ఎంత పనయింది

ఎంత పనయింది

రచన::మంగు క్రిష్ణ కుమారి

                      “ఉషా! చంటి పిల్లతో ఉన్నావు. తెలియనివి, రానివి చేయకు. రాణీ మీద ప్రయోగాలు చేయకు” తల్లి సుందరి ,ఉష పాప తో తనింటికి వెళుతుంటే మళ్ళా చెప్పింది.

ఉష ఓసారి రాణీకి కాటుక పెట్టినప్పుడు చెయ్యి కడుక్కోకుండా పెట్టింది. పాప చాలా సేపు ఏడిచింది. అప్పుడు మొదటి సారి ‌పాపని ఎలా చూసుకోవాలో పెద్ద క్లాస్ పెట్టింది ఆమెతల్లి. చెప్పింది చంటిదాని కోసం కాబట్టి ఉష నోరు మెదపలేదు. ఉష వేళ్ళ అమరికలో కాస్త పట్టు తక్కువ.

ఇప్పుడు రాణీకి  ఎనిమిదో నెల. భర్త బ్యాంక్ ఉద్యోగి. ఇది వరకూ ఎక్కడకైనా స్కూటర్ మీద  వెళ్ళేవారు. భార్యకి పాపని ఎత్తుకొని స్కూటర్ మీద కూచోడం వచ్చో రాదో అని భయపడి ఆటోలో వెళదాం అంటున్నాడు భర్త రాజేష్.

రాణీ కేరింతలు నేర్చింది. మెల్లి మెల్లిగా పాకుతొంది. రాజేష్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ బాబు ఏడాది పుట్టిన రోజుకి సాయంకాలం  కేక్ కటింగ్ దగ్గరనుంచీ నైట్ డిన్నర్ కి కూడా పిలిచేరు. ఉషని ఆటోలో రమ్మన్నాడు రాజేష్.

ఉష ఒప్పుకోలేదు. “ఇంత కన్నా చిన్న పిల్లలని వాళ్ళమ్మలు వళ్ళో కూచో పెట్టుకొని స్కూటర్ ల మీద వెళుతున్నారు.వచ్చేసరికి ఏ వేళవుతుందో, ఫరవాలేదు. మనం మీ స్కూటర్ మీదే వెళదాం” అంది.

దర్జాగా మొగుడి వెనక కూతురిని ఎత్తుకొని కూర్చొని అందరూ చూస్తుంటే, రాణీని ఎత్తుకొని దిగాలనే ఆశ చంపుకో లేకపోయింది.

రాజేష్ కి తప్పలేదు. ట్రాఫిక్ తక్కువ గా ఉండే టైమ్‌ లో‌ బయల్దేరి వెళ్దాం అన్నాడు. ఉష రాణీని తయారు చేసింది. దానికి కావలసినివన్నీ సర్దేసింది. దానికి ఫుల్ డ్రెస్ వేసి టోపీ‌ పెట్టింది. మహదానందంగా భర్త వెనకాల స్కూటర్ ఎక్కి పాపని వళ్ళో కూచో పెట్టుకొని కూచుంది.

రాజేష్ కి చాలా భయం.  తనకి  భార్యా కూతురూ కనపడరు.  అందుకని మెల్లిగా నడుపుతూ మెయిన్ రోడ్ కాకుండా చిన్న సందులోంచి తీసుకెళ్తున్నాడు.  ఇలా బయటికి రావడం కొత్తేమో రాణీ చాలా హుషారుగా ఆసక్తి గా చూస్తున్నాది. ఉష కూడా రిలాక్స్ అవుతూ పాపని పట్టుకోవడం మీదే దృష్టి ఉంచుతోంది.

