మేలెంచి ..కీడెంచు..!

మేలెంచి ..కీడెంచు..!

రచయిత :: యర్రాబత్తిన మునీంద్ర (చైత్రశ్రీ)

మొన్నీమధ్యే సాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఏలినాటి శని తాండవిస్తున్నా ఇంటర్వ్యూలో ప్రథమ స్థానంలో సెలెక్టయి ఎంచక్కా విమానమెక్కేశాడు. వాడికి జాతకాలంటే నమ్మకం లేదు. చిన్నప్పట్నించీ అమెరికాకెళ్ళాలని వాళ్ళమ్మా అబ్బా బూస్టింగ్ ఇచ్చేసరికి చేష్టలు కూడా అమెరికావే అబ్బినాయి. యు.ఎస్ లో మా వోడికి ఉద్యోగం అంటూ పెళ్ళి చూపులకి తెగ తిరిగేస్తూ, కట్నం నోటికొచ్చినంత అడిగేస్తూ విచ్చల విడిగా వూరూరా చక్కర్లు కొడుతున్నారు సాయి అమ్మానాన్న. ఎట్టకేలకు ఓ బడా సంబంధం సాయికి కుదిరింది.
పిల్లికి కూడా బిచ్చం పెట్టని వీరాస్వామికి ఒకే ఒక్క కూతురు వినీత. కూతురి మీద అపార నమ్మకంతో డాక్టర్ చదివించాలని ఆశపడి తన బిజినెస్ లో జనాల నుంచి రాబట్టుకున్న డబ్బంతా లాంగ్ టర్మ్ కోచింగ్ లకి ధార పోశాడు. వినీత సీటు సంపాదించింది కానీ అది మేనేజ్ మెంట్ సీటు. డెబ్బై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టడం పెళ్ళి చేసేస్తే పోలా అనుకున్న వీరాస్వామి, వినీతకి అమెరికా సంబంధాలు చూస్తుంటే సాయి కంటికి ఆనాడన్న మాట. గొప్పలు చెప్పడం సాయి వాళ్ళ అమ్మా నాన్నకి వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజుల్లో నీతి నిజాయితీల కంటే నడమంత్రపు సిరి, సత్య హరిశ్చంద్రుల కంటే అబద్ధాల కోరులకి విలువెక్కువ. మాటే మంత్రము అని ఒక కవి పాటలో రాస్తే ఏమో అనుకున్నా గానీ కలి పురుషుల మాటలు తంత్రాలై అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాయి. వీరాస్వామి సాయి అమెరికాలో చాలా అనుభవం గల ఉద్యోగిగా చాలా ఏళ్ళ నుంచి ఉద్యోగం అనే సరికి ఎగిరి గంతేసి పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. సాయి వారం సెలవుతో పెళ్ళి తంతు ముగించుకొని వినీతతో అమెరికాకెళ్ళిపోయాడు. అమెరికాలో వినీత సాయిల సంసారం బాగానే సాగుతుండగా వీరాస్వామి సడన్ గా అమెరికాలో కూతురింటికి వెళ్ళాడు. సాయికి ఫోన్ చేసిన వినీత “నాన్నగారొచ్చారని” చెప్పడంతో ఆశ్చర్యపోయి పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు. కొత్తగా పెళ్ళై కూతురు దూరమయ్యేసరికి చూడకుండా ఉండలేక వచ్చుంటాడు అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. సాయిని చూసిన వీరాస్వామి అదోలా చూస్తూ వంకరగా మాట్లాడాడు.
ఏమైంది మావయ్యా అని సాయి అంటుండగానే, ఎవర్రా నీకు మావయ్య అమెరికా సంబంధం అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నందుకు నా చెప్పుతో కాదు కాదు నీ చెప్పుతో కొట్టుకోవాలి అంటూ వీరాస్వామి తిట్టిపోశాడు.
వినీతా..! అసలు ఏం జరిగింది మావయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పు అడిగిన సాయి ముఖంపై మూతితో ఒక తిప్పు తిప్పి బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది వినీత.
