మాతృదేవోభవ

మాతృదేవోభవ

రచన: నాగు వెల్పూరి

ప్రశాంత వాతావరణంలో ఆ రాత్రి నిండు గర్భిణీలు తమకు పుట్టబోయే బిడ్డల కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ అప్పుడప్పుడు వస్తున్న నొప్పులను పంటితో అదిమి పడుతూ ఎన్నెన్నో ఆశలతో బిడ్డల రూపురేఖలు తలుచుకుంటూ నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా అలజడి రేగింది.
విశాఖపట్నంలోని ‘ఘోష ఆసుపత్రి’లో రాత్రి సరిగ్గా ఒంటిగంట సమయానికి నిండు గర్భిణీ ‘ప్రమీల’కు ఒక్కసారి విపరీతంగా పురిటి నొప్పులతో మెలికలు తిరిగి పోతూ ఉండటం చూసిన ‘డాక్టర్ రమాదేవి’గారు ప్రమీలను ‘డెలివరీ రూములోకి’ తీసుకువెళ్లారు!, అయితే ఇంకా గంట రెండు గంటల సమయం ఉండటంతో నర్సు బయట కాలు కాలిన పిల్లిలా ఎంతో టెన్షన్ తో అటు ఇటు తిరుగుతున్న ‘కనకారావు’ని పిలిచి ‘ఏవండీ ! మీ భార్యకి ప్రసవ సమయం ఆసన్నమైంది, మీరు వెళ్లి ‘kgh’ ఆస్పత్రి దగ్గర ‘డే అండ్ నైట్ మెడికల్ ‘ షాపు ఉంది, తొందరగా మందులు తీసుకురండి, అనీ ఒక కాగితం ఇచ్చింది.
భార్య అరుపులు కేకలు వింటున్న కనకారావుకి “బాబోయ్, ఇకముందు పిల్లల్ని కనకూడదు, బంగారం లాంటి నా భార్య పడుతున్న బాధలు తలుచుకుంటూ ‘జన్మ వైరాగ్యం’ చెందుతూ జీవితంలో ఒక బిడ్డ చాలు, ‘ఆ స్త్రీకి అదే పునర్జన్మ’ అనుకుంటూ ఎన్నడూ లేనంత వేగంగా బైక్ మీద మందుల కోసం వెళ్ళాడు భర్త కనకారావు.
అమిత వేగంతో వెళ్లి మందులు తెచ్చి నర్సుకు ఇస్తూ.. ‘సిస్టర్ ఎలా ఉంది? నా భార్య’, అని ఆత్రంగా అడిగాడు.
‘ఏం పర్వాలేదు! మీరు టెన్షన్ పడకుండా ఎక్కడైనా ఒక కాఫీ తాగి రండి, అంతా బాగానే ఉంటుంది; అని నవ్వుతూ చెప్తున్న సిస్టర్ కు నమస్కారం చేశాడు కనాకారావు.
ఇంతలో ప్రమీల పడుతున్న బాధను తలుచుకుంటూ ‘ఆహా! ప్రకృతి ఎంత విచిత్రం, ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన తరుణంలో ‘మృత్యు ఘడియలు’ దాటుకుంటూ, మరో జీవికి జన్మనివ్వడం నిజంగా! ఎంత నాస్తికుడైన ఆ సమయంలో భగవంతుని ప్రార్థిస్తాడు,! అలా ఆలోచిస్తున్న కనకారావుకి ఒక తియ్యని కబురు చెబుతూ సిస్టర్ వచ్చింది.
‘మీకు పండంటి మగ బిడ్డ పుట్టాడు మీరిక నిశ్చింతగా ఉండొచ్చు’! అని అనేసరికి కనకారావుకి ఏనుగు మీద అంబారి ఎక్కినట్టుగా ఆనందం కలిగింది.
పుట్టిన బిడ్డను చూసిన కనకారావు ఆనందంతో భార్య తల మీద నిమురుతూ.. ‘నీ కోరిక తీరింది కదా!’ అంటూ అనేసరికి ప్రమీల కూడా గర్వంగా భర్త పక్క చూస్తూ ‘చూడండి ,అంతా మీ పోలికే, ఇక మీరు ఇంటికి వెళ్లి మన బంధువులకు చెప్పి కాసేపు పడుకోండి, పాపం రాత్రంతా వేచి ఉన్నారు! అంటూ అంటున్న భార్య చేయి రాస్తూ.. ‘అలాగే లే, ముందు నువ్వు బాగా రెస్ట్ తీసుకో’, అని చెప్తున్న సమయంలో..
నర్సు వచ్చి ‘ఏమండీ! మిమ్మల్ని డాక్టర్ గారు ఒకసారి రమ్మన్నారు’, అనేసరికి ‘పదండి’, అంటూ డాక్టర్ రమాదేవి గారి దగ్గరికి వెళ్లారు.
