నువ్వోసగం -నేనోసగం(సంక్రాంతి కథల పోటీ)

నువ్వోసగం -నేనోసగం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: భాగవతుల భారతి

ప్రొద్దున్నే ఫోన్ మోగుతోంది.తీసి “నాన్నా! ఏంటీ సంగతులూ” అడిగింది వింథ్య.

“మగాణ్ణి ,మెుగుణ్ణి చూస్తే ఏ ఆడదానికైనా కేవలం డబ్బు యంత్రంలా మాత్రమే కనబడతాడా?” అన్నాడు వింథ్య తండ్రి.

“అయ్యో అదేం ప్రశ్ననాన్నా? ఆడా ,మగా ఇద్దరూ పరస్పరం అవగాహనతోనే మెలగాలి నాన్నా! ఏమంటావ్ ” అంది వింధ్య.

“నువ్వే చెప్పు చదువుకున్నాదానివీ? వివేక వంతురాలివీ! ” వింధ్య తండ్రి వ్యంగ్యాస్త్రం.

“అదేం కాదు నాన్నా! ఆడవాళ్లమే మెుగుళ్ళకి ఆటబొమ్మలల్లే కనబడతామేమో!? ఆ ఆటనుండి తప్పించుకోవటానికి,
ఆడవాళ్ళం బిగ్గరగా అరుస్తాం. అదిగో …అలా అరుస్తోంది.. గయ్యాళిది అంటారు.. కానీ మా అరుపుల వెనుక అభద్రతా భావం మెుగుళ్ళు గుర్తించరు. మగాడు మెుగుడు కానంతవరకూ, ఇది గుర్తిస్తాడు. పెళ్ళాంది మాత్రం గుర్తించడు.. ఏంటి నాన్నా సంగతీ! అమ్మతో గొడవా? ” అడిగింది వింధ్య.

వింధ్య తండ్రి ,మాటతప్పించి…

” ఆ.. ఏంలేదు రోజూ ఉండేదే కానీ… పేపర్లో వార్తల చదువుతూ నీతో మాట్లాడలనీ!..భార్య సాధింపులు భరించలేక ఈయనెవరో ఆత్మహత్య చేసుకున్నాట్ట …భర్త వేధింపులకు బలైపోయిన భార్య ..అందుకనీ! ..” అన్న తండ్రి మాటలకు..

“నాన్నా! భర్తని భరించలేక భార్య, భార్యను భరించలేక భర్త,…. ఇక ఇంతేనా? భార్యాభర్తల మధ్య సమతౌల్యం.. సమభావం ఎప్పటికీ రాదా?! ” వింథ్య అడిగింది.

“నీతో ఇదే గోలే అమ్మాయ్! ఏది మాట్లాడినా ఆడవాళ్ళనే వెనకేసుకొస్తావ్… ఇప్పుడు మీ అమ్మ చూడు నేను ఎడ్డెమంటే తను తెడ్డెమంటుంది.చదువు సంధ్య లేని మెుద్దు చస్తున్నా మీ అమ్మతో ” …వింధ్య వినలేక ఫోన్ పెట్టేసి ఆలోచిస్తోంది .

