అర్ధాంగి

అర్ధాంగి

రచన – దివ్యాన్ష లేఖిని

    పెద్ద ఆడిటోరియం, వేదిక మీద ఎందరో ప్రముఖులు ఆశీనులై ఉన్నారు. అక్కడ ఒక సన్మాన సభ జరుగుతోంది. నెమ్మదిగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. 33 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో సేవలందించి, విశ్రాంత ఉద్యోగిగా నాకెందుకులే అనుకోకుండా, తన దగ్గర చదువుకొని మంచి స్థాయికి ఎదిగిన వారినందరిని గుర్తుపెట్టుకుని, ప్రతి ఒక్కరిని సంప్రదించి, తన వద్దకు వచ్చిన ప్రతి పేద విద్యార్థికి చేయూతనిస్తూ, విధ్యాదానానికి ఒక కొత్త అర్ధాన్ని చెప్పారు కనలింగేశ్వరరావు గారు ( KL రావు గారు).

ఇంటికి పెద్దగా, పెద్ద కుటుంబం బాధ్యత తన మీద  ఉన్నా, ఏనాడు తన పర భేధం లేకుండా, అడిగిన వారికి లేదనకుండా శక్తి వంచన లేకుండా సాయం చేసిన మహోన్నత మనస్కులు. 70 వసంతాల వయసులో, షష్ఠి పూర్తి సంబరాల ఖర్చును ఒక పేద విద్యార్ధి చదువుకు అందించి, తృప్తిగా నవ్విన నిరాడంబర జీవి అతను.

SVR, శ్రీకాంత్, వినాయక్, జ్యోతి, జానకి, ధనలక్ష్మీ, శైలజ, జయ, ఉదయ, అభి, యామిని, మాధవ వారి శిష్యగణంలో ప్రముఖులు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా గురువుగారి బాటలో ఎంతో మందికి ఉద్యోగ కల్పనలో, మార్గ నిర్దేశంలో ముందు ఉండటమే జీవిత లక్ష్యంగా నడుస్తున్నారు. గురువుగారి ఇన్ని సంవత్సరాల శ్రమను లోకమంతా చాటి చెప్పాలనే బలమైన కోరికతో, వారికి మాట మాత్రం చెప్పకుండా ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. సభ ఏర్పాటు చేసిన తరువాత కాదు అనరు అని నమ్మకం. తన పిల్లల నమ్మకాన్ని నిలబెట్టటానికి ఎక్కడో గ్రామం నుంచి సతీసమేతంగా వచ్చారు KL రావు గారు. వారి సతీమణి రాధ, నిజంగా గుణేన రుక్మిణి ఆమె, రావు గారికి హృదయ రాధ ఆమె. సభ నెమ్మదిగా మొదలు పెట్టారు, ఒక్కొక్కరు గురువు గారి గుణగణాలను తమదైన శైలిలో హృద్యంగా, కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. అందరూ వారి వారి అనుభవాలను పంచుకోవటం ముగియగానే, కార్యక్రమ ఏర్పాటుకు అసలు కర్త, కర్మ అయిన SVR,  గురువుగారిని వేదిక మీదకు రావాలిసిందిగా అభ్యర్ధించారు.

ఆనందంతో లేచి అడుగులు వేసి సభ మెట్ల మీద కాలు పెట్టబోతు, ఒక్కసారే వెనక్కి తిరిగి ధర్మపత్ని వైపు చూసి తన చేయి చాపారు, కనుల నిండా నీరుతో తన వైపు చేయి చాపిన భర్త వంక కంగారుగా చూస్తూ, గబా గబా అడుగులు వేసి, తన పరిసరాలు మరిచి వారి చేయి అందుకున్నారు రాధ గారు. తన సహచరి చేయి పట్టుకుని దగ్గరకు తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వేదిక మీదకు చేరారు. రాధ గారు కంగారుగా వారించబోయి, వారు ఉన్న ప్రదేశం చూసి బిడియంగా ఒదిగి భర్త పక్కన నిలబడిపోయారు.

గురువు గారి చర్య అర్ధం కాక స్థాణువులా నిలుచున్న SVR దగ్గరకు వచ్చి, భుజం తట్టి తన చేతిలో ఉన్న మైక్ అందుకుని, భార్య భుజం చుట్టూ చేయి వేసి భరోసా ఇస్తూ, “ మీ అందరూ అనుమతిస్తే నా భావాలు మీతో పంచుకుంటాను ” అని అందరి వంక చూడగా, ప్లీజ్..! ప్లీజ్…! అని వినిపించిన మాటలకు సంతోషంతో, అందరికి నమస్కరించి.. “ఇప్పుడు నేను చేసిన పని మీ అందరికి ఏదో వింత అనుభూతి, సంశయం, ఇంకా చాలా భావాలు కలిగించి  ఉండవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం, ఈ సన్మానానికి అసలు అర్హత నాకు లేదు. ఈ సన్మానానికి పూర్తి అర్హత నా ధర్మపత్నికి మాత్రమే ఉంది.

ఒక ఉపాధ్యాయుడిగా నేను చేసిన ప్రతి పనీ, నా బాధ్యతల్లో భాగం మాత్రమే, కానీ నా ప్రతి చర్యని నిస్సందేహంగా ప్రోత్సహించి, ఎన్ని ఇబ్బందులైనా గడప లోపల దాచి, ఏనాడు నా పిల్లల్ని కానీ, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని కానీ లేదు, కాదు అనకుండా, అపర అన్నపూర్ణగా, కుబేర సోదరిలాగా ఆదరించింది. అందుకే నా భార్యకు మాత్రమే అర్హత ఉంది అన్నాను. మీ అందరి విజయానికి కారణం నేను అని మీరు భావిస్తే, నా గెలుపుకు కారణం నిస్సందేహంగా నా జీవిత భాగస్వామి మాత్రమే.

ఇలాంటి ఎన్నో సన్మానాలు నేను భర్తగా నా భార్యకు ఎన్ని చేసినా, అవి అన్ని కూడా చంద్రునికి నూలుపోగుతో సమానం. కానీ బిడ్డలు తల్లికి చేస్తే అది తర తరాలకు ఆదర్శం. అందుకే ఈ సన్మానికి, ఎవరు నిజమైన అర్హులో వారికే ఈ సన్మానం, మీ అందరితో పాటు నేను కూడా ఈ తల్లికి బిడ్డనే, అందుకే భార్యగా వచ్చి తల్లిగా మారిన నా పిల్లల తల్లికి, నా చిరు కృతజ్ఞతాంజలి ఈ సన్మానం”.. అని పలుకుతూ తన కోసం వేసిన సింహాసనం లాంటి కుర్చీలో స్థాణువులా నిలుచున్న భార్యను నెమ్మదిగా నడిపించుకు వచ్చి కూర్చోబెట్టారు రావు గారు.

ఒక్కసారే సభ మొత్తం లేచి నిలబడి వారి సంస్కారానికి ముగ్దులై, తమ కర్తవ్యం, జీవిత భాగస్వామిని ఎలా అర్థం చేసుకోవాలి అనేదానికి నిర్వచనం దొరికినట్లుగా, మైమరచిపోయి చప్పట్లు కొడుతూ ఉండిపోయారు. ధారపాతంగా వస్తున్న రాధ గారి కంటి నీరు తుడిచి… “ఇది నీ గెలుపు రాధా, పూర్తిగా నీకు మాత్రమే సాధ్యమైన గెలుపు. నిన్ను భాగస్వామిగా పొందటం నా ఎన్నో జన్మల పుణ్య ఫలం” అని చెప్తూ శాలువా కప్పారు.

పార్వతి పరమేశ్వరుల వంటి వారి వద్ద ఇంతకు ముందు ఎన్నో సార్లు ఆశీస్సులు తీసుకున్నా, వారి మధ్య ఉన్న అనురాగానికి ముగ్దులై, ఇటువంటి వారి పాదాలు స్పృశిస్తే… జన్మ జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి అని భావించి ప్రతి ఒక్కరు వారి పాదాలంటి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువుగారు మరొకసారి గెలుపుకు అర్ధం చెప్పినట్లుగా అర్ధమైన SVR వారి శిష్యులలో ఒకడినైనందుకు గర్వంగా నిలబడిపోయాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!