అవసరానికో ప్రేమ

రచన – తపస్వి

“ప్రేమంటే…. ఇంతేనా?”

“నిజంగా ప్రాణప్రదంగా ప్రేమిస్తే బాధ పడటం తప్పదా? ఈ క్షణం ఎక్కడో ఢిల్లీలో హోటల్ రూంలో హ్యాపీగా నిద్ర పోవాల్సినవాడిని ఎందుకు ఇక్కడ ఇలా ఏడుస్తూ కూర్చున్నాను? తప్పు ఎవరిది? తనదా? తనని నమ్మి పిచ్చిగా ప్రేమించిన నాదా?” ఓ హాస్పిటల్ మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్నాను… ఈ క్షణం నా మీద నాకే జాలి, అసహ్యం వేస్తుంది. కారణం… “నీ కోసం ఏదైనా చేస్తాను….” అని నేను తనతో అన్న మాట.

(మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర, ప్రేమిస్తున్న వాళ్ళ దగ్గర ఏదో ఒక సమయంలో మనలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే మాట…. ఎదుటి మనిషికి దగ్గర అవ్వాలి, మనల్ని నమ్మాలి అని. ఆ మాటకి అర్థం తెలీకుండా ఉపయోగించే వాళ్ళు కూడా ఉంటారులేండి…. అది ఇప్పుడు అనవసరం.)

***

“నువ్వు పక్కన ఉంటే బాగుండు ధైర్యంగా ఉంటుంది…” ఈ మాట విన్న తర్వాత, తనకి అలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధ, నేను ఉన్నాను అని ధైర్యం తనకి ఇవ్వగలిగాను అన్న సంతోషం రెండు కలిగాయి నాలో.

“అన్నా… ట్రైన్ వస్తుంది” అన్న మాటతో ఆలోచనల నుండి బయటకు వచ్చాను.

“నేను రావట్లేదురా…. మీరు వెళ్ళండి… ఆఫీస్ కి ఫోన్ చేసి చెబుతాను… నా ప్లేస్ లో వేరే వాళ్లు వస్తారు…” అన్నాను. ఆ సమయంలో ఆఫీస్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళటం కంటే, అంజని పక్కన ఉండటం ముఖ్యం అనిపించింది.

“అన్నా… కాని ఇప్పటికిపుడు మీరు ఇలా…” ఇంకా ఏదో మాట్లాడబోతూ… నేను వినే సిట్యుయేషన్లో లేను అని అర్థం చేసుకుని, “సరే అన్నా… మీ ఇష్టం” అంటూ నా బ్యాగ్ నాకు ఇచ్చాడు.

ఆ బ్యాగ్ అందుకున్న తర్వాత మొదట వచ్చిన ఆలోచన… ఇక్కడ నుండి విజయవాడకి ఎలా వెళ్తే తొందరగా వెళ్లగలను, అంజని ఉన్న పరిస్థితులకి నేనెలా సహయపడగలను అని. ఆ ఆలోచనల మధ్యనే… రైల్వేస్టేషన్ బయటకి వచ్చి, విజయవాడ వెళ్ళే ఓ ప్రైవేట్ బస్ ఎక్కేసా. ఈ సమయానికి ఢిల్లీ వెళ్లే ట్రైన్లో ఉండాల్సినవాడిని. రేపు ఆఫీస్ నుండి ఫోన్ వస్తే ఎందుకు వెళ్ళలేదు… అంటే ఏ సమాధానం ఇవ్వాలి, జాబ్ ఉంటుందో, పోతుందో… ఈ ఆలోచనల కంటే… తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉంటే… “నిస్సహాయతతో ఏమి చేయాలో అర్థం కావట్లేదు, భయంగా ఉంది, నువ్వు దగ్గర ఉంటే బాగుండేది… ధైర్యంగా ఉండేది” అన్న అంజని మాటలే గుర్తుకు వస్తున్నాయి.

నాకే కాదు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి అలా మాట్లాడితే ఎవరికైనా అలాగే ఉంటుందేమో. ఎందుకో ఆ మాట విన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను. ఈ క్షణం తన పక్కన ఉండటం తప్ప ఇంకేం ముఖ్యం కాదు అనిపించింది.