డాక్టర్ గారు రూమ్ లోకి వెళ్లి ‘నమస్తే అమ్మ! మీకు ముందుగా కృతజ్ఞతలు, ప్రసవ సమయంలో ఏ కష్టం రాకుండా నా భార్యను కాపాడినందుకు’,అని నమస్కారం పెట్టేసరికి,
‘అయ్యో! ఇది మా దినచర్య పర్వాలేదు కూర్చుండి’, అంటూ అసలు విషయం బయట పెట్టింది డాక్టర్ రమాదేవి.
‘మీ బిడ్డ ఆరోగ్యం చాలా బాగుంది, బరువు కూడా కరెక్ట్ గా ఉంది, మరేం లేదు.. మీ బాబుకి చెవుల దగ్గర కొంచెం ఫార్మేషన్ సరిగా లేకపోవడం వల్ల రెండు చెవులు పైన ‘డొప్పలు’ ఏర్పడలేదు, కానీ వినికిడి మాత్రం అందరిలాగే బాగానే ఉంది, కొంచెం వయస్సు వచ్చిన తర్వాత చెక్ చేద్దాం! మిగతా అన్ని అవయవాలు చాలా బాగున్నాయి, మీరు కంగారు పడనవసరం లేదు!’ అని డాక్టర్ గారు చెప్పేసరికి, కనకారావుకి గుండెల్లో రాయి పడినట్లే అయింది. వెంటనే గాభరాగా
‘డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఏమి చేయలేమా, చెవి డొప్పలు లేకపోతే వాడి భవిష్యత్తులో ఎంతో అవమానం, హేళనతో మనస్థాపం చెందుతాడు, కనుక వినికిడి సమస్య బాగానే ఉంది అంటున్నారు, కాబట్టి మన ఇప్పుడు ఏం చేయాలి?’ అని ఆత్రుతగా అడిగేసరికి..
‘ఏం పర్వాలేదు! అండి, బాబుకి కొంచెం వయసు వచ్చేసరికి చెవి డొప్పలు వాటంతట అవే పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, కాకపోతే అప్పుడు చూద్దాం, మీరేం కంగారు పడనవసరం లేదు’, అంటూ అనేసరికి కొంచెం ధైర్యం వచ్చింది కనకారావుకి.
‘అలాగే డాక్టర్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ దగ్గరికి తీసుకు వస్తాను, మీరే ఏదైనా చేసి మా బాబు భవిష్యత్ కాపాడండి!’ అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
ఈ విషయం తెలిసిన ప్రమీల కళ్ళనీళ్ళు పెడుతూ, ‘అయ్యో ఎలాగండి? బాబును చూసిన ప్రతి వారు అదే విషయం అడుగుతారు, వాడు స్కూల్ కి వెళ్ళినా స్నేహితులు ఆటపట్టిస్తారు’, అంటూ బాధతో అనేసరికి,
‘ఏం లేదే! కంగారు పడకు, డాక్టర్ గారు మన బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక్క చెవులు మాత్రమే రాలేదు, వాడు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేస్తాయి, అంతగా రాకపోతే అప్పుడే కాస్మటిక్ సర్జరీ చేసి చెవి డొప్పలు అమరుద్దాము, ఇది చిన్న లోపమే కొంచెం మనం భరించాలి’ అంటూ భార్యకు ధైర్యం చెప్పారు కనకారావు గారు.
అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బాబు పెద్దవాడై స్కూల్ కి వెళ్ళినప్పుడు జుట్టు పెద్దగా ఉంచడం స్కూల్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో హెయిర్ కట్ చేయించిన తర్వాత స్నేహితుల హేళనలతో అవమానం చెందుతూ రోజు తల్లిదండ్రుల వద్ద బాధపడుతూ ఉండడం చూసిన ప్రమీల కూడా బెంగపెట్టుకుని అనారోగ్యం పాలైంది.
అసలే బాబు టెన్త్ క్లాస్ కు వస్తున్నాడు చెవులు పెరగలేదు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం కనబడక సరైన మంచివార్త చెవి డొప్పలు కుదిరాయని డాక్టర్ రమాదేవి గారు కబురు పంపిస్తారు.. ఏమోనని ఎదురు చూస్తూ ఇన్నాళ్లు గడిచిపోయింది కానీ నిరాశే మిగిలింది.
