నీది నాది ఒకటే కథ

రచన – తపస్వి

“చెప్పేది జాగ్రత్తగా వినండి… మీరంటే నాకు ఇష్టమే… కాని అలా అని ప్రేమ అంటే తెలీదు… మీతో టైమ్ స్పెండ్ చేయటం ఇష్టం, కాని జీవితాంతం మీతో నేను ఉండలేను. ఇప్పటికైనా మారండి, నా గురించి ఎక్కువ ఆలోచించకండి, లైట్ తీసుకోండి, నాకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి… మీ ప్రేమకి నాకు అర్హత లేదు.” కాస్త అటు ఇటుగా ఇదే విషయం చాలా సార్లు చెప్పింది తాను, అతనికి.

“నీకు అర్హత ఉందా… లేదా… అని నేనేపుడు ఆలోచించలేదు. ఇక నీకు నేనంటే ఇష్టం ఉందా? లేదా? అని కూడా ఆలోచించలేదు. జస్ట్ నాకు మిమల్ని ప్రేమించటం తెలుసు…” అతని సమాధానం.

“ప్లీజ్ చెబితే అర్థం కాదా… నన్ను ప్రేమించవద్దు… నేను మీకు బాధనే తప్ప సంతోషం ఇవ్వలేను…”

“నిజమే… బాధని తప్ప సంతోషం ఇవ్వలేను అనే దానివి, ఏ రోజు అయినా ఎందుకు ఇవ్వలేను? ఎలా ఇవ్వాలి అని ఆలోచించావా? లేదు కదా… సర్లే ఇక వదిలేయ్…”

“ఇంకా నా జీవితంలో ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు? ఇంత బాధపడుతూ… వెళ్లి పోవచ్చు కదా…”

“ప్రేమిస్తున్నా కాబట్టి ఉన్నా… ప్రేమంటే సంతోషం ఒక్కటే కాదుగా…”

వాళ్లిద్దరి మధ్య ఈ మాటలు తూటాలై కాసేపు సాగాయి. ఎలా అయినా తన జీవితంలో అతని అవసరం లేదు అని చెప్పాలని ఆమె, అవసరం కాదు ఎలా అయినా, ఎంత బాధ భరించి అయినా… ఆమె తను జీవితంలో ఉంటే చాలు అనుకునే మనస్తత్వంతో అతను.

“సారీ… నేను మిమల్ని బాధపెడుతున్నా… అనే బాధని నేను తట్టుకోలేకపోతున్నాను. కుదిరితే మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే మీ ప్రేమ కోసమే పుడతాను…”

“అంటే ఈ జన్మలో నాకు నీ జీవితంలో స్థానం లేదు అని చెబుతున్నావా?” అతని గొంతులో బాధ.

“అలా అని కాదు…” ఏదో సర్ధి చెప్పాలి అనుకుంటుంది.

“సరే… నా ప్రేమతో నిన్ను సంతోషంగా ఉంచాలి అనుకున్న, కాని నువ్వు నా వల్ల బాధపడుతున్నావ్ అంటే నీ జీవితంలో నేను ఉండి ఉపయోగం లేదు… నేనే నీ జీవితం నుండి వెళ్ళిపోతా…”

“అది కాదు…”

“పర్వాలేదు కుట్టీ… ఇపుడు మాత్రం ఏముంది… నేను నీకు మెసేజ్ చేయకూడదు, నువ్వు చేసే వరకు వెయిట్ చేయాలి. నాకు మాట్లాడాలి అనిపించిన కాల్ చేయకూడదు, నువ్వు మాట్లాడాలి అనుకుని చేస్తేనే నేను మాట్లాడాలి. నిన్ను చూడాలి అనుకోకూడదు, కలవాలి అనుకోకూడదు, అన్నీ నీకు అనిపిస్తేనే చేయాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి దానికి వెయిట్ చేస్తూ… నీ జ్ఞాపకాల్లో బ్రతుకుతున్నా, ఇక నువ్వు దూరం అయితే ఆ వెయిటింగ్ ఉండదు. మామూలుగానే నీ జ్ఞాపకాలతో సంతోషంగా బ్రతుకుతా… నీకు, నేను నీ కోసం ఎదురుచూస్తున్నా… అనే భయం, బాధ ఉండదు…”

“అలా కాదు…”

