మళ్ళీ రావా

రచన – తపస్వి

మళ్ళీ రావా…

మన తొలి పరిచయంలో ఉన్న ఆతృతను మరొక్కసారి అనుభవిద్దాం.

మళ్ళీ రావా…

నేను నిన్ను కలిసే క్షణంలో, నేను పడ్డ కంగారుని  సరదాగా తలుచుకుని నవ్వుకుందాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ కళ్ళలో ఆ మెరుపుని, నీ పెదవులపై ఆ చిరునవ్వుని నేను చూసి మైమరిచి పోయిన ఆ క్షణాన్ని మళ్ళీ తిరిగి పొందుదాం.

మళ్ళీ రావా…

నీ చేతి గాజులు బాగున్నాయి అంటూ, వాటిని తడిమి నేను మురిసిపోయిన క్షణాలలో మళ్ళీ బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

నిద్ర లేచిన తర్వాత, నిద్ర పోయే ముందు వచ్చే తొలి, తుది ఆలోచన నువ్వైన రోజులను మళ్ళీ కలుద్దాం.

మళ్ళీ రావా…

ఏమి లేకపోయినా మాటలు కలపాలి అన్న ఆశతో, కారణాలు వెతికిన రోజులని మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం.

మళ్ళీ రావా…

తొలిసారి ఇష్టంగా ఒంటరిగా కలిసిన రోజు,  తొలిముద్ద నా నోటిలో నువ్వు పెట్టిన క్షణం తలచుకుందాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ అల్లరి ఆస్వాదిస్తూ గడిపిన ఆ క్షణంలోకి వెళ్లి మళ్ళీ ఆ అల్లరిని చూద్దాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ ముందు కూర్చుని కళ్ళతో చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుందాం.

 

మళ్ళీ రావా…

తొలిసారి నీ కాటుక కళ్ళతో నన్ను కవ్వించిన ఆ క్షణం మరోసారి తెచ్చుకుందాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ కాలి మువ్వలలో చిక్కుకున్న నా కళ్ళని చూసిన నీ చిలిపి చూపులని మరోసారి చూద్దాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ చేతి స్పర్శకి కలవరపడిన నా మనసుకి మరో కలవరింత ఇద్దాం.

మళ్ళీ రావా…

తొలిసారి నీ నుదుటి మీద నా పెదవులు తాకిన క్షణం, నా పెదవులకి చేరిన నీ కుంకుమని ఆశగా మళ్ళీ నీ నుదుటన అలంకరిద్దాం.

మళ్ళీ రావా…

నా పెదవులు నీ కనులని తాకిన క్షణం, ఎగిసిన నీ శ్వాసలో మళ్లీ ఇద్దరం కలిసి బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

తొలిసారి నిను కౌగిలించుకున్న క్షణం, ఆగిన ఓ క్షణానికి ఊపిరి పోసి మళ్లీ మనం

పెనవేసుకుపోదాం.

మళ్ళీ రావా…

చీకటి వేళ చిలిపి ఊసులతో మనం  సృష్టించుకున్న ఓ మన్మథ రాజ్యంలో మళ్ళీ అలా విహరించి వద్దాం.

మళ్ళీ రావా…

కారణాలు లేకుండా అలిగి గొడవ పడిన క్షణాల్లో మన ఇష్టాన్ని మళ్ళీ చెప్పుకుందాం.

మళ్ళీ రావా…

మనకి మనం దూరంగా ఉన్న ప్రతి క్షణంలో మళ్ళీ మన జ్ఞాపకాలని నింపుదాం.

మళ్ళీ రావా…

హద్దులు లేని అల్లరి ఆట, పాటలలో.. కోప, తాపాలతో మనం మనలా ఒకరితో ఒకరం గడిపిన ఆ రోజులకి మళ్ళీ జన్మను ఇద్దాం.

 

మళ్ళీ రావా…

మన అధరాల యుద్ధంలో స్తంభించిన కాలంలో, కుదిరితే మరోసారి ఇద్దరం విజేతలం అవుదాం.

మళ్ళీ రావా…

చిలిపి అల్లరితో ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమని, కోరికని ఇంకొంచెం కొత్తగా తెలుపుకుందాం.

మళ్ళీ రావా…

కోరికతో ఆస్వాదించిన మన సంగమ క్షణాలని మరింత అందంగా మలుచుకుందాం.

మళ్ళీ రావా…

నీ గుండెలో వేదనని విన్న స్నేహితుడిగా మళ్ళీ కొత్తగా, నాలో ఓ మనిషిని కనుగొన్న క్షణం రాకుండా చూసుకుందాం.

మళ్ళీ రావా….

నీ చిరునవ్వు కోసం నా మనసుని చంపుకున్న క్షణంలో, నా గుండె వేదన పడ్డ క్షణాన్ని

ధైర్యంగా నా మనసులో మాట చెప్పగలిగే క్షణంగా మారుద్దాం.

మళ్ళీ రావా…

ఉన్న ఇష్టాన్ని.. మన మనసులలో మళ్ళీ బంధించి ఉంచుకుంటూ, నటించిన క్షణాలకు విముక్తి ఇచ్చి స్వేచ్ఛగా బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

నచ్చని గొడవలను చెరిపేసి, నచ్చిన మన మనసుల మాట మళ్ళీ విందాం.