సందు తిప్పడంలో‌ కాస్త పెద్ద సందులోకి వచ్చేరు. దూరంగా గేదెలు వస్తూ కనిపిస్తే బండి కాసేపు ఆపుదాం అని రాజేష్ కాస్త పక్కకి తీయడం రాణీ అట్నించి గంప నెత్తి మీద పెట్టుకొని వస్తున్న  ఆవిడని చూసి ఇంతెత్తున దుమికింది. ఉష చేతి పట్టు తప్పి రాణీ కింద పడ్డది. ఉష కెవ్వుమని కేక పెట్డింది.

రాజేష్ గబుక్కున బండి ఆపేడు. ఏ దేవుళ్ళు దీవించేరో, బండీ నెమ్మదిగా నడపడం రాణీ పడ్డ దగ్గర చాలా ఎండు గడ్డి ఉండడం కొంత మేలు చేస్తే “ఓలమ్మో! పిల్ల పడిపోనాది” అంటూ ఒకామె చటక్కున రాణీని ఎత్తుకుంది. అప్పటికే రాణీ గుక్క పట్టేసింది.ఏడుస్తూ ఉష పాపని అందుకుంది. రాజేష్ గాభరాగా వచ్చేడు.గంపతో వస్తున్న ఆవిడ గంప దింపి

” అమ్మో పిల్లకేటవలేదుకదా! అమ్మా! ఎదరగా శామలమ్మగారి ఆస్పత్రి ఉంది. పిల్లల డాటరమ్మే! గమ్మనెల్లండి” అంది

రాజేష్ గబ గబా “ముందు పద ఉషా” అని రాణీని ఎత్తుకొని ఎదురుగా ఉన్న డాక్టర్ శ్యామలా క్లినిక్ లోకి వెళ్ళాడు. నిజానికి అది డాక్టర్ వచ్చే టైమ్ కాదు.

కానీ కాంపౌండర్ ఉన్నాడు.  అతను పాపని తీసుకునేసరికి రాణీ ఏడుపు మొదలెట్టింది. పాపని చూసి మళ్ళా రాజేష్ కి ఇచ్చి డాక్టర్ కి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసేడు.

పావుగంటలో డాక్టర్  శ్యామల వచ్చింది.  అంతా విని పాపని మొత్తం పరీక్షించి “మీ అదృష్టం. టోపీ ఉండడం గడ్డి మీద పడడం పాపకి పెద్ద ఆపద తప్పింది. చిన్న చిన్న దెబ్బలున్నా

ఫరవాలేదు” అని రాణీకి ఇంజక్షన్ ఇచ్చి మందులు రాసి “ఈ డ్రాప్స్ పాలలో కలిపి వేయండి” అంది‌.

“ఒకవేళ ఎక్కడన్నా ముట్టుకుంటే పాప తట్టుకోలేక ఏడిస్తే తెండి. ఎక్స్ రే తీయిద్దాం” అంది.

వేలాడుతున్న మొహాలతో దంపతులిద్దరూ రాణీని ఎత్తుకొని బయటకి వచ్చేరు. రాజేష్ ఆటోని పిలిచి ఉషని రాణీని ఆటో ఎక్కించేసాడు. “నేను వెనకే వస్తాను పద” అన్నాడు.

ఆ రోజు రాత్రి రాజేష్ కచ్చితంగా చెప్పాడు.

“ఉషా! మీ అమ్మగారు చెప్పింది నిజం.  మనకి రానివి చేయడం పాప మీద ప్రయోగాలే! ఇలాటి ఏ పనీ రాణీ మీద మనం ఎప్పుడూ చేయవద్దు ”

ఉష జరిగింది తలచుకుంటూ మళ్ళీ వణికింది.  అలాగే అన్నట్టు బుర్ర ఊపింది.

( నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఇలాటి సంఘటన జరిగి జారి పడ్డ పాపాయి మరి ఆ తల్లితండ్రులకి దక్కలేదు.మా ఉద్యోగినులం అందరం ఏడుపు ఆపుకోలేకపోయేం.అంత విషాదంతో ఎండ్ చేయలేకపోయాను. ఇలా రాసేను)

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!