అక్కడకి వెళ్ళిన తర్వాత ఏమన్నా డబ్బులు అవసరం అయితే… ఆలోచించే పరిస్థితి రాకూడదు అని, నా అకౌంట్లో ఉన్నవి సరిపోతాయో లేదో అనే అనుమానంతో… ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మరికొంత అప్పుగా అడిగి తీసుకున్నా.

ఆ సమయంలో ఫాస్ట్ గా వెళ్లే బస్ కూడా, ఎందుకో చాలా స్లోగా వెళ్తుంది అనిపించింది.

తను ఫోన్ చేస్తే ఎందుకు వెళ్తున్నాను అంటే… తనని అంతలా ప్రేమించాను కాబట్టి.

తను అంటే… 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ… పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అంజని.

మొదటిసారి అంజనినీ నేను చూసింది ఓ కంప్యూటర్ సెంటర్లో… తన చలాకీతనం, నవ్వు, మాట్లాడే విధానం చూసి నాకు తెలీకుండానే నేను తనని ఇష్టపడటం మొదలు పెట్టాను. తర్వాత తన గురించి, తన కుటుంబం గురించి తెలుసుకున్నాను.

వాళ్ళ కుటుంబంలో మొత్తం ఐదుగురు… అమ్మ, నాన్న, ఇద్దరు ఆడపిల్లలు, మధ్యలో ఒక అబ్బాయి. అంజని ఆఖరిది. ఆర్ధికంగా చెప్పుకోతగ్గ స్థితి కాదు, డిగ్రీ చేసిన తన అక్క ఒక మెడికల్ షాప్ లో వర్క్ చేస్తుంది, అన్నయ్య వేరే ఊరిలో చుట్టాల ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నాడు. నాన్న రైస్ మిల్లులో పని చేస్తూ ఉండటంతో… వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ లో ఉంటున్నారు. అంజని మా ఊరిలో ఓ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. బాగా చదివి IAS అవ్వలనేది తన కోరిక, చాలా బాగా చదువుతుంది. ప్రతిరోజూ కాలేజ్, ఇల్లు కలిపి, మొత్తం మీద 10 కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతుంది.

ఇది మా ఫ్రెండ్స్ నాకు తెలుసుకుని ఇచ్చిన ఇన్ఫర్మేషన్. తనతో పరిచయం చేసుకోవటానికి చాలా రోజులే పట్టింది. ఈ లోపు నేను తనని ఇష్టపడుతున్నట్లు, తన వైపు చూస్తూ ఉన్నాను అన్న విషయం… మా క్లాస్ స్టూడెంట్స్ వల్ల తనకి తెలిసింది. తనతో మాటలు ఎలా కలపాలి అని ఎదురుచూస్తున్న నాకు, అనుకోకుండా ఒక అవకాశం మా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వల్ల వచ్చింది. క్లాస్ లో చెప్పింది ప్రాక్టీస్ చేయటానికి కంప్యూటర్స్ తక్కువుగా ఉండటం వల్ల… స్టూడెంట్స్ ని… ఇద్దరు ఇద్దరినీ బ్యాచ్ గా పెట్టి, ఒకే కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి అన్నారు. నా అదృష్టమో… ఏమో…. అంజని నేను ఒకే బ్యాచ్ లో పడ్డాము.

ఆ రోజు మొదలైన మా పరిచయం… స్నేహంగా, స్నేహం నుండి ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు సరదాగా గడిచింది. మా ప్రేమ మా ఇంట్లో చెప్పటం, అయిష్టంగానే వాళ్ళు అంగీకరించడం జరిగింది. బాగా చదివి IAS అయ్యి తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న తన ఆలోచన నాకు చాలా ఇష్టం. ఈ రెండు సంవత్సరాలు తనకి, తన కుటుంబానికి నేను చేయగలిగిన సహాయం చేశాను. తనని ఒక మహారాణిలా చూసుకునేవాడిని. వాళ్ళ ఇంట్లో కూడా నన్ను ఒక స్నేహితుడిగా పరిచయం చేసింది. తన ఇంటికి నేను, మా ఇంటికి తను వస్తూ, వెళ్తూ ఉండేవాళ్ళం.

