సెకండ్ ఛాన్స్

రచన – తపస్వి

‘లాస్ట్ బస్ వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను… రాను… అని ఇపుడే చెప్పకు… అది విని తట్టుకునే ధైర్యం నా గుండెకి లేదు.’

అతని ఆలోచనలను చెదరగొడుతూ, “ఏరా ఇంకా తను వస్తుంది అనుకుంటున్నావా?” వాటర్ బాటిల్ ఇస్తూ అన్నాడు తేజ.

“ప్రయత్నించకుండా ఓడిపోయాం అనే బాధ కంటే, ప్రయత్నించి ఓడిపోయా అనుకోవటం బెటర్ కదరా…” మూత తీస్తూ అన్నాడు అవినాష్.

“అంటే రాదని ముందే తెలుసా…”

“నేను పెట్టిన మెసేజెస్ కూడా చూడనిది, నా కోసం ఎందుకు వస్తుందిరా”

“మరి మార్నింగ్ నుండి ఎందుకురా, పిచ్చివాడిలా ఎదురు చూడటం? 2 టికెట్స్ ఎందుకు తీసుకున్నావు?”

“ప్రేమంటేనే పిచ్చి కదరా! తను నా మెసేజెస్ చూసి వస్తే? అని చిన్న ఆశ… నా ప్రేమ మీద నాకు ఉన్న నమ్మకం…!”

“మరి ఆ నమ్మకం ఏమైంది?

“ప్రేమ మీద నమ్మకం పోలేదురా… తన మీద నమ్మకం పోయింది అంతే…” నవ్వుతూ, “ఎలాగూ 2 టికెట్స్ ఉన్నాయి కదా… సరదాగా హైదరాబాద్ రావచ్చు కదా…” కన్నీళ్ళను కనురెప్పల చాటున దాస్తూ.

“కుదరదు లేరా… కావాలంటే ఓ వీక్ తర్వాత వస్తా… దమ్ము కొడతావా? బస్ కి ఇంకో అరగంట టైం ఉంది…”.

“సరే పద…”

ఇద్దరు బస్టాండ్ బయటకి బయల్దేరారు.

***

అవినాష్ కి 20 అడుగులకు దూరంలో… గత 4 గంటలు నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ… ప్రేమించిన వాడు మోసం చేస్తే… ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో… తల్లితండ్రుల దగ్గరకి తిరిగి వెళ్లాలని ఉన్నా వెళ్ళలేక, చావాలన్న కోరిక కలిగిన, ప్రేమంటే అర్థం తెలీని ఓ వెధవ కోసం తానెందుకు చావాలి… అనుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్లి జీవితంలో గెలిచి చూపించాలి అన్న ఆలోచనల మధ్య నలిగిపోతూ… మౌనంగా రోదిస్తూ కూర్చుంది స్నేహ.

***

“ఓ సారి తన ఇంటికి వెళ్లి మాట్లాడి ఉంటే బాగుండేదేమోరా…” చేతిలో సిగరెట్టు పడేస్తూ అన్నాడు తేజ.

“నాతో ఉండాలన్న కోరిక ఉన్నది అయితే ఇంట్లో ఎవరు లేనపుడు వేరే వాడితో ఉండదు కదా”

అవినాష్ మాటలకి తేజ అడుగు ఆగింది.

“అది చూసి బాధ వేయలేదా?”

“బాధ…? తనతో ఉన్నవాడి గురించి ఆలోచించి జాలి వేసింది… ఇలాంటిదాన్నా నేను ప్రేమించింది అని నా మీద నాకు అసహ్యం వేసింది…”

“వాడి మీద జాలి ఎందుకురా… నేనైతే అక్కడే వాళ్ళిద్దరినీ చంపేసేవాడిని…”

