ఉల్లి రవ్వ దోశ

ఉల్లి రవ్వ దోశ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి బైటారు ” దేవి తనయ”

“అత్తయ్యగారు, అత్తయ్యగారు. ” అంటూ వత్తులు చేసుకుంటున్న సుగుణమ్మ దగ్గరికి కోడలు జానకి హడావిడిగా వచ్చి, రేపు ఉదయం ఉల్లి రవ్వదోశ టిఫిన్ చేసుకుందామా? ఆదివారం కదా. మామూలు రోజుల్లో ఎలాగూ అవ్వదు అని అడిగింది. ఉల్లిరవ్వ దోశలా, చాలా సమయం పడుతుంది కదా” అని నసిగింది సుగుణమ్మ. పర్వాలేదు అత్తయ్యగారు, ఎంతసేపు? మీరలా పక్కన నిలబడితే చకచక అయిపోవూ” అనేసరికి అలా అనడం వరకే మళ్ళీ చెయ్యల్సింది. తనే కదా అని తెలుసు కాబట్టి అయిష్టంగానే తలాడించింది సుగుణమ్మ. మర్నాడు ఉదయం సుగుణమ్మ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇవ్వగా జానకి రవ్వ దోశల పిండి కలిపి ఒక్కొక్కటి వెయ్యడం మొదలుపెట్టింది. ఓ నాలుగు దోశలు వేసి చెరో రెండు  పిల్లలిద్దరి కిచ్చింది. ఇంతలో ఫోన్ రింగవగానే అమ్మ నీకే, అంటూ కూతురు హసిత తెచ్చి ఇచ్చింది. హలో ! ఆ రాధిక, బాగున్నావా? మేమందరం బాగున్నాం. ఏమంటున్నావు వినిపించడం లేదు. ఒక్క నిమిషం ఆగు, బయటికి వస్తున్నాను” అని ఫోన్లో చెప్పి, అత్తయ్యగారు స్టౌ సిమ్ లో పెట్టాను. కొంచెం చూస్తూ ఉండండి” అని సుగుణమ్మకి చెప్పి పక్కకి వెళ్ళి మాట్లాడుకోసాగింది. సుగుణమ్మ ఊహించిందే కదా అని తలూపింది. ఓ రెండు దోశలు వేసి కొడుకుకి పిలిచి తినమని ప్లేట్ ఇచ్చింది. ఇంతలో కోడలు వంటగదిలోకి వచ్చి “అత్తయ్యగారు మీకు నా బాల్య స్నేహితురాలు రాధిక గురించి చెప్తుంటాను కదా. నిన్న వాళ్ళ చుట్టాలు ఇంటికి వచ్చిందట. నన్ను ఒకసారి వచ్చి కలవమంటుంది. మీరు కూడా చూస్తారని మనింటికే రమ్మన్నాను కానీ, ఏదో పని ఉండి రాలేక నన్నే రమ్మంటుంది. మళ్ళీ రేపు ఉదయమే వాళ్ళ ఊరు వెళ్లిపోతుందంట. అందుకే తొందరగా రమ్మంటుంది. ఇక్కడినుండి గంటన్నర సేపు ప్రయాణం. ఇప్పుడు బయలుదేరితే గాని చేరుకోలేము. నేను రెడీ అవుతుంటాను. కొంచెం నాక్కూడా ఓ రెండు  దోశలు వేసి ఇచ్చేయరా, ప్లీజ్ అని తయారవ్వడానికి వెళ్తూ, పదండ్రా బయటికి వెళ్దాం రెడీ అవుదురు గాని అంటూ పిల్లల్ని కూడా బెడ్రూంలోకి లాక్కెళ్ళింది. సరేనని నిట్టూరిస్తూ సుగుణమ్మ మరికొన్ని ఉల్లిపాయలు తరిగి దోశలు వేసింది. భలే చేస్తావమ్మ అని కొడుకు అనేసరికి ఆ తర్వాత ఇక చాలు వద్దు. వద్దు, అతను అంటున్నా మరో మూడు దోశలు  వేసింది. ఇంతలో జానకి టిప్ టాప్ గా తయారయి వచ్చింది. ఆమెకి కూడా ప్లేట్ లో ఓ రెండు వేసి ఇచ్చింది సుగుణమ్మ. ఆమె అవి తింటుండగా మళ్ళీ ఫోన్ రాధిక నుండి. ఆ, ఆ,బయలుదేరామే, మేం నలుగురాం వచ్చేస్తున్నాం. వచ్చాక మనం ప్లాన్ ఫిక్స్ చేసుకుందాం సరేనా అని చెప్పి, ఇంకోటి అయ్యిందా అత్తయ్య గారు అంటూ వయ్యారం గా పళ్ళెంతో వచ్చింది. ఇదిగోనమ్మా అంటూ సుగుణమ్మ పెనం పై నుండి పళ్ళెంలో వేసింది. అది తింటూ ఈరోజు భలే బాగా కుదిరాయి కదండీ కరకరలాడుతూ అంటూ భర్తని అడిగింది జానకి. అవునవును, బాగున్నాయి. ఎంతైనా మా అమ్మ చేతి వంటే వంట అన్నాడు రామ్. అలా మాట్లాడుతూనే మరో రెండు వేడి వేడి దోశలు తినేసింది జానకి. తర్వాత చేతులు కడుక్కుoటూ “అయ్యో అత్తయ్యగారు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీకు వేసి ఇద్దామంటే టైమ్ అయిపోతుంది. మీరు వేసుకుని తినేయండి. ఆ, అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మేము మధ్యాహ్నం బయట ఎక్కడో తినేస్తాము. మీరు ఏదో ఒకటి వండేసుకోండి ఫ్రిడ్జ్ లో కూరలు ఉన్నాయి కదా అనేసి పిల్లల్ని తీసుకుని జానకి, రామ్ లు బయలుదేరారు. సరేనని మెయిన్ డోర్ తాళం  వేసుకుని వంటగదిలోకి వచ్చింది సుగుణమ్మ. దోశల పిండి గిన్నెలో చూసేసరికి ఒక్క దోశకి సరిపడా ముద్ద మాత్రమే ఉంది.  