ్మా, అక్కడ లైన్లోనే ఏదో సమస్య అన్నారు. ఫోన్ చేస్తే తెల్లారి వచ్చి బాగు చేస్తా అన్నారమ్మా..” మా మాటలు మధ్య గుమ్మం దగ్గరకి చేరుకున్నాం.

“అవునూ… అమ్మ, నాన్న ఎక్కడకి వెళ్లారు.” అనుమానంగా అడిగా ఇల్లు సైలెంట్ గా అనిపించి.

“మీ అన్నయ్యగారి ఊరిలో ఏదో జాతర అని వెళ్లారు, సాయంత్రం వరకూ వచ్చేద్దామనుకున్నారు, కాని లేట్ అవుతుంది, అన్నయ్య ఉండమన్నారు అని అక్కడే ఉండిపోయారటమ్మ…”

“మరి నాకెందుకు చెప్పలేదు…” నోటి దాకా వచ్చింది కాని అడగాలి అనిపించక తలుపు తీసుకుని లోపలకి వెళ్ళా.

“ఒక్క నిముషం.. దీపం వెలిగిస్తా” అంటూ లోపలకి వెళ్లి దీపం వెలిగించి హాల్లో పెట్టి,

“వేడి నీళ్లు పోస్తా వెళ్లి స్నానం చేసి రామ్మ” అంది.

అమ్మ వాళ్ళు లేకపోవటం కూడా ఒక రకంగా మంచిదే అయింది, ఇపుడు నేను ఉన్న పరిస్థితికి నాన్న ఏమంటారో.. నేను ఆవేశంగా ఏం మాట్లాడతానోనని భయం భయంగా ఉంది ఇప్పటి వరకు, రేపటి వరకు రారు కాబట్టి ఈ లోపు కాస్త కుదుటపడచ్చు. ఆలోచనల మధ్య, లక్ష్మి వేడి నీళ్లు పెట్టడం, నేను స్నానం చేసి బయటకు రావటం జరిగింది.

“అమ్మగారు మీకు కట్టుకోవడానికి చీర ఇక్కడ పెడుతున్న , అలాగే మీకు పడుకోడానికి పక్క.. పైన వేసా, భోజనం కూడా అక్కడే పెట్టా.. వెన్నెల్లో కూర్చుని తిని ప్రశాంతంగా పడుకోమన్నారు..” మాటల్లో తడబాటు తెలుస్తుంది.

“ఎక్కడికైనా వెళ్ళే పని ఉందా?” అడిగాను.

లక్ష్మికి కూడా పోయిన సంవత్సరమే పెళ్ళి అయింది, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేసుకుని ఉంటుంది అన్న ఆలోచన వచ్చి అడిగా.

“అంటే, మా మావా నేను సినిమాకి వెళ్తున్నాం… అలాగే అటు నుండి ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు మావా, రేపు కోడి కూసే యాలకి తిరిగి వస్తాం అమ్మా…” సిగ్గుపడుతూ.. ఒక్కో పదం ఒత్తి పలికింది లక్ష్మి.

“సరే వెళ్ళే ముందు చెప్పి వెళ్ళు… గేట్ లాక్ చేసుకుంటా..” ఎందుకో కనుచూపు మేర ఇల్లు లేక, ఇంట్లో మనుషులు లేక, నేను ఒక్కదాన్నే ఉండాలి అనే ఆలోచనకి భయం కూడా కలగడంలేదు ఇప్పుడు.

“సరే అమ్మా… మీరు రెఢీ అవ్వండి…” అంది.

ఈ చీకటిలో ఒకరి మాటలు ఒకరు వింటున్నాం, మోహలు మాత్రం మసక మసకగా ఉండి సరిగ్గా కనపడక పోవటం కూడా మంచిది అయింది అనిపించింది, లేకుంటే ఏడ్చి ఏడ్చి.. ఉబ్బిన నా కళ్లను చూసి, ఏమైంది అని అడిగేది. అడుగుల శబ్దానికి తను గుమ్మం దాటింది అని అర్థం అయింది. ఎవరు లేరు కదా అన్న ఆలోచనతో హాల్లోనే బట్టలు మార్చుకుంటున్నాను.

అంతలో మళ్ళీ అడుగుల శబ్ధం వినబడడంతో, లక్ష్మి అయి ఉంటుందన్న ఉద్దేశంతో, “బయల్దేరారా.. వెళ్తున్నావా?” చెప్పటానికే వచ్చుంటుంది అని అనిపించింది. సమాధానం రాకపోతే “ఏమిటే మాట్లాడవు?” అన్నాను. సమాధానం లేకుండా ఒక ఆకారం దగ్గర అవుతున్నట్టు అర్థం అయ్యి కాస్త కంగారు వేసి “ఏంటే…” నా మాట పూర్తి అయ్యేలోపు ఆ ఆకారం నన్ను చేరి నా నోరుమూసి.. “ష్ .. నేనే, నేనే..బావని..” అనేసరికి నాకు షాక్ కొట్టినట్టు అయ్యి.. కాస్త కంగారు మొదలైంది.