ఆరోజు నిఖిల్ స్కూల్ నుంచి రాగానే ‘అమ్మ!’ అని పిలుస్తూ తిరిగేసరికి అక్కడే ఉన్న నాన్న గారు,
‘ఒరేయ్ నిఖిల్ అమ్మకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో జాయిన్ చేశాను, నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి చదువుకో, అమ్మా రేపు వచ్చేస్తుంది’ అంటూ నాన్నగారు చెప్పేసరికి ఆశ్చర్యపోతూ
‘అమ్మకు ఏమైంది నాన్న ?’ అంటూ కంగారుగా అడిగాడు నిఖిల్.
‘ఏం లేదు ! నాన్న అమ్మ రెండు రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతుంది, అందుకనే డాక్టర్ గారు రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు, మరేం పర్వాలేదు, మన బంధువులు వస్తారు, నువ్వు మామూలుగా స్కూల్ కి వెళ్ళిపో, నేను అమ్మను తీసుకొని వచ్చేస్తాను!’ అంటూ కొడుకును ఓదార్చి ఆస్పత్రికి వెళ్లి పోయారు కనకారావు గారు.
ఆ మర్నాడు సాయంత్రం ప్రమీల ఇంటికి వచ్చేసరికల్లా నిఖిల్ ఆనందంతో ‘అమ్మ ఎలా ఉంది? తగ్గిపోయిందా, పడుకో’, అంటూ ఎంతో ప్రేమగా తల్లిని పలకరిస్తు మంచం మీద పడుకోబెట్టాడు.
అలా ఒక వారం రోజులు గడిచేసరికి ప్రమీల మామూలు మనిషి అయిపోయింది. కొడుకుని స్కూలుకి పంపిస్తూ, అన్ని పనులు తనే చేసుకుంటూ హుషారుగా ఉంది, ఆరోజు నైన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయాయి, ఎండాకాలం సెలవులు, సరిగ్గా అదే సమయానికి ‘డాక్టర్ రమాదేవి’ గారు ఫోన్ చేసి..
‘మీ అబ్బాయిని ఆసుపత్రిలో జాయిన్ చేయండి, ఒక ఇయర్ స్పెషలిస్ట్ వచ్చారు ఆయన ‘కాస్మెటిక్ సర్జరీ’ చేసి బాబుకి 2 చెవి డొప్ప లు అమరుస్తారు’, అన్న వార్త తెలిసేసరికి తల్లిదండ్రులిద్దరూ ఆనందంతో కొడుకుకు చెప్పి.. ‘నాన్న! నీకు ఎవరో ఒక దాత రెండు చెవి డొప్పలు దానం చేశారు, అది నీకు అమరుస్తారు, నీకు ఇకముందు చెవులు లేవు, అని ఎవరు ఎగతాళి చేయరు, నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది’, అని చెప్పగానే నిఖిల్ కి.. జాక్పాట్ కొట్టిన అంతపని అయ్యింది, ‘అలాగే !అమ్మ నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నాకు చెవులు వస్తాయంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు, పదండి !’ అని ఆ రోజే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
‘వేయి దేవుళ్ళకి ‘మొక్కుకున్న నిఖిల్ తల్లిదండ్రులు అన్ని అనుకున్నట్లు గానే ఆపరేషన్ సక్సెస్ అయి, అసలు మామూలుగా చెవులుతోనే పుట్టాడా!! అన్నట్టుగా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. నిఖిల్ కూడా చిన్న వాడు అవడంతో బలమైన మందులతో, ఒక్క పది రోజుల్లోనే కోలుకొని స్కూలుకి వెళుతుండటం , హేళన చేసిన వాళ్ళందరికీ నోరుముయించడం జరిగింది.
నిఖిల్ అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రయోజకుడు అయ్యి, జీవితంలో స్థిరపడ్డాక మంచి సాంప్రదాయం చదువు ఉన్న అఖిల నిచ్చి పెళ్లి చేశారు.
కొడుకు కోడలు ఎంతో సందడిగా సరదాగా కాపురం చేస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఇద్దరికీ అంతులేని ఆనందం వెల్లివిరిసింది, ఆ రోజు ఎందుకో ప్రమీల గారికి బాగా సుస్తీ చేసి వృద్ధాప్యం మీద పడటంతో అనారోగ్యం పాలై ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది, కొడుకు కోడలు దగ్గరుండి అన్ని చూసుకోవడంతో క్రమక్రమంగా కోలుకుంటూ ఉన్న సమయంలో, నిఖిల్ తల్లి దగ్గరే ఉండి చూసుకుంటున్న సమయంలో మధ్యాహ్నం తల్లి మగతగా పడుకుంది, ఆ క్రమంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో జాగ్రత్తగా ఉన్న సమయంలో కూడా ఆమె జుట్టు చెదిరిపోయి చెవులు లేకుండా ఉండటం, చూసి ఆశ్చర్యపోతూ రెండు పక్కల అమ్మ చెవులు లేకపోవడం చూసి తన భార్యను పిలిచి ఏడుస్తూ, చూడు! అఖిల అమ్మ ఎలా ఉన్నారు? అంటూ చూపించేసరికి కన్నతల్లిలా చూసుకునే అత్తగారికి చెవి లేకపోవడం చూసి ఒకింత ఆశ్చర్యపోతున్న సమయంలో మావయ్య గారు వచ్చేసారు, నిఖిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి,
‘నాన్నగారు ఏమిటిది ? అమ్మ చెవులకు ఏమైంది?’ అంటూ ఏడుస్తూ అడిగేసరికి..
