ఈ ప్రేమకథ ముగింపు ఏమిటో?

ఒక మనిషి ఒకేసారి ఒక్కరినే ప్రేమించగలరా?

ఒకేసారి ఇద్దరిని ప్రేమించగలరా?

ఒకేసారి ఇద్దరిని ప్రేమించటం తప్పా?

ఇది నేనే కాదు… ఎవరు సమాధానం ఇవ్వలేని ప్రశ్న…?

ఎందుకు అంటే అది అలా ప్రేమించే వాళ్ళకే తెలియాలి కాబట్టి.

“ఎందుకు ప్రతిసారి నాతో గొడవపడటం ఎంజాయ్ చేస్తారు మీరు…?” స్నేహ చిరాగ్గా అడిగింది కార్తీక్ ని.

“నా బాధ గొడవలాగా ఉందా…?” నిస్సహాయంగా అడిగాడు కార్తీక్.

“అసలు ఏంటి ప్రాబ్లెమ్…? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం వచ్చినపుడు మాట్లాడతారు లేదంటే సైలెంట్ అయిపోతారు, మళ్ళీ నేనే మీతో మాట్లాడటం లేదు అని అంటారు… ఎందుకు ఇలా మారిపోతున్నారు.” అంటుంది స్నేహ కోపంగా.

అది కోపం… అవునో, కాదో కూడా తెలియడం లేదు కార్తీక్ కి.

“ప్రాబ్లెమ్ కాదు, నిజం… నీలో వచ్చిన మార్పు గురించిన నిజం. ఆ మార్పుని అంగీకరించలేక, అలా అని నీకు దగ్గరగా ఉండలేక… దూరం అవ్వలేక నేను పడే వేదన అది…” కార్తీక్ గొంతులో బాధ.

“అంటే నేను తప్పు చేశాను అంటారా?” సూటిగా ప్రశ్న వేసింది స్నేహ.

“నువ్వే కాదు, నేను కూడా…!” నిజాన్ని చెప్పాడు.

“మనకు పరిచయం అయ్యి, అది ప్రేమగా మారుతున్నపుడు, నువ్వు నీ జీవితంలో నా కన్నా ముందే నిన్ను ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు అని ఎందుకు చెప్పలేదో తెలీదు… చెప్పకపోయినా, నేను ఇష్టం అంటూ ఎందుకు దగ్గర అయ్యావు తెలీదు… పోనీ దగ్గరయ్యావు సరే, పూర్తిగా దగ్గర అయ్యి నీకు I LOVE YOU చెప్పినపుడు కాని, తిరిగి I LOVE YOU అని నువ్వు చెప్పినపుడు కాని, ఎందుకు చెప్పలేదు… నీకు, తనకు ఇంకా నడుస్తున్న మీ ప్రేమ కథ గురించి?” తెలియని బాధలో మాట్లాడుతున్నాడు కార్తీక్.

“నేను ముందు నుండి చెబుతూనే ఉన్నా కదా నాకు ప్రేమ అంటే తెలీదు అని…” కొన్ని వందల సార్లు చెప్పిన… అదే మాట మళ్ళీ చెప్పింది స్నేహ.

“ప్రేమంటే తెలీదు… సరే మరి అతని మీద ఉన్నది ఏంటి? మరి అది ప్రేమ కాదా? ప్రేమంటే తెలియకుండానే ప్రేమ అనుకునే ఆ బంధంలో ఉన్నావా?” సమాధానం ఇవ్వదు అని తెలుసు అయినా అడుగుతున్నాడు కార్తీక్.

“నాకు ఒక తోడు… ఒక బంధం కావాలి అనుకున్నపుడు, నా ఆశల, ఊహలతో ఒక పర్సన్ కావాలి అంటే తను ఎలా ఉండాలో అలా ఉంటారు అతను… అతను నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు…”

“మరి నువ్వు…?” స్నేహ మాటలకి అడ్డు తగిలాడు కార్తీక్.

“నాకు ఆయనతో ఉండటం ఇష్టం…”

“మరి నాతో…?” అడిగాడు కార్తీక్

“మీ దగ్గర నేను నాలాగ ఉండగలను…”

“హ్మ్మ్… నీలాగా నువ్వు అంటే అర్థం?”

“మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటారు… నన్ను బాగా ప్రేమిస్తారు… నన్ను సంతోషంగా చూడాలి అనుకుంటారు… నా సంతోషమైన, బాధయినా నేను ముందుగా మీతోనే పంచుకోవాలని అనుకుంటా…”

“హ్మ్మ్… సరే, మరి నేను ఎందుకు నచ్చాను నీకు? నువ్వు కోరుకునే ఒక్కటంటే ఒక్క లక్షణం నాలో లేదు, కనీసం నేను నీ ఫ్రెండ్ అని చెప్పుకునే ధైర్యం కూడా నీకు లేదు… కాని నాతో ఏంటి ఈ బంధం…”

“తెలీదు మనది చాలా విచిత్రమైన బంధం… ఎందుకు ఏమిటి తెలీదు…”

“హ్మ్మ్….. ఒక్కటి అడగనా…” కార్తీక్ ప్రశ్న

“అడగండి…”

“నేను తప్పు చేసానా? నువ్వు అతని గురించి చెప్పిన తరువాత కూడా ఇంకా నీ లైఫ్ లో ఉండి?”

“లేదు నేనే తప్పు చేసా… ముందే ఆలోచించాల్సింది…”

“హ్మ్మ్… నిజమే… నేనూ తప్పు చేసా…, ఏ రోజు అయితే నువు నీ లైఫ్ లో నా కంటే ముందే… నిన్ను ప్రేమించే మనిషి ఒకరు ఉన్నారు అని చెప్పావో…, ఆ రోజే నేను నీ జీవితం నుండి వెళ్లిపోవాల్సింది, అప్పటికీ నేను ఈ విషయం తెలిసిన క్షణం నుండి నీకు దూరంగా ఉండటానికి ట్రై చేస్తూనే ఉన్న… నీకు దూరంగా పారిపోవాలని అనుకుంటూనే ఉన్న… కాని ఏం చేయను, నా వల్ల కాలేదు… అలా వెళ్ళాలి అని ప్రయత్నం చేసిన ప్రతిసారి… మళ్ళీ మళ్లీ నీకు దగ్గర అయ్యేవాడిని…”

“అయితే ఇపుడు ఏం అంటారు…”

“నేను కాదు నువ్వేం అంటావు…?”

“చేసిన తప్పుకు నేను బాధపడుతున్న కాని, ఎందుకో మిమ్మల్ని వదులుకోలేకపోతున్న… నేను ఎప్పుడు ఇలా లేను… మీ ఒక్కరి విషయంలోనే, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నా… మిమ్మల్ని బాధపెడుతున్న అని తెలుస్తుంది…”

“బాధ…? బాధ అనే పదం కూడా బాధపడేంత బాధని ఆల్రెడీ ఇచ్చేసావ్ నాకు మన బంధంలో… అంతకు మించి ఇంకా ఏముంటాయి…”

“అంటే?”

“అంటే? నువ్వు నా పక్కన కూర్చుని, అతని గురించి చెప్పిన క్షణం… ప్రేమించే ఏ మనిషికి అయిన అంతకుమించిన బాధ ఏముంటుంది? మీ ఇద్దరికీ గొడవ అయ్యి అతను నీతో మాట్లాడటం మానేస్తే నేను నిన్ను ఓదార్చి… నీ ఫోన్ నుండి అతనికి కాల్ చేసి, నీతో మాట్లాడించి… పక్కన ఉండటం… అంత కన్నా ఏముంటుంది? ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి మన మధ్య… అయినా ఇంకా ఎందుకు నవ్వుతూ భరిస్తూ ఉన్నానో తెలుసా…ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావు అనే భయం… నువ్వు బాధపడటం చూడలేక…”

“అన్ని తెలిసే కదా నాతో ఉన్నారు…”

“తెలిసాక కాదు… తెలియక ముందు ఉన్న…, తెలిసిన క్షణం నుండి ఉండలేక, వదలలేక నరకం చూస్తూ ఉన్న…”

“అంత కష్టంగా ఎందుకు ఉండటం… వదిలేసి ఉండొచ్చు కదా…”

“వదిలేసి ఉండొచ్చు కదా… అదే మాట నాతో అన్నట్టు, అతనితో అనగలవా, లేక అదే మాట నీతో అంటే తట్టుకోగలవా?”