“రేయ్ తను అలాంటిది అని తెలుసుకోలేకపోవటం నాది తప్పు… నమ్మి ప్రేమించటం నాది తప్పు… తప్పు తెలుసుకున్నా… ప్రేమని చంపుకున్నా… తప్పు సరి చేసుకున్న… ఈ రోజు నేను వుండగానే వేరే వాడితో వెళ్ళింది అంటే, తనకి కావల్సింది ప్రేమ కాదు… సరదా… నిన్న నేను, ఈ రోజు వాడు… రేపు ఇంకొకడు… అందుకే వాడిని చూసి జాలి వేసింది”

“ఇంత తెలిసిన వాడివి ఇవ్వాళ ఈ డ్రామా ఏంటిరా? నన్ను పిచ్చి వాడిని చేయటానికా?” తేజ మాటల్లో అసహనం తెలుస్తుంది అవినాష్ కి.

“ప్రేమించాను కదరా… ఇంత తెలిసిన నేను ఇంకా తనతో ఉండాలి అనుకుంటున్నాను అంటే, తన మనసు మారి వస్తుందేమో అన్న చిన్న ఆశరా… పైగా మొన్నే ఎవడో ఓ భగ్నప్రేమికుడు, ప్రేమించిన వాళ్ళలో మంచినే కాదు… చెడుని కూడా అంతే ప్రేమించాలి అంటే విన్నానురా…” నవ్వుతూ అనేసరికి, తేజ ఒళ్ళు మండింది. మాటల మధ్యలోనే వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళే బస్ లు నిలిచే ప్లాట్ ఫామ్ దగ్గరకి చేరుకున్నారు.

“నీ గోలలో పడి చెప్పడం మర్చిపోయా… అక్కడ చూడు రెడ్ కలర్ డ్రెస్లో, నేను ఈవెనింగ్ నుండి చూస్తున్నాను, అక్కడే కూర్చుని ఉంది, ఏదో ప్రాబ్లంలో ఉందనుకుంటా… ఏడుస్తుంది…”

తేజ చెప్పిన వైపు చూసిన అవినాష్ పెదవులపైన తనకి తెలియకుండానే చిరునవ్వు తొంగి చూసింది.

“రేయ్ రెండు Kit Kat చాక్లెట్స్ తెస్తావా” అన్నాడు అవినాష్.

“సెలబ్రేట్ చేసుకోవాలంటే బార్ కి వెళ్ళేవాళ్ళం కదరా…”

“వెళ్లి తీసుకురా… ప్లీజ్” ఆమె వైపు చూస్తూనే అన్నాడు అవినాష్.

***

‘హైదరాబాద్ వెళ్ళే బస్ ఇంకో 10 నిముషాల్లో బయల్దేరుతుంది’ అని అనౌన్స్మెంట్ విన్న స్నేహ కన్నీళ్ళను తుడుచుకుని బాగ్ సర్దుకుంటూ ఉండగా…

“Kit Kat ఇంకా నీ ఫేవరెట్ చాక్లెటే కదా…!” అన్న మాట వినేసరికి తల పైకి ఎత్తి ఎదురుగా ఉన్న అవినాష్ ను చూసి ఆశ్చర్యంతో “ఓయ్ నువ్వా? నువ్వెంటి ఇక్కడ…” తనకి తెలీకుండానే ఆమె మొహంలో సంతోషం తొంగి చూసింది.

“ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్లో ఓ అందమైన అమ్మాయి ఉందని నా ఫ్రెండ్ చెబితే… లైన్ వేద్దామని వచ్చా…”

“మరి పడిందా?” అతనిని చూడక ముందు ఉన్న దుఃఖం ఇపుడు ఆమె ముఖంలో లేదు.

“వాడేదో అందంగా ఉందంటే వచ్చా… కానీ… అనుకున్నంత లేదు…”

వాళ్ళ మాటలు వాళ్ళ చెవులకి చేరుతున్నాయి అలాగే… ఒకరి కళ్ళల్లోనీ నిజం… వేరొకరి హృదయానికి అంత కంటే వేగంగా చేరింది.

చేతిలో చాక్లెట్స్ తో పక్కన నిలబడిన తేజకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఇద్దరినీ చూడసాగాడు.

