“బావ మనసు బంగారం”

“బావ మనసు బంగారం”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : శ్రీ విజయ దుర్గ. ఎల్

“మాఘమాసం ఎప్పుడు వస్తుందో!” అంటూ.. పాట పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్తున్న, రాణిని తన స్నేహితురాలు శాంతి ఆపి, “ఏంటే, భలే హుషారుగా కనిపిస్తున్నావు? ఏంటి సంగతి?” అని అడిగింది.
రాణి సిగ్గుపడుతూ.. తన ఓణీ పైట చెంగు చివరిని నోటిలో పెట్టుకుని.. లాగి వదలుతూ.. “అదీ, ఈ మాఘమాసంలో.. మా బావతో నాకు పెళ్లి ఖాయం చేసారే, బావ సంక్రాంతికి.. అమెరికా నుంచి రాగానే, మాఘమాసంలో నా పెళ్లి” అంది రాణి.

అబ్బా! ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావే, ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న నీ కల.. ఈ మాఘ మాసంలో నెరవేరుతుంది అన్నమాట! ఇంకేమీ, నీ అందానికి మెరుగులు దిద్ది.. మరింత అందం పెంచే పనిలో ఉండు. అసలే మీ బావ అమెరికా నుంచి వస్తున్నాడు. అక్కడ ఎంత మంది తెల్ల తోలు పిల్లల్ని చూసి ఉంటాడో? నువ్వు అసలే చామని చాయ! మీ బావకి నచ్చుతావో! లేదో! ఎప్పుడో చిన్నప్పుడు చూసిందేగా.. మళ్లీ నిన్ను చూసిందే లేదు.” అని, అప్పటి వరకూ రాణీలో లేని అనుమానం అనే చిన్న విత్తనాన్ని నాటి.. తన మనసులో సంతోష పడిపోతూ.. శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఎంతో ఉత్సాహంగా! తన అమ్మమ్మ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తున్న రాణి.. దిగాలుగా ఇంటికి చేరి, తల్లి పక్కన కూర్చుంది. రాణి తల్లి రాగిణి, ఎంతో సంతోషంగా ఉంటుంది. అనుకున్న కూతురి మొహం లో సంతోషంగా లేకపోవడం చూసి. అదేంటమ్మా! మీ అమ్మమ్మ, తాతయ్య! ఈ మాఘ మాసంలో ముహూర్తాలు పెట్టేసారు. నువ్వేమో! ఇలా దిగులుగా ఉన్నావు? ఏమి, మీ బావ అంటే నీకు ఇష్టం లేదా!?” అని అడిగింది. “లేదమ్మా! బావ అంటే నాకు చాలా ఇష్టం. కానీ, బావ అమెరికాలో పెద్ద చదువులు చదువుకుని వస్తున్నాడు. ఈ పల్లెటూరిది, బావకి నచ్చుతుందా? లేదా? అని భయం వేస్తుంది. బావని అడగకుండా.. మీరు ముహూర్తాలు కూడా ఖాయం చేశారు. అందుకే కాస్త భయంగా ఉంది.” అంది.

“అయ్యో! రాణి అలాంటి భయాలు పెట్టుకోకు. మీ బావ.. మా అన్నయ్య మాట అసలు కాదనడు. మా అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. నిన్నే చిన్నప్పటి నుంచీ కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాడు. కాబట్టి, నువ్వు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకు. సంతోషంగా ఉండు. మరో వారంలో, బావ వస్తాడుగా! కాస్త బావతో స్నేహంగా ఉంటూ.. తన మనసు తెలుసుకుని ప్రవర్తిస్తే సరిపోతుంది.” అని, కూతురికి అననయంగా చెప్పింది. తల్లి మాటలతో.. రాణి మనసు కాస్త స్వాంతన చెందింది. తన బావ రాక కోసం ఎదురుచూసింది.
సంక్రాంతికి నాలుగు రోజుల ముందే, ఊరికి చేరుకున్నాడ రాణి బావ వరుణ్. తన బావని ఎప్పుడూ ఫోటోలులోనే చూడ్డమే తప్ప.. డైరెక్టుగా చూడకపోవడంతో.. తన బావని చూడడం కోసం అందంగా తయారై వెళ్లాలని, ‘లేత గులాబీ రంగులో, అక్కడక్కడా లేత నీలం పువ్వులు ఉన్న లంగా, గులాబీ రంగు వోణీ, నీలం రంగులో బుట్ట చేతులు ఉన్న భ్లౌజ్ వేసుకుని, రెండు జడలు వేసుకుని.. రెండు జడలలను.. కలిపేట్టుగా! అందంగా మల్లె పువ్వులను సింగారించుకుని.. హరివిల్లు లాంటి తన కనుబొమ్మల మధ్యలో, కోల బొట్టు పెట్టుకుని, మెడలో సన్నని చెయిన్ వేసుకుని, చేతినిండా గాజులు వేసుకుని, కాలికి మువ్వలు పట్టీలు పెట్టుకుని.. అచ్చమైన తెలుగింటి ఆడపిల్ల లాగా సిద్ధమై, తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది.’