‘ఏం చెప్పను రా! మీ అమ్మ అందరి దగ్గర ప్రమాణం చేయించుకుంది, నీ చిన్నప్పుడు నీకు చెవులు’ ఫార్మేషన్’ కాకపోవడం వల్ల నీ భవిష్యత్తులో అవమానాలు, హేళనలు, ఉండకూడదని, చెవులు వల్ల నీకు ఏ ఇబ్బంది రాకూడదని, నీకు కొంచెం వయసు వచ్చాక డాక్టర్ గారు వద్దంటున్నా వినకుండా నీమీద ఎనలేని ప్రేమతో తన చెవులను తీసి నీకు అతికించేటట్లు ‘కాస్మెటిక్ సర్జరీ’ చేయించి నీకు ఎవరో దాత ఇచ్చారని అని చెప్పి, నీకు అతికించారు, అందువల్ల నువ్వు ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం మీ అమ్మ త్యాగమే, ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచుతూ, నీకు మన బంధువులకు చివరికి కోడలికి కూడా ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఎందుకుంటారు? జడ వేసుకోవచ్చు కదా! అన్న మాటలను నవ్వుతూ సహిస్తూ ఇదంతా ఫ్యాషన్ అని చెప్పింది, కానీ జుట్టు విరబోసుకున్న కారణం ఎవరికీ తెలియని రహస్యం, ఆమెకు రెండు చెవులూ లేవని తన కొడుక్కి త్యాగం చేసినట్లు ఒక్క నాకు తప్ప మరెవరికీ తెలియదు, ఇది రా అమ్మ ప్రేమకి,త్యాగానికి కి నిలువుటద్దం మీ అమ్మే!!’ అని చెప్పగానే కొడుకు కోడలు అమాంతంగా తల్లి కాళ్లు పట్టుకుని బోరున విలపించారు.
అప్పటికి భర్త చెప్తున్నా మాటలను వద్దు , అని వారిస్తున్నా చెప్తున్న భర్తను ఎంతో గౌరవంగా నమస్కారం పెడుతూ, “బాబు ఇంత జరిగినా ఎంతో సహనంతో, మీ నాన్న గారి సహకారంతో నీ భవిష్యత్తు కోసం చేశాను. ఇందులో గొప్ప ఏమీ లేదు’ అన్నది.
ఆ కన్నతల్లిని చూస్తూ మనసులోనే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా చప్పట్లు చరిచారు.
నిఖిల్ ఎంతో ఉద్వేగంతో ‘అమ్మ, నీ గుప్త దానం నా భవిష్యత్తుని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దింది, నేను నీకు కూడా చెవులకు కాస్మెటిక్ సర్జరీ చేయించి నా రుణం తీర్చుకుంటా, అయినా ఈ జన్మంతా ఎంత చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము, నా శాయశక్తులా ప్రయత్నించి నీకు చెవులు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను !’ అని అంటూ తల్లి పాదాలు పట్టుకున్నాడు నిఖిల్.
“ఒరే బాబు, నిన్ను కన్నందుకు ఈ క్షణం గర్వపడుతున్నాను, ప్రతి కొడుకు నీలాగే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఒక్క ధనమే కాకుండా జీవితంలో’ ప్రేమ, త్యాగం ‘అనే రెండు పదాలు ప్రతి కుటుంబం అలవరచుకోవాలి, తద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమం లో, వదిలేసి వచ్చే వాళ్ళకి బుద్ధి రావాలి !! దీనివల్ల కుటుంబ పరువు ప్రఖ్యాతులు, భారతదేశ సంస్కృతికి అనుగుణంగా మారి ప్రపంచానికి మన భారతదేశం ఆదర్శంగా నిలవాలి !!!’ అంటూ ముగించిన ప్రమీల మాటలను వినగానే అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు కరతాళధ్వనులతో ఆస్పత్రి మొత్తం మారుమోగిపోయింది.
****
“ఈ కథలో సైన్స్ పరంగా తప్పులుంటే సరిదిద్దగలరు,ఇది కేవలం కల్పితం మాత్రమే!!”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!