“ఇపుడు బాగానే ఉన్నాం కదా… మనం”

“బాగానే ఉన్నామా? కాదు… లేదు… లేము… ఇంతకుముందు మన మధ్య ఉన్న మాటలు ఇప్పుడు ఉన్నాయా? ఆ ఇష్టం… ప్రేమ… ఇప్పుడు ఉన్నాయా? నీ మెసేజెస్ కోసం ఎదురు చూడాలి, నీ కాల్స్ కోసం ఎదురు చూడాలి… కలవాలి అంటే కుదరదు…..”

“నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయవద్దు… నా మీద ఫీలింగ్స్ వద్దు… ఎమోషన్స్ వద్దు….. ప్లీజ్ అర్థం చేసుకోండి…” అంటావు.

“నీకు అర్థం కావడం లేదా… నువ్వు ఇలా అర్థం చేసుకో అన్నపుడల్లా… నిన్ను అర్థం చేసుకోవటానికి ట్రై చేసి చేసి నా మనసుని నేను అర్థం చేసుకోవటం మరచిపోయా!”

“మామూలుగానే ఉన్నాము కదా… మాట్లాడుకుంటూ…”

“హా హా హా… మామూలుగానే మాట్లాడుకుంటూ… గ్రేట్… ఎప్పుడూ…? వందల మెసేజెస్ పంపుకునే రోజు నుండి, రోజు మొత్తంలో పది మెసేజెస్ పంపుకునే స్టేజ్ కి వచ్చాక, ఇంకా మాట్లాడుకుంటున్నాం అని ఎలా అంటున్నావు…, సరే వర్క్ టెన్షన్లు పనులు బిజీ అంటావు, కాని ఎన్ని రోజులు?”

“మీరే నాకు మెసేజెస్ చేయటం తగ్గించారు…”

“తగ్గించలేదు… అలా చేసింది నువ్వు… అదెందుకు మరిచిపోయావు?”

“సరే ఇవన్నీ కాదు నన్ను నిజంగా ప్రేమించాను అంటే నా కోసం, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండలేరా?”

“నన్ను ప్రేమించిన నీ కోసం ఏదైనా చేస్తా…, ఇపుడు ఉన్న నీ కోసం అయితే నాకు అసలు నువ్వే అక్కరలేదు…”

“ప్లీజ్… అర్థం చేసుకో కార్తీక్… నాకు నిన్ను వదులుకోవాలని లేదు…” స్నేహ గొంతులో బాధ…

“మన మధ్య జరిగింది ఏదైన అవ్వనివ్వండి… మీరు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర ఏ సమాధానం లేదు… నాతో గొడవ పడండి, తిట్టండి, కాని రేపు మళ్లీ నేను మీతో మాట్లాడతా… అది నా స్వార్థం, అవసరం ఏదైన అనుకోండి… కాని మీరు నా లైఫ్ లో ఉండాలి, మిమల్ని వదులుకోలేను…”

“నా ప్రేమ అక్కరలేదు, కాని నేను కావాలి…”

“నాకే అర్థం కావడం లేదు… ఇంకా మీకు ఏం సమాధానం ఇవ్వను కార్తీక్, నిజమే మీరు ప్రేమ చూపిస్తే… వద్దు అనేది నేనే, మళ్ళీ అదే ప్రేమ కోరుకునేది నేనే ,మిమల్ని దూరం పెట్టేది నేనే, కాని మళ్ళీ దగ్గర అయ్యేది నేనే… వద్దు అనేది నేనే… కాని మీరు కాస్త దూరం అయితే అన్ని మర్చిపోయి మీతో మాట్లాడేది నేనే… మీ విషయంలో నేను ఎపుడు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉన్న… మీకు దగ్గరగా ఉండలేక… దూరంగా బ్రతకలేక… మిమల్ని బాధ పెడుతూ… నేను బాధపడుతూ… నా జీవితంలో నేను చేసే అతి పెద్ద తప్పు… మీ విషయం, అని తెలిసి ఆ తప్పు చేయకుండా ఉండలేకపోతున్న… ఏం చేయమంటారు…” నిస్సహాయంగా అంది స్నేహ

“నిజమే… తప్పు… మన బంధం తప్పు… నీ జీవితంలో ఒకరు ఉండగా… నీతో ప్రేమ కాదు కదా… అసలు ఎలా అయినా ఉండటం తప్పే… నేను నీ జీవితం నుండి వెళ్లిపోతే ఏ సమస్య ఉండదు…” కార్తీక్ మాటలు తడబడుతున్నాయి.

“అది కాదు కార్తీక్ ప్లీజ్…” స్నేహ కళ్ళలో కన్నీరు.

“సరే వెళ్ళిపోతా అన్నాను కదా, ఇంకా ఏం చేయమంటావు…?”

“నా లైఫ్ లో మీరు ఉండాలి… ప్లీజ్…”

“ఉండాలి… కాని ఎలా?”

“స్నేహితుడిగా…..”

“ఫ్రెండ్ గానా? నా వల్ల కాదు…”

“అది కాదు కార్తీక్ ఇంతలా నేను అడుగుతున్న అంటే అర్థం చేసుకో…”

“ఏం అర్థం చేసుకోవాలి…? నువ్వు నన్ను ప్రేమించింది నిజం… అది నీకు నువ్వు ఒప్పుకోవటానికి భయం… ఎందుకు అంటే అలా ఒప్పుకున్న క్షణం, నీకు అతని మీద ఉన్నది ప్రేమ కాదు అని… నీకు నువ్వు ఆక్సెప్ట్ చేయాలి, అలా చేశావు అంటే మళ్ళీ నీకు ఈగో…నీ తప్పు నువ్వు ఒప్పుకోలేవు కదా… ఎందుకు అంటే అతను నువ్వు కోరుకునే లక్షణాలు ఉన్నవాడు… నేను నీ మనసు కోరుకునే లక్షణాలు ఉన్నవాడిని… మీ ఇద్దరి ప్రేమ… మీ ఆలోచనలు, ఆశలు, కోరికలు, లెక్కల నుండి పుట్టింది… మన ఇద్దరి ప్రేమ మన మనసుల నుండి పుట్టింది… ఇదే తేడా… అతన్ని వదులుకోలేవు… ఒకవేళ వదులుతా అని నువ్వంటే అతను అర్థం చేసుకోడు…

కాని ఎలా ఉన్న… ఏం చేసిన… అన్ని అర్థం చేసుకుని నువ్వెలా ఉన్న సంతోషంగా ఉంటే చాలు అనుకుని ఉండేది నేను… కాబట్టి నన్ను అర్థం చేసుకో అని అడుగుతున్నావు కదా…? సరే అర్థం చేసుకుంటా… ఎలా ఉండాలి చెప్పు…..” కార్తీక్ అడిగాడు.

“ఫీలింగ్స్, ఎమోషన్స్… బాధలు… గొడవలు… ఆశ… నిరాశ…, అప్సెట్…, ఇలాంటివి ఏమి లేకుండా… మనకి కుదిరినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉందాం. ప్రతి బంధంలో అవి ఉంటాయి… మన బంధంలో అవి వద్దు… నేను నాలా నీ దగ్గర ఉంటా… నువ్వు నీలా ఉండు… నాకో మిర్రర్ లా బిహేవ్ చెయ్ చాలు కార్తీక్…”

“హా హా హా… అసలు అవేమీ లేని ఒక మనిషి, ఒక బంధం వుంటుందా?”

“ఏమో నాకు తెలీదు… కాని నాకు మీతో బంధం ఒక స్పెషల్ బంధంలా కావాలి… మీరు నా జీవితంలో ఉండాలి అంతే…..”

“హ్మ్మ్… ఉంటా… నీకు నచ్చినట్టు… నీకు కావలసినట్టు… నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే ఉంటా… ఎందుకో తెలుసా… నన్ను వదులుకోలేక, నాకు దూరం అవ్వలేక… ఇంకా నన్ను నీ జీవితంలో ఉంచుకోవాలి అని ట్రై చేస్తున్నావు చూడు… అందులో నీకు నాపై ఉన్న ప్రేమ కనపడుతుంది…”

“థాంక్స్ కార్తీక్…”

“హా హా హా… థాంక్స్… నేనే నీకు చెప్పాలి… ఇప్పటికైనా నన్నే నువ్వు మనస్పూర్తిగా ప్రేమిస్తున్నావ్ అని ఒప్పుకున్నందుకు… చూద్దాం… మన కథ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుంది అనేది…”

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!