తన అమ్మమ్మ ఇంటిలోకి, వీధి గుమ్మం నుంచి కాకుండా.. పెరటి గుమ్మంలో నుంచి వెళ్లి, వంటగది నుంచి హాల్లో కూర్చుని ఉన్న వారిలో తన బావ ఎవరై ఉంటారని.. ముందుకి వంగి, తొంగి.. తొంగి చూసింది. తన తాతయ్య, మావయ్య ఒక సోఫా లాంటి కుర్చీలో కూర్చుని ఉండగా! వాళ్ళిద్దరికీ ఎదురుగా ఉన్న కుర్చీలో.. ఒకరు కూర్చుని ఉన్నారు. వెనక నుంచి తలకట్టు చాలా అందంగా కనబడింది. అతనే తన బావ అయి ఉంటాడు. అని పోల్చుకుని.. తన బావ మొహం చూడకుండానే, సిగ్గుతో తన బుగ్గలు ఎర్రగా అయిపోయాయి.
హాల్లో ఉన్న వాళ్ల తోటి మాట్లాడి.. వంట గది వైపుకి వస్తున్న రాణి అత్తయ్య! రాణిని చూసి..
“ఏంటే, రాణీ ఎప్పుడొచ్చావు? మేమంతా ఇక్కడే ఉన్నాము. నువ్వు ఇంట్లోకి రావడమే చూడలేదు. ఓ! వెనక నుంచి వచ్చావా? ఇక్కడ ఆగిపోయావే, పదా! మీ బావ వచ్చాడు.” అంది. రాణి సిగ్గు పడిపోతూ.. “పో! అత్తయ్య! అని అక్కడ నుంచి పరుగున వెళ్ళిపోయింది.”
హాల్లో కూర్చుని ఉన్న వరుణ్ కి, రాణీ మాటలు చెవిన పడ్డాయి. తన కాలి పట్టీలా శబ్దం ఆధారంగా.. హాల్ లో నుంచి లేచి, రాణీని అనుసరిస్తూ.. తన వెనకే వెళ్ళాడు. రాణీ, తన బావని చూడకుండానే వాళ్ళ ఇంటికి వెళ్లి పోవడానికి.. పొలం గట్టు వెంట పరుగులు పెడుతూ వెళుతూ ఉండగా! కొబ్బరి చెట్టు చాటు నుంచి, ఒక చెయ్యి హఠాత్తుగా! తనని పక్కకి లాగింది. తనని అంత ధైర్యంగా! చెయ్యి పట్టుకుని ఎవరు లాగారా! అని బిత్తరపోయి చూసిన తనికి..
ఎదురుగా! ‘తనను మించిన ఎత్తులో, గులాబీ రంగులో మెరిసిపోతూ.. నేరేడు పళ్ళు లాంటి కళ్ళతో, కోటేరు లాంటి పొడవైన ముక్కు.. ఆడపిల్లల పెదవులకే పోటీ ఇచ్చేంత ఎర్రగా ఉన్న.. ఎర్రని పెదవులు. ఆ ఎర్రని పెదవులకి దిష్టి తగలకుండా అన్నట్టుగా ఉన్న.. తీరైన మీసకట్టు..’ అంతటి అందమైన మోముని చూసి.. రెప్ప వేయడం మరిచిపోయింది రాణి.

