గురివింద గింజ

గురివింద గింజ

రచయిత :: కమల’శ్రీ’

“రజనీ గారూ ఈ మాట విన్నారా! మన ఆఫీస్ లో పని చేసే రాధ ఉంది కదా. ఆమె నిన్న మన మేనేజర్ సుందరం గారితో హోటల్ లో కనపడింది. నేనూ మా ఆయనా కూడా వెళ్లాము అక్కడికి. మమ్మల్ని చూడగానే తలవంచి వెళ్ళిపోయారు ఇద్దరూ. అలా వెళ్లిపోయారంటే వాళ్ళిద్దరూ ఏదో తప్పు చేసినట్టే కదా?!.” అంది వాసంతి.

“అవునా! రాధ ఇలాంటిదా?!.”అంది రజనీ అప్పుడే ఆఫీస్ లోకి అడుగుపెడుతున్న రాధని అదోలా చూస్తూ.

రజని తన వైపు చూస్తూ ఉండటాన్ని గమనించినా అదేమీ పట్టించుకోకుండా తన సీట్ లో కూర్చుని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది రాధ. సుందరం కూడా ఆఫీస్ కి వచ్చి తన ఛాంబర్ కి వెళ్లిపోయాడు. కాసేపటికి ప్యూన్ వచ్చి రాధని పిలవడం తో ఆమె మేనేజర్ ఛాంబర్ లోనికి వెళ్లింది.

“చూశారా చూశారా. ఇప్పుడే ఆఫీస్ కి వచ్చారో లేదో అప్పుడే పిలుపు.ఇక లోపల ఇక ఇకలూ, పక పక లూ మొదలౌతాయి. కాసేపటికి ఇంకేం జరుగుతుందో ఎవరికి ఎరుక?.” అని ముఖాన్ని అదోలా పెట్టింది వాసంతి.

రజని కి కూడా వింటుంటే అదోలా ఉంది.”ఈ రాధకి ఏమోచ్చింది? చాలా మంచిది అని అందరూ అంటారు. అలాంటిది ఇలా చేస్తుందా?.” అనుకుంటూ తన పనిలో పడిన ఆమె “మేడమ్ మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు.” అని ప్యూన్ పిలవడంతో లేచి వెళ్లింది మేనేజర్ ఛాంబర్ లోకి.

“మిస్ రజనీ గారూ ఈ ఫైల్ ని తొందరగా ఫుట్ అప్ చేసి హెడ్ ఆఫీస్ కి పంపించండి.” అని ఓ ఫైల్ ఆమె చేతిలో పెట్టాడు సుందరం. అక్కడే కూర్చున్న రాధ వైపు చూడబుద్ది కాక ఆ ఫైల్ అందుకుని బయటకు వచ్చింది రజని.

ఫైల్ ఓపెన్ చేసిన రజని కళ్లు అశ్రువులతో నిండిపోయాయి. అది రాధ లోన్ ఫైల్.ఆమె భర్త మెడికల్ ఎమర్జెన్సీ మీద లోన్ అప్లై చేసింది. అతడు క్యాన్సర్ రోగి అని తెలుస్తుంది ఆ బిల్స్ చూస్తే. పది నిమిషాల్లో చేయాల్సిన పనిని ఐదునిమిషాల్లో చేసి మేనేజర్ కి ఇచ్చి బయటకు వచ్చిన రజనీ దగ్గరికి వచ్చిన వాసంతి “ఏంటి మేడమ్ లోపల జరిగేది చూడలేక వెంటనే వచ్చేసారా ఏంటి?!.” అంది.

ఆమెకి సమాధానం ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయిన రజని లంచ్ టైమ్ లో ప్యూన్ ని కలిసి రాధ భర్త పరిస్థితి కోసం అడిగింది.

“ఏం చెప్పమంటారు మేడమ్.ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. కొన్నాళ్లు బాగానే ఉన్నారట. వారిపై ఎవరి కళ్లు పడ్డాయో కానీ అతనికి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుందట.ఆ బాధని బయటకు కనపడనీయకుండా ఆఫీస్ కి వచ్చి పని చేసుకుని వెళ్ళి తన హస్బెండ్ ని చూసుకుంటున్నారు.

తన ఒంటి మీద నగలన్నీ,తన కన్నవారు తన పేరిట రాసిన పొలాన్ని అమ్మేసారు. అయినా డబ్బు చాలలేదట.మొన్నోసారి ఏదో పని మీద ఆ హాస్పిటల్ కి వెళ్ళిన మన మేనేజర్ గారు అక్కడ ఆమెని చూసి విషయం అడిగితే చాలా సేపు చెప్పలేదట. ‘నీ అన్న లాంటి వాన్నమ్మా! సమస్య నాకు చెప్పు.’ అనడం తో విషయం చెప్పారట.” అని చెప్పాడం ముగించాడు.

“ఏ హాస్పిటల్?.” అంది రజని. పేరు చెప్పాడు ప్యూన్.

‘ఓహ్ వాసంతి చెప్పిన హోటల్ ఆ హాస్పిటల్ ఎదురుగానే ఉంది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూసి ఏవేవో కథలు అల్లి చెప్పిందన్న మాట. అలా ఎలా లేనివి చెప్తారు?!.’ అనుకుంటూ రాధ వైపు చూసింది.రాధ తన పనిలో నిమగ్నమై ఉంది.

ఓ రోజు గడిచింది. మరునాడు డ్యూటీ నుంచి ఇంటికి చేరిన వాసంతి తన భర్త చెప్పిన విషయం విని షాక్ అయ్యింది.

“ఏవోయ్ మీ ఆఫీస్ లో పని చేసే వాసంతి అనే ఆమె, మా కొలీగ్ రాజేష్ తో లేచిపోయిందట. వాళ్లావిడ ఫోన్ చేసి విషయం చెప్పి బాధపడుతుంది. ఆమెకేం వచ్చింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా!.” అని.

వాసంతి లాంటి గురవింద గింజలెందరో ఉన్నారు ఈ సమాజంలో అనుకుంటూ ఇంటిపని లో పడింది రజని..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!