నా ఇంజనీరింగ్, తన డిగ్రీ ఒకే సంవత్సరం పూర్తి అయ్యాయి. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తూ… తను కూడా నాతో వస్తే… తనకి ఏదన్నా పార్ట్ టైమ్ ఉద్యోగం చూస్తా అని, అలాగే IAS కోచింగ్ కూడా తను తీసుకోవచ్చు అని చెప్పాను. ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారికి మొదటిసారి హార్ట్ అట్టాక్ రావటం వల్ల, ముందు నన్ను వెళ్ళమని పరిస్థితులు చక్కబడిన తర్వాత వస్తాను అని చెప్పింది. ఉన్న ఊరిలోనే ఓ చిన్న జాబ్ చూసుకుని జాయిన్ అయింది. నేను నెల నెలా వచ్చి కలిసి వెళ్తున్నాను. ఇలాగే సంవత్సరం గడిచిపోయింది. IAS అవ్వాలన్న తన కోరిక గురించి మాట్లాడితే… తర్వాత చూద్దాం… ఇంట్లోనే చదువుతున్నాలే అనేది. రోజులు గడుస్తున్న కొద్దీ తను ఫోన్ చేయటం, మాట్లాడటం తగ్గిన… తన పరిస్థితుల వల్ల అని అనుకున్నాను.

నేను హాస్పిటల్ కి వచ్చి కనపడగానే అంజని ముఖంలో కనపడిన సంతోషం నిజం అని నమ్మాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఎందుకు అక్కడికి వచ్చి వాళ్ళతో ఉండి, వాళ్ళకి సహాయంగా ఉన్నానో పూర్తిగా అర్థం కాకపోయినా… అన్ని తెలిసిన అంజని అక్క మాత్రం, ఫ్రెండ్ వస్తే తప్పేముంది అంటూ సపోర్ట్ చేసింది. అంజని వాళ్ళ నాన్నగారికి హార్ట్ సర్జరీ జరిగి ప్రాణాపాయం తప్పింది అని చెప్పేవరకు, అందరం క్షణక్షణం భయపడుతూ ఉన్నం. దేవుడి దయ వల్ల ఆయన మామూలు మనిషి అయ్యారు. ఆఫీస్ లో ఫ్యామిలీలో ఎమర్జెన్సీ అని చెప్పటంతో, వాళ్ళు అర్థం చేసుకోవటంతో ఏ సమస్య రాలేదు.

కానీ సమస్య వచ్చింది… రేపు నేను బయల్దేరదాం అనుకున్నా, ఈ రోజు రాత్రి 9 అయ్యేసరికి అందరం భోజనాలు చేసాము. అంజని అమ్మ, బామ్మ, ఇంకో ఇద్దరు బంధువులు హాస్పిటల్ గెస్ట్ రూంలో నిద్రపోతున్నారు. పది గంటలు వరకు నేను, అంజని, తన అక్క, అన్నయ్య కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. 10 అవుతుంది అనగా…. అంజని, తన అక్క ఒక చోట… నేను తన అన్నయ్య మరో చోట రోజూలాగానే పడుకున్నాం. సమయం పదకొండు దాటుతుందనగా నిద్ర పట్టక ఫోన్లో మూవీ చూస్తున్న నాతో… వదిన(అంజని అక్క) అన్న మాటలు మొదట అర్థం కాలేదు.

“ఇప్పటిదాకా దాకా డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు కదా… ఇంకా ఫోన్లో కూడా అవసరమా” అంది.

“ఎవరితో…? ఎవరు…?” అన్నాను ఆ మాటలు అర్థం కాక.

“అంజనితో…” అంది పక్కన వాటర్ బాటిల్ అందుకుంటూ.

“లేదు… సినిమా చూస్తున్న.”

“జోక్ చేయకు…! రోజూ… అది ఇలా నీతోనే కదా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఈ టైముకి” అంది.

ఆ మాటలు నాకు ఒక పెద్ద షాక్……

“రోజునా…….? లేదు, ఇంతకు ముందు మాట్లాడుకునేవాళ్ళం, గత ఆరు నెలలు నుండి రాత్రి పది తర్వాత తనకి ఫోన్ చేయొద్దు, మెసేజెస్ చేయొద్దు, ఫ్యామిలీలో ప్రోబ్లం అవుతుంది అంది… అందుకే నేను చేయట్లేదు….”