రాణిని పట్టుకున్న వ్యక్తి కూడా.. రాణి ముఖంలోని అమాయకత్వాన్ని, అందాన్ని చూసి.. మైమరిచి!
“ఏయ్! చీమిడి ముక్కు! ఎక్కడికి పారిపోతున్నావు?” అన్నాడు. చీమిడి ముక్కు! అనేది, తన బావ మాత్రమే అవడంతో.. తన చేయి పట్టుకుంది. తన బావే అని, తెలుసుకుని, రాణి సిగ్గుల మొగ్గ అయ్యి! తన బావ ముందు నిలవలేక.. చెయ్యి విడిపించుకుందామని, చాలా ప్రయత్నించింది. వరుణ్! ఎంతకీ రాణి చెయ్యి వదలకపోవడంతో.. కళ్ళతోనే ప్లీజ్! అని బ్రతిమాలింది. వరుణ్ కూడ.. రాణీ వైపే చూస్తూ.. “నో ప్లీజ్! ఇన్ని రోజులూ నాకు దూరంగా ఉన్నందుకు! నాకు నువ్వు ఫైన్ కట్టాలి.” అన్నాడు.
రాణి కలువ రేకుల్లాంటి తన కళ్ళను టపటపలాడిస్తూ.. “ఫైన్ ఏంటి?” అని అడిగింది.
“ఇంతటి అందాన్ని! ఇన్నాళ్లు నాకు కనపడనివ్వకుండా.. దాచినందుకు! ఎప్పుడు వీడియో కాల్ చేసినా! దాక్కుండి నా తోటి మాట్లాడనందుకు” అన్నాడు. రాణి! వరుణ్ వైపు చూసి.. “నేను నీ అంత అందంగా లేను. కదా! బావ. నువ్వు చూడు ముట్టుకుంటే మాసిపోయేలాగా! ఆడవాళ్ళకి పోటీ ఇచ్చేలాగా.. గులాబీ రంగులో మెరిసిపోతున్నావు. నేను చామని చాయలో.. ‘కాకి ముక్కకి దొండ పండు అన్నట్టుగా!’ ఉన్నాను. నీకు నేను తగను అని, దూరంగా ఉండిపోయాను. అనుకోకుండా! అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ముహూర్తాలు పెట్టేసారు. అందుకే కాస్త భయపడ్డాను. నీకు ఇష్టమో! కాదో తెలుసుకోవాలని, నీతో మాట్లాడాలని వచ్చాను. కానీ, మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను.” అని తలవంచుకుని చెప్పింది.
రాణి మనసులో.. తను అందంగా లేను. చామని చాయగా ఉన్నాను. అనే, ఇన్ఫిరియాటీ కాంప్లెక్స్ ఉందని అర్థం చేసుకుని.. రాణి చేతిని వదిలి, రాణీ రెండు చెంపల మీద చేతులు వేసి.. తన దోసిట్లోకి రాణి ముఖాన్ని తీసుకుని.. రాణి నుదటి పైన తన పెదవులను అద్ది! “పిచ్చి! నీ రంగు ఎవరికి కావాలి? నాకు నువ్వు కావాలి. నీ మనసు కావాలి. నువ్వంటే నాకు ప్రాణమే! ఎన్నిసార్లు నిన్ను చూడాలి అని, నా మనసు తపించిపోయేదో తెలుసా! నన్ను ఎంత ఏడిపించావో తెలుసా? ఇప్పుడు ఇలాంటి మాటలు అని ఇంకా బాధ పెడుతున్నావు” అన్నాడు. వరుణ్ కి, తనంటే ప్రాణం అని.. తన రూపుని, రంగుని తను అసలు పరిగణించడం లేదని తెలిసి రాణి ఆనందంతో వరుణ్ ని హత్తుకుపోయింది.

వరుణ్! రాణిని మరింత.. తన గుండెలకు హత్తుకుని.. “నువ్వంటే, పిచ్చ నాకు. చిన్నప్పుడు, మనిద్దరం సరదాగా ఆటలు ఆడుకున్నాము. కలిసి తిరిగాము. అప్పుడు లేని, ఈ వ్యత్యాసం. ఇప్పుడు నీకు ఎందుకు వచ్చింది?” అని చిన్నగా చిరుకోపంగా అని..రాణి ముఖంలోకి తుంటరిగా చూస్తూ.. గండు చీమకుట్టినట్టు లావుగా ఉన్న రాణి కింది పెదవిని.. తన పెదవితో పట్టుకుని లాగి వదిలాడు. రాణీ! కళ్ళు పెద్దవి చేసుకుని.. తన గుండె వేగం పెరిగిపోతుంటే, అదురుతున్న పెదవులతో.. కాస్త తడబడుతూ.. “బావ! ఏంటిది?” అంటూ దూరం జరగబోయింది. వరుణ్! రాణిని వదలకుండా.. తన పెదవులతో రాణి పెదవులను బంధించి, తన ప్రేమను పూర్తిగా రాణికి అందించాడు. రాణీ! తన కళ్ళ నుంచి ఆనందభాష్పాలను రాల్చుతూ.. తన బావ ప్రేమను స్వాగతించింది. వరుణ్, రాణి ఇంట్లో నుంచి కంగారుగా పరిగెత్తడంతో.. ఏం జరిగి ఉంటుందా! అని వాళ్ళ వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన.. వరుణ్ తాతయ్య! రాఘవయ్య గారు..తోటలో మనవడిని, మనవరాలని అంత దగ్గరగా చూసి, కాస్త దూరం నుంచే గొంతు సవరించుకుంటూ.

“రేయ్! మీ ఇద్దరి పెళ్లికీ మాఘమాసంలో ముహూర్తం పెట్టించాము. ఇప్పుడే తొందరపడి, నన్ను ఇప్పుడే ముత్తాతని చేయకండి. రా!” అన్నారు. తాతయ్య మాటలకి.. ఇద్దరూ విడివడి, సిగ్గుగా తలవంచుకున్నారు రాఘవయ్య గారు.. ఇద్దరి దగ్గరికి వచ్చి, చేరొక చెయ్యి వాళ్ల భుజాల మీద వేసి.. “మీ ఇద్దరిదీ చూడముచ్చటైన జంట” అని ఆశీర్వదించారు. మాఘమాసంలో ఒక శుభ ముహుర్తాన.. కుటుంబ సభ్యులంతా రాణీ, వరుణ్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. రాణీ, వరుణ్ వాళ్ళ ప్రేమను పంచుంటూ.. సుఖ ధాంపత్యానికి తెర తీశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!