నే బడికి పోనమ్మా!

“నే బడికి పోనమ్మా!”

రచన :: కమల’శ్రీ’

“అమ్మా…అమ్మా…” అంటూ  గుమ్మంలో నుంచే పదేళ్ల కొడుకు అనిల్ పిలుపు.

ఏంటి నాన్నా! అంది వంటింట్లో ఉన్న వాసంతి.

“అమ్మా! నేనిక బడికి పోనమ్మా…” అన్నాడు అనిల్.

ఆ మాటకి కాస్త కోపం వచ్చినా తమాయించుకుని… వంట గదిలో నుంచి బయటకు వచ్చి కొడుకుని దగ్గరికి తీసుకుని ఎందుకు వెళ్లవటా?” అంది ప్రశాంతంగా.

“వెళ్లనంటే వెళ్లనమ్మా… నాకు స్కూల్ లో ఎవరూ నచ్చలేదు” అన్నాడు అనిల్.

“అదే ఇన్నాళ్లూ నచ్చిన స్కూల్ ఇప్పుడెందుకు నచ్చలేదటా…?” అంది వాసంతి.

చెప్పాను కదమ్మా నచ్చలేదని. నేను వెళ్లనంటే వెళ్లను అని భుజాన ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి వెళ్లిపోయాడు గదిలోకి.

“క్రింద పడిన బ్యాగ్ తీసుకుని అతడి వెనకాలే వెళ్లింది” వాసంతి.

గదిలో ఓ మూలన కూర్చుని మోకాళ్లపై శిరస్సు ఉంచి ఏడుస్తున్న అనిల్ ని చూడగానే ఆమె మనసు ద్రవించి పోయింది.

“అనిల్… ఏం జరిగింది నాన్నా. ఎందుకు ఏడుస్తున్నావు?” అంది బాధగా కొడుకు పక్కనే కూర్చుని.

ఆమె అలా అడిగేసరికి ఆమె ఒడిలో తలపెట్టి మనమేం తప్పుచేశామనమ్మా ఈ కులం ( కథ వరకే) లో పుట్టాము. తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన మనం మనుషులం కాకుండా పోతామా?” అన్నాడు.

ఆ చిన్నారి నోటి నుంచి ఎంతటి వాడియైన ప్రశ్న. ఏమని సమాధానం ఇవ్వగలదు తను. ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుని “అసలు ఏం జరిగిందో చెప్పు నాన్నా” అంది.

“మరే… మొన్న మా ఫ్రెండ్ వాళ్లింట్లో ఓ పార్టీ ఉందని వెళ్లానా?”

“హా జతిన్ ది పుట్టిన రోజు అని వెళ్లావు. అయితే?”

“అక్కడ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశామమ్మా ఒక్క వాసూ తప్పించి. నేను వెళ్లి అడిగా వాసుని వాడు చెప్పాడు రేయ్ మేము చాలా తక్కువ కులంలో పుట్టామురా. మా లాంటి వాళ్లకి ఇలాంటి పెద్ద కులాల వాళ్ల ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు అన్నాడు. అదేంట్రా అలా అంటావు. మనం ఫ్రెండ్స్. మన మధ్య ఇలాంటివి ఎందుకు, పద లోపలికి అన్నాను. కానీ వాడు ససేమిరా రానని చెప్పారు. వాడంతలా రానంటుంటే అప్పుడు అడిగా మీదే కులమని. వాడు బదులిచ్చాడు. అదేంట్రా నాదీ అదే కులం కదా. నేను రాలేదా. నువ్వెందుకు రాకూడదు అన్నాను. ఆ మాటకి వాడు నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ… రేయ్ ఈ మాట నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గరా అనకు అన్నాడు. అదేంట్రా అలా అంటావు అన్నాను. వీరి దృష్టిలో మన కులం వాళ్లు మనుషులు కాదురా. మనల్ని వారితో సమానంగా చూడరు. వారి పక్కన నిలబడనీయరు. కూర్చోనీయరు, ఆడుకోనీయరు” అన్నాడు.

అప్పుడే జతిన్ పిలవడంతో వెళ్లి ఆటల్లో మునిగిపోయాను. కానీ నిన్నటి నుంచి జతిన్ తో పాటు కొంత మంది ప్రవర్తన వింతగా ఉంది. నాతో సరిగ్గా ఉండటం లేదు. నాతో మాట్లాడటం లేదు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే నన్నా స్కూలు మాన్పించి ఇంకెక్కడైనా చేర్పించు” అన్నాడు అనిల్.

“ఒకవేళ అక్కడా ఇదే సమస్య వస్తే…”

ఆ ప్రశ్నకి తలెత్తి తల్లి ముఖంలోకి చూశాడు.

“చెప్పు ఒకవేళ అక్కడా ఇదే సమస్య వస్తే ఏం చేస్తావు ఆ స్కూలూ మానేస్తావా…?” అంది సూటిగా అతడినే చూస్తూ.

తలదించుకున్నాడు అనిల్.

“చూశావా! నా ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు. నువ్వే కాదు చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని. వాళ్లంతా స్కూల్లూ కాలేజీలూ మానేయలేదే. తాము ఎదుర్కొన్న సమస్యని పక్కన పెట్టి కేవలం చదువుపైనే దృష్టి పెట్టి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు… అందుకు ఉదాహరణ డా.బీ.ఆర్. అంబేద్కర్… ఆయన గురించి తెలుసు కదా నీకూ”

“హా… తెలుసు… రోజూ సాయంత్రం టీవీ లో సీరియల్ వస్తుంది”.

“అందులో చిన్నప్పటి నుంచే అంబేద్కర్ చదువుకోవడం కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో చూపించారు. అంతకంటే ఎక్కువ అవమానాలూ, అవహేళనలూ ఎదుర్కొన్నారు ఆయన. కానీ ఏ పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయలేదు. తాను ఎదుర్కొన్న అవమానాలనే తన భావి జీవితానికి రాచబాటగా మలచుకుని భారతదేశానికి రాజ్యాంగము అందించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి.

నీకెప్పుడైనా బాధనిపించినా కష్టంగా ఉన్నా ఓసారి ఆయన్ని గుర్తుచేసుకో. నీ కష్టం ఆయన కష్టంలో నూరో వంతు కూడా లేదనిపిస్తుంది.” అని చెప్పడం ముగించి,

“ఇంకా నీకు ఆ స్కూలుకి వెళ్లడం ఇష్టం లేదంటే చెప్పు రేపే మీ నాన్న గారిని పంపించి ఇంకో స్కూల్ లో జాయిన్ చేయిస్తా” అంది.

మరుసటి రోజు వంటగదిలో ఉన్న వాసంతి దగ్గరికి వచ్చిన అనిల్, “అమ్మా ! ఏం టిఫిన్ చేస్తున్నావు. త్వరగా చేయమ్మా. స్కూల్ కి ఆలస్యం అయిపోతుంది” అనడంతో వాసంతి మనసు తేలిక పడింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!