రైతన్న

🌾రైతన్న🌾

రచయిత :: నరసింహారావు.కాసీమల్ల( అక్షరపద్మ ) 

కమ్మిన చీకట్లలో ఉదయించే
సూర్యునికి ముందులేచి..
పేడనెత్తి,
పాలుపిండి,
గొడ్లమేపి,
తెల తెల్లారగనే..
సద్దిబువ్వ చేతబట్టి..
తుండుగుడ్డ తలకు చుట్టి..
భుజం మీద నాగలెట్టి..
కీళ్లరిగిన పాదాలకు
సగమరిగిన చెప్పుతోడిగి,
గతుకు రోడ్ల మీద..
మొనదేలిన రాళ్ళపై ప్రపంచానికి కడుపు నింపబోయె రాజును… రా రాజును.

పుడమితల్లి కడుపు చీల్చి..
పచ్చని మాగానీలో బంగారాన్ని పండించే
నా తల్లి ముద్దు బిడ్డ ని…….!!!

నిప్పుల కొలిమివలె..
మండే ఎండను మరిచి..
చెట్టు నీడకు రాతి బండను చేరి..
చెదిరిన గుండెలో రగిలే బాధని..
చెవులు సోకని పైరగాలికి..
ఎల్లబోసినంతనా..
మదిలో ఆశావర్షం నేలను తడిపి..
మొలకలొచ్చి ,
కన్న కనుల వెనుక స్వప్నం నెరవేరేనా…!!!
కాల్చే ఆకలి,
కూల్చే వేదన కానజూసిన..
కారుమబ్బులు కరిగి..
కన్నీటిని తుడుచునా…?
అని మరచి…
ఎదురు చూసే వెర్రి జీవిని…..!!!!

దిక్కులేక దీనుడనై…
కాంతిలేని కళ్లతో…
ఆరిన కుంపటిలో
నిప్పులను వెదికే వింత జీవిని….!!!

నన్ను మరచిన జగం..
నా వెంటే ఉందని
నమ్మే నిర్భాగ్యపు రైతుని…!!!

ఎదుగుదల ఎరుగని దారిలో దరిద్రాన్ని
మూటగట్టుకుని…
లాభాన్ని దోచిపెట్టుకుని…
అలసిన కనులతో…
విసిగిన మనసున
జవాబులేని ప్రశ్నలా…
మిగిలిన  విగత జీవిని…!!!

విధి వంచించి
కనిపించని శత్రువులా విషం చిమ్ముతూ..
బాకులు దూస్తుంటే..
ప్రాకారాలు దాటినా..
ఆకారాలు మారునా…!
అని తెలిసి…
ఆశదీపం వెలిగించే మూగ జీవిని..!!!!!

వీడిన మబ్బులలో..
చిందే వెలుగుల కోసం చూసే
లేత కలువ పూవులా…
మసక బారిన మనసుతో..
అమాస మింగిన చంద్రునిలా…
చీకటి వీడగా ఎదురుచూసే
రా రాజును..

గోడలేని నా గూటికి ముళ్ళు,
రాళ్లే రక్షలని తెలిసిన..
అలజడిలో ప్రకృతి  అందాలకు
మురిసె బాటసారి వోలె..
చీకటి గుడ్డిదని మరచి
దహించే జ్వాలలో..
విడువని కష్టాలతో..
నిట్టూర్పులు విడిచే
నిష్టూరపు శ్రమజీవిని…!!!!

మీ రైతైన రాజుని…!!!
రా రాజుని

You May Also Like

One thought on “రైతన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!