రెండు బజార్ల అవతలే పుట్టిల్లు. అయినా నాన్న రోజూ తనని ఫోన్ లోనే పలకరిస్తాడు. అమ్మ రెండు రోజులకొకసారి వచ్చి తమని పరామర్శించి పోతుంటుంది.
ఓ మనిషికి తనకేం కావాలో తనకే తెలీని దుస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుందా? అణకువగా ఉండి, తనే ప్రపంచంగా, తనే లోకంగా ఉండి, ఇల్లూ వాకిలీ తప్ప ఏం తెలీని, ఆడదే తనకు భార్యగా రావాలని, పాత తరం మగాళ్ళు అనుకునేవారు. మరి తన తల్లి మూడో క్లాసే చదివింది. వంట, తమని కనీ, పెంచటం తప్ప ఆమెకు, తోడులేకుండా బస్టాండుకు వెెళ్ళి బస్సు ఎక్కడమే తెలీని పిచ్చితల్లి. మరి! నాన్నకి ఏదో అసంతృప్తి . చదువుసంథ్య అక్కరలేని భార్యను కోరుకున్న నాన్న, “ఆడపిల్లలకు చదువుకావాలమ్మాయ్”.. అని ఇంజనీరింగ్ చదివించాడు తనని. ఈ తరంలో చదువుకుని ఉద్యోగంచేసే భార్యల్ని కోరుకుంటున్నారు. పోనీ తన భర్తైనా.. సంతృప్తి తో ఉన్నాడా? అదీ లేదు. ఏం కావాలి? వీళ్ళకి? పోనే ఆడవాళ్ళకేం కావాలో ఆడవాళ్ళకైనా తెలుసా?

“అమ్మాయ్ వింథ్యా! ” అంటూ తల్లి అడుగుపెట్టింది ఇంట్లోకి . వచ్చి ” ఏమిటోనే ఈమధ్య మీ నాన్న వేధింపులు భరించలేకపోతున్నానే, నీలాగా చదువుకుని ఉంటే, ఎంచక్కా మీ నాన్నని వదిలేసి వెళ్ళిపోయేదాన్నే ” నిష్టూరంగా అంటున్న తల్లి మాటలకు ఏడవాలో నవ్వాలో తెలీక,

“అమ్మా!మేం చదువుకుని ఏం ఉద్దరించామనీ!?చదువుకుని ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ జీవితాలు ‘వెేస్తే వెయ్యిరూపులుగా వెలిగిపోతున్నాయనా!? అయ్యో నేనూ ఉద్యోగం చేయలేక పోయాననా? నీ దుగ్ధ” అంది వింధ్య తల్లిమీద రుసరుసలాడుతూ.

“అదేమిటే ! ఎందుకంత ఆవేశం?!..మా కంటే మీ రెంతనయం ?!.. ఆడపిల్లలూ…. ” తల్లి మాట పూర్తి కాకముందే..

“ఏం మారిందీ ఆడపిల్ల జీవితం? అప్పుడూ ఇప్పుడూ” నిట్టూరుస్తూ అంది వింధ్య

“ఎందుకు మారలా? చక్కగా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ” వింధ్యతల్లి .

“వీటివల్ల ఇదివరకటికంటే బరువు బాధ్యత పెరిగినాయ్. మానసిక ఒత్తిడీ పెరిగింది. మీరోజుల్లో ఇంట్లో వంట, మా సంరక్షణ మాత్రమే, హాయిగా,బయటి ప్రపంచంతో పనిఉండేది కాదు మీకు.. మరి ఇప్పుడు? ఇంటా బయటా ఎన్ని సమర్ధించాలో , ఆడవాళ్ళం. అయినా మెుగుళ్ళని మెప్పించలేకపోతున్నాం .ప్చ్.”

“మరి ఈనాటి వనితలూ కుటుంబానికి అంకిత మవ్వచ్చుగా! “

“పాతతరంలో మిమ్మల్ని వంటింటి కుందేళ్ళగా మార్చి, పురుషప్రపంచం, చాలా ఇబ్బందులకు గురిచేసిందనేగా, సంఘసంస్కర్తలంతా స్త్రీని బయటికి తేవాలని …..” వింద్య మాటలు పూర్వ కాకముందే…

“తల్లీ! తెలుగును కూడా అర్ధంకాని భాషలో మాట్లాడక, విషయం చెప్పు ” అన్న తల్లి మాటలకు నిట్టూర్చి,