“మరి రోజు ఈ టైమ్ కి తను ఎవరితో మాట్లాడుతున్నట్టు? నేను నీతోనే అనుకున్నాను…” నా మాటలు పూర్తి అవ్వక ముందే అంది.

ఆ మాటలకి నాకు ఏం సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కాలేదు.

“ఇపుడు కూడా… తను, నువ్వు ఒక్క చోట ఉండి ఉంటారు… అనుకున్న…” అంటూ ఫోన్ తీసి అంజనికి డైల్ చేసి…. స్పీకర్ ఆన్ చేసింది, మొదటి సారి కట్ చేసినా… రెండోసారి లిఫ్ట్ చేసింది.

వదిన… “ఎవరితో మాట్లాడుతున్నావ్…”

అంజని… “ఇంకెవరితో మాట్లాడతాను? విజయ్ తోనే…”

వదిన… “సరే తొందరగా…రా….” అంటూ నా వైపు చూస్తూ ఫోన్ పెట్టేసింది.

నా గుండెలో ముందెన్నడూ తెలియని… ఓ బాధ, కళ్ళ వెంట కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఆలోచనలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

“రోజు తను ఇలాగే అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అపుడపుడు ఫోన్లో ముద్దులు పెడుతున్నట్టు ఉంటుంది. నీతోనే కదా అని నేను ఏ రోజు పట్టించుకోలేదు, ఈ మధ్య తను ఆఫీస్ లో పని చేసే ఒకతనితో కొంచెం క్లోజ్ గా ఉంటుంది, ఎక్కువగా కలిసి తిరుగుతున్నారు అని తెలిసింది, అదే అడిగితే నా ఫ్రెండ్ అతను, తప్పు ఏంటి? అని అడిగింది. సరే… మీరు ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకుంటున్నారు అని తెలుసు కాబట్టి, నిజంగానే అతను ఫ్రెండ్ అయ్యుంటాడు అనుకున్నాను” చెప్తూనే వుంది వదిన.

ఎందుకో అంజని నన్ను మోసం చేస్తుంది అన్న ఆలోచన కూడా నాకు నచ్చట్లేదు, “తనని కలిసి ఒకసారి ఎందుకు అబద్ధం చెప్పిందో అడగటం మంచిది అనుకుంటా… నాతో కాదు మాట్లాడేది అంటే, నువ్వు తిడతావేమో అని భయంతో అలా అబద్ధం చేప్పిందేమో…”

“నిజంగా ఫ్రెండ్ అయితే, రోజు ఇలా మాట్లాడుతూ ముద్దులు పెడ్తూ ఉంటుందా…” ఆవిడ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు.

“నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అని కాదు…. నా చెల్లి కాబట్టి నేను నిజం తెలుసుకోవాలి… వస్తావా…”

ఆవిడ వెనుక నాకు తెలీకుండానే నడిచాను… అడుగులు భారంగా పడుతున్నాయి, సెకండ్ ఫ్లోర్ నుండి మూడో ఫ్లోర్ కి వెళ్లే మెట్ల మీద కూర్చుని తను ఫోన్ మాట్లాడటం చూసాము. తనకి మేము వచ్చినట్టు తెలీకుండా… తను మాట్లాడేది కాస్త వినబడెట్టు ఒక పక్కగా నుంచున్నాము.

“సరే… సరే… ఇక చాలు… ఇంతకు ముందే అక్క ఫోన్ చేసింది… ఇక రేపు మాట్లాడుకుందాం… నేను చాలా మిస్ అవుతున్నాను… ఇపుడు నువు నా పక్కన ఉండి ఉంటే గట్టిగా ఒక హగ్ ఇచ్చి… ముద్దు పెట్టాలని ఉంది….” అంతకు మించి వినాలనిపించలేదు. వెళ్లిపోతున్న నన్ను వదిన చెయ్యి పట్టుకుని ఆపి, లాక్కుని అంజని ముందుకి వెళ్ళింది. అపుడే ఫోన్ పెట్టేసిన అంజని… అక్కడ నన్ను…. వదినని చూసి షాక్ అయింది.

