నా మొండి వాడి జ్ఞాపకాలు

రచన – తపస్వి

‘ఎప్పుడన్న ఒక మనిషి.. మనకి తెలీకుండా మనకే మనల్ని కొత్తగా పరిచయం చేయటం, మనలో ఓ భాగంగా అయిపోవటం, ఆ మనిషి దూరంగా ఉంటే.. మనలో ఎదో ఒక పార్ట్ దూరం అయిన భావం.. ఇలా మనలో చాలా మందికి అనుభవాలు ఉండి ఉండవచ్చు, నాకూ ఉన్నాయి, అది నా మొండివాడి పిచ్చి ప్రేమలో. నేను వాడికి కొన్ని జ్ఞాపకాలు ఇవ్వాలి అనుకున్నా, కాని వాడే నన్ను వెంటాడే ఓ జ్ఞాపకంగా.. నన్ను వాడి జ్ఞాపకాల్లో మిగిల్చి వెళ్లిపోతాడు అని నేను అనుకోలేదు.’

గుండెలపై పడ్డ తాళితో వచ్చిన బంధం బరువై భారంగా జీవితం గడుస్తున్న కాలంలో నా కోసం, నా ప్రేమ కోసం అనుకోకుండా వచ్చాడు వాడు. వాడే ప్రేమా.. లేక ప్రేమకి అర్థం వాడా? నీకు ప్రేమ అంటే తెలియాలి అంటే వాడి కళ్ళలలోకి చూడాలి. ఆ కనులలో నాపై కోరిక ఎపుడన్న కనపడుతుందా అని చూసా… లేదు, ఏ రోజు కోరిక కాదు, అనంతమైన ప్రేమ.. ఆరాధన కనపడేది. ఎందుకో వాడి కనులలోకి చూస్తే లోకం గుర్తు ఉండేది కాదు, కాని చూడాలంటే  భయం.., ఎక్కడ వాడి ప్రేమకి లొంగి వాడి ప్రపంచంలోకి వెళ్లి తిరిగి రాలేనని…

నా చేతి వేలు పట్టుకుని ఎందుకు మురిసిపోయేవాడో అర్థం అయ్యేది కాదు, కాని వాడు నా చెయ్యి పట్టుకుని నా చేతి మీద ముద్దు పెట్టినప్పుడు ఆ పెదవుల తడిలో ఓ పవిత్ర ప్రేమ కనపడింది.. ఆ క్షణమే ఎదో తెలియని ఓ ఆనందం. తొలిసారి మా ఏకాంతంలో నన్ను దగ్గరకు తీసుకొని వాడి పెదవులు నా నుదుటిన తాకిన క్షణం.. ఏకాంత సమయం దొరికితే నా పెదవులను కదా వాడు తాకాల్సింది.. మరి ఎందుకు నుదుటిన ముద్దు పెట్టాడు,  వాడికి కావాల్సింది నా ప్రేమ, నాకు వాడు ఉన్నాడు అని చెప్పాలన్న ఉద్దేశం.. ఆ క్షణం వాడిలో నాకో తండ్రి కనపడ్డాడు. ఆ పెదవులు నా కనురెప్పలను తాకిన ఆ క్షణం.. ఈ రోజుకీ నేను కనులు మూసిన ప్రతిసారి వెంటాడే ఒక జ్ఞాపకం.

నాకో అవసరం ఉన్నప్పుడు.. నా అన్న వాళ్ళే నాకు అండగా నిలబడని క్షణం, వాడే అన్ని అయ్యి.. ఓ సైనికుడిలా.. ఓ సేవకుడులా.. నాకోసం వాడు నిలబడిన క్షణం.. ఆ క్షణంలో నా జీవితంలో ఓ భాగం అవ్వాలి అనే ఆశ, ఆలోచన వాడిది.. కాని ఎప్పటికీ నాకు మాత్రమే మిగిలిపోయే ఓ జ్ఞాపకం.

నా భర్త నన్ను ఒక్కమాట అంటే పడలేను, కాని వాడు మొరటుగా చంపేస్తా… కొడతా అంటూ కసురుకున్నా ఎందుకు భరిస్తానో తెలీదు. ఎవరి దగ్గర నా కోపం.. బాధ చూపించని నేను వాడి మీద ఎందుకు అరుస్తాను, కసురుకుంటాను, ఏడిపిస్తాను, బాధపెడతాను.. వాడు మౌనంగా నవ్వుతూ భరిస్తాడు. ఎందుకో ఈ క్షణం వరకు నాకు అర్దం కాలేదు, బహుశా మా ఇద్దరికీ.. మాకు మా మీద.. మాకే తెలియకుండా ఉన్న ప్రేమా..?నమ్మకమా..?

నువ్వు నాకు వద్దు పో… అంటూ మొండిగా వాదిస్తా.. కాని వాడు నిజంగా దూరం అవుతాడు అంటే నాకే తెలియని ఓ బాధ, మళ్ళీ నమ్మకం.. నా వాడు నాకోసం మళ్ళీ మళ్ళీ వస్తాడు అని.. నేను ఒక్కసారి పలకరిస్తే మళ్ళీ అలాగే నవ్వుతూ వస్తాడు అని. నేను వద్దు అని వెళ్ళిపోతాడు… కాని ఎంత దూరంగా వెళ్తాడో.. అంతే ప్రేమగా మళ్ళీ దగ్గర అవుతాడు.