“ఉద్యోగం చేస్తున్నానన్న మాటేగానీ ప్రశాంతత ఏదీ? మీ అల్లుడు ,నేనూ ఇద్దరమూ సాఫ్టువేర్ల క్షల్లో జీతాలు. రోజూ ఉరుకులూ పరుగుల కంటే, ఈగోలూ గొడవలూ, పోట్లాటలూ, ఎందుకో అర్ధంకాదూ. జీవితం మీద విరక్తి పుడుతోంది. ఇద్దరం ఉద్యోగాలు కాబట్టి, పని పంచుకోవాలిగా. ఇంటా బయటా ఎన్ని….. వహ్ చిరాకు వచ్చేస్తోంది. “

“సమాజం ఆడదానికి ఒక్క విషయం లో మాత్రమే వెసులుబాటు కల్పించింది. అది నచ్చక పోతే, మెుగుడితో కలిసి బ్రతకలేక పోతే, విడిపోయే విషయం లో మాత్రమే.”

“అమ్మాయ్! అలాంటి ఆలోచన రానీయకు. ఏదైనా పరిష్కారం ఆలోచించాలిగానీ. “

“పెళ్ళి కుదిరి, అత్తవారింటికి వెళ్ళటంలో కూడా, అడుగడుగునా అవే లాంఛనాలు, షరతులూ, ఒద్దికలూ మీ రోజుల్లోనూ అదే, మా రోజుల్లోనూ అదే. ఇప్పుడు…..”

మాట్లాడుతూ ఉండగానే వింథ్య భర్త , సతీష్ వచ్చాడు.

“ఏమండీ! చెప్పిన సరుకులు తెచ్చారా? ” వింథ్య అడిగింది.

“నువ్వు వస్తూ తెస్తావనుకున్నానే! అయినా పిల్లలను పికప్ చేసుకుని వచ్చేటప్పుడే, దారిలో నీకు కావాల్సింది తెచ్చుకోవచ్చుగా! నాకిప్పుడు ఓపికలేదు.కాస్త కాఫీ ఇవ్వు” హుష్.. అంటూ సోఫాలో చతికిల పడ్డాడు సతీష్.

“ఏమండీ! రోజూ ఇలాగే చేస్తున్నారు మీరు. నాకు ఇంటికొచ్చాక,ఇంటిపనీ, వంటా, పిల్లల హోం వర్కులూ, బోలెడు పని
ఉంటుంది అందుకే హడావిడిగా ఇంటికి వచ్చేస్తా. కాస్త పట్టించుకో పోతే ఎలాగండీ ? సరేలెండి కొంచెం లేటయినా రేపు నేనే తెచ్చుకుంటాలెండి ” అని వింథ్య కాఫీ తీసుకురావటానికి లోపలికెళ్ళింది.

“అత్తయ్యగారూ ఇదండీ మీ అమ్మాయి వరస. ఏం తక్కువయిందనీ? కోరినంత డబ్బు. చేసినంత ఇంటి పెత్తనం. ఉద్యోగం చేయించక పోతే, పురుషాహంకారం, ఉద్యోగానికి పోనీలేదని ఏడుపు, పంపితే హక్కుల పోరాటం . మామయ్యగారు అదృష్టవంతులు. మీరు చదువుకోలేదుగా….చక్కగా ఉన్నారు ” అన్నాడు సతీష్ .

“అవునవును ఉద్యోగం పేరుతో బయటికి పోయే ఆడదానికి, ఇంటికి వస్తే, గ్లాసెడు మంచినీళ్ళిచ్చే, నాధుడు ఉండడు.
అటు బయట ,ఇటు ఇంట్లో ఒళ్ళు హూనం. పోనీ మానేద్దామా? ఈరోజుల్లో చదువులూ ఖర్చులూ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్. రేపటి నుండి ఉద్యోగం మానేస్తాలే పోండి……” రుసరుసల మెుదలై వాగ్వివాదంగా మారి ముష్టి యుధ్దాలకు దిగుతోందనగా ఇద్దరిలో ఎవరికీ చెప్పలేక, చల్లగా జారుకుంది వింధ్య తల్లి.

