తధాస్తు   

తధాస్తు

రచన::మంగు క్రిష్ణ కుమారి

‌‌శ్రావణ‌ శుక్రవారం పూజ సంతోషంగా చేసుకుంది సుమిత్ర. మర్నాడే ప్రయాణం.‌ మేనకోడలి పెళ్లి.‌ బంధువులందరినీ చూడొచ్చు.‌ అందరిళ్లల్లో తలా రెండు రోజులు గడిపి తాపీగ రావచ్చును. సర్ధడాలు పూర్తి చేసి వస్తుంటే, స్నేహితురాలు కమల ఫోన్. “సారీ సుమిత్రా, మా అత్తగారికి బాగులేదని కబురు తెలిసి కార్లో గుంటూరు వెళిపోతున్నాం.‌ నీకు చెప్పడానికి అవలేదు”   సుమిత్ర కి షాక్. కారణం వెండి సామానంతా, ఊరికి వెళ్లేముందు కమల ఇంట్లో ఉంచుదాం అనుకుంది. ఇప్పుడెలా?

మర్నాడు పొద్దున్నే పక్కింటి సరస్వతిని అడిగింది. మా వారు వారం రోజుల్లో వచ్చేస్తారు.‌ కొంచెం మీ ఇంట్లొ ఉంచుకుంటారా?” ఆవిడ బెదురు చూపులు చూసింది.‌ “మేం కూడా ఊరు వెళ్తాం అండీ” అంది.

ఎదురింట్లో అడిగింది. ఆవిడ “అయ్యో బీరువాలు ఖాళీ లేవండీ! పైన వదిలి లేను కదా!”అంది దీనంగా.

భర్త పిలిచేడు. “ముందు పనులు చూడు. మన బీరువా లోనే పెట్టీ. అయినా నీకు పిచ్చిఇంత వెండి పెట్టి పూజ చేస్తేనే పూజ చేసినట్టా?”

“బాగుందండీ, మరి‌ ఇలాటివి ఇంకెప్పుడు వాడుకుంటాను.‌ కమల‌ ఇలా ఊరికి  వెళ్తుందని నాకు మాత్రం తెలుసా?”

” సరే సరే,  పద పని చూడు”

బీరువాలో, వెండివి నాలుగు చీరల మధ్య సర్ది తాళం‌ వేసి బీరువా మీదున్న లక్ష్మీ దేవికి దండం పెట్టింది. “తల్లీ ,ఈ వెండి సామానంతా నీకే అప్ప చెప్తున్నాను. జాగ్రత్తగా చూడు. నీ పూజకే కదమ్మా!కాపాడు.‌” అంటూ కాసేపు కళ్లు మూసుకొని మొక్కింది.

దేవుళ్లకి దండాలు పెడుతూనే రైలు ఎక్కింది.  తెల్లవారి  విశాఖపట్నంలో  దిగి కొత్తవలస బస్ ఎక్కి పదినిమిషాలన్నా గడవలేదు, ఎదురింటావిడ ఫోన్‌ , “సుమిత్రగారూ, మీ ఇంటి తలుపులు తీసి ఉన్నాయండీ” కెవ్వుమంది సుమిత్ర.‌ భర్త ఆమె చేతిలొంచి ఫోన్ లాక్కున్నాడు.‌ ఆతరవాత ఎలా ఇంటికి చేరేరో తెలీదు. అన్న, వదిన అక్క బావ,ఆరాటంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ, వాళ్ల వాళ్ల అనుభవాలు చెప్తున్నారు.

భర్త శివరాం ఏదో జవాబులు చెప్తూ, పక్కింటి సరస్వతి గారి భర్త రాజారావుతో మాటాడుతూ, తనకి, భార్యకి ఆరోజుకే ఫ్లైట్‌ కి బుక్ చేసేసాడు.‌ తలుపులు తీసి ఉన్నాయిట. బీరువాల తలుపులు తీసే ఉన్నాయిట. లొపలకి పోలీసులు వచ్చిందాకా ఎవరూ వెళ్ల కూడదని  ఎవరూ వెళ్ల లేదు. తన స్నేహితుడికి కొంచెం తాము వచ్చిందాకా ఉండమని సంగతంతా వివరించాడు శివరామ్.

ఎలా తయారయిందో సుమిత్రకే తెలీదు.

ఫ్లైట్ టైమ్ కి విమానాశ్రయం చేరారు. వద్దన్నా‌ అన్న, వదిన వచ్చారు. “సుమిత్రా, నువ్వు మామూలు అవడం‌ ముఖ్యం. వెళ్లగానే ఫోన్ చెయ్యి.” అని ఆప్యాయంగా చెయ్యి ఊపారు.

మొత్తానికి ఇంటికి చేరేసరికి మూడయింది. స్నేహితుడు ఎదురుగా వచ్చేడు. పోలీసులు వచ్చి వెళ్లారు అని, ఇల్లంతా చెల్లా చెదురై ఉందనీ చెప్తున్నాడు.

సుమిత్ర ఆత్రంగా లోపలకి పరుగెత్తింది. మాసిన బట్టలు ,ఇస్త్రీ చీరలు,‌ కాగితాలు కింద కుప్ప పోసి ఉన్నాయి. బీరువాలు తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. పర్సులు కింద పడున్నాయి. మంచాల మీద కిందా వెండి సామాను విసిరేసుంది. సుమిత్ర గబ గబా వెండి సామానంతా తీసింది. వెండి పూల సజ్జా, పెద్ద పళ్లెం, నాలుగు గిన్నెల గుత్తీ నూట ఎనిమిది పూలూ, పాలు, తీర్థం , ప్రసాదాలు పూజ కోసం వాడే  గిన్నెలు హారతి పళ్లెం, అష్ట లక్ష్మి చెంబు అరివాణం పళ్లెం , పెద్ద కుంకం భరిణా, మొత్తం వెండి సామానంతా ఉంది.చిన్న గిన్నె కూడా పోలేదు.

ఏమండోయ్! అంటూ శివరామ్ ని పిలిచి ఆనందంగా విషయం చెప్పింది.

అప్పటికి చుట్టు పక్కల వాళ్లందరూ వచ్చేరు. విషయం విని అందరూ ఆశ్చర్య పోయారు. “దొంగలకి వెండి తీసుకెళ్లడం రిస్క్ అండీ! బంగారం డబ్బు అయితే తీసేసుకుంటారు” అన్నారు.

సుమిత్ర చటుక్కున ఏదో గుర్తొచ్చినట్టు అంది.

“నేను నమ్ముకున్న లక్ష్మీదేవి నన్ను కాపాడిందండీ! ఆవిడకే అప్పచెప్పిన వెండి వస్తువులన్నీ భద్రంగా నాకే అప్పచెప్పింది. నా తప్పుంది. ‘తల్లీ, నా వెండి సామాను నీకే అప్ప చెప్తున్నాను.’ అన్నాను గానీ, ‘అమ్మా! నా ఇల్లు, నీకు అప్ప చెప్తున్నాను’ అన్నానా? నాకు మంచి పనయిందండీ!” అంది.

సుమిత్ర విశ్లేషణ వింటూ, అందరూ‌ ” కీడులో మేలు, అంటే ఇదే!” అన్నారు.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!