విలపించే మనసు

విలపించే మనసు

రచయిత ::సుజాత తిమ్మన

ఇయ్యాల ఏంటో పొద్దున్నుంచి క్షణం తీరిక లేకుండా తిరిగిన.. చానా పొద్దుబోయింది.. పది దాటింది ఒళ్ళంతా పులిసిపోతా ఉంది …’ తనలో తానే అనుకుంటూ ఇంటి దారి పట్టాడు వెంకటేశు.
వీధిలోనుంచే లోనికి చూసాడు. దీపం ఇంకా వెలుగుతుంది, శాంతి పడుకోలేదు ఈ టివిలో ‘నవ్వుల జల్లు’ ప్రోగ్రాం చూస్తూ పడి పడి నవ్వుతూ ఉంది.
‘బానే ఉంది దీని పనే..’ చేతి సంచి లోనకి వేసి అటునుంచి ఆటే బయిటికి నడిచాడు ’ఈయాల కనీసం రెండు సీసాలన్నా తాగాల ఫుల్లుగా ..లేకపోతె ఈ నొప్పులు తగ్గేలా లేవు ..’ అనుకుంటూ కల్లు దుకాణం వైపు వెంకటేశు.

***

పదోతరగతి ఫేలయిన వేంకటేశు బ్రతుకు తెరువుకోసం బండ పనులెన్నో చేసాడు. ఇంటికి పెద్దకొడుకు కావడంతో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి అతనే చేయవలసి వచ్చింది. చిన్నతనంలోనే తాగుడుకి బానిస అయి, లివర్ పాడయి చనిపోయాడు తండ్రి వీరయ్య. తల్లి బాలమ్మ నాలుగు ఇళ్ళల్లో పనిచేసి వీళ్ళందరినీ సాకింది. బాధ్యత తెలిసిన వేంకటేశు అన్నీ తనే అయి ఇంటిని ఒక దారిలోకి తీసుకు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లకి తమకు తగిన సంబందం చూసి పెళ్లి చేసాడు.
శాంతి ఎదురింటి మేడలో పనిచేస్తూ ఉండేది. అమాయకంగా కనిపించే ఆ పిల్లని చూస్తూ.. ఇష్టపడి, శాంతిని చేరదీసిన వాళ్ళతో (ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు కూలిపనికి వెళ్ళి, అక్కడ గోడ కూలి మొత్తం అయిదుగురు ప్రాణాలు విడిచారు. అందులో శాంతి తల్లితండ్రులు కూడా ఉన్నారు. శాంతి నాలుగేళ్ల వయసులో ఒంటరిదైయింది. కొండయ్య దంపతులు శాంతిని చేరదీసి వాళ్ళపిల్లలతో పాటే పెంచుకున్నారు సంప్రదింపులు జరిపించి నిరాడంబరంగా దేవుడి గుడిలో పెళ్లి చేసుకున్నాడు వేంకటేశు.
శాంతి పేరుకు తగ్గట్టు ఎంతో ఓపిక గల అమ్మాయి. అత్తని సొంత తల్లిలా చూసుకుంటూ, వెంకటేశుకు సరి అయిన ఇల్లాలు అనిపించుకుంది. బ్యాంక్ లో లోను పెట్టి ఒక అటో కొనుక్కున్నాడు వెంకటేశు.
తన కష్టానికి ప్రతిఫలం బాగానే వచ్చేది. రోజు కర్చులు పోను మిగిలినది చిట్టీలు కట్టుకునేవాళ్ళు. శాంతి కూడా రెండు ఇళ్ళు పనిచేసుకుని వచ్చేది. అత్తకు జబ్బుచేస్తే తనే బిడ్డలాగా చూసుకుంది. అయినా లాభం లేకపోయింది. తన బాధ్యత అయిపొయింది అన్నట్టు బాలమ్మ కన్నుమూసింది.
ఇద్దరు ఆడబిడ్డల పురుళ్ళు ..పుణ్యాలు అన్ని అయేలోపు శాంతి కూడా ఇద్దరు బిడ్డల తల్లి అయింది. తనకి ఎవరు లేని కారణంగా అన్ని ఇక్కడే చేసుకోవలసి వచ్చింది ..వెంకటేశు అన్నీ తానే అయి శాంతిని కాపాడుకున్నాడు బాధ్యతగా. బాధ్యతలని భరించవచ్చు… అరమరికలు లేకుండా ఉంటే.. మనసు బరువైతే చిన్న కష్టం వచ్చినా పెద్ద బండరాయిగా కనిపిస్తుంది .

**

పెద్ద పాప రజనికి ఎనిమిది ఏళ్ళు.. బాబు రాజేష్ కి ఆరేళ్ళు వచ్చాయి ..ప్రైవేట్ స్కూల్ లో ఫీజులు ఎక్కువే అయినా పిల్లలు బాగా చదువుకోవాలి అనే తాపత్రయంతో ఇద్దరినీ ఒకే స్కూల్లో వేసి చదివిస్తున్నారు. రోజులు బాగానే గడుస్తున్నాయి. తెల్ల కార్డు మీద బియ్యం, పప్పులు, ఇంకా ఇంటి సరుకులు గవర్నమెంట్ ద్వారా లభించేటివి అన్నీ తెచ్చుకుని వాటితోనే తిన్నాం అనిపిస్తారు. పిల్లలకి మాత్రం తప్పని సరిగా మంచి ఆహారం ఇవ్వాలి అని పాలు, కొంచం తక్కువ దర అయిన పండ్లు, గుడ్లు, రోజు పెడతారు. అందుకే ఇద్దరు చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా పెద్దింటి బిడ్డల్లా కళ కళ లాడుతూ ఉంటారు.

***

ఓ రోజు వెంకటేసుతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు గిరి కనిపించాడు బ్యాంకు దగ్గర.
‘ ఏంటి బావా…బాగున్నావా..అటో తోల్తున్నావా…’ అంటూ పలకరించాడు.
“అవును బావా చాలా రోజులైంది నిన్ను చూసి…ఎట్లా ఉన్నావు?
నువ్వేంజేస్తున్నావు?’ అనడిగాడు వెంకటేశు.
“నేను ఈ బ్యాంక్ సార్ ఉండే అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నా బావా.. ఆ ఇంటి వాళ్ళు పని చెపితే ఇట్లా వచ్చిన. దా కొంచం చాయ్ తాగుతా మాట్లాడు కుందాం..” అంటూ పక్కనే ఉన్న ఇరానీ కేఫ్ లోనికి దారి తీసారు ఇద్దరు.

కష్ట సుఖాలు ఇద్దరు ముచ్చటించుకున్నారు.
మాటల్లో చెప్పాడు గిరి తనకి ముగ్గురు పిల్లలు అని..అయినా వాళ్ళ కర్చు అసలు నాకు లేదు అని.
‘అదెట్లా బావా ‘ తెల్ల మొఖం వేసాడు వెంకటేశు.
“అంతేబావా…కొత్త గవర్నమెంట్ వచ్చినాక మనలాటోళ్ళకి చానా మేలు జరుగుతున్నాయి ..
ముందుగాల నేను కూడా ప్రైవేటు ఇస్కూల్ల ఏసినా..మస్తు ఫీసులు గట్టిన..ఎంత సంపాదించినా ఆల్ల బళ్లకే పోయ్యాలిసి వచ్చేది..పుస్తకాలని, డ్రస్సులని, అబ్బో..ఒక్కటేమిటి..రెక్కలు ముక్కలు జేసుకుని ఇద్దరం కష్టబడ్డా సరిపోయేది కాదు. మన ముఖ్య మంత్రి పుణ్యామాని ఈ ఏడాది జర సుకూన్ గా ఉన్నాం ..” చాయ్ లో ఉస్మానియా బిస్కెట్టు ముంచుకుంటూ చెపుతున్నాడు గిరి.
‘అదేంటో నాకు చెప్పు బావా, మేము కూడా అంతే..నా భార్య శాంతి నాలుగు ఇళ్ళు పని చేసి వస్తాది..నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ అటో తోల్తా..అయినా సాలి సాలని బతుకే ..” త్రాగేసిన చాయ్ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అడిగాడు వెంకటేశు.
“ఎం లేదు బావా…తెల్లకార్డ్ ఉన్న మనలాటి వాళ్ళ పిల్లలకి ప్రభుత్వం బడులు ముందు నుంచి ఉన్నవే..కానీ ఆ టైములో మంచి టీచర్ లు ఉండేటోల్లు గాదు కానీ ఈ పొద్దు అట్లలేదు. స్కూల్స్ ..హాస్టల్స్ అన్ని తనిఖీలు చేసి మంచిగా ఉండేతట్టు చేసినారు. అందుకే నా ముగ్గురు పిల్లగాండ్లని హాస్టల్ల ఏసిన. మనకాడికెల్లి గంట పయానం. వారం వారం పోయి చూసి వస్తా. సెలవులకి వాళ్ళు వస్తారు. మస్తుగ ఉన్నారు పిల్లలు. బట్టలు, పుస్తకాలు, చివరికి ఆడబిడ్డలకు కావలసినవి (సానిటరీ నాప్కిన్స్ ) కూడా ఇస్తున్నారట. చదువు కూడా వాల్లే చెపుతారు. ఇంట్లో కంటే బిడ్డలు ఆన్నే మంచిగా ఉన్నారు. అందుకే మాకు చాలా సుఖంగా ఉంది ..”అంటూ చెప్పుకొచ్చాడు గిరి.
“బావా..బావా..నాకు కూడా సాయం చేసి పుణ్యం కట్టుకో…నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి ..మంచిగా ఉండాలి ..మేము ఏమి సంపాదించినా అది ఎనకేసుకుంటే వాళ్ళకే కదా ఉంటది ..ప్లీజ్ బావా..దీనికి నీ సాయం గావలి ..” బతిమిలాడుకున్నాడు వెంకటేశు.
“దానిదేముంది బావ ఆధార్ కార్డ్ ఉందా పిల్లలది ..”అడిగాడు గిరి..
‘హా..ఉంది బావా..’
“అయితే రేపు ఆదార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ పోటోస్ తీసుకుని రా బావా.. మా బిల్డింగులో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు ..ఆయనే నాకు సాయం చేసాడు ..నీకు పరిచయం చేస్తా..” హామీ ఇచ్చాడు గిరి..
“అట్లనే బావా..రేపు పొద్దున్నే ఎనిమిది కల్లా వచ్చేస్తా..”అంటూ అతని అడ్రెస్ …ఫోన్ నంబర్ తీసుకుని..
‘సరే బావా మరి రేపు కలుస్తా ‘ అంటూ అటో ఎక్కి స్టార్ట్ చేసి
’పద బావా ఇంటి కాడ దింపుతా ‘ అన్నాడు
“లేదు బావా ..బండి ఉంది నీవు పోయి రా..”బండిని చూపిస్తూ అన్నాడు గిరి.

**

మరు సటి రోజు పొద్దున్నే ఎనిమిదికల్లా పిల్లల ఆధార్ కార్డ్ లు , పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ దగ్గరపెట్టుకుని గిరి చెప్పిన అడ్రెస్ కి వెళ్ళాడు వెంకటేశు.
గేటు దగ్గరే గిరి కలిసి మూడో అంతస్తులో ఉన్న గోపాలరావు గారి దగ్గరికి తీసుకు వెళ్ళాడు వెంకటేశును..
పేపర్ చదువుతూ కూర్చొన్నాడు గోపాల్రావు.
కాలింగ్ బెల్ నొక్కి ’సార్’ అని పిలిచాడు గిరి.
‘హా…రావోయ్ రా..లోపలి ..వచ్చాడా నీ దోస్తు …’ అనడిగారు గోపాల్రావు ..
లోపలి వస్తూ వెంకటేశుని కూడా రమ్మని సైగచేసాడు గిరి.
‘నమస్తే సార్ !’ అంటూ చేతులు జోడించాడు వెంకటేశు
‘నమస్తే వెంకటేశు, చెప్పాడు గిరి..ప్రభుత్వం కల్పించిన సదుపాయాలని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి మరి ..సరేనా..ఆదార్ కార్డ్స్ ..ఫొటోస్ తెచ్చావా..” అని అడిగాడు గోపాల్రావు.
“ అలాగే సార్ ..తప్పకుండా..మా పిల్లలు మంచిగా చదువుతారు సార్ …ప్రైవేట్ స్కూల్స్ లో మస్తు ఫీజులు కట్టలేక రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాము సార్ ..అయినా ఏమిటికి సరిపోతలేవు …” బాధని వెళ్లగక్కుకున్నాడు వేంకటేశు..
“నిజమేనోయ్..ఈ సహాయం నా చేతిలో పని కాబట్టి నేను మీకు చేయగలను ..అందరికీ తెలియదు కదా ..పాపం పిల్లలను చదివించలేక పనులకు తీసుకుపోతూ ..వెట్టి చాకిరీ చేయిస్తున్నారు పసివాళ్ళతో ..” తనదగ్గర ఉన్న అప్లికేషను ఫామ్స్ తీసి పెన్ సరిచేసుకుంటూ అన్నారు గోపాల్రావు.
‘సరే ..వివరాలు చెప్పు ‘ అని రెండు అప్లికేషను ఫామ్స్ ఫిలప్ చేసి అతనితో సంతకం చేయించుకుని ..ఆదార్ కార్డ్స్ ..ఫొటోస్ జతచేసి పెట్టుకున్నాడు గోపాల్రావు.
పని ఇంత తొందరగా అయిపోయినందుకు సంతోషంతో అతనికి చేతులు జోడించి మరి మరీ దండాలు పెట్టాడు వెంకటేశు.
వేంకటేశు సెల్ నెంబర్ తీసుకుని “నాలుగు రోజుల్లో నీకు కాల్ చేసి చెపుతా ..అప్పుడు పిల్లలని తీసుకుని రా” అని చెప్పాడు గోపాల్రావు.
‘అలాగే సార్ ..నమస్తే సార్ ..’ ఎంతో వినయంగా చెపుతూ సెలవు తీసుకున్నాడు గిరితో కలిసి వేంకటేశు.
“బావా ..నీ సాయం మర్చిపోను ..నీవు కలవబట్టే నాకు ఈ విషయం తెలిసింది బావ ..” అంటూ గిరి చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పాడు వేంకటేశు.
‘దానిదేమింది బావా…నా పిల్లలను కూడా ఇట్లానే చేర్పించినా కదా ..అదే విషయం చెప్పినా..’ అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్లి భార్య అరుణతో చెప్పాడు ‘చాయ్ పెట్టు’ అని గిరి .

***

అనుకున్నట్టుగా పిల్లలిద్దరికి సిటీకి కొంచం దూరంలో ఉన్న స్కూల్తో కలిసున్న హాస్టల్లో సీట్లు దొరికాయి. భార్య శాంతి ముందు చాలా వ్యతిరేకించింది ..’పిల్లలు ఇంట్లో లేకుండా నేను ఉండలేను …’ అంటూ
చాలా సర్ది చెప్పాడు వేంకటేశు..’డబ్బులు మిగిలితే అవి కూడా ముందు పిల్లలకే కదా …మన స్తోమతకు తగ్గ ఇల్లు కొనుక్కుందాము ముందు…’ అంటూ ఎంతో అనునయించిన మీదట లోన బాధగానే ఉన్నా ఒప్పుకుంది శాంతి.
తల్లి తండ్రులను విడిచి పిల్లలు కూడా వెళ్ళడానికి చాలా గొడవ చేసారు. వాళ్ళని సముదాయించి పిల్లలతో పాటు వెళ్లి హాస్టల్లో అన్ని సదుపాయంగా ఉన్నాయి అన్న సంతృప్తితో తిరిగి వచ్చారు శాంతి వెంకటేశులు.

