మనం

మనం

రచయిత::మంజీత కుమార్

“కిరీటం ఉందని డాబులుపోకు బావ”
“ఎర్రగా బుర్రగా ఉన్నావని నువ్వు కూడా ఎగిరెగిరిపడతావు కదా మరదలా” వంకాయ, టమాటా మాటలకు కాకరకాయ పగలబడి నవ్వింది.
“చేదు మాస్టారు మీకెందుకు అంత నవ్వు” అని కోపంగా వంకాయ అనేసరికి
“ఏముంటుంది? అందరికీ మీరంటేనే ఇష్టం. నన్ను చూడగానే దూరంగా పెట్టేస్తారు” బాధపడుతూ చెప్పింది.
“నిజమే… నీ రుచి అబ్బో తలుచుకుంటేనే బాబోయ్” బుజ్జగించకుండా వంకాయ అలా అనేసరికి
బెండకాయ “తప్పు అలా మాట్లాడకు. రుచి సంగతి ఎలా ఉన్నా…కాకర బాబాయి ఆరోగ్యప్రదాయిని అని మర్చిపోకు” అంది.
“వంకాయ తింటే వాతం, ముందు ఆ సంగతేంటో చూడు” గుమ్మడికాయ అనేసరికి వంకాయకు మండిపోయింది.
“ముందు నువ్వు కాస్త ఒళ్ళు తగ్గించు, ఆ తర్వాత నా జోలికి రా” అని తిట్టగానే
“ఆపండి ఏంటి మీ గొడవ” సొరకాయ మందలించింది.
“చూడు సోదరా నన్ను చూస్తే వీళ్ళందరికి కుళ్ళు, నిజం చెప్పాలంటే నేనే కూరగాయల మహారాజు, అందుకే దేవుడే నాకీ కిరీటం పెట్టాడు” వంకాయ గొప్పలు విని
చిక్కుడు “కానీ కిరీటం పీకి అవతల పారేశాకే తింటారు” అని గుర్తుచేసింది.
“నాపై ఎన్ని సినిమా పాటలు ఉన్నాయో తెలుసుగా అది నా ప్రత్యేకత” అని వంకాయ “గుత్తి వంకాయ కూరో మావ కోరి వండితిని రావో మావ” పాట అందుకుంది.
“చిన్న పిల్లల రైమ్స్ లో మేమందరం ఉంటాము మరి ” ఆలుగడ్డ మాటలకు వంకాయ “ఫ్రిడ్జ్ లో చోటు లేని నువ్వు నాకు ఎదురు మాట్లాడతావా” అని కయ్ మంది.
“నేను నీలాగా డాంభికాలుపోను, నేలలో పుట్టి నేలపైనే ఉంటాను” ఆలుగడ్డ ధీటైన సమాధానం ఇచ్చింది.
“ముందు క్యాబేజీ కోడలితో నీ గొడవేంటో చూసుకో, అందరితో కలుస్తావు కానీ క్యాబేజితో మాత్రం కలవవు” అని ఆలుగడ్డకి వంకాయ సవాలు విసిరింది.

“ఇక చాలు, అందరికీ ఒక్కో లక్షణం, ఒక్కో ఆరోగ్య గుణం ఉన్నాయి, అందరం సమానమే” ఉల్లిపాయ ఉవాచా విని అన్నీ కాసేపు మౌనంగా ఉండిపోయాయి.
ములక్కాడ “హమ్మయ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది” అనగానే పొట్లకాయ ఒక్కటిచ్చింది.
ఈలోగా సుచరిత వంటగదిలోకి వచ్చి “అబ్బా కొన్నే కూరగాయలు ఉన్నాయి, ఓ పని చేస్తా అన్నిటిని కలిపి నవరతన్ కూర్మా చేస్తా” అని కత్తిపీట తీసింది.

కూరగాయలు ఒకదానిని ఒకటి చూసుకుని నవ్వుకున్నాయి.

You May Also Like

One thought on “మనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!