ఎక్కడికి పోతావు చిన్నవాడా

ఎక్కడికి పోతావు చిన్నవాడా…!!

రచన: సిరి

 

          ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను, చూస్తే బయట అంతా చల్లటి గాలి వీస్తుంది. పైకి ఆకాశంలోకి చూస్తే నల్లని మేఘాలు కమ్ముకుని నక్షత్రాలు, చందమామ ఏమి కనిపించలేదు.

         అయ్యో వర్షపు సూచనలు కనిపిస్తున్నాయే, ఇప్పుడు వర్షం పడితే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇంటికి ఎప్పుడు చేరుతానో? అసలే ఈ రోజు త్వరగా వస్తాను అని శ్వేతకు మాట ఇచ్చాను, మాట తప్పితే వారం దాక అలకపాన్పు ఎక్కుతుంది.

         శ్వేత ఎప్పుడైనా త్వరగా వస్తారా అని  అడుగుతుంది గానీ, రండి అని ఆర్డర్ వేయదు. అడిగినప్పుడే నేను వచ్చేది, రానిది చెపితే ఏమి అనదు. అందుకే శ్వేతకు వచ్చేది రానిది ముందే చెపుతాను. ఒకవేళ మార్నింగ్  త్వరగా వస్తాను అని చెప్పి ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం ఫోన్ చేసి చెపితే ఏమి అనదు.

       అదే త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళలేదో వారం దాకా అసలు మాట్లాడదు, నా వైపు కూడా చూడదు. అది ఎంత నరకమో నేను నిన్నటి దాకా అనుభవించాను.

        ఈ రోజు మార్నింగ్ నేను ఆఫీస్ కి బయలుదేరుతుంటే శ్వేత నవ్వుతూ ఈవినింగ్  త్వరగా వస్తారా అని అడిగింది, అంతే అశ్చర్యంతో శ్వేతని చూసి “వారం అయిపోయిందా బుజ్జి” అన్నాను. అవును అంటూ తల ఊపింది.

నేను తనని దగ్గరకు తీసుకొని “బుజ్జి ఇది అన్యాయం కదా. చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష నేను తట్టుకోలేను బుజ్జి. ఈ వారం ఎంత నరకంగా ఉందో తెలుసా. పక్కన ఉన్నా లేనట్లే ఉంటావు. ఇలా చేయకు, ఇంకా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు” అంటూ లాలనగా అడిగాను.

“ఇది మీకే కాదు నాకు కూడా పనిష్మెంట్ అండి. మీతో మాట్లాడకుండా నేను ఉండలేను, అది ఏమిటో నాకు తెలియదు, మీరు వస్తాను అన్న టైంకి రాకపోతే  కోపం వస్తుంది” అంది గోముగా.

“అయితే ఈ రోజు శెలవు పెడతాను” అన్నాను. 

“ఏమి వద్దు వెళ్ళి త్వరగా రండి” అంది. నేను అయిష్టంగానే “సరే అయితే వస్తాను” అని చెప్పి వచ్చాను.

       ఈ రోజు వర్క్ కూడా ఎక్కువ లేదు. ఎప్పుడెప్పుడు శ్వేత దగ్గరకు వెళ్దామా అని మనసు ఒకటే ఆరాటపడుతుంది. ఆఫీస్ టైం అవ్వగానే  బయటకు వచ్చి చూస్తే వర్షం వచ్చేలాగా ఉంది. 

      ఓ వరుణ దేవుడా నేను ఇంటికి వెళ్ళేదాకా వర్షం పడకుండా చూడు తండ్రి, లేకపోతే నా శ్వేత కోపానికి బలి అవుతాను ప్లీజ్ సేవ్ మీ. అసలే వారం తరువాత నా శ్వేతతో సంతోషంగా ఉందాం అనుకుంటున్నాను. నాపై కరుణ చూపు అని చేతులు చాచాను అంతే టపాటపా చేతి మీద నీళ్ళు పడ్డాయి.

      వరుణ దేవుడా ఒక మగవాడివి అయి ఉండి సాటి మగవాడి బాధ అర్థం చేసుకోకుండా ఏమిటి తండ్రి ఇది, అని పైకి చూసేసరికి వర్షం జల్లు నా మీద పడుతుంటే, గబగబా వెళ్ళి కారులో కూర్చుని ఈ రోజు శ్వేతతో హాయిగా గడుపుదాం అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి. శ్వేతకు ఫోన్ చేసి చేపుదాం అని ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయింది.