వీరాస్వామి ఆగలేక మీ అమ్మ అయ్య వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటారు, రమ్మని చెప్పు అని ఆర్డర్ వేశాడు.
సాయి మావయ్యా ఇప్పుడు అమెరికాలో ఉండడం అంత సేఫ్ కాదు నేనే వీలుచూసుకొని ఇండియాకి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు.
నేనేమైనా తెలివితక్కువ వాణ్ణా నీ మాటలు నమ్మడానికి, మీ పేరంట్స్ కి టికెట్స్ బుక్ చేసి ముందు రప్పించు అంటూ కోపంగా వెళ్ళాడు.
సాయికి అసలేం జరిగిందో అర్థం కాక చేసేదేమీ లేక అమ్మా నాన్నల్ని రప్పించేశాడు. అందరూ హాల్లో కూర్చుని బిగ్ సైజ్ సోనీ టి.విలో తెలుగులో వార్తలు చూస్తుండగా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే విదేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ ఇండియా రద్దు చేసింది. కనుక వెళ్ళిన వాళ్ళంతా ఆ దేశాల్లోనే కొద్దిరోజులు ఉండాలని కోరిన ఇండియా ప్రధాని. ఈ వార్త చూసిన వీరాస్వామికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ఇప్పుడు అసలు విషయంపై రాద్ధాంతం చేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక చాలా ఇబ్బంది పడతాం అని సమస్యపై చర్చను వెనకేశాడు. సాయి మావయ్య ఎప్పుడు అమ్మ వాళ్ళపైకి యుద్ధానికి వెళ్తాడోనని టెన్షన్ లో ఉన్నాడు. సడన్ గా ముత్యాల ముగ్గు రావుగోపాలరావు ఆ ఒక్కటి అడక్కులో రొయ్యలనాయుడులా మంచోడైపోయినట్లు వీరాస్వామి “అల్లుడూ నీదెంత ముందు చూపు అల్లుడూ.. నువ్విందుకేనా మీరెళ్ళండి నేనే ఇండియా వస్తాను అన్నది” అన్నాడు. అవును మామయ్యా కోవిడ్19వైరస్ ఏదో చైనా నుంచి అమెరికాకి వ్యాపిస్తూ ఉందని, తర్వాత ఇండియాకి కూడా వస్తుందని మొన్ననే పేపర్లో చదివా. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా సీరియస్ మ్యాటర్ అయుంటుందని అమ్మ వాళ్ళని రప్పించా ఇప్పుడు మీరంతా నా ఇంట్లో ఇరుక్కుపోయారు అన్నాడు సాయి.
అదేముందిలే అల్లుడూ పనిలో పని హ్యాపీగా అమెరికా మొత్తం చూసేస్తే పోలా అని వీరాస్వామి అంటుండగానే సాయి ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్, ఈ టైంలో తిరగడానికి కుదరదు అనడంతో, వీరాస్వామి అబ్బా సాయిని గిలగిల కొట్టుకొనేలా చేద్దామని వచ్చి కుడితిలో పడ్డ ఎలకయ్యామే అని బాధ పడ్డాడు.
ఇండియాకి స్పెషల్ ఫ్లైట్స్ గురించి ఫ్రెండ్స్ ని ఆరా తీస్తే అడుగు బయట పెట్టడం కూడా కుదరదని కరాకండీగా చెప్పేశారు. ఇంకేముంది ఈ కరోనా టైమ్ లో అమెరికాలో ఇంట్లోనే ఉండి విసుగుతో వీరాస్వామి భలే ఇబ్బంది పడ్డాడు. వినీత యూట్యూబ్ లో రకరకాల వంటలు చేస్తూ తిప్పలు పడుతూ, సాయికి వచ్చే సగం జీతం ఇంట్లో వాళ్ళ తిండికి సరిపోక అప్పులు చేస్తుంటే వాళ్ళమ్మ ఏంట్రా ఈ ఖర్మ జీవితం, మనూర్లో అయితే దొరికింది తిని తృప్తిగా ఇంట్లోనే ఉండేవాళ్ళం. దూరపు కొండలు నునుపు అంటే ఏమో అనుకున్నా కానీ నిజమేరా దేశంగాని దేశంలో ఒకరిమీద ఆధారపడుతూ కోట్లు సంపాదించినా స్వతంత్రం ఉండదు తృప్తి ఉండదు. ఈ ఉద్యోగమూ వద్దు ఏమీ వద్దు ఇండియాలోనే ఏదో ఒక కంపెనీలో పనిచేస్తూ మా కళ్ళముందే ఉంటావ్, వచ్చెయ్ కన్నా అంటూ కన్నీరుపెట్టుకుంది.