వెడుతూ వెడుతూ ” అమ్మాయ్! పనిమనిషిని మాట్లాడానూ! రేపట్నించి వస్తానందీ!” అని చెప్పి రెండు బజార్ల అవతల ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది.

***********

” అమ్మగారూ!” అనే పిలుపుకు బయటి కొచ్చి ” నువ్వూ” అంది వింధ్య.

“పక్కబజారులో ఉన్న మీ అమ్మగారు పంపినారు ..నేను పనిమనిషి ఉమని”.

“మరి అతనూ ” పనిమనిషి పక్కనే ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని చూస్తూ అడిగింది.

“మా ఆయనమ్మా!పేరు శివ. పనేంటో చెప్పండమ్మా” అంటూనే వెనక బాల్కనీ లోకి దారితీసింది. పనిమనిషి ఉమ,వెనుకే భర్త శివ.

సతీష్, వింధ్య ఆశ్చర్యంగా చూస్తూనే, చేయవలసిన పనంతా చెప్పి, లోపలికి వెళ్ళి , మళ్లీ బయటికి వచ్చి చూసేసరికి, సతీష్ ఆశ్చర్యపోయాడు. ఇంట్లోకి వచ్చి వింధ్యకి చెప్పాడు. వింధ్య హడావిడిలో కూడా వచ్చి చూసి నిర్ఝాంతపోయింది.

ఉమ అంట్లుతోముతుంటే, భర్త శివ కడుగుతున్నాడు. ఉమ బట్టలుతుకుతుంటే శివ ఝాడిస్తున్నాడు. ఇద్దరూ కలిసి బట్టలు ఆరేస్తున్నారు. ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి, శివ బక్కెట్ తో నీళ్ళు తెస్తే, ఉమ తడిగుడ్డ తో, ఇల్లంతా తుడుస్తోంది. అడ్డువచ్చిన సామాను సర్ది పక్కన పెడుతున్నాడు, శివ.

ఎంత హృద్యంగా ఉందీ దృశ్యం… ప్రకృతీ పురుషుల ఆనంద తాండవంకాదూ! పరమేశ్వరుడు ఉపదేశించిన అర్ధనారీశ్వర తత్వంకాదూ. పంచేంద్రియాలనూ ఏకంచేసిన యోగీశ్వరుడెవరో, సమీకరించిన జీవనవేదం కాదూ!’ కాళిదాస కవి చెప్పిన వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే ‘ ఇదేనా? ఒకరు వాక్కు ఐతే ఒకరు అర్ధంగా, ఒకదానికొకటి అనుసరించుకున్న అర్ధనారీశ్వర,జగద్వందితం ఇదే కాబోలు. అనుకుంటూ…
ఏదో అడగబోయారు వింధ్య, సతీష్.
చాలామంది అడిగే ఉంటారనుకుంటా! వీళ్ళేమడుగుతారో ముందే ఊహించినట్లుగా …

“మా బావ అంతేనమ్మా! నన్ను కట్టపెట్టడు. ప్రతి పనిలో సాయం వచ్చేత్తాడు. ఇద్దరం కట్టపడేది ఇంటికోసమేగా! పోనీ నిన్ను పనికి పంపకపోతే, ఈ రోజుల్లో నా సంపాదన ఏమూలకీ ,అంటాడమ్మా ” అంది ఉమ.

శివ కూడా వంతపాడుతూ ” ఆళ్ళఅయ్య నా చేతిలో పెట్టి, తండ్రి లా సూసుకో అన్నాడు .మరి సూసుకోవాలిగా ” నవ్వాడు

నెలరోజులు గడిచి మెుదటినెల జీతం అందుకోటం లోకూడా, అన్యోన్యతే “ఎవరికిస్తే ఏముందిలే అమ్మా ” అంటూ ..
ఇక రోజూ వాళ్ళిద్దరినీ, పరిశీలించటంలో నిమగ్నమయ్యారు వింథ్య,సతీష్ లు.

