ఏడు గొందుల సందు

(అంశం:”అల్లరి దెయ్యం”)

ఏడు గొందుల సందు

రచన:రాధ ఓడూరి

తన్వి, నైనీ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. తరగతి గదిలో ఎక్కడ కూర్చున్నా జతగా కూర్చుంటారు. తన్వి ఆ బడిలో చేరి వారం రోజులైంది. అందుకే ఆ చుట్టుపక్కల పరిసరాల మీద అవగాహన లేదు.

ఒకరోజు…

“తన్వి! త్వరగా లంచ్ చేసి దొంగా పోలీస్ ఆడదామే!” లంచ్ బాక్స్ తెరుస్తూ అంది నైనిక.

“అమ్మో! స్కూల్లోనా!? మేడం చూస్తే ఊరుకోదు. నేను ఆడను బాబూ!”

నైనిక నవ్వుతూ తన్వి చెవిలో గుసగుసగా “ఇక్కడ కాదు… మన స్కూల్ పక్కనే ఏడు గొందుల సందు ఉంది. అక్కడ ఆడుకుందాం.”

“ఎవరైనా టీచర్ కి కంప్లైంట్ చేస్తే!?”

“ఎవ్వరూ చేయరు తన్వి. ఎందుకంటే అక్కడికి ఎవ్వరూ రారు”.

“ఎందుకని రారు నైనీ!?”, కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది”.

తన్వి మాటలు విని కూడా పట్టించుకోకుండా గబగబా లంచ్ బాక్స్ లోనిది తినేసి ఎలాగైతేనేం ఏడు గొందుల సందు వైపు తీసుకొచ్చింది.

“తన్వి! ముందుగా ఇద్దరం రెండు చేతులు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ ఒక పాట పాడుదాం సరేనా!”

“గుండ్రంగా తిరగడం మైతే వచ్చు. కానీ…పాట!?”

“అబ్బా! చెట్టు కింద దెయ్యం పాటనే”

“ఓ!అదా వచ్చు. పదా పాట పాడుతూ ఆడుకుందాం”.
అంటూ తన్వి నైనిక చేయి పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ…
తన్వి పెద్దగా గొంతెత్తి “చెట్టు కింద దెయ్యం..”అని అనగానే…

నైనిక కూడా అదే గొంతుకతో ” నాకేం భయ్యం!” అంది

అలా వాళ్ళు “చెట్టు కింద దెయ్యం…. నాకేం భయ్యం, చెట్టు క్రింద దెయ్యం…నాకేం భయ్యం” అని ఏడు సార్లు పాడారో లేదో వారికి ఒక్కసారిగా

తన్వి…. తన్వి…. తన్వి అని మూడు సార్లు గట్టిగా రీసౌండ్ తో కూడిన అరుపులు వినబడినాయి.

ఆ పిలుపుకి పిల్లలిద్దరూ బెదిరిపోయి భయం తో తల పైకెత్తి చూసారు.

ఆకాశాన్ని తాకేటట్లుగా వేప, మర్రి చెట్లన్నీ ఏపుగా పెరిగాయి. ఆ చెట్ల ఆకుల మధ్య నుంచి మాత్రమే ఆకాశం కనపడుతుంది.

తల దించి చుట్టూ చూసారు. ఎవ్వరూ లేరు. అంతా నిర్మానుష్యం, నిశబ్దం. ఆ చిన్న పిల్లలకి అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయం వేసింది.

నైనిక కి వాళ్ళ తాత చెప్పిన మాటలు వెంటనే గుర్తుకు వచ్చాయి.

‘నైనీ! ఆ ఏడు గొందుల సందులలో మధ్యాహ్నం పూట వెళ్ళకండి అల్లరి దెయ్యాలు ఉంటాయి జాగ్రత్తా అని’

వెంటనే నైనీ భయంతో తన్వీ చేయి పట్టుకొని “సారిరా! ఇంకోసారి ఇక్కడికి రావద్దు. ఇక్కడ మధ్యాహ్నం పూట దెయ్యాలు ఉంటాయని, ఈ సమయంలో వచ్చిన వారిని మాత్రమే ఏడిపిస్తాయని మా తాత చెప్పాడు. నేను తన మాట వినకుండా నిన్ను కూడా తీసుకొచ్చాను” అనగానే

తన్వి భయంతో స్కూల్ వైపు పరిగెటిట్టింది…నైనీ చేయి పట్టుకొని.

ఇద్దరూ రొప్పుతూ క్లాసులో కొచ్చి కూర్చున్నారు. క్లాస్ టీచర్ ఇంకా రాలేదు. అందుకే మిగిలిన పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు.

ఇంతలో నవ్య అనే అమ్మాయి నైనీ పక్కనే కూర్చుని ” మరే “ఏడు గొందుల సందులో ఆడుకుందామా” అని అడిగింది.

“మా ఇంట్లో ఆటలంటే తిడతారు” అంటూ ఇద్దరు ఏక కంఠంతో చెబుతూ పుస్తకాల సంచి నుంచి తెలుగు నోట్స్ తీసారు.

ఆ మాటలేవో నవ్య మెుహం చూసి చెప్పి ఉంటే ఆమె మెుహం లోని అల్లరి నవ్వు ని చూసైనా వారికి అర్ధమై ఉండేడి.

నవ్య ఏండు గొందుల సందు చివర ఉంటుంది. లంచ్ టైం లో భోజనానికి వచ్చినప్పుడు నైనీ, తన్వి లను చూసి “తన్వి, తన్వి” అని అరుస్తూ అల్లరి పట్టించింది.

నవ్యకీ తెలీదు రీసౌండ్ చేసింది నిజమైన ఏడు గొందుల సందు లోని దెయ్యమని.

*సమాప్తము*
************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!