వారసుడొచ్చాడు

వారసుడొచ్చాడు

రచయిత ::తేలుకుంట్ల సునీత 

వేసవి కాలం ఆరుబయట వెన్నెల్లో వేసి ఉంచిన మంచం పై మనువడు హర్షిత్ చంద్రను పడుకోబెట్టుకొని జో కొడుతూ కథ చెబుతోంది రత్నమాల.
పక్కనే భరత్ చంద్ర చేతికర్రను పక్కన పెట్టి, నీళ్లు త్రాగి, మనవడితో ఆనందంగా గడుపుతున్న రత్నమాలను చూస్తూ కళ్లద్దాల మాటున దాగిన చెమ్మగిల్లిన కళ్ళను రత్నమాల కంట పడకుండా “రత్నా… వీడు, వీడి అల్లరి చిన్నప్పటి మన శరత్ చంద్రను గుర్తుచేస్తున్నాయి కదా” అనగానే రత్నమాల “అవునండీ మన చందూనే జ్ఞాపకం వస్తున్నాడు. మీకు గుర్తుందా… ఒకసారి టీవీలో వచ్చే గుర్రపు స్వారీనీ చూసి తనను ఆ గుర్రంపై కూర్చోబెట్టమని ఒకటే ఏడుపు… తన అమాయకత్వానికి పడిపడీ నవ్వే వాళ్ళం” అంటూ అందరాని చందురూడు అయిన తన కొడుకును గుర్తు చేసుకుని మొహం పై రాని నవ్వును పులుముకొని మనసులో మూగగా రోదిస్తున్న సమయంలో “అత్తమ్మా… చందూ (మనవడు) మా దగ్గర పడుకుంటాడు, మీరు హాయిగా నిద్రపోండి” అని అన్న కోడలు కళ్యాణి మాటలు విన్న రత్నమాల “ఇక్కడే ఉంటాడు. మాకు మాత్రం అంత తొందరగా నిద్ర పడుతుందా… కాలక్షేపం అవుతుంది” అంటూ మనవడిని మరింత దగ్గరికి తీసుకోని జో కొడుతుంది రత్నమాల.
ఆ మాటలు విన్న కళ్యాణి “వాడు మాటిమాటికి లేస్తాడు, బాగా బొర్లడం అలవాటు. మీకు ఇబ్బంది కలుగుతుంది. నేను తీసుకెళ్తాను అత్తయ్య ” అంటుంది.
“పర్వాలేదు కళ్యాణి ఇంతకాలం మీతోనే ఉన్నాడు కదా. వాడి కంటే మాకు ఏదీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు. నువ్వెళ్లు అక్కడ వినోద్ నీకోసం ఎదురు చూస్తుంటాడు” అని రత్నమాల అనగానే మేము ఇక్కడికి ఈ మధ్యనే వచ్చాము. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి అని మనసులో అనుకొని అక్కడినుండి ఇంట్లోకి వస్తుంది కళ్యాణి.
“కళ్యాణీ… చందూ ఏడి? అన్న వినోద్ మాటకు బెడ్ పై ఉన్న దిండు, దుప్పటి సర్దుతూ… అత్తమ్మ పంపలేదని, వాళ్ల మాట కాదనలేక వచ్చానని” నడుం వాలుస్తూ చెప్పింది కళ్యాణి.
“అది కాదు కళ్యాణీ… పాపం పిన్నీ బాబాయ్ ఇబ్బంది పడతారు. వాళ్లు వద్దంటే నువ్వు వచ్చేస్తావా?” అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న వినోద్ మాటలకు అడ్డుతగులుతూ కళ్యాణి “వద్దండీ మీరు ఏమి మాట్లాడకండి. చందూను వాళ్లు ఇబ్బందిగా అనుకోరు. వాళ్లు వారసుడొచ్చాడు అనే సంతోషంతో, వాడిలో కన్నకొడుకును చూసుకుంటు, వాళ్ళు పడ్డ మానసిక వ్యథను ఇప్పుడిప్పుడే దూరం చేసుకుంటున్నారు. ఇంతకు ముందు మనం కూడా వారిని చులకన చేస్తూ, నరకయాతన అనుభవించేలా ప్రవర్తించాము. మనం చేసిన పనులకు మనల్ని దేవుడు కూడా క్షమించడు. కానీ, వీళ్ళు మంచి మనుషులు కాబట్టి మళ్లీ మనల్ని చేరదీశారు” అంటూ నిద్రకు ఉపక్రమించింది.
వినోద్ కు కళ్యాణి మాట్లాడిన తీరు తనను నిద్రకు దూరం చేసి… గతం తాలూకు జ్ఞాపకాలు మనసులో మెదలసాగాయి.
పిన్నీ, బాబాయ్ లకు ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ ఏం లాభం, సంతానం లేక మొక్కని దేవుడు లేడు. తిరగని హాస్పిటల్ లేదు. ఏ నోము ఫలమో చాలా సంవత్సరాల తర్వాత శరత్ చంద్ర పున్నమి చంద్రుడిలా వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడానికి ఉద్భవించాడు. వాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా, ఆడంబరంగా, ఏ లోటు లేకుండా కొడుకును యువరాజులాగా పెంచుతూ అవధులు లేని సంతోషంతో గడుపుతున్నారు పిన్ని, బాబాయిలు.
కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవక, స్నేహితులతో పిక్నిక్ కు వెళ్లిన శరతశ్చంద్ర బోట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