అవినాష్ చెయ్యి చాచటంతో చాక్లెట్స్ ఇచ్చి, ఓ పది నిముషాలు ముందు వీళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న ఇద్దరు… వారేనా? వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది అన్న ఆలోచనల్లో మునిగిపోయాడు.

“నా ఇష్టాలని ఇంకా మర్చిపోలేదా!?” అవినాష్ ఇస్తున్న చాక్లెట్స్ తీసుకుంటూ అంది. ఆమె కళ్ళలో మెరుపు.

“రేయ్ మన కథకి ఈ సీన్ కి, సిట్యుయేషన్ అసలు సింక్ అవ్వట్లే… పులిహోర కలపటం ఆపి… కాస్త క్లారిటీ ఇస్తావా!” విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు తేజ.

“వీడు నా ఫ్రెండ్ తేజ…, తేజ… తను స్నేహ…”

“హాయ్…” స్నేహ మాటలు తేజ మెదడుకి చేరే లోపు, అవినాష్ స్నేహ గురించి చెప్పిన కథ గుర్తొచ్చింది.

“అంటే ఇంజనీరింగ్ లో… ఉన్నపుడు నువ్వు ఇష్టపడిన స్నేహ తనేనా!” లోపల అనుకున్నా అనుకున్నాడు కానీ, పైకి అనేశాడు. తేజ అలా రియాక్ట్ అవుతాడు అని ఊహించని అవినాష్,

‘కలిసి ఉన్న 4 సంవత్సరాలు మంచి ఫ్రెండ్స్ గా ఉండి… అవినాష్ అంటే ఇష్టం ఉండి కూడా… అది ప్రేమ అవునో, కాదో తేల్చుకోలేక, తన భావాలను చెబితే ఎక్కడ ఉన్న స్నేహం కూడా పాడవుతుంది అన్న భయంతో మనసులోనే దాచుకున్న స్నేహకి కూడా’… తేజ మాటలు అంతే షాక్ ఇచ్చాయి.

ఊహించని ఆ సంఘటనకు ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.

“హైదరాబాద్ కే కదా వెళ్ళేది…!” నిశబ్ధాన్ని చేధిస్తు అడిగాడు అవినాష్.

“అవును… టికెట్ తీసుకోవటానికి వెళ్ళాలి అనుకున్నప్పుడే నువ్వు వచ్చావు…”

“నా దగ్గర ఇంకో టికెట్ ఉంది… ఇద్దరం కలిసి వెళ్దామా…”

“ఇంకోటి ఎక్కడిది అన్న డౌట్ వద్దు… అయ్యగారి లవర్ ని లేచి వచ్చేయమంటే, హ్యాండ్ ఇచ్చింది…” అవినాష్ పరిస్థితి అర్థం కావాలని… కావాలనే అన్నాడు తేజ.

“ఓ ప్రేమించానని చెప్పి, లేచి వచ్చేయమనే ధైర్యం వచ్చిందా?” అన్నదే కాని… ఒకపుడు తనకి ఆ ధైర్యం లేకనే కదా… అవినాష్ అంటే ఇష్టం ఉండి కూడా చెప్పలేదు అనుకుంది మనసులో.

“జీవితంలో ఒక్కసారి చేసిన తప్పు మరోసారి చేయకూడదు అనుకున్నా…, సర్లే నా విషయం వదిలేయ్… ఎప్పుడూ ఏడిపించడం తప్ప… ఏడవటం తెలియని నువ్వేంటి ఇలా…”

“హ్మ్మ్… నువ్వో అమ్మాయిని లేచి రమ్మంటే, రాలేదని నువ్వు ఇలా… నన్ను రమ్మన్నవాడు… వచ్చి నా డబ్బు దోచుకుని పారిపోతే నేను ఇలా…”

కన్నీళ్లు…ఇద్దరికీ నేస్తాలు…

“కాస్త మీ మెలో డ్రామా ఆపి… నాకో విషయం క్లారిటీ ఇస్తారా…? ఇద్దరూ… ఇద్దరికీ ఇష్టం అని తెలిసి, అసలు అపుడు ఎందుకు చెప్పుకోలేదు, ఎందుకు విడిపోయారు” అర్థం కాక అడిగేశాడు తేజ.