   ఈ రోజు అయిపోయాను ఇక మళ్ళీ వారం దాకా ఈ విరహం భరించాలా, అమ్మో నా వల్ల కాదు శ్వేతనీ ఎలాగైనా బ్రతిమాలాడు కోవాలి అని వర్షం పెద్దగా పడుతుంటే కారు చిన్నగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను.

       ఆఫీస్ నుంచి సిటీలోకి ఎంటర్ అవడానికి 30 నిమిషాలు పడుతుంది. మధ్యలో అంతా నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు ఉండరు. ఇక ఈ వర్షం పడుతున్న టైంలో నరమానవుడు కూడా కనిపించడు.

పాటలు అయినా విందాం అని FM అన్ చేస్తే… 
‘లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా..
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..
లేత చలిగాలులు దోచుకోలేవులే..
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే..
అందాల నా కురులతో వింజామరలు వీచనా.. 
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా..
నీ కురులవీ వదలకు నా హృదయమర్పించనా..
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా..
కనుల భాష్పాలు కలల భాష్యాలువలపుగా.. 
సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా..

అనే పాట వస్తుంటే నాకు శ్వేత గుర్తు వచ్చి మనసు అంతా ఏదోలా అయింది. ఈ టైంలో ఈ పాట వింటే అంతే ఇంక అని,

పాట ఆపి రోడ్డు మీదకు చూసేసరికి సడెన్ గా నా కారుకి ఎవరో అడ్డు వచ్చినట్లు అనిపించి, కారు బ్రేక్ వేసి ఆపాను.

అంతే గబగబా సైడ్ కి వచ్చి డోర్ తీసి కూర్చోని “చాలా థ్యాంక్స్ అండి కారు ఆపినందుకు” అంది.

“నేను ఎక్కడ ఆపేను మీరే నా కారుకి అడ్డుపడి మరి ఆపారు” అన్నాను.

“మరి ఏమి చేయను అరగంట నుంచి ఎవరు ఆపడం లేదు. అందుకే ఇలా చేశాను సారీ అండి” అంది. “అయినా ఈ టైంలో మీరు ఒంటరిగా ఇక్కడ ఉన్నారే” అని తన వైపు చూశాను.

తెల్లని చీర కట్టి తెల్లని మేలిమి ఛాయలో ఉండి వర్షంలో తడవటం వల్ల తనలోని అందాలు అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి. నా మనసు అదుపు తప్పుతుందెమో అని భయపడుతుంటే…

“నేను ఎప్పుడు ఒంటరి దానినే ఒంటరిగా ఈ

భూమి మీదకు వచ్చాను. అలాగే ఒంటరిగానే పోయాను” అంది. ఆ మాట వినేసరికి నాకు అర్థం కాక  “ఏమిటి” అని అడిగాను.

“ఏమి లేదు ఒంటరిగానే పోతాం అన్నాను” అంది.

“నాకు వేరేలాగా వినిపించిందిలే” అన్నాను. 

“అది ఏమి లేదులే” అని తను నా వైపు చూస్తుంటే, “ఏమిటి అలా చూస్తున్నావు” అని అడిగాను. 

“ఏమి లేదు మీరు చాలా అందంగా ఉన్నారు” అంది.

ఒక అమ్మాయి నన్ను అందంగా ఉన్నావు అని చెప్పేసరికి నా హృదయం పొంగిపోయింది.

“థ్యాంక్యూ” అని “మీరు కూడా చాలా అందంగా ఉన్నారు” అన్నాను.

“మీ అంత కాదు లెండి” అంది.

నేను ఆనందంతో తబ్బిబ్బైపోయి, తడిచిన చీరలో తన అందాలు అన్ని కనిపిస్తుంటే, ఎంత వద్దు అనుకున్నా అటే చూడాలనిపిస్తుంది. వారం నుంచి శ్వేత దూరంగా ఉండటం, అదీకాక బయట వర్షం, వాతావరణం అంతా రొమాంటిక్ ఫీలింగ్ తలపిస్తుంటే బుద్ది తప్పు అని చెపుతున్నా మనసు మాట వినడం లేదు ఎదో కావాలి అని తహతహలాడుతుంది.

