మరో నేత్రం(సంక్రాంతి కథల పోటీ)

మరో నేత్రం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: గొర్తి వాణిశ్రీనివాస్

రైలు వెళ్ళిపోయింది.
పాట ఆగిపోయింది.
పాటగాళ్ళు కూడా వెళ్లిపోతున్నారు.
ఇన్నాళ్లుగా నేను వెతికేవాళ్ళు వీళ్లేనా ? !
“ఎంత గొంతు చించుకుని పాడినా మనకి చివరికి మిగిలేది బీడీ కట్టకూ షోడా కొట్టుకూ సరిపడ డబ్బులేగా ”
“మన బతుకులు ఇలా కావడానికి కారణం ఆ రసూల్ గాడేగా!వాడికి కాలం ఎప్పుడు మూడుతుందో” వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
రసూల్ పేరు వినగానే నేను వెతుకుతున్న నలుగురు గుడ్డివాళ్ళు వాళ్లే అని రూఢీ చేసుకున్నా. రైలు ప్రయాణంలో అలరించిన అద్భుత పాటగాళ్ళు జీవితంలో మాత్రం ఓడిన దురదృష్టవంతులు.ఆ నలుగుర్నీ చూడగానే నాకు సంతోషం కలిగింది
“మీరు ఆ నలుగురే కదూ! “అన్నాన్నేను
“ఎవరూ !? అంటూ నా వైపు తిరిగారు వాళ్ళు
“నేను మమతని” అన్నాను
“ఏ మమత?’
“చాలా ఏళ్ల క్రితం మీ పాటలకి ముచ్చటపడి ఒక కళ్ళ డాక్టర్ మీకు కార్నియా దానం చేస్తానని వాళ్ళ క్యాంప్ కి రమ్మంది గుర్తుందా?” అన్నాను
“అవును గుర్తుంది. మీరు ఆ డాక్టరమ్మా?!”
“కాదు! రసూల్ ఒక ఆడపిల్లను ఎత్తుకొచ్చి కళ్ళు పోగొట్టి గుడ్డిదాన్ని చేసి ముష్టి ఎత్తించాడు. ఆ పాపమీద జాలిపడి మీరు చేరదీసారే ఆ మమతని. ఆ డాక్టర్ గారు మీకిస్తానన్న రెండు కళ్ళను నాకిమ్మన్నారు . నాకు అమర్చమని డాక్టర్ ని బతిమాలారు. కళ్ళొచ్చే అవకాశం మీకొస్తే చేతులారా వదులుకుంటున్నారెందుకు అని డాక్టర్ అడిగితే ఆడపిల్లకు కళ్ళు లేకపోతే ఆమె జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆవిడని బతిమాలి నాకు కళ్ళ దానం చేయించారు గుర్తుందా?!
“అవును గుర్తుంది. అదెలా మర్చిపోతాం!ఆరోజు మాకెంతో మంచిరోజు”అన్నారువాళ్ళు
“మీ దయవల్ల బతికి బట్టకట్టిన ఆ పాపని నేనే” అనగానే వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగాయి.
“నువ్వు ఆ మమతమ్మవా? ఎలాగున్నావ్ బాగున్నావా ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇంకా మేం గుర్తున్నామా ?” అన్నారు
” నాకు పునర్జన్మ ఇచ్చినవాళ్ళని నేనెలా మర్చిపోతాను?ఆరోజు నన్ను డాక్టరమ్మకి అప్పగించి పంపించేసాక అంబులెన్స్ సరాసరి హాస్పటల్ కి చేరింది. సమాచారం అందుకున్న మా అమ్మా నాన్నా అక్కడికి వచ్చారు.నాకు కళ్ల ఆపరేషన్ జరిగింది. మీ నలుగురి త్యాగాన్నీ అందరూ ఎంతగానో పొగిడారు . కానీ తిరిగి మీకు సహాయం చేద్దామని మా అమ్మా నాన్నతో కలిసి వచ్చాను. మీరెవరూ స్టేషన్ లో కనపడలేదు. ఈ పదిహేనేళ్లలో మీకోసం చాలా సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఏమైపోయారు? ఇన్నాళ్లూ ఎక్కడున్నారు?” అన్నాను
“ఆ రసూల్ గాడికి ఏదో అనుమానం వచ్చి మా డ్యూటీ బస్టాండుకి మార్చాడు.మేం ఎక్కడున్నా వాడి మనుషులు మమ్మల్ని గమనిస్తుంటారు.మా కోసం ఎందుకొచ్చావమ్మా? మళ్లీ ఆ రసూల్ గాడి కంటపడితే ఇంకేమైనా ఉందా?మాతో ఎవరు మాట్లాడినా వాళ్ళకి ప్రమాదం” అన్నారువాళ్ళు కంగారుగా