రోజూ స్కూటీ మీద కలిసే వస్తారు ఉమ, శివ. ఎదురింట్లోకి దూరతారు. ఇద్దరూ కలిసి మెలిసి పనిచేస్తున్నారు.

తాము రోజూ బిజీ లో ఉండి ఎదురింట్లో వీళ్ళని గమనించలేదా? ఎన్నాళ్ళనుండి చేస్తున్నారో! వాళ్ళకి. అడిగింది వింధ్య. ‘ఏడాదినుంచి’ …
పక్కబజార్లో ఓ ఇంటికి పోతారు, అక్కడా ఇద్దరూ ఒకరితో ఒకరు మాటాముచ్చటా చెప్పుకుంటూనే, పనికానిస్తారు. వస్తూవస్తూ, అక్కడ గోడవారగా, చిన్నఅరుగుమీద చతికిలబడి ఏవో గుసగుసలూ…”ఏంటర్రా!మీ మంతనాలూ” అంటే ఏముంటాయమ్మా! కట్టం సుఖం ” అని నవ్వుతారు.
ఉమ మాత్రమే వచ్చినరోజున ” ఏంటీ పార్వతి వచ్చింది. పరమేశ్వరుడేడీ? వదిలిఉండడుగా ” అని అడిగితే పిల్లలకి జోరమమ్మా! ఆళ్ళకాడ తానున్నాడు. నేను పని సూసుకుని యెడతా ” అంటుంది ఉమ అంటే ఎంత చదివినా, పక్కవాణ్ణి, పనివాణ్ణీ కూడా చూసి, నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయా? అసలు చదువు,సమాజంలోనే ఉందా? సతీష్, వింధ్య ఆలోచనలో పడ్డారు.

మూడు నెలలు గడిచినాయ్.

**********

ప్రొద్దున్నే వింధ్య కళ్ళుతెరిచి,ఏవో శబ్దాలు వినబడితే గభాలున వంటింట్లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది.
వంట్లింట్లో స్టవ్ మీద కాఫీ పెట్టి ,కూరగాయలు తరగటానికి ఏర్పాటు చేస్తూ, పిల్లలను స్కూల్ కి రెడీ చేయడానికి హైరాన పడుతూ, తాము చెరో వైపు ఆఫీసులకి వెళ్ళాలని, హడావిడి పడుతున్న సతీష్ ను చూస్తూ మనసారా నవ్వి,దగ్గరకి వచ్చి సతీష్ నుదుటిపై ముద్దు పెట్టింది వింథ్య ..నువ్వో సగం నేనో సగం అన్నట్లుగా.

****************

You May Also Like

5 thoughts on “నువ్వోసగం -నేనోసగం(సంక్రాంతి కథల పోటీ)

  1. సగం సగం …నువ్వో సగం..నేనో సగం..సగాలు రెండూ ఒకటైపోతే…జగాన అది అమరత్వం. ప్రకృతి పురుషులు ఇద్దరూ ఒకరుగా అయినప్పుడే…మరో సృష్టి కలుగుతుంది. సృష్ఠి చలనంతో సాధ్యం. రచయిత్రి కథనం ను సుసాధ్యం గా నడిపించడం లో సమర్ధురాలు. ఈ కథ నేటి తరానికి స్త్రీ పురుషులు ఒకరి కొకరు అనేట్లు కలిసి జీవించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. చక్కని కథ అందించిన భారతి గారికి అభినందనలు.

  2. “నువ్వో సగం..నేనో సగం ‘ … భాగవతుల భారతి గారి కథ నేటి సమాజం లో భార్యాభర్తల జీవితాల్లో అసమతుల్యత కు అద్దంపట్టింది… అర్ధనారీశ్వర తత్వం ఆవశ్యకతను తెలియజేసింది…పామరులనుంచి పండితులు అనబడేవాళ్లు కూడా నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని అర్థమయ్యేలