అర్ధాల అమరిక

అర్ధాల అమరిక

రచయిత :: మొహమ్మద్ అఫ్సర వలీషా

పరగడుపునే ప్రతి రోజూ కలుసుకుని పసందైన మాటల పొట్లాలు విప్పుకుని పొట్టనింపుకోనిదే ఆ స్నేహానికి కాలక్షేపం కాదు. మాయదారి కరోనా లాక్ డౌన్ తో ఎక్కడి వాళ్ళక్కడ గప్ చుప్ అన్నట్లు, ఎవరినీ తాకకుండా, ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండి దాగుడుమూతలు ఆడాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది, బాధ్యత గుర్తొస్తుంది.
శరత్, చంద్ర బాల్య మిత్రులు ఒకే చోట కలిసి పెరిగి పెద్దవారై తమ తమ వ్యపారాలు చేసుకుంటూ ప్రతిరోజూ పార్కులో కలుసుకుంటూ కష్ట సుఖాల బేరీజు వేసుకుంటూ హాయిగా ఉంటున్నాం అనుకునేంతలో ఈ ఉపద్రవం వచ్చి పడింది.
ఇంకేం చేస్తారు అందరిలాగానే ఫోన్ లో యోగ క్షేమాలు సరదా సరదా పలకరింపులు మధ్య మధ్యలో కరోనా పై కోపగింతలు ఇంక ఎన్నాళ్ళో ఈ మహమ్మారి కరాళ నృత్యం ప్రజల పైన అని నిట్టూర్పులు.
ప్రతి రోజూ సెల్ లో కరోనా పై జనాల ఆకలి కేకలు, చావులు ఒకళ్ళ కొకళ్ళు షేర్ చేసుకోవటం విచారం వెల్లి బుచ్చుకోవటం, ఒకరి నొకరు పరామర్శించు కోవటం ఇలాగే భారంగా, భయభయంగా రోజులు వెళ్ళి పోతున్నాయి గానీ కరోనా మాత్రం ఇంచు కూడా కదలటం లేదు.
ఒక రోజు చంద్ర బ్యాంక్ అకౌంట్ లో శరత్ 5000/రూ వేశాడు. చంద్ర ఆశ్చర్య పోయాడు, వెంటనే ఫోన్ చేసి “ఏమిటి డబ్బులు వేశావు శరత్ ” అన్నాడు.
దానికి శరత్ “నీ పరిస్థితి నాకు తెలియనివ్వకుండా నన్ను ఫూల్ ను చేద్దామనుకున్నావు నీ ఫ్రెండ్ ను ఆమాత్రం అర్థం చేసుకోలేనా నిన్నంతా నీవు ఇల్లు ఎలా గడుస్తుందోనని మధన పడ్డావు గానీ నీ ఫ్రెండ్ దగ్గర మొహమాటం మాత్రం మారలేదు. నీకు ఇల్లు గడవని విషయం ఏనాడూ నాకు చెప్పలేదు. నీవు పెట్టే ఆకలి ఆలమటింపుల కరోనా కష్టాల వీడియోలు నన్ను ఆలోచింపచేశాయి. అడిగితే నీవు ఆకలితో ఉపవాసం అన్నా ఉంటావు గానీ నీ గురించి మాత్రం చెప్పవు పిల్లలు, చెల్లెమ్మను కష్ట పెడతావు. ఇంక మనిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కు అర్థం , విలువేముంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలోనే నిజమైన బంధముంది మై డియర్ నేస్తం” అనగానే, చంద్ర కళ్ళంబడి నీళ్లు వచ్చాయి. తన బాధలు వాడికి చెప్పకుండా ఫూల్ చేద్దామనుకున్నాడు తనే ఫూల్ అయ్యాడు. ఇంత మంచి స్నేహానికి విలువిచ్చే స్నేహితుడు దొరికి నందుకు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాడు……!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!