ఈ క్షణం.. ఇక్కడ.. నేను బావని కాదు కదా, ఎవరినీ ఊహించలేదు. అలాంటిది ఇక బావ వచ్చాడు అని లక్ష్మికి తెలిసి.. అది మా ఇంట్లో తెలిస్తే ఏమన్నా ఉందా? మా కుటుంబాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇన్ని రోజుల తర్వాత బావ నా దగ్గరకి వచ్చేసరికి నాకు తెలియకుండానే ఒక రకమైన సంతోషం కలిగింది.

అంతలో.. “అమ్మా.. మేము వెళ్తున్నాం..” అంటూ లక్ష్మి గుమ్మం బయట నుంచే అరిచి చెప్పింది. బావ చేతులు తీయటంతో ” సరే ..” అన్నాను.

బావ కిందకి వేలాడుతున్న నా పైటని తీసి సర్దుతూ..

“భయపడ్డావా?” అన్నాడు నవ్వుతూ.

“భయపడక… ఏమనుకోవాలి…” అన్నాను భుజం మీద కొడుతూ…

ఎందుకో మళ్ళీ నాకు నా ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది ఇప్పుడు. 2 సంవత్సరాల క్రితం ఇలాగే ఉండేవాళ్ళం మేము. ఎందుకు వచ్చావు? అనే ప్రశ్న నాకు వేయాలి అనిపించలేదు.

“కళ్ళు మూసుకో…” అంటూ నా సమాధానం కోసం ఎదురుచూడకుండా, నన్ను తన చేతులతో ఎత్తుకున్నాడు. నేను అడ్డు చెప్పలేదు, ఎందుకో కూడా తెలియదు, తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెపై తల పెట్టి ఆ శబ్దాన్ని వింటూ ఉన్నాను. ఎక్కడకి, ఎందుకు అన్న ఆలోచన కూడా కలగలేదు. ఈ క్షణం నాకు ఎందుకో ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడికైనా ,ఎలాగైనా తీసుకెళ్లనీ.. పర్వాలేదు అన్నట్టు కళ్ళు మూసుకున్న.

బావ మా ఇంటి మెట్లు ఎక్కుతూ ఉన్న విషయం తెలిసి.. కళ్ళు తెరిచి చూసా… ఆశ్చర్యం.. ఎదురుగా డాబా మీద.. మల్లెపందిరి కింద అందంగా అలంకరించిన పరుపు… పైన వెన్నెల.. అక్కడక్కడ మసక చీకటిని పారద్రోలెందుకు పెట్టిన చిన్న చిన్న దీపాలు.. ఎక్కడో ఒక మూల నుండి వినపడుతున్న.. నాకు, మా బావకి ఇష్టమైన పాట. అచ్చం.. నేను మా బావ పెళ్ళి చేసుకుంటే, ఎలా మా మొదటి రాత్రి ఉండాలి అని కోరుకున్నామో అలా. తన చేతుల నుండి విడిపించుకుని కిందకి దిగి..

“ఏంటి బావ ఇది…” ఆశ్చర్యం… ఆనందం… నా మాటల్లో.

“మనం కోరుకున్నది… నా దానిగా నిన్ను పూర్తిగా నాలో కలుపుకోవాలి అనుకున్న క్షణం…”

“కాని… బావ… నేను… నువ్వు…”

“ప్లీజ్ ఇంకేం మాట్లాడకు… గతం గతః… ఇపుడు మళ్ళీ నువ్వు, నేను… మళ్ళీ మనం… మనకోసం…” బావ మాటలు పూర్తి కాకముందే ఎందుకో నాకు ఏడుపు తన్నుకు వచ్చింది. బావ గుండెలపై తలపెట్టుకొని ఏడవసాగాను. బావ నన్ను పొదివి పట్టుకుని, తల మీద చెయ్యి పెట్టి, “నేను అంటే ఇష్టమేనా” అన్నాడు.

“హ్మ్మ్ …” అలాగే ఉండి సమాధానం చెప్పాను.

“ఇపుడు ఏంటి ఈ కన్నీళ్లు?” నా గడ్డం పైకి లేపుతూ అడిగాడు నా కళ్ళల్లోకి చూస్తూ.

