ఈ కథకి పేరేమిటో?

రచన – తపస్వి

తులం బంగారం, మూరెడు తాడు, సంబంధం లేని మనుషుల మధ్య… బంధాల కోసం తప్పక తలవంచి కట్టించుకున్న, గుండెలపై ఉండే తాళికి అంత విలువ ఇస్తే… ఇష్టపడి, ప్రేమించి, ప్రతి గుండె చప్పుడులో ఒకరినొకరు తలుచుకుంటూ… ఒకరి శ్వాసలో మరొకరు బ్రతకటం… ప్రేమంటే, బంధం అంటే… 5 నిముషాల సుఖం… నాలుగు మాటలు కాదు… రెండు ఆత్మల మధ్య ఏర్పడే బంధం అని కొత్తగా పరిచయం చేసిన మదిలోని ప్రేమకి ఎంత విలువ ఇవ్వాలి…??

***

2020 ఏప్రిల్ 1:

“ఊపిరి ఆగిపోతున్నట్టు ఉందే నువ్వు నాకు దూరంగా ఉండే ఒక్కో క్షణం… ఎలా చెప్పను, చెప్పిన అర్థం చేసుకొగలవా…?” తన పుస్తకంలో రాసి ఉన్న ఆ పదాలను మళ్ళీ మళ్లీ చదువుకున్నాడు అతను.

“ప్రేమ అంటే అంత గొప్పగా ఉంటుందా?” ఆమె ఆ అక్షరాల్ని చదివిన రోజు… అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు.

“ప్రేమని ప్రేమగా ప్రేమ కోసం ప్రేమించిన క్షణం నీకే అర్థం అవుతుంది…” అతని సమాధానం.

“నాకు అంత అదృష్టం లేదులే…” జీవితంలో పెళ్లి అంటే ఒక అవసరం అనుకుని, ఆ బంధంలో ప్రేమని వెతుక్కోవాలి అని ప్రయత్నం చేసి… ఆశలు అడియాశలు అయ్యి… భార్య అంటే ఇంటి, ఒంటి అవసరాలు తీర్చే మనిషి అనుకునే ఒక మగాడి మూర్ఖత్వానికి బలి అయ్యి, జీవితం అంటే ఆశ కోల్పోయిన వేదన కనపడుతుంది ఆమె మాటల్లో.

తలుపు కొట్టిన చప్పుడు అవ్వటంతో ఆలోచనల నుండి బయటకి వచ్చి పుస్తకం మూసి కుర్చీలో నుండి లేచి వెళ్ళి తలుపు తీసాడు.

ఎదురుగా లక్కీ… ” హయ్ అంకుల్ ” అంటూ చేతిలో క్యారీ బ్యాగ్ తో వచ్చింది.

“లెటర్ ఏమన్నా వచ్చిందా?” ఆశగా అడిగాడు.

“లేదు…”

లేదు అన్న మాట వినగానే అతని మొఖంలో కనపడే బాధ… మళ్ళీ ఓ క్షణంలోనే “రేపు వస్తుందిలే” అని ఆశగా అతను చెప్పే మాట, రెండు తనకి అలవాటే ఈ పది సంవత్సరాల నుండి.

కుర్చీలో కూర్చుంటూ విపరీతంగా దగ్గు రావటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అతను.

వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గ్లాస్ తో వాటర్ తెచ్చి ఇచ్చింది లక్కి.

వాటర్ తాగి కాస్త స్థిమిత పడుతూ… “ఏమైంది మీ కాలేజ్ లో కవితల పోటీ…” అడిగాడు.

“మీరు రాసిచ్చిన తరువాత ఏమవుతుంది… ఫస్ట్ ప్రైజ్ నాకే…” గ్లాస్ అందుకుని చెప్పింది లక్కీ.

“సరే… ఇవాళ వంట ఏమి వద్దులే… ఆకలి లేదు… నువ్వు ఇంటికి వెళ్ళిపో…” కళ్ళు మూసుకుని అన్నాడు.