         నేను తన వైపు దొంగలు చూపులు చూస్తుంటే, తను నన్ను చూసి “ఏమిటి దొంగ చూపులు చూస్తున్నారు. వర్షంలో ఒక ఆడపిల్ల వచ్చి కారు ఎక్కితే ఆ టైపు అనుకుంటున్నారా ఏమిటి” అంది.

“ఛ.. ఛ అది ఏమి లేదు ఏదో క్యాజువల్ గా చూశాను అంతే. అయినా మీతో నాకు ఎందుకు, మీరు ఎక్కడకి వెళ్ళాలో చెపితే అక్కడే డ్రాప్ చేసి వెళ్తాను” అన్నాను.

“ఇంత అందమైన అమ్మాయిని అప్పుడే డ్రాప్ చెస్తారా” అనేసరికి, నాకు అర్థం కాక “అంటే” అన్నాను.

“మీరు ఏమి అర్థం కాని చిన్నపిల్లాడు కాదు కదా. బయట వర్షం, లోపల నీ పక్కన ఇంత అందమైన అమ్మాయి ఉంటే ఎలా డ్రాప్ చేయాలి అనిపిస్తుంది డార్లింగ్” అని నా చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంది.

     కారు సడెన్ బ్రెక్ వేసి “ఏమిటి అండి మీరు చేసిన పని” అన్నాను.

“నేను ఏమి చేశాను” అని బుగ్గ మీద ముద్దు పెట్టి “ఇలా ఏమైనా చేశానా చేయలేదు కదా” అంది.

నాలో కోరికలు ఎంత అణుచుకుంటున్నా తను చేసే పనులకి నన్ను అదుపు చేసుకోవడం నా వల్ల కావడం లేదు. తొందరగా తనని డ్రాప్ చేసి వెళ్ళి శ్వేత కౌగిలిలో సేద తీరాలి అని అనుకొని, “మీ ఇంటి అడ్రెస్ చెప్పండి” అన్నాను.

“ఎప్పుడు వెళ్ళే ఇల్లే కదా కొంచెం ఆగు, బయట చూడు వర్షం పడుతూ లోపల చలి గిలి పెడుతుంటే మనసు ఎదో కావాలి అని ‌కోరుకోవడం లేదా” అని, తను దగ్గరకు జరిగి నా కళ్ళల్లోకి చూస్తూ “నిన్ను చూడగానే నా మనసు నిన్ను కావాలి అని కోరుకుంది” అని కౌగిలించుకుంది.

అంతే అప్పటి దాకా అణిచిపెట్టుకున్న ఆవేశం ఒక్కసారిగా బయటకు వచ్చి, నేను ఏమి చేస్తున్నానో తెలియకుండా తనని దగ్గరకు లాక్కొని తన చూట్టూ చేతులు వేశాను. ఇద్దరం ఒకరి కౌగిలిలో ఒకరం ఉన్నాం. 

      నా కళ్ళ ముందు ఒక్కసారిగా శ్వేత మెదిలింది. అంతే కళ్ళు తెరిచి తనని దూరంగా జరిపి తన వైపు చూడకుండా “సారీ ఎదో తెలియక జరిగింది” అని “మీరు ఎక్కడకి వెళ్ళాలో చెప్పండి” అన్నాను.

“ఎందుకు నన్ను దూరం జరిపారు, ఏమైంది” అంది. “నాకు పెళ్ళి అయింది నా కోసం మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది నేను త్వరగా వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి” అన్నాను.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా

నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా…”

అని పాడుతుంటే.. 

ఇది ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి అంటే పాట పాడుతుంది అని తన వైపు చూశాను. అంతే అప్పటి దాకా ఎంతో అందంగా కనిపించిన తను, ఇప్పుడు వికృత రూపంతో 

ఉంది.

జుట్టు అంతా విరబోసుకుని మొహం అంతా ఎర్రని గాట్లు. కళ్ళు కింద నల్లగా ఉండి కళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంది.