కొబ్బరి చట్నీ కూడా ఒక చెంచాడు మాత్రమే ఉంది. నిట్టూర్చి ఆ ఒక్క దోశ వేసుకుని తిన్నాది. కానీ అది ఏ మూలకి సరిపోక కొంచెం అటుకులు నీళ్ళల్లో కడిగి కొంచెం పంచదార కలుపుకుని తినేసింది. అసలు సుగుణమ్మకి ఎన్నాళ్ళనుండో ఎవరో ఒకరు వేసి ఇస్తే వేడి వేడిగా ఉల్లి రవ్వ దోశలు  తినాలని ఉంది. వేడి పెనం మీద గరిట జారుగా కలిపిన పిండిని పల్చగా వేసి అంచుల చుట్టూతా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి ఖాళీల్లో నూనె వెయ్యడం వలన ఎర్రగా కాలుతూ బంగారు వర్ణంలోకి వచ్చాక చుట్టూ అంచులు తిప్పి మధ్యలోకి మడిచి ప్లేట్లో వేసుకుని తింటుంటే కరకరలాడుతూ ఎంత బాగుంటాయో. అలా టేబుల్ దగ్గర కూచుని ఉంటే వేడి వేడి దోశని  పళ్లెంలోకి ఎవరో ఒకరు వేస్తె దోశని సుతారంగా వేళ్ళతో తుంపి ఒక ముక్క కొబ్బరి పచ్చడితో, ఇంకో ముక్క వేడి సాంబార్ తో తింటే అబ్బ, స్వర్గమే దిగిరాదు. అదే ఊపులో నాలుగయిదు  దోశలు తినేయోచ్చు. అదేంటో పెళ్లయినప్పటినుండి ఈ కోరిక మాత్రం తీరడం లేదు. అత్తమామలకి వేడి వేడిగా వండి వడ్డించడం తోనే అయిపోయేది. తన దగ్గరికి వచ్చేసరికి ముద్దయినా ఉండేది కాదు, చట్నీ అయినా ఉండేది కాదు. తోటికోడళ్ళు కూడా ఎవరికి వాళ్ళు వేసుకుని తినేసేవారు. పిల్లలైన  పెద్దయ్యాక చేస్తారులే అనుకుంటే తనకి ఇద్దరూ కొడుకులే. ఎప్పుడు అన్ని సిద్ధంగా అమరిస్తే వచ్చి వేడి, వేడిగా వేస్తూ ఉంటె ఒక్కోటి  లాగించేసి కంచం ఖాళీ చేసి వెళ్ళిపోతారు తప్ప “అమ్మ నువ్వు తిన్నావా” అని అడగరు. పెద్దోడికి ముందు పెనం పైన జీడిపప్పు ముక్కలు , ఉల్లిపాయముక్కలు వేసి, ఆపై దోశల పిండి వేసి చుట్టూ నెయ్యి వేసి కాలిస్తే ఇష్టమని అలా చేసేది. చిన్నోడికి మాత్రం దోశ వేశాక, పైన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ వేస్తే ఇష్టమని అలా ఇచ్చేది. భర్త మాత్రం ఆవురావురుమంటూ అరడజను తినేసి ఆనక పనుందంటు వెళ్లిపోయేవాడు. ఇంట్లో అందరికి వెయ్యడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిసినా, భర్త కి ఇష్టం కదాని చేస్తుండేది. ఎప్పుడు దోశలు వేసినా, ముందు రెండు మూడు సరిగా వచ్చేవి కావు. అలాంటి వాటిని భర్త, పిల్లలకి ఏం  పెడతాను అని వాళ్ళకి కాకుండా తను తినేది. అయిన కరకరలాడే దోశలు ముందు ఈ ముక్కలు ఏం పనికిరావు, కానీ ఏం చేస్తాం?నాకు ఒక కూతురు ఉండుంటే చక్కగా కూర్చోబెట్టి ఒక్కొక్కటి వేసి తనకి ఇచ్చేది కదా అని అప్పుడప్పుడు అనిపించేది. పోనీ బయట రెస్టారంట్లో తిందామంటే అంతంత బిల్లు చూసేసరికి తినబుద్ది వేసేది కాదు. ఐనా బయట అరో, ఒకటో తినగలం కానీ ఇంట్లోలాగ తనివితీరా మూడు నాలుగు దోశలు తినేయలేము కదా. హు, ఎప్పటికో ఆ ప్రాప్తం” అంటూ నిట్టూర్చి మరేం చేస్తాం, ఎప్పుడో కోడలికి ఖాళీ ఉన్నప్పుడు చెప్పి దగ్గరుండి వేయించుకోవాలి. అనుకుంటూ టి‌వి లో రామాయణం చూడటంలో మునిగిపోయింది  సుగుణమ్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!