“అదీ ఆఫీస్ ఫ్రెండ్… నాన్నకి ఎలా ఉంది… వర్క్…. డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం….” అంజని మాట పూర్తికాకముందే, వదిన అంజనినీ లాగి చెంప మీద కొట్టింది.

“ఎలా ఉండేదానివి… ఎలా తయారయ్యావే… ఇంకా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు వస్తే బాగుండు అన్న ఒక్క మాట కోసం… వచ్చి… వారం రోజుల నుండి ఇక్కడే ఉంటున్న వీడిని, ఎలా మోసం చేయాలి అనిపిస్తుంది? ఛీ… నువ్వు ఇలా బ్రతకటం కంటే… ఇక్కడ నుండి దూకి చావవే…”

అక్కడ జరిగేది కాని…. మాటలు కాని… అర్థం అయ్యే పరిస్థితిలో నేను లేను. అంజని అక్కడ నుండి వెళ్లిపోయింది. కాళ్ళు కదలని స్థితిలో నేను అక్కడే కూలబడ్డాను.

“సారీ విజయ్… ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు…”

నాకూ అర్థం కావట్లేదు…. ఎందుకు ఈ క్షణం నేను ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాను? ఎందుకు ఏడుస్తున్నాను?ఎందుకు గుండెలో ఎదో తెలియని నొప్పి, బరువు…? నమ్మి… ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే కలిగే బాధ ఇదేనా?  ప్రేమిస్తే బాధ తప్పదా?

“వెళ్తాను వదిన…” ఎందుకో ఇంకో క్షణం కూడా ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు.

“విజయ్….”

“ఏది జరిగినా మంచికే వదిన… తను రా… అని ఉండకపోతే, నేను వచ్చి ఉండేవాడిని కాదు… నాకు ఈ నిజం తెలిసేది కాదు… మోసపోయాను అని నాకేం బాధ లేదు… ఒకవేళ నాతో కంటే వేరే అతనితో తను సంతోషంగా ఉంటుంది అంటే… అంతకు మించి ఏం కావాలి. ఏమో నా ప్రేమలో ఏమన్నా లోపం ఉందేమో… నేను తనకి కరెక్ట్ కాదు అనుకుందో… ఏమో… తనని ఏమి అనకండి….”

“అది కాదు విజయ్…”

“ప్లీజ్… నాకోసం తనని ఏమి అనవద్దు… నిజంగానే నేను తనని ప్రేమించాను… ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. ఒకవేళ నేను లేకుండానే తను హ్యాపీగా ఉంటుంది అనుకుంటే అలాగే ఉండనివ్వండి. కాని ఆఖరిగా ఒక్క మాట నా తరుపున చెప్పండి… కనీసం… అతని నమ్మకాన్ని అయినా నిలబెట్టుకోమని….”

అంతకు మించి ఇంకేం చెప్పాలి అనిపించలేదు, నా బ్యాగ్ తీసుకుని బయల్దేరాను. ఈ క్షణం బాధ ఉండొచ్చు, కాని… ఆ బాధ రేపు కూడా ఉంటుంది అన్న నమ్మకం లేదు. ముఖ్యంగా… తన లాంటి అమ్మాయి కోసం అలోచించి బాధపడాల్సిన అవసరం లేదు అనిపించింది.

***

ప్రేమించే వాళ్ళు తప్పు చేయొచ్చు… కాని ప్రేమ ఎప్పుడూ తప్పు కాదు, ఆ జ్ఞాపకం మంచిదైనా… చెడ్డదైనా మనతో జీవితాంతం ఉండే… ఓ జ్ఞాపకం. ప్రేమించిన వాళ్ళు దూరం అయినపుడు అది బాధనిచ్చే జ్ఞాపకం అయి ఉండవచ్చు. కాని జీవిత గమనంలో అది… ఓ ప్రేమకథగా మన గుండెల్లో నిలిచిపోయె ఓ జ్ఞాపకమే కదా. పుట్టిన ప్రతి మనిషి చచ్చేలోపు ఇలాంటి ఓ జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది… అదే జీవితం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!