“ప్లీజ్ ఇక ఇవన్నీ వద్దు కుట్టీ… నేనేం బాధతో అనటం లేదు… అనవసరంగా ఇలా కలిసి ఉంటూ బాధ పడటం కంటే, దూరంగా ఉండి జ్ఞాపకాలతో, సంతోషంగా ఉండటం మంచిది. ఇలా విడిపోతేనే, ఈ రోజు కాకపోతే జీవితంలో మళ్ళీ మనం ఎపుడన్నా అనుకోకుండా కలిస్తే, కనీసం స్నేహితులుగా అయినా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మన పరిచయం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతే చాలు…”

అతన్ని జీవితంలో అంగీకరించలేక… అలా అని అతన్ని వదులుకోలేక, ప్రతి క్షణం సతమతమవుతూ ఉండే ఆమె… అతనే ఆమె జీవితం నుండి వెళ్ళిపోతా అనే సరికి, ఇష్టం… అయిష్టం… ఏదైన అవ్వనివ్వండి… “సరే” అంది.

ఇద్దరికి అదే ఆఖరి క్షణం… వారి బంధంలో.

***

“ఇది ఊహించిన రోజే… కానీ ఇలా కాదు… తేడా ఏముంటుంది, నిన్నటి వరకు నిన్ను ప్రేమించా… ఇపుడు నీ జ్ఞాపకాలని ప్రేమిస్తా…” ఆమెకి ఆఖరిసారి పంపిన మెసేజ్ ఫోన్ లో చూసుకున్నాడు. అలవాటు లేకపోయినా మనసులో బాధ , పొంగుకొచ్చే కన్నీళ్లను ఎలా ఆపాలి తెలియక గమ్యం లేకుండా కార్ డ్రైవ్ చేస్తూ… ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని తాగుతూ, ఆపలేని ఆలోచనలకి తగ్గ వేగంతో కార్ నడుపుతూ వెళ్తున్నాడు. అంతలో ఎదురుగా ఏదో ఆకారం కార్ కి అడ్డంగా వస్తూ ఉండటం గమనించి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు.

దిగి వెళ్లి తిట్టాలి అనుకుని, కార్ డోర్ ఓపెన్ చేస్తూ చూస్తే ఎదురుగా వచ్చింది ఓ యువతి… గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్నట్టు తెలుస్తుంది. వెనుక ఎవరన్నా ఉన్నారా అని చూసాడు ఎవరు లేరు. వచ్చిన యువతి కార్ మీదకి ఎక్కి, రెండు చేతులతో ముఖం దాచుకుని ఏడవటం చూసాడు. డోర్ క్లోజ్ చేసి… చేతిలో బీర్ బాటిల్ తోనే ఆమె పక్కకి వెళ్ళాడు. మనసులో బాధని తట్టుకోలేక, ఎక్కడ ఎలా ఉన్నది… అనే స్పృహ కూడా లేకుండా ఏడుస్తుంది అనేది అర్థం అయ్యి, ఆమెకి వచ్చిన కోపం కూడా తెలుస్తుంది. బాధలో ఉన్న మరో మనిషికే, ఆ మనిషి పడే బాధ ఏంటో తెలుస్తుంది.

“మీ ఆడవాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా… మీరు ఎక్కడైనా, ఎపుడైనా, ఏడవచ్చు… కాని మాకు ఆ అవకాశం లేదు, అలా ఏడిస్తే ఆడంగి వెధవా అంటారు” అన్నాడు ఆమె పక్కకి వెళ్లి కార్ కి ఆనుకుని నిలబడి.

అప్పటి దాకా తన పరిస్థితిపై స్పృహ లేని ఆమె, పక్కన ఒక మగ గొంతు వినపడే సరికి ఉలిక్కిపడి పక్కకి చూసింది. తాను రోడ్డు మీద ఒక కార్ ముందు పార్ట్ పైకి ఎక్కి కూర్చున్న అని అర్థం అయ్యి… తన పక్కన ఉన్నది కార్ కి సంబందించిన మనిషి అని అర్థం చేసుకుని… “సారీ…” అంటూ కార్ దిగింది.

“పర్వాలేదు… I can understand … కూర్చోండి…” అంటూ అతను కూడా కార్ పైకి ఎక్కి కూర్చున్నాడు. అతని మాటలో నిజాయితీ, ఆమెకి అర్థం అయింది. మళ్ళీ కార్ ఎక్కి, కళ్ళు తుడుచుకుంది… వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.

“ఏడుపు వస్తే ఏడవండి, ఎంతసేపైనా, ఎంత కావాలంటే అంత ఏడవండి. మనస్పూర్తిగా ఏడవగలగటం కూడా అదృష్టమే, నాకు ఆ అదృష్టం లేదు, ఏడ్చినా కళ్ళ నుండి కన్నీళ్లు రావు…” అంటూ… “ఆ… ఆ… ఎలా ఎలా… నేను లేకుండా ఉండలేను… నేను లేని జీవితం ఊహించుకోలేను, నువ్వే నా ప్రపంచం… నా జీవితంలో ఎవరున్నా… లేకపోయినా నువు మాత్రం ఉండాలి అన్నావ్… ఏమయ్యాయి ఆ మాటలు…” అని గొంతు చించుకుని ఆకాశంలోకి చూస్తూ అరిచాడు.