ఇదంతా విన్న వీరాస్వామి నిజమే కదా ఇక్కడ ఎంత సంపాదించినా ఏం లాభం ఖర్చుపెట్టేదంతా అమెరికా వాడి జేబులోకే కదా అనుకుంటూ గొడవ పెట్టుకొందామని వచ్చిన పనిని పక్కన పెట్టి ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడెప్పుడు ఇండియాకెళ్ళిపోదామా అని వీరాస్వామి లోలోపలే నలిగి పోయాడు.
ఫ్లైట్లను ఇండియాకి నడపడానికి సిద్ధమయిన ఎయిర్లైన్స్ అనే వార్తను చూసిన సాయి అందరినీ పిలిచి హాల్లో కూర్చున్నాడు. ఏంటి అల్లుడూ విషయం అన్నాడు వీరాస్వామి. నువ్వేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటేనే కదా అమ్మా నాన్నని రప్పించాను. నాన్న నన్ను ఎందుకురా మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఇరికించావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా రోజూ నస పెడుతున్నాడు మావయ్యా ఆ విషయమేంటో చెప్పు.
దానికి తడబడుతూ వీరాస్వామి ఏం లేదులే అల్లుడూ అది చిన్న విషయమేలే అని తోసిపుచ్చాడు.
సాయి ఇండియా నుంచి వాళ్ళని రమ్మని ఇప్పుడేమో చిన్న విషయమని కొట్టిపారేస్తే ఎలా చెప్పండి అన్నాడు.
అల్లుడూ “నాకు కావల్సినంత ఆస్తి ఉంది ఎంతో పలుకుబడి ఉంది. కానీ ఆపత్కాలంలో అవి నన్ను ఇండియాకి కూడా తీసుకెళ్ళలేక పోయాయి. మీ అమ్మా నాన్నలు చెప్పిన జాబ్ నువ్వు చేయట్లేదని చాలా చిన్న జాబ్ చేస్తున్నావని అబద్ధం ఎందుకు చెప్పారో నిలదీద్దామని రమ్మన్నా. కానీ కరోనా కాలంలో నాకు జ్ఞానోదయమైంది. నువ్వు చేసేది చిన్న జాబ్ కాబట్టి సగం జీతం ఇచ్చారు అదే మీరు అబద్ధం చెప్పిన జాబ్ అయ్యుంటే వాళ్ళందరినీ రిమువ్ చేశారు. నాకో మాట గుర్తొచ్చింది కీడెంచి మేలెంచు అనే ఆర్యోక్తిని మార్చి మేలెంచి కీడెంచాలని. అదే ఆరోజు నేను అల్లుడు చేసే పని మంచిదైతేనే చేరుంటాడు అని కొంచెం ఆలోచించి ఉంటే ఇప్పుడు ఈ కరోనా తిప్పలు వియ్యంకులు, నేనూ పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక నుంచి నువ్వు ఇండియాలో నా కంపెనీలు చూసుకుంటే చాలు అల్లుడూ అంటూ సాయిని కౌగిలించుకున్నాడు వీరాస్వామి. సాయి మనసులో ఈ కరోనా వల్ల మా మావ మనసు మారింది అంతా మన మంచికే అనుకుంటూ ఈ మహమ్మారి అందరికీ ప్రాణాపాయంగా మారకుండా ఉంటే బాగున్ను అని దేవున్ని ప్రార్థించాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!