నాకు చూడగానే వెన్నులో వణుకు, ఒళ్ళంతా చెమటలు. హార్రర్ మూవీ అంటేనే భయపడే నేను ఇప్పుడు పక్కనే  దెయ్యాన్ని పెట్టుకొని కూర్చున్నాను అని అనుకుంటూ భయపడుతుంటే…

“భయపడకు చిన్నవాడా నేను ఏమి చేయను” అంది. నేను ధైర్యం తెచ్చుకుని “ఎవరు నువ్వు” అన్నాను. 

తను ఏడుస్తూ “నాలుగు సంవత్సరాలకు ముందు ఇలాగే వర్షం పడుతుంటే, ఒక కారు ఆపి హెల్ప్ అని అడిగేను. సరే ఎక్కు అని ఒక చోట కారు ఆపి నన్ను బలవంతంగా అనుభవించి పక్కన తుప్పల్లో పడేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇలా కామాపిశాచి గా మారి ఎవరైనా నా మాయలో పడి నన్ను అనుభవించాలి అని చూస్తారో వాళ్ళని అక్కడిక్కడే చంపేస్తాను. ఇప్పటికే ఎంత మంది నా చేతుల్లో చచ్చారో లెక్కేలేదు. ఆడది కనిపిస్తే చాలు అనుభవించాలి అని చూస్తారే తప్ప, ఇంకేమి ఆలోచించరు. నువ్వు ఒక్కడివే మా ఆవిడ ఎదురు చూస్తుంది వెళ్ళాలి అన్నావు. అందుకే నిన్ను ఏమి చేయకుండా వదులుతున్నాను. వెళ్ళు వెళ్ళి హ్యాపీగా నీ భార్యతో ఉండు” అని “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అంటూ మాయం అయింది వర్షం కూడా తగ్గింది.

నేను కారుని ఇంటికి స్పీడ్ గా పోనించి కారు దిగి లోపలికి వెళ్తుంటే శ్వేత కంగారు పడుతూ బయట నిలబడి, నేను వెళ్ళగానే నన్ను కౌగిలించుకుని “నేను మాట్లాడను అనే భయంతో ఈ వర్షంలో స్పీడు గా వస్తారేమో అని ఎన్ని సార్లు కాల్ చేశానో తెలుసా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అప్పటి నుంచి మీకు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిలబడ్డాను. మీరు లేట్ గా వచ్చిన ఏమి అనను కానీ స్లో గా రండి” అన్నది. “అంటే బుజ్జి వారం దాకా మాట్లాడకుండా ఉండటం అలాంటివి ఏమి ఉండవు కదా” అంటే “ఊహూ” అని నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

‘వరుణ దేవుడా ఇందాక మా బాధలు అర్థం చేసుకోవు అన్నాను కదా, నాకు బాధ లేకుండా చేయాలి అని ఇలా చేశావు అని ఇప్పుడు అర్థం అయింది థ్యాంక్యూ” అని చెప్పి “బుజ్జి లోపలికి వెళ్దామా లేక ఒకరి కౌగిలిలో ఒకరం ఇలానే ఉందామా” అని నవ్వుతుంటే, లేచి “పదండి” అంది.

          నేను తనని ఎత్తుకుని లోపలికి వెళ్ళగానే టివీలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా’ అనే సాంగ్ టీవీలో వస్తుంటే శ్వేత ని ఎత్తుకొని అలాగే నిలబడ్డాను.

***

You May Also Like

One thought on “ఎక్కడికి పోతావు చిన్నవాడా

  1. కథ బాగుందండీ.ఈ జోనర్ కథలంటే నాకు కాస్త ఇంట్రెస్ట్. అయితే కథా శీర్షిక బట్టి కారులో ఎక్కినామె ముందుగా చెప్పకపోయినా దెయ్యం అని రెగ్యులర్ పాఠకులకు ఇట్టే తెలిసిపోతుంది.సంభాషణలు బాగున్నాయి.అయితే చెప్పాల్సింది టకటకా చెప్పేసి ముగించినట్లనిపించింది.హర్రర్ జోనర్ కదా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండి కథను ఇంకాస్త పొడిగించి రాయడానికి స్కోప్ ఉంది.ఆసాంతం మీ రచనా శైలి ఆకట్టుకుంది.ఓ పాఠకుడిగా చదివిన తర్వాత నాకు అనిపించింది చెప్పాను.అన్యదాభావించవలదండీ.మీకు అభినందనలు 💐💐💐🙏

    – వాడపర్తి వెంకటరమణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!