***

రెండు నెలలు బాగానే గడిచాయి. పిల్లలు లేని ఇల్లు ఏంతో వెలితిగా అనిపించసాగింది ఇద్దరికీ. పనులకు పోయి వచ్చాక ఇంట్లో ఏమీ తోచడంలేదు శాంతికి. వేంకటేశు వచ్చేసరికి ఒక్కోసారి బాగా పొద్దుపోతూ ఉంటుంది. విసుగ్గా అయిపోతుంది శాంతి.
భార్య విసుగును అర్ధం చేసుకున్న వెంకటేశు తనకు తెలిసిన వాళ్ళు ‘పెద్దటీవి కొనుకుంటాం..మా టీవి అమ్ముతున్నాం’ అని చెప్పగానే బేరం ఆడి రెండు నెలల వాయిదాల మీద డబ్బులు ఇస్తానని మాట్లాడుకుని తీసుకు వచ్చాడు టీవిని.
శాంతి ఆనందం అంతాఇంతా కాదు. పని నుంచి రాగానే టీవి పెట్టుకుని వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది.
ఇక వెంకటేశు బేరాలు కుదుర్చుకుని ఆటో నడిపిస్తూ..కాళీగా ఉన్నప్పుడు దోస్తులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ..ఇంటికి వెళ్ళినా ఏం చేస్తాం అన్న భావంతో సమయాన్ని బయిటే గడుపుతూ ఉంటున్నాడు.
ఇలా గడపడంలోనే దోస్తులుగా ఉంటారు కానీ వాళ్లకుండే వ్యసనాలని తప్పని సరిగా పక్కవాడికి అంటగడతాడు అన్న నిజం నిజం చేస్తూ..
ఓ రోజు “అన్నా! నా పుట్టినరోజన్నా..ఇయాల నేను పార్టీ ఇస్తున్నా అన్నా!” అంటూ వెంకటేశును తన మిగిలిన దోస్తులతో పాటు తీసుకుపోయాడు సాంబి.
“ఒద్దురా సాంబి! నాకలవాటు లేదు. మా అయ్య తాగి తాగి పోయినాడని నాకు దీన్ని చూస్తే కోపంరా ..” అంటూ చాలా సేపు నిరాకరించాడు వెంకటేశు.
కానీ సాంబితోపాటు ఉన్న మిగతా ముగ్గురు కూడా బలవంతం చెయ్యటంతో ఆ రోజు మొదటి సారి మందు తాగాడు వెంకటేశు.
అలా అలవాటు అయిన మద్యం ఒకరోజు ఒళ్ళు నొప్పులని, మరో రోజు మరొకరెవరో పిలిస్తే వెళ్ళటం ఇలా మెల్లమెల్లగా త్రాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది వెంకటేశుకి.
శాంతి ఇంట్లో ఎంతో చెప్పి చూసింది. కానీ “చిన్నప్పటి నుండి కష్టం చేసే పెరిగినాను, ఇద్దరాడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యడానికి మస్తు కష్టపడ్డా, మన పెళ్లి కోసం కూడా అప్పుచేసినా.. జర ఇప్పుడే మా గిరిగాడి పుణ్యమాంట పిల్లలు ఒకదారిలో పోతున్నారు అన్న నిశ్చింతతో కొంచం సుఖంగా నిద్రపోతున్నా..ఏదో ఒంటికి హాయిగుంటుందని ఇట్లా తాగుతున్నా..నీవేం ఫిఖర్ పడక్, పని మాని తాగుడు జోలికి పోన్లే” అంటూ శాంతిని మబ్య పెట్టాడు వెంకటేశు. వద్దనుకుంటూనే అందుబాటులో ఉన్న మద్యానికి అలవాటు పడటం వ్యసనమే. అలాగే వెంకటేశు కూడా బానిసయ్యాడు .

**

ఒకరోజు శాంతి ఎదురు తిరిగిందని మొదటిసారి చెయ్యి చేసుకున్నాడు వెంకటేశు. విలవిలాడిపోయింది శాంతి. ఎంత మరచిపోదాము అనుకున్నా రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి కన్నీళ్లు చెంపలను తడుపుతూ ఉంటే..అది చూసి శాంతి పనిచేస్తున్న ఇంటావిడ సుమిత్ర “ ఏంటి శాంతి! ఎప్పుడు లేనిది ఇవాళ ఇలా కంటనీరు పెట్టుకుంటున్నావు “ అని అడిగింది వంటచేసుకుంటూ. జరిగింది చెప్పింది శాంతి వెక్కిళ్లు పడుతూనే.. కొన్ని ఓదార్పు మాటలు చెప్పింది కానీ..
‘పిల్లలు వీళ్లతో ఉన్నప్పుడే బాగుండేవాళ్లు వీళ్ళు. పిల్లలకోసం కష్టం చేయగా వచ్చిన డబ్బుని జాగ్రత్త చేయాలనే ఆలోచన వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదన్న భయంలేనితనం ఇలా విచ్చలవిడితనానికి అలవాటు చేసింది. ఈ విధంగా వెంకటేశు లాంటి వాళ్ళు ఎంతమందో..త్రాగుడు అనే మహమ్మారికి బలి అయిపోతూ ఇటు కుటుంబాలను, ఆరోగ్యాలను పాడుచేసుకుంటూ ఉన్నారు. డబ్బుని బట్టి, స్తోమతను బట్టి రకరకాల మందు సీసాలు ప్రభుత్వం అనుమతి పరంగానే దొరుకుతున్నాయి. అదే విధంగా ప్రజలు కూడా మందుకి బానిసలు అవుతున్నారు. ఈ త్రాగుడు అలవాటు వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయో..! ఎందరు పిల్లలు అనాథలుగా మిగులుతున్నారో..?
ప్రభుత్వం ఎన్నో విషయాలలో ఎంతో కృషి చేసి లేనివారికి ఆర్ధికంగానే కాక పిల్లల చదువులకు, వారి బాగోగులకు కూడా స్వచ్చందంగా సహాయపడుతూ ఉంటే.. దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు కాయకష్టం చేసి డబ్బులు సంపాదించి వచ్చింది వచ్చినట్టు తాగుడుకి తగలబెడుతున్నారు. ఇక వీళ్ళ జీవితాలు ఎలా మారతాయి.’ మనసులోనే మథన పడసాగింది సుమిత్ర.

***

నొప్పులు తగ్గాలి అనుకుంటూ రోజుకంటే ఎక్కువ తాగేసి ఇంటి ముఖం పట్టిన వెంకటేశు బురదలో చూసుకోకుండా కాలు వేసి జారి వెల్లకిలా పడిపోయాడు. అదే సమయంలో నిండుగా లోడ్ లో ఉన్న లారీ అటువైపుగా వస్తూ క్రింద పడిఉన్న అతన్ని చూసుసుకోకుండా అతని రెండుకాళ్ళ మీది నుంచి వెళ్లిపోయింది. హాహాకారాలు చేస్తూ స్పృహ కోల్పోయాడు వెంకటేశు.
ముడునెలల తరువాత రెండు కాళ్లని పోగొట్టుకుని దైన్య వదనంతో వీల్ చెయిర్లో కూర్చుని ఉన్నాడు. “ప్రభుత్వం దేవుడల్లే పథకాల రూపంలో ఆదుకుంటూ ఉంటే ..నా సుఖం, నా ఆనందం, అనుకుంటూ మనసును అదుపు చేసుకోలేక త్రాగుడుకి బానిసనై నన్ను నేనే పోగొట్టుకున్నాను.. పిల్లలకు ఏం జవాబుదారీగా ఉంటాను.. ఇటు శాంతికి మంచి భర్తను కాలేకపోయాను..” వేంకటేశు తనలో తానే తన పరిస్థితికి తానే కారణం అని తననితాను నిందించుకుంటూ భారమైన మనసుతో విలపిస్తున్నాడు వెంకటేశు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!