మళ్ళీ రావా…

కలవాలి అన్న కోరిక ఉండి అడ్డుపడిన ఆ సంఘర్షణలను పక్కకు పడేసి, మనం మనలా మన బంధం కోసం మళ్లీ బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

మాట వినని మనసుకి సర్ధి చెప్పి, చెదిరిన మన ఆలోచనల్ని సరిచేసి, మళ్ళీ మన బంధం కొత్తగా మొదలుపెడదాం.

 

మళ్ళీ రావా…

కారణం లేకుండా నువ్వు నా మనసుకు చేసిన గాయాన్ని, నీ ప్రేమతో మానేలా చేసేద్దాం.

మళ్ళీ రావా…

కారణం లేకుండా మన మధ్య వచ్చిన ఎడబాటును ఎదురించి మన బంధాన్ని మరింత గట్టిగా ముడివేద్దాం.

మళ్ళీ రావా…

నా నువ్వు కాని క్షణంలో, నే పడ్డ వేదనని, ధైర్యంగా నీతో పంచుకునే క్షణంగా మారుద్దాం.

మళ్ళీ రావా…

నీ నేనుగా నీకు దగ్గర అయిన క్షణం, నువ్వు చెప్పిన ప్రేమ పలుకులు మరొక్కసారి కలిసి విందాం.

మళ్ళీ రావా…

నీ ఒడిలో ఓ బిడ్డగా, నే ఒదిగిన క్షణం మన మద్య ఉన్న ఆ ప్రేమని మళ్ళీ బ్రతికిద్దాం.

మళ్ళీ రావా…

వదులుకోలేక ,వదులుకునే ఆలోచనలు నచ్చక, మనం పడ్డ వేదనని ఇష్టంగా మళ్ళీ తలచుకుందాం.

మళ్ళీ రావా…

పెరిగిన దూరంలో ఉండలేక, మళ్ళీ మనం మనలా దగ్గర అవ్వలేక, మనం మళ్ళీ కలిసేందుకు వెతికిన కారణాలను చూసి నవ్వుకుందాం.

మళ్ళీ రావా…

నా ప్రతి శ్వాసలో.. ప్రతి ఆలోచనలో.. నువ్వే ఉన్నావు అని చెప్పుకున్న క్షణంలో సంతోషంగా కలిసి బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

ఏకమైన మన శ్వాసల బంధాన్ని.. శాశ్వత బంధం అని మరింత గట్టిగా మనకి మనం చెప్పుకుందాం.

మళ్ళీ రావా…

ఒకరిని ఒకరం బాధ పెట్టుకొలేక , మనకి మనం దూరం పెంచుకోవాలి అని పిచ్చిగా మనం చేసిన ప్రయత్నలను చూసి వెక్కిరిద్దాం.

మళ్ళీ రావా…

అబద్ధం చెప్పే నీ పెదవులను కాదు అని, నిజం చెప్పే నీ కళ్ళను మరోసారి చూపిస్తా, నీకు నేనంటే ఎంత ఇష్టమో అని.

మళ్ళీ రావా…

కాసేపు ఎడబాటుకే నా మీద అలిగి నువ్వు గొడవ పడిన క్షణాల్లోని మన ప్రేమని మనం మళ్లీ తెలుసుకుందాం.

మళ్ళీ రావా…

మన మధ్య  బంధం తెగిపోతుంది అనుకున్న క్షణం, మళ్ళీ మన కలయికని మరింత కొత్తగా తీర్చిదిద్దుకుందాం.

మళ్ళీ రావా…

తొలిసారి అలకతో వచ్చిన నీ కోపాన్ని, మరోసారి మన గుండెల్లో పదిలంగా దాచుకుందాం.

మళ్ళీ రావా…

నిండు జాబిలి సాక్షిగా, చిరుగాలిలో మనం విహరించిన క్షణాల్లో మళ్ళీ తిరిగివద్దాం.

మళ్ళీ రావా…

అపుడపుడు మనం మనలా, మన బంధంలో ఉండలేక సతమతమయ్యే క్షణాలు మళ్ళీ మన మధ్య రాకుండా, మనం మనతో ఉండే క్షణాలు మన కోసం.. మన ప్రేమ కోసం.. మన బంధం కోసం.. మనం బ్రతుకుదాం.

మళ్ళీ రావా…

మరోసారి నా నువ్వుగా.. నీ నేనుగా.. అపుడపుడైన మన కోసం.. మనం మనలా.. మన చిలిపి అల్లరులు, కోపతాపాలు, ఇష్టకష్టాలు, సుఖసంతోషాలు, ప్రతిదీ పంచుకుంటూ బ్రతికిన ఆ రోజుల్లో కలిసి బ్రతుకుదాం.

మళ్ళీరావా.. మళ్ళీరావా.. మళ్ళీరావా..

నా.. ఆ నువ్వుగా…

మళ్ళీ మన ప్రేమ కథని,

ఆ ప్రణయ రసరమ్య కథని..

మనకి మనం మళ్ళీ మన ప్రేమ కోసం

మరింత కొత్తగా, ఇష్టంగా,

ప్రేమగా రాసుకుందాం..

మళ్ళీరావా.. మళ్ళీరావా.. మళ్ళీరావా..

నేను కోరుకునే నా నువ్వుగా…

నా ఆఖరి శ్వాస లోపు అయినా..

మళ్ళీరావా.. మళ్ళీరావా… మళ్లీ తిరిగి రావా…

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!