ఇదా అంతం

 ఇదా అంతం

 

రచన: వై. మంజులత

          చుట్టూ ఏం జరుగుతోంది. మసక మసకగా ఉంది. ఏదో జరుగుతోంది. నాకు తెలుస్తూనే ఉంది. నా దగ్గరకు వస్తున్నారు, వెళుతున్నారు. బయట చిమ్మ చీకటి. దూరంగా అడుగుల శబ్దం. బాగా ఎరిగిన వారు సమీపిస్తున్న అనుభూతి. దగ్గరకు వచ్చి చూసాడు. నా చిన్న కొడుకు. చిన్నగా ఏడుస్తున్నాడు. “ఏమైంది నాన్న! ఎందుకు కన్నీరు” అన్నాను.  వినిపించుకోకుండా పక్కనే ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. నాకు అయోమయంగా ఉంది. ఏమైంది అని గొంతుచించుకున్నా ఎవరూ ఉలకరూ పలకరే.  పిచ్చెక్కించేస్తోంది వారి ప్రవర్తన. చేసేదేం లేక అలాగే నిలబడి ఉన్నా. 

      హాస్పిటల్ లో కొంతమంది వార్డు బాయ్ లు తెల్లటి వస్త్రం పట్టుకుని ఒక బెడ్ దగ్గర నిలబడి ఏదో చేస్తున్నారు. ఏంటా అని వెళ్ళి చూసాను. ఎవరో ఆడమనిషి పోయినట్టుంది. ప్యాక్ చేయటానికేమో అదంతా హడావుడి అనుకున్న. ఎవరో పాపం చివరిసారిగా చూద్దామనీ ముందుకు చూపులు సారించా. షాక్ కొట్టినట్లు అయింది. తనెవరో అచ్చం నాలాగే ఉంది. ఏమిటి ఈ విడ్డూరం అనుకుంటూ దూరంగా నిలబడి ఏడుస్తున్న నా చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి భుజంపై చెయ్యి వేసా. కదలడే నేను తాకిన స్పర్శ కూడా పట్టించుకోకుండా ఎందుకు అంత ఏడుపు అనుకుంటూ గట్టిగా పిలిచా. పలకడే…అసలు నేననే ఒక మనిషిని పక్కన ఉన్నాననే స్పృహలో లేడే తను. మరోసారి పిలిచా. రెండు భుజాలు పట్టుకుని కుదిపా. అసలు కదలడంలేదు. ఆ వార్డ్ అబ్బాయిల దగ్గరగా వెళ్లిన వారిని పలకరించా. వారు కూడా నా ఉనికి పట్టనట్లు వారిపని వారు చేసుకుంటున్నారు.  అసలేమైంది వీళ్ళకు. అనుకుంటూ చూస్తున్న.వారు తమ పని పూర్తయినట్లు బయటకు వెళ్ళిపోయారు నా చిన్న కొడుకుతో చెప్పి. ఇందాకవారు తెల్లటి వస్ర్తం పైన నల్టటి కవర్ కట్టారు. ఆ కవర్ చూస్తూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు. ఎదురుగా నన్ను పెట్టుకుని అంతలా విలపించడం ఏంటో అర్థం కాలేదు.