“ఏమని చెప్పను? ఊహ తెలిసిన దగ్గర నుండి బావే నా భర్త అనుకుంటూ పెరిగాను, ప్రాణంగా ప్రేమించాను. నేను కన్న ప్రతి కలలో, ఊహలో తనే నా సర్వసం. బావ కూడా అలాగే ఉన్నాడు. అందరూ మా గురించి మాట్లాడుకుంటూ మా జంట బాగుంటుంది అంటూ, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం అనే మాటలు వినడం వల్ల, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ఆశలు పెరిగాయి, అయినా కాని ఏ రోజు మేము మా హద్దులని దాటలేదు. పెళ్ళి అయిన తరవాత జరిగే మొదటి రాత్రి రోజు మాత్రమే మమ్మల్ని మాకు, మనస్పూర్తిగా ఒకరికి ఒకరం సమర్పించుకోవాలి అనుకున్నాము. వయసులో ఉన్నా,ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, మా కోరికలు మమ్మల్ని లోబరుచుకోకుండా, కోరికలను ఊహల్లో బంధించి వేసి, పెళ్ళి అయ్యే క్షణం కోసం ఎదురు చూసాము.

కాని కాలానికే కన్ను కుట్టిందో… విధి మాపై పగ పట్టిందో ఏమో తెలియదు కానీ.. పెళ్ళి వయసుకి వచ్చి , మాటలు జరగాల్సిన సమయానికి అనుకోకుండా మా కుటుంబానికి, మా బావ కుటుంబానికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. మా అన్నయ్య, మా బావ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోను అనటం దగ్గర మొదలైన సమస్య, ఉప్పెనలా మారి మా రెండు కుటుంబాల మధ్య అగాధం సృష్టించింది. మా ప్రేమ, బాధ, ఏమి పట్టించుకోకుండా మా బావకి వేరే అమ్మాయితో, నాకు వేరే అబ్బాయితో పోటా పోటీగా ఒకే ముహూర్తానికి పెళ్లి చేశారు. వాళ్ళ పంతాలను కాదు అని వెళ్లిపోవాలి అనుకునే ఆలోచన వచ్చినా, కుటుంబాల గౌరవం కోసం తలవంచక తప్పలేదు.

మా పెళ్లిళ్లు అయ్యి 6 నెలలు అయింది. పెళ్ళి అయిన మూడు నెలలకే మా బావ పెళ్ళి చేసుకున్న అమ్మాయి, తను ప్రేమించిన అతని కోసం వెళ్తున్నా అంటూ, ఇష్టం లేని పెళ్లి బంధంలో ఉండలేక వెళ్ళిపోయింది. మా బావ మళ్ళీ ఒంటరి అయ్యాడు. నా విషయంలోనే సగం పిచ్చోడు అయిన బావ, మళ్ళీ 3 నెలలకే ఇలా జరగటం వల్ల పూర్తి పిచ్చోడు అయ్యి మందుకి బానిస అయిపోయాడు.

పోని నా జీవితం ఏమన్నా సంతోషంగా ఉందా అంటే.. అదీ లేదు.. మగతనం లేని మగాడి పైశాచికత్వానికి ప్రతి రోజూ బలి అవుతూ, బయటకి చెప్పుకోలేక ప్రతి క్షణం ఒక నరకంలా బ్రతుకుతున్నా. ఈ రోజు ఇక అక్కడ ఉండలేక ధైర్యంగా ఎదిరించి మెడలో తాళి తీసేసి, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి బయల్దేరి వచ్చేసాను. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ నా జీవితం ఏమిటో అర్థం కాక, భయం భయంగా ఉన్న నాకు, ఇలా బావనీ, మళ్ళీ అతని ప్రేమని చూస్తే కన్నీళ్లు కాక ఇంకేం వస్తాయి.

“నన్ను పెళ్ళి చేసుకుంటావా?” బావ మాటలకి ఈ లోకంలోకి వచ్చాను.

“అడగాలా? నేను ఎపుడు నీ దాన్నే కదా..” అంటూ గట్టిగా హత్తుకున్నాను.

నేను ఊహించని విధంగా బావ జేబులో నుండి తాళి తీశాడు. నా జీవితానికి ఇంతకు మించిన ఆనందం ఇచ్చే క్షణం ఉంటుందా? మళ్ళీ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాను. సంతోషంగా తల వంచాను.

చంద్రుడు మా పెళ్లికి పెద్ద…

ఆకాశమే మా పెళ్ళి పందిరి…

చల్లగాలే మా పెళ్ళికి సాక్ష్యం…

చుక్కలే అతిథులు…

మెడలో తాళి కళ్ళకి అద్దుకుని బావ కాళ్ళకి నమస్కరించబోయాను. “అక్కడ కాదు… ఇక్కడ నువ్వు వుండాల్సింది”, అంటూ తన గుండెలకు హత్తుకుని, నన్ను అలాగే ఎత్తుకుని వెన్నెల్లో ఏర్పాటు చేసిన మన్మథ రాజ్యానికి నన్ను యువరాణిగా తీసుకెళ్ళాడు. ఆశల సౌధం కూలిపోయి.. వ్యర్థం అనుకున్న జీవితం.. మళ్ళీ బావ రాకతో, ఇలా జరిగిన మా పెళ్లితో.. నేను కోరుకున్న కొత్త జీవితం మొదలైంది. జీవితం, కాలం.. మనకి తప్పకుండా రెండో అవకాశం ఇస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!