ఇద్దరి సమాధానం ఒక్కటే… మనసులో

ఆ రోజు చెప్పుకునే ధైర్యం లేక… చెబితే ఎక్కడ ఉన్న స్నేహం కూడా పోతుందో, ఎక్కడ ఇద్దరి జీవితాల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతామో అన్న భయం, అందుకే ఓ మంచి జ్ఞాపకంగా ఇద్దరు ఇద్దరి జీవితాల్లో మిగిలిపోవాలని స్నేహితులుగానే విడిపోయారు. విడిచి దూరంగా ఉండటం కష్టంగా ఉండి, మళ్ళీ ఆ ఇష్టాన్ని చంపుకోలేక… దగ్గరగా ఉంటే ఎక్కడ ఒకరిని ఒకరు హర్ట్ చేసుకుంటారో అనే ఆలోచనలతో, శాశ్వతంగా దూరం అయ్యారు. దూరం అయ్యారే కానీ… స్నేహలాంటి అమ్మాయి కావాలని అతను… అవినాష్ లాంటి ప్రేమికుడు కావాలని ఆమె… ప్రేమంటే అర్థం తెలియని మరో ఇద్దరిని కలుసుకున్నారు’.

స్నేహ,అవినాష్… ప్రేమికులుగా ఉంటే ఎలా ఉండాలనుకునే వారో… వాళ్ళ బంధాన్ని నిలుపుకోవడానికి ఎంత భరించాలో… అంతా భరించారు… ఆఖరి క్షణం వరకు వాళ్ళ ప్రేమని గెలిపించుకోవాలని చూసారు, కాని… కాలం… జీవితం… ప్రేమ… చాలా విచిత్రమైనవి… మళ్ళీ అనుకోకుండా ఇద్దరినీ… ఒకే పరిస్థితుల్లో కలిపింది… వాళ్ళలాంటి వాళ్ళు, వాళ్ళు తప్ప వేరే ఉండరు అని… అలా వెతుక్కోవడం తప్పు అని అర్థం అయ్యేలా చేసింది.

తన ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఇస్తారేమో అని వాళ్ళ వైపే ఆసక్తిగా చూడసాగాడు తేజ.

“మళ్ళీ ఇలా కలవడానికి” ఇద్దరూ ఒకేసారి సమాధానం చెప్పారు…

***

కదులుతున్న బస్ వైపు చూస్తూ నిల్చున్నాడు తేజ.

పక్క పక్క సీట్లలో కూర్చుని… మాట్లాడుకోవాలి, ఏదో చెప్పుకోవాలి, ఒకరి కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళను మరొకరు తుడవాలి… అన్న ఆలోచనలతో… ముగిసిపోయిన ప్రేమకథ నుండి పుట్టిన ఓ రెండు ప్రేమకథల ముగింపులో… మళ్ళీ కలిసిన పాత స్నేహితులా… సరికొత్త ప్రేమికులా… ఏమో ఏదైనా అనుకోవచ్చు…

ఎవరికి తెలుసు… జీవితం ఎప్పుడు ఏ సర్ప్రైజ్ ఇస్తుందో…! ఒకప్పుడు వీళ్లిద్దరూ విడిపోయిన కథ విన్నాడు తేజ, ఇపుడు మళ్ళీ కలిసిన కథకి సాక్ష్యంగా నిలబడి చూస్తున్నాడు… మళ్ళీ ఇంకోసారి ఇద్దరినీ చూసే సమయానికి, జంటగా చూడాలన్న ఆశతో.

జీవితం, కాలం, ప్రేమ… ఎపుడూ మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అన్న నమ్మకంతో…!

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!