“వాడిప్పుడు నన్ను గుర్తు పట్టలేడు. ఏమీచెయ్యలేడు కూడా.మీరు నాతో వచ్చేయండి. మిమ్మల్ని హోమ్ లో చేర్పిస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను.” అన్నాను.
“అది జరగనిపని తల్లీ! ఇంతసేపూ నీతో మాట్లాడినందుకే ఆ రసూల్ గాడు నీతోఏం మాట్లాడారో చెప్పమని మా చెమడాలు ఎక్కతీస్తాడు .
అన్నిటికీ సిద్ధపడినోళ్లం. మాకేం ఫర్లేదు. మీకే అపాయం. బేగి ఎల్లిపోమ్మా” అన్నారు వాళ్ళు
“రసూల్ గాడి చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తా. త్వరలో వాడు చేసిన అన్యాయాల్ని బద్దలుకొడతా “అన్నాన్నేను.
“నీకు తెలీత్తల్లీ పోలీసోళ్లకీ వాడికి బోలెడు లాలూచీలుంటాయి.మా మీద దొంగతనం కేసు పెట్టి స్టేషన్ లో పెట్టి చితక్కొట్టిచ్చినా ఆడిగేవాళ్ళు లేరు. అదే మా భయం” అన్నారు వాళ్ళు.
“నూరు గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకి చస్తుంది. వాడి అరాచకాలు కలకాలం సాగవు. ఆరంభం ఉంటే అంతం కూడా ఉంది. వాడిమీద పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఫైల్ చేస్తాను. మీరొచ్చి సాక్ష్యం చెప్పండి చాలు.అంతా నేను చూసుకుంటాను” అన్నాను
వాడే ఉంటే వీడెందుకని పోలీసులకి ,వాడికి మధ్య చాలా లెక్కలున్నాయి. అయినా గుడ్డివాళ్ళం మా సాక్ష్యం చెల్లుతుందా? లేనిపోని సమస్య దేనికి. నువ్వెళ్ళిపోమ్మా ఇన్నాళ్లూ ఎలాగున్నావో అలాగే వుండు. “అన్నారు ఆ నలుగురూ.
“అలా అనకండి. ఒకప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలిసేది కాదు. బాధితుల పక్షాన ఎవరూ నిలబడేవారు కాదు. ఇప్పుడలాకాదు.అవినీతిపై అన్నిటికన్నా పెద్ద అస్త్రం మీడియా. దాని కంట్లో పడితే సమస్య అంతు తేలేదాకా వదలదు. సామాన్యుడి గొంతును అంతర్జాతీయ స్థాయిదాకా వినిపిస్తోందిప్పుడు. మనం దాన్ని ఆశ్రయిద్దాం. మనలాగా ఎవరూ రసూల్ బారిన పడకుండా కాపాడదాం ఏమంటారు?” అన్నాను వాళ్ళవైపు చూస్తూ.
వాళ్ళు పడిన కష్టాల తాలూకు చిత్రాలు వాళ్ళ మనోనేత్రం ముందు కదిలినట్టున్నాయి. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మెల్లిగా తేరుకుని
“సమాజంలో పాతుకుపోయిన ముళ్ళని ఏరిపారేసే అవకాశం వస్తే ఎవ్వరం వదులుకోము. బతికేం చేస్తాం రా! భూమికి భారంగా. మేం పోయేముందు ఒక మంచి పని చేసే పోతాం. మేం ఏం చెయ్యాలో చెప్పు మమతమ్మా!” అన్నారు.
వాళ్ళని వెంటపెట్టుకుని ధైర్యంగా పోలీస్టేషన్ కి వెళ్ళాను.
అంతకు ముందే నేను ఫోన్ చేసి పిలిచిన మీడియా కూడా మాతోపాటే వచ్చింది మాకు తోడుగా.

—————————

You May Also Like

3 thoughts on “మరో నేత్రం(సంక్రాంతి కథల పోటీ)

  1. కళ్ళున్నవాళ్ళు కూడా చేయలేని ,చూపించలేని, మానవత్వాన్ని నలుగురు గుడ్డివాళ్ళు చూపించి పాప ని కాపాడటం వావ్…సూపర్ సూపర్ అండీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!