వాడు నా జుట్టు పట్టుకుని రాక్షసి అన్న క్షణం.. నొప్పి కంటే ఆ నొప్పితో పాటు ఓ తీయటి అనుభూతి. వాడికి అంత ధైర్యం ఏంటి? అసలు అంత ధైర్యంగా నా జుట్టు అలా పట్టుకుని ఎలా అనగలడు? వాడు అలా అన్న.. నేను ఎందుకు అంతలా భరిస్తూ నవ్వుతానో.. నాకే తెలీదు. వాడు చూపించే ప్రేమని చూపించవద్దు అనేది నేనే. చూపించకపోతే వాడిని రెచ్చగొట్టేదాన్ని నేనే.

వాడి ప్రేమ పొందినందుకు అదృష్టం అనుకునేది నేనే.. ఆ ప్రేమని అర్థం చేసుకుని కావాలనుకుని దగ్గర అయ్యి, దూరం పెట్టి బాధపడేది నేనే.. నేను సంతోషపడతా అంటే.. వాడు ఎంత బాధ అయిన భరిస్తా అంటాడు.. ఎందుకు భరించాలి? ప్రేమిస్తే భరించగలం? మరి నేను ఎందుకు భరించలేను? కేవలం సంతోషం మాత్రమే ఎందుకు కోరుకుంటూ ఉంటా?

నేను బాధపెడితే, గొడవపడితే మౌనంగా అలా ఎలా వెళ్లిపోగలడు? సరే బాధ పెట్టు.. పర్వాలేదు, నీ వాడినే కదా అని ఎలా అనగలడు? నేను ఎందుకు అనలేకపోతున్నా?

ప్లీజ్ గొడవ పడకు, అలగకు, బాధగా ఉందిరా అని ఎందుకు అంటున్న? అంటే వాడు భరించే బాధలో నేను కాస్త కూడా వాడిలా భరించలేనా..? మరి వాడు మాత్రం ఏమి జరగనట్టు కొత్తగా మళ్ళీ ఎలా నన్ను ప్రేమిస్తాడు?

నా అల్లరిని.. నా ప్రేమని.. ఇష్టాన్ని.. కోపాన్ని… బాధని.. సంతోషాన్ని.. ఎందుకు అంతలా.. నన్ను నాలాగే ఎలా ప్రేమించగలడు? నేను ఎందుకు ప్రేమించలేను?.

ప్రతిరోజు, ప్రతిక్షణం వాడికి నేను అంటే ఎంత ఇష్టమో ఎందుకు చెప్పాలి అనుకుంటాడు, చెప్పినా నేను అర్థం చేసుకుని ఒకసారి, చేసుకున్నా పట్టించుకోకుండా మరోసారి, అసలు లెక్కే చేయకుండా మరోసారీ నేను ఉంటే.. వాడు మాత్రం మళ్ళీ మళ్ళీ అలాగే ఎలా ఉండగలడు. బాధతో నా కనులు చమర్చితే వాడి కళ్ళు ఎందుకు వర్షిస్తాయి.

నేను సంతోషంగా ఉంటే వాడి పెదవులు ఎందుకు నవ్వుతూ ఉంటాయి.

నన్ను ప్రేమిస్తున్న అంటూ.. నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండటం ముఖ్యం అంటూ ఎలా అనగలడు. నా భర్తతో, నేను ఎలా సంతోషంగా ఉండాలి అని ఎలా సలహా ఇవ్వగలడు? ఏ జన్మలో మిగిలిపోయిన బంధం మనది.. అందుకే ఇక్కడ కలిశాం అంటూ.. ఈ జన్మకి నువ్వు నా  సొంతం అని కోరుకోకుండా.. వచ్చే జన్మకి ఎదురుచూస్తాను అని ఎలా చెప్పగలడు? నేను చేసే తప్పు ఒప్పులలో, ప్రతి చిన్న విషయంలో నాకు ఒక తోడుగా ఉంటూ… నన్ను ఒక దేవతలా కొలుస్తూ.. నేనే లోకం అంటూ.. నాకు దూరంగా ఎందుకు వేరే లోకంలో ఉంటాడు.

నాతో కలిసి అల్లరి చేస్తూ నా కొడుకులా..

నా చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పే స్నేహితుడిలా..

నా బాధ వింటూ ఓదార్చే తల్లిలా…

నీకు నేను ఉన్నానంటూ అండగా నిలబడే తండ్రిలా…

నా ఆశల పల్లకి  మోసే బోయలా…

నా కోరికల రాజ్యానికి రాజులా…

నాకై పోరాడే సైనికుడిలా..

ప్రేమగా దగ్గరయ్యే ప్రేమికుడిలా…

అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ.. ఓ జీవిత భాగస్వామిలా…

ఏది మంచి, ఏది కాదు..

అంటూ కాపు కాసే సోదరుడిగా.. ఎంత.. కాదు, వద్దూ అనుకుంటూ ఉన్నా.. మళ్లీ మళ్లీ నాలో ఉంటూ.. నన్ను వెంటాడుతూ.. నా జీవితంలో ఒక భాగంగా నిలిచిపోయిన నా మొండివాడిగా ఉంటూ.. కాస్త ప్రేమ.. కాస్త బాధ.. కాస్త కోపం.. కాస్త భయం.. కాస్త ఇష్టం.. కాస్త విరహం.. కాస్త ఆశ… కొంచెం మైమరపు.. ఇలా ప్రతి ఒక్క భావన నాలో నింపి.. నాకో ప్రియ శత్రువుగా నిలిచిన.. నా మొండి వాడి జ్ఞాపకాలు.. ఎప్పటికీ నాలో నిలిచిపోయే, నాతో ఉండిపోయే జ్ఞాపకాలు. ఇంతకీ మా పేర్లు చెప్పలేదు కదా..? అవి.. మీకు తెలిసిన పేర్లే…!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!