వాళ్లకు కలిగిన నష్టాన్ని, కష్టాన్ని ఎవరు తీర్చలేరు. కానీ బంధువులంతా చర్చించి వాళ్ళ మానసిక బాధను మెల్లమెల్లగా దూరం చేయాలంటే తక్షణమే ఎవర్నో ఒకరిని దత్తత తీసుకోవాలని, అది అన్న కొడుకు అయితే వాళ్లను బాగా చూసుకుంటాడని, మా నాన్నను ఒప్పించి, నన్ను వాళ్ల బాగోగులు చూసుకోవడానికి, కన్న కొడుకు స్థానాన్ని సంప్రదాయబద్ధంగా కల్పించారు.
పిన్ని బాబాయిలు మెల్ల మెల్లగా నాతో ప్రేమగా ఉండడం మొదలు పెట్టారు. కొంతకాలం అందరం బాగానే ఉన్నాము. తర్వాత నా జీవితంలోకి వచ్చిన కళ్యాణి వల్ల మనస్పర్ధలు రావడం, వీళ్లకు మనం ఎందుకు చేయాలి చాకిరి. హాయిగా మనము వేరే ఉందాము. ఆస్తి ఎక్కడికి పోతుంది అంటూ… నన్ను ఊపిరి సలపనివ్వకుండా సతమతం చేస్తూ, వేరు కాపురం పెట్టేలా పోరు పెట్టగా, అప్పటికే మా మధ్యలోకి వచ్చిన వారసుడు హర్షిత్ చంద్రను తీసుకొని బయటికి వచ్చేసాము.
కన్న కొడుకు అలా దూరమయ్యాడు, వాడి రూపంలో వచ్చిన నా కొడుకు హర్షిత్చంద్ర, నేను ఇలా దూరమవడంతో… అన్నీ ఉండి నా అన్నవాళ్లు లేక పిన్ని బాబాయిలు మానసికంగా కృంగి అనారోగ్యం పాలయ్యారు.
నేను ఒక కంపెనీలో పని చూసుకొని భార్య, కొడుకుతో కలిసి కొత్త కాపురం మొదలుపెట్టాను.
కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాతర్వాత కళ్యాణి కోరికలకు నా సంపాదన సరిపోయేది కాదు. దాంతో మెల్లమెల్లగా అప్పుల పాలయ్యాము. దీనికి తోడు నా కొడుకు హర్షిత్ చంద్ర తీవ్ర అనారోగ్య సమస్య బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసిన క్షణం నుండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. బాబాయ్ దగ్గరికి వెళ్దామంటే మొఖం లేదు. ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేదు. చివరికి కంపెనీలో పరిచయం అయిన ఒక మిత్రుని ద్వారా తెలిసింది… ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పైసా ఖర్చు లేకుండా చేస్తారని, అది విని పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయి హుటహుటీన వెళ్ళి హాస్పిటల్ లో చేర్పించిన వెంటనే తగిన ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ బాగా జరిగింది. నా కొడుకు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తూ… వాడాల్సిన మందుల చిట్టీ రాసి ఇచ్చి అవి వాడమన్నారు. అప్పుడు గమనించాను. రోజు చూసిన ప్రిస్క్రిప్షన్ అయినా, వారం రోజుల నుంచీ గమనించని విషయాన్ని… ఆ ప్రిస్క్రిప్షన్… ఆశ్చర్యం… నా చేతిలో ఉండి… నా చేతిలో వణుకు… కంటి నుండి నీళ్ళ ధార… అది చూసి కళ్యాణి ఏమయింది అనే ఆతృతతో చూడగా ప్రిస్క్రిప్షన్ పై ఉన్న శరత్ చంద్ర ఫోటో చూపించాను. ఉండబట్టలేక రిసెప్షన్ లో కెళ్ళి వివరాలు తెలుసుకోగా… మా పిన్ని బాబాయిలు మా తమ్ముడు శరత్చంద్ర జ్ఞాపకార్ధంగా పేదవారికి ఉచిత వైద్యం అందించడానికి ఈ హాస్పిటల్ కట్టించారని, అది మాకు ఈ విధంగా నా కొడుకును బతికించింది అని, తాము చేసిన తప్పు తెలుసుకొని వెంటనే బయలుదేరి పిన్ని బాబాయ్ ల దగ్గరికి వచ్చి, కళ్యాణి నేను కాళ్ళ మీద పడి బోరున విలపించాము, మమ్మల్ని క్షమించమని. వాళ్లు మమ్మల్ని లేవనెత్తి మా వారసుడిని మళ్లీ మా నుండి విడదీయవద్దంటూ… మీరు మాతోనే ఎప్పటిలా ఉండిపోండి అని చెప్పగా, బుద్ధిగా ఇక్కడే ఉంటున్నాము. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇక వారిని వదిలి వెళ్లొద్దని, పిన్ని బాబాయ్ లకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాము. కళ్యాణి మాటల్లో ఎంతో నిజం ఉందని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు వినోద్.
అప్పటినుండి పిన్ని బాబాయ్ లతో కలిసి, వారి సమాజసేవలో తాను కూడా భాగం పంచుకుంటూ హాయిగా జీవనం కొనసాగించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!