పొంగుకొస్తున్న దుఖంతో ఉన్న ఆమె, అతని అరుపు విని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని మాటలను బట్టి అతను కూడా, తన పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకుంది.

“డ్రింక్” అన్నాడు చేతిలో బాటిల్ ఆమె వైపు ఇస్తూ…

“నాకు అలవాటు లేదు అండి” ఇబ్బందిగా అతని ముఖంలోకి చూస్తూ, ఏంటి… ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ.

“నాకూ అలవాటు లేదు, పర్లేదు తీసుకోండి… ఇంకా బాగా బాధపడటానికి పనికి వస్తుంది.”అన్నాడు.

ఏమనుకుందో… ఏమో… బాటిల్ తీసుకుని సిప్ చేసింది, మొదట చేదు అనిపించినా… మళ్ళీ తాగింది.

“పెళ్ళి అయ్యి భర్తతో సమస్య అయితే ఇలా ఏడుస్తూ రారు, లేదా అమ్మ నాన్నతో గొడవ అయి బయటకు రావటం ఇలా అయితే అయుండదు, నమ్మిన మనసు దారుణంగా మోసం చేస్తే తట్టుకోలేక ఇలా వచ్చి ఉంటారు…” అన్నాడు కార్ దిగి డోర్ దగ్గరకి వెళ్లి, సీట్ లో ఉన్న మరో రెండు బీర్ బాటిల్స్ తీసుకుని వస్తూ…

“ఆన్లైన్ లో పరిచయం… ప్రేమించాను అన్నాడు… నేను అతని మాటలు విని ప్రేమించా, నేను ఉండేది ఊరిలో, ప్రతి వారం అతను నా కోసం… లేదా నేను అతని కోసం వస్తూ ఉండేవాళ్ళం. కొన్ని రోజుల నుండి అతని ప్రవర్తనలో కాస్త తేడా, కలవటం కొంచెం తగ్గించాడు, సర్లే ఎదో వర్క్ టెన్షన్ లో ఉన్నాడు కదా అనుకున్నా… ఎదురు చూస్తూ… కాని నెల నుండి బాగా తగ్గింది ఫోన్ లో మాట్లాడటం కూడా… అందుకే వాడిని కలుద్దాం అని వచ్చా… కాని… కాని…”

“ఇంకో అమ్మాయితో ఉన్నాడా?”

‘నీకెలా తెలుసు’ అన్నట్టు చూసింది…

“స్మోక్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు కాదా…” అంటూ లైటర్ తీసి వెలిగించుకుని “హ్మ్మ్… సో, అది చూసి బాధతో ఏడ్చుకుంటూ వచ్చేశారు… అంతేనా” అన్నాడు.

“లేదు… అక్కడే ఇద్దరినీ చావగొట్టి వచ్చా… నేను కరాటేలో బ్లాక్ బెల్ట్…” ఆమె మాట వినేసరికి తాగుతున్న వాడల్లా “వాట్…” అన్నాడు నవ్వుతూ…

“మరి కోపం వచ్చింది… అందుకే కొట్టా… లేకుంటే… అలా వదిలేయాలా…?”

“వదిలేయాలి అంటే నన్ను కొట్టేట్టు ఉన్నారుగా…” అన్నాడు నవ్వుతూ సిగరెట్ తాగుతూ.

“హ్మ్మ్… మీ స్టోరీ ఏంటి…”

“ఏం లేదు… కలిసి ఉండలేక విడిపోయాం. తనకి నా మీద ప్రేమ లేదు… నా ప్రేమ అవసరం లేదు… అందుకే తన లైఫ్ నుండి బయటకి వచ్చేశా…”

“ఏ లవ్ స్టొరీలో అయిన కలిసి ఉన్నపుడు… విడిపోయినప్పుడు… ఒక్కరే ఎందుకు ఎక్కువగా ప్రేమ కోసం తపన పడతారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడతారు… అలాగే సమస్య అయితే ఎక్కువ ఒక్కరే బాధపడతారు… రెండో వారి దగ్గర అలా ఎందుకు ఉండదు…” ఆకాశంలో చుక్కలని చూస్తూ అంది.

“ప్రతి లవ్ స్టోరీ ఏమో తెలీదు కానీ, చాలా కథల్లో అంతే… కారణం రెండో వ్యక్తి కంటే, మొదటి వ్యక్తి స్వచ్ఛంగా… ప్రేమని ప్రేమలా ప్రేమించటం అందుకు కారణం…”

“నిజంగా అసలు ప్రేమ అంటూ ఉంది అంటారా…”

“హా హా హా… లేదు అని ఎలా అనగలం… మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయినంత మాత్రాన ప్రేమ లేదు అంటారా? మన అమ్మ నాన్నల ప్రేమ… స్నేహంలోని ప్రేమ… తోబుట్టువులలో ప్రేమ… మన చుట్టూ రకరకాల బంధాలలో… ప్రతిదానిలో ప్రేమ ఉంది… జస్ట్ మనం రాంగ్ పర్సన్స్ ని లవ్ చేశాం… అంతే…!!”

“మాటలు బానే చెబుతున్నారు…” అంది వెటకారంగా.

“మాటలు కాదు నిజాలు… అయినా ఇపుడు మనం ఉన్న పరిస్థితికి మాటలు కాక… ఇంకేం చేయగలం… ఏడ్చి, బాధపడి ఏం సాధించగలం…?”

“నిజమే… అక్కడ వాళ్ళు, వాళ్ళ లోకంలో సంతోషంగా ఉంటారు… మనమే ఇలా రోడ్డు మీద కూర్చుని బాధపడుతున్నాము…”

“నిజమే… మనం బాధపడతాం అని తెలిసి మనల్ని బాధ పెట్టిన వాళ్ళకోసం మనం ఎందుకు బాధపడాలి. ఆ విలువ లేని మనుషులకి మనం ఎందుకు విలువ ఇవ్వాలి? మనం సంతోషంగా ఉందాం… మనం ఉన్నంత కాలం వాళ్ళని సంతోషంగానే ఉంచాం… విడిపోయి మనం ఎందుకు బాధపడాలి… బాధ పడాల్సిన వాళ్ళు వాళ్ళే కదా…”

“అంటే…” అంది బాటిల్ పక్కన పెడుతూ…

“లెట్స్ సెలబ్రేట్ బ్రేక్ అప్ పార్టీ…” అన్నాడు బీర్ బాటిల్ పైకి ఎత్తి…

“హా హా హా… మీరు భలే మాట్లాడుతున్నారు…” మొదటిసారి చిరునవ్వు తొంగి చూసింది ఆమె ముఖంలో.

“ఇవన్నీ మీకు చెబుతున్న కానీ… నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను… థాంక్స్…” అన్నాడు మరో బాటిల్ ఆమెకి ఇస్తూ.

“థాంక్స్ నేను చెప్పాలి… నిజం చెప్పాలంటే మీ కార్ కింద పడి చచ్చిపోవాలి అనుకున్నా… కానీ…”

“హ్మ్మ్… నా బ్రేక్స్ బాగా పని చేశాయి… అయినా మనం అనుకుంటాం కానీ… ప్రేమించిన వాళ్ళు లేకపోతే బ్రతకలేక… చావాలి అని, నిజం చెప్పాలి అంటే అంత సీన్ లేదు వాళ్ళకి… మన ప్రేమకే అర్హత లేని వాళ్ళ కోసం మన ప్రాణాలు తీసుకోవటం ఎంత తప్పు చెప్పండి…”

“హ్మ్మ్ నిజమే… ఏదేమైనా మీకు చాలా థాంక్స్… ఈ టైమ్ లో మీరు నన్ను ఇలా కలవటం నాకు కాస్త రిలాక్స్ గా ఉంది…”

“నాక్కూడా…” అన్నాడు నవ్వుతూ…

“సో… వాట్ నెక్స్ట్…” అంది నవ్వుతూ…

“గమ్యం లేదు… సరదాగా…అలా… అలా… లాంగ్ డ్రైవ్ కి వెళ్తా… ఎప్పటి దాకా… ఎక్కడి దాకా తెలీదు…”

“నేను రావచ్చా… ఒంటరిగా ఉంటే పిచ్చి ఎక్కిద్ది…”

“హా హా హా… నన్ను ఎలా నమ్మగలరు…”

“పగిలిన ఒక మనసుకి తెలుసు… మరో పగిలిన మనసు ఎలాంటిది అని…”

“సరే… రండి…”

ఇద్దరు కార్ దిగారు… డోర్స్ దగ్గరకి వెళ్లారు… ఇద్దరి చూపులు కలిశాయి…..

“లెట్స్ స్టార్ట్ న్యూ జర్నీ…”.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!