      తెల్లారింది. మా బాబు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. ఎవరూ రాలేదు. చాలా సేపటికి అనుకుంటా ఆ నల్లటి కవర్ ఉన్న బాడీని నలుగురు మోసుకుని వచ్చి తెల్లని అంబులెన్స్ లో పడుకోబెట్టారు. నేను వెళ్ళి అందులో కూర్చున్న. మా బాబు వేరే వాహనంలో ఎక్కాడు. కనీసం నన్ను చూడనేలేదు. పట్టించుకోనూ లేదు. వ్యాన్లు కాసేపటికి దగ్గరలోని స్మశానవాటిక కు చేరాయి. గేట్ దగ్గర వీరి రాకకోసం ఎదురు చుస్తూ చాలా మందే ఉన్నారు. నేను దిగి వెళ్ళాను. వారంతా ఎవరో కాదు. నావాళ్ళు. నా కుటుంబ సభ్యులు. నాకు అయోమయంగా ఉంది. వీరంతా నాకు చెప్పకుండా ఏదేదో చేస్తున్నారు. నాకు ఆరోగ్యం బాగాలేదనీ హాస్పిటల్ లో చేర్పించి, ఇప్పుడు దగ్గరకు వస్తే కూడా పలకరించకుండా కనీసం చూడకుండా ఉన్నారే నన్ను. నాకు చాలా బాధ కలిగింది. అందరితో పాటే నేను లోపలికి వెళ్ళిన. అక్కడ ఏర్పాటు చేసిన చితిపై ఆ నల్లటి కవర్ ఉంచి అందరికీ మొహం కనబడేలా చేసి ఒక్కొక్కరికి చూపించారు కాటికాపరులు చూసి వారంతా ఒకటే ఏడుపు . పిల్లలు మావారు దూరం దూరంగా ఉండి మాట్లాడుతూ దుఃఖిస్తుంటే నాకు ఏడుపొస్తుంది.కానీ ఏం చేయలేను. నాకు ఇప్పటికి అర్థం అయింది. నేను ఇకలేననీ. అందుకే అందరూ ఏడుస్తున్నారు. చకచకా కార్యక్రమాలు అన్ని చేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. 

         అందరూ వెళ్ళాక ఒంటరిగా నేను మాత్రమే మిగిలా. చితిపై మంటలు ఎగిసిపడుతున్నాయి. నా మనసులో ఆవేదన అలాగే ఉంది. గతం సుళ్ళుగా నా ముందు మెదిలింది.  కరోనా కాలం అనీ లాక్డౌన్ అంటూ కొంతకాలం ఇళ్ళకే పరిమితం అయి కాస్తా పరిస్థితి చక్కబడీ జనాలు మామూలు జీవనం గడిపే సమయంలో ఎలా వచ్చిందో ఈ మహమ్మారి నాకు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటే ఎంతకీ తగ్గకపోగా చివరకు క్యాన్సర్ అనీ తేలిందట.ఈ విషయం నాకు తెలీదు. ఎందుకు తగ్గటంలేదో ఎపుడు మామూలుగా తిరుగుతానా అనే ఆలోచనలు తప్ప ఇంకేమీ లేదు నాలో. దాదాపు మూడునెలల నుంచి ట్రీట్మెంట్ కోసం తిరగని రోజు లేదు. నా పిల్లలు నన్ను పసిపాపలా కంటికి రెప్పలా చూసుకున్నారు. ఏమాత్రం బాధ కనబడనీకుండా అంతా జాగ్రత్తగా ఉన్నారు. ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చింది అంట వెంటనే నన్ను హాస్పిటల్ లో చేరిపించారు. అక్కడ వైద్యులు నాకు కోవిడ్ కూడా సోకిందనీ తేల్చి చెప్పారుట. ఇంకేముంది ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా జరగాల్సిన దారుణం జరిగింది. పిల్లలు కూడా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది అంట. వాళ్ళు ఇంట్లో నేను హాస్పిటల్ లో ఉన్నా.  ఒకరాత్రి నాకు ఎలాగో ఉంది. నిద్ర పట్టక బయటకు వస్తే  ఇదంతా తెలిసింది. నిద్రలోనే నా శ్వాస ఆగిపోయింది అంట. 

   ఈ కోవిడ్ వలన కనీసం ఒకరినొకరు దగ్గరకు తీసుకొని ఓదార్చలేని పరిస్థితి. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు జరగని పరిస్థితి. ఐనవారు దగ్గరగా ఛూడలేని పరిస్థితి. ఇదంతా ఎందుకు ఎవరివల్ల.  ఎక్కడో ఏ దేశంలోనో పుట్టి, ఇంకాఎందరి జీవితాలను నాశనం చేస్తుందో ఈ మహమ్మారి. కనీసం తొందరగా మందు వచ్చి నాలాంటి ఎందరినో బాధకు దూరం చేస్తుందనీ ఆశిస్తున్నా. ఉంటాను ఇక సెలవు.

You May Also Like

One thought on “ఇదా అంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!