“లేదు అంకుల్… నాకు ఇవాళ మీరు మీ ప్రేమకథ చెబుతా అన్నారు…”

“హా హా హా… నా ప్రేమకథా… తెలుసుకుని ఏం చేస్తావు…”

నవ్వుతూ అడిగాడు…

“నాలో కూడా ఒక రచయిత్రి ఉంది… నేను కథలు రాయగలను అని అన్నారుగా… అందుకే మీ ప్రేమకథ నేను రాస్తా…”

“హా హా హా… నా ప్రేమకథ… అది మాకు తప్ప ప్రపంచానికి తెలియనిది… తెలియకూడనిది… వద్దు వదిలేయ్… ప్రపంచం అంగీకరించని ఒక వింత ప్రేమకథ మాది…”

“ప్రపంచం గురించి వదిలేయండి… అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు అని మీరే చెబుతారు కదా… పైగా 20 సంవత్సరాల నుండి ఒక మనిషి, ప్రేమించిన మనిషి వస్తుందో? రాదో?? అని తెలీకుండా… ఎదురుచూస్తూ… ఆమె జ్ఞాపకాలతో… ఆమెని కలిసే రోజు కోసం ఆశగా ఎదురుచూసే కథ కంటే గొప్ప కథ ఉంటుందా…”

“అది కాదు లక్కీ…”

“లేదు అంకుల్… మీ రచనలకి వారసులు కావాలి అని కోరుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా… నేను అలా అవ్వాలి అంటే… ఈ రోజు మీరు నాకు ఆ కథ చెప్పాల్సిందే…” లక్కీ గొంతులో పట్టుదల అర్థం అయింది.

“ఏం చెప్పను లక్కీ…” సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు అతను.

“మీరు సిగరెట్ తాగకూడదు అని డాక్టర్స్ ఎంత చెప్పినా వినరా?” కోపంగా అతని చేతిలో సిగరెట్ లాక్కోవడానికి ట్రై చేసింది.

“ప్లీజ్ ఇప్పుడు ఇది లేనిదే నేను చెప్పలేను, ఇవాళ ఇదే మొదటిది…”

“హ్మ్మ్… సరే… మీరు ఎప్పుడు తనని కలిశారు.”

“ఎప్పుడా…! 20 సంవత్సరాల క్రితం…”

“ఎలా ఉంటారు ఆవిడ… అంత అందంగా ఉంటుందా!”

“అందంగానా తెలీదు… కాని… ఎపుడన్నా తేనె రంగు పులుముకున్న జాబిలమ్మని చూసావా? తను అలాగే ఉంటుంది…”

“మొదటిసారి కలిసినపుడు ఏం అనిపించింది అంకుల్…”

“తనని మొదటిసారి కలిసినపుడు ఎందుకో నా మాటలు తడబడ్డాయి… అసలు చుట్టూ ప్రపంచం ఒకటి ఉంది అన్న విషయం నాకు గుర్తులేదు… ఆ కళ్ళు… ఏంటో ఆ కళ్ళల్లోకి చూస్తూ, మాట్లాడుతూ ఉంటే ఆ పెదవులను చూస్తూ… నన్ను నేను మర్చిపోయా…”

“అంటే అదేనా మీ మొదటి పరిచయం…”

“కాదు… అప్పటికే మాకు పరిచయం ఉంది…”

“అదెలా… అప్పటికి సెల్ ఫోన్ లేవుగా…”

“ఉత్తరాలు ఉన్నాయిగా…”

“ఓహ్ అంటే, అందుకేనా ఇప్పటికీ ఈ లెటర్స్…”

“సరే అయితే మీ పరిచయం ఎలా అయింది…”

“నేను ఒక సేవా సంస్థలో పని చేసేవాడిని… చేసేవాడిని అనే కంటే వెనుక ఉండి నడిపేవాడిని. మా సంస్థ సభ్యుల సంఖ్య ఎక్కువే. ఒకసారి ఆ సంస్థ మీటింగ్ జరుగుతూ ఉన్నపుడు ఒక ఆవిడ పాటలాంటి ఒక కవిత చదివింది… నాకు చాలా నచ్చి వెళ్లి ఆవిడని కలిశా…”

“ఓహ్ అయితే ఆవిడేనా…”

“కాదు… తను వేరు… ఆ కవిత రాసింది నా దేవత అయితే… తన తరపున చదివింది వేరే వాళ్ళు అని చెప్తే… రాసింది ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగా…”

“అపుడు ఆవిడ అక్కడే ఉందా…”

“లేదు, ఆమె తన ఫ్రెండ్ రాసింది అని చెప్పి ఈసారి కుదిరితే తీసుకొస్తా అంది…”

“మరి వచ్చిందా”

“రాలేదు… కాని థాంక్స్ అని చెప్పమని చెప్పింది, నేను సరే అని నాకో సహాయం చేయగలరేమో కనుక్కోమని చెప్పా…”

“హెల్ప్?” ఏంటి అంకుల్…

“నా సంస్థకి ఒక గేయం రాయమని అడిగా…”

“ఆవిడని రాయమన్నారా…? నేను నమ్మను… మీరే రాయగలరు కదా, మరి ఆవిడని ఎందుకు అడిగారు…”

“హా హా హా… మరి పరిచయం ఎలా పెంచుకోను… అందుకే అడిగా…”

“అబ్బ… సూపర్ అంకుల్… మరి రాసి ఇచ్చారా…”

“హ్మ్మ్… రాసి పంపింది…”

“బాగుందా… మీ కంటే బాగా రాసి ఉండదులే…”

“లేదు చాలా బాగుంది… తను రాయగలదు అనే నమ్మకం నిలబెట్టుకుంది, ఆ రోజే నేను మొదటిసారి ఉత్తరం రాసి పంపా… చాలా బాగుంది అని…”

“మరి ఆవిడ రిప్లై ఇచ్చిందా…”

“లేదు… కాని ఆవిడ ఫ్రెండ్ కనపడినప్పుడల్లా ఒక ఉత్తరం రాస్తూ… ఇస్తూ ఉండేవాడిని. అలా 3 నెలలు గడిచాయి. దాని తరువాత ఒక రోజు తన నుండి ఒక ఉత్తరం వచ్చింది… వేరే పాట రాశా ఎలా ఉంది చెప్పండి అని…”

“అబ్బ… అంటే 3 నెలల మీ ప్రయత్నం అప్పుడు సక్సెస్ అయింది అన్నమాట…”

“అవును… ఆ రోజు అలా మొదలైన మా ప్రేమకథ… కొన్ని రోజులు అలా అలా కాగితాల ద్వారానే సాగింది… మాకు తెలీకుండానే ఆ అక్షరాల ద్వారానే ప్రేమలో పడ్డాము. ఇద్దరి జీవితాలు ఒక్కటే అని అర్థం చేసుకున్నాం, చెప్పుకునే బంధాలు ఉన్నాయి కానీ, మనసుకు నచ్చిన బంధాలు కాదు. ప్రేమ రాహిత్యం, ఒంటరితనం, మనసులో బాధ… ప్రేమ అర్థం చేసుకునే మనిషి కరువు. అదే మమ్మల్ని ప్రేమలో పడేట్టు చేసింది.” మళ్ళీ దగ్గు రావటంతో సిగరెట్టు పడేసి మంచినీళ్లు తాగాడు.

“మీరు ఇలా హెల్త్ పట్టించుకోకపోతే ఎలా… మీకు ఏదన్నా అయితే…”

“హా హా హా… నాకేం అవ్వదులే… తను ఈ ప్రపంచంలో ప్రాణాలతో ఉండగా ఇక్కడ నాకు ఏమి అవ్వదు. నేను బ్రతికేది నా కోసం కాదు… ఏ రోజన్నా తనకి నా అవసరం పడినా… నేను కావాలి అనుకున్నా నేను ఉండాలి కదా, అందుకే ప్రాణం పోయే క్షణం వచ్చినా తన కోసమే బ్రతుకుతా నేను…”

“సరే ఇక చెప్పండి…”

“ఏం చెప్పను… తనని ఎందుకు ప్రేమించానో తెలీదు… కాని ఈ క్షణం ఇంకా నేను బ్రతికి ఉన్నాను అంటే అది తనని ఇంకా ప్రేమిస్తూ ఉండటం వల్లే…”

“అంటే తన ముందు… తన తరువాత ఇంకెవరు లేరా…”

“తన ముందు ప్రేమ అనుకునే ఒక బంధం ఉండేది. తనకి దూరం అయ్యాక, నన్ను ప్రాణంగా ప్రేమించాను అన్నవాళ్ళు ఉన్నారు. కాని… కాని… ఎందుకో తనని ప్రేమించిన ఆ మనసు ఇంకొకరిని అంగీకరించలేదు. తను నాలో ఎంతలా నిండిపోయింది అంటే… తను నాకోసం ఇచ్చిన ఫోటో… ఆ ఫోటోలో తనని చూస్తూ, ఇప్పటికీ తను నా పక్కనే ఉంది అని అనుకుంటూ ఉంటా. అందంగా తను రాసిన కవితలు ఉన్న ఒక క్యాసెట్ తన గొంతుతో ఉంది… తన మాటలు వినాలి అనుకున్న క్షణం అది వింటా. తను గుర్తు వస్తే… మా జ్ఞాపకాలు, మేము కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ గడిపేస్తా…”

“అవును అంకుల్ అంతలా ప్రేమించుకున్నారు కదా… మరి మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు…”

“తనకి అప్పటికే పెళ్లి అయింది కదా… పైగా ఇద్దరు పిల్లలు, పరువు గల కుటుంబం. నా వల్ల, నా ప్రేమ వల్ల తనకి, తన కుటుంబానికి మచ్చ రాకూడదు అనుకున్న, నా ప్రేమ దేవత ఒకరి ముందు తల వంచుకుని నిలబడకూడదు అనుకున్న… అందుకే ఎంత ప్రేమించినా… ఎంత దగ్గర అయినా, బయట ప్రపంచం ముందు మా ప్రేమకథ తెలియకుండా జాగ్రత్త తీసుకున్నా…”

“కాని అంకుల్ అలా పెళ్ళి తరువాత…”

“పెళ్ళి… పెళ్ళి అంటే ఏంటి…? ఇంట్లో ఒక మనిషి ఉంటే చాలు పనులకి… పడకకి అనుకోవటమా? ఆ మనిషికి కూడా ఒక మనసు ఉంటుందని, ఆశలు కోరికలు ఉంటాయని, తనకి కావాల్సింది కాస్త ప్రేమ అని కూడా తెలుసుకోలేనిది పెళ్ళి అవ్వదు… వ్యాపారం అవుతుంది అంతే…”

“సరే… సరే… అంటే అంకుల్ ఇలా అడగొచ్చా… లేదా తెలీదు… మీరు ఇద్దరు శారీరకంగా కలిసారా…”

“కలిశాం… అది అనుకోని పరిస్థితుల్లో, అయినా ఇష్టపడే ప్రేమగానే కలిశాం…”

“అంటే అది తప్పూ…..’

“ఒక్కటి చెప్పు… ఆడదాని ఇష్టం తెలుసుకోకుండా మొగుడైనా సరే… రాక్షసానందంగా తన సుఖం మాత్రమే కోరుకుని ఆడదాని శరీరాన్ని వాడుకోవటంలో లేని తప్పు… ఇష్టపడి, ప్రేమించి కలిస్తే తప్పు ఏంటి…?”

“నాకో డౌట్ అంకుల్… మరి ఇంతలా ప్రేమించుకున్నారు కదా… ఎందుకు తనకి దూరంగా వచ్చేశారు…”

“పరిస్థితుల వల్ల… ఇంకా దగ్గరగా ఉంటే ఎక్కడ తనకి నా వల్ల సమస్యలు వస్తాయో అని భయంతో, అయినా మా మధ్య దూరం ఎక్కడ ఉంది… మా మనసులో మా ప్రేమలో ఇద్దరం ఒక్కటిగానే ఉన్నాం… జస్ట్ మా శరీరాలు మాత్రమే వేరుగా ఉన్నాయి…”

“అంటే తాను ఎప్పటికైనా మళ్ళీ మీ ప్రేమ కోసం వస్తుంది అని ఎదురు చూస్తున్నారా?”

“వస్తుంది… తన బంధాల బాధ్యతలు తీరిన రోజు ఖచ్చితంగా వస్తుంది…”

“ఒక వేళ అలా రాలేకపోతే…”

“అలా రాలేకపోతే… తాను చనిపోయే క్షణం ముందు, నేను తన ముందు ఉంటా… లేదా నేను చనిపోయే క్షణం ముందు తను నాతో ఉంటుంది… అది మాకు మేము చేసుకున్న ఒప్పందం. మేము ఎక్కడ ఎలా ఉన్నా… ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా… మరణం ముంగిట ఉంటే ఆ క్షణం మేము కలవాలి… మా చేతులు కలిసే ఉండాలి…”

“అంకుల్ మీకో విషయం చెప్పాలి…”

“ఏంటి… మా లెటర్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నావ్ అదే కదా…” నవ్వుతూ అన్నాడు అతను.

“హ్మ్మ్… కానీ… అలా ఖాళీ ఉత్తరాలు ఎందుకు పంపుతారు అంకుల్… మీకు మాట్లాడుకునే విషయాలు ఏమి ఉండవా?”

“అవి ఖాళీగా లేవు… అందులో మా మనసు, మా భావాలు ఉన్నాయి. అక్షరాలలో చెప్పలేనంత ప్రేమ… కోరిక… భావాలు ఉన్నాయి. ఈ అనంత శూన్యంలా ప్రియమైన మాటలు ఉన్నాయి అందులో అందుకే అది శూన్యంగా అక్షరాలు లేకుండా ఉంటాయి…”

“ఇంకోటి చెప్పాలి అంకుల్…”

“ఏంటి…”

“ఇవాళ లెటర్ వచ్చింది… కాని ఖాళీగా లేదు… ఎదురుచూస్తూ ఉంటా… అని ఉంది.”

ఎదురు చూస్తూ ఉంటా… ఆ ఒక్క మాటకి అర్ధం ఏంటని తెలుసు అతనికి… వెంటనే లక్కీ ఇచ్చిన లెటర్ తీసుకున్నాడు.

“పది నిముషాల్లో రెఢీ అవుతా… బైక్ మీద నన్ను బస్టాండ్ లో దించగలవా?”

“అన్నయ్యకి చెప్పా అంకుల్ కార్ తీసుకొస్తాడు, వెళ్ళండి… కాని మళ్ళీ వస్తారా?” లక్కీ కళ్ళ వెంట నీళ్లు.

“రాకుండా ఎలా ఉంటా… నా ప్రేమ దేవతని చూడాలిగా నువ్వు…”

తనకి తెలిసి అతనిని కలిసిన ఈ 10 సంవత్సరాలలో మొదటిసారి అతను అలా మనస్పూర్తిగా నవ్వటం చూస్తుంది. కేవలం ప్రొద్దున్నే ఒక పది నిముషాలు… అతనికి ఏదన్నా కావాలి అంటే బయటకి వచ్చి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే అతను నవ్వడం చూస్తుంది.

లక్కీ వాళ్ళ అమ్మ అతనికి పాలు పోస్తూ ఉండేది. అమ్మతో వస్తూ ఉండటం వల్ల ఆయన పరిచయం అయ్యారు లక్కీకి. అప్పటి నుండి అతని చిన్న చిన్న అవసరాలు చూసేది లక్కీ. ఏదేదో కథలు రాస్తూ… మారు పేరుతో పుస్తకాలు రాస్తూ, చుట్టూ ఉన్న ప్రకృతి మధ్య తన ప్రేమ దేవత జ్ఞాపకాలతో బ్రతుకుతూ, తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు.

అతని వయసు ఇపుడు 50…

అతని ప్రేమ దేవత వయసు 53…

“మీరు వెళ్లి రండి… ఈ లోపు నేను కథ రాసేస్తా…”

“పేరు ఏం పెడతావు…”

“నేనేం పెట్టను… మీ కథ చదివిన వాళ్ళే పెడతారు…”

“హా హా హా… గురువుకి తగ్గ శిష్యురాలు అన్నమాట” చెప్పులు వేసుకుని కార్ డోర్ తీస్తూ అన్నాడు.

“అంతే కదా గురూజీ… మీ ప్రేమ దేవత దర్శనం అయ్యాక మమ్మల్ని మరిచిపోరు కదా…” నవ్వుతూ అంది.

“లేదు…” అంటూ నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకున్నాడు.

నవ్వుతూ అతని పక్కన కూర్చుని అతని చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ ఉన్న ఆ ప్రేమదేవత రూపం అతని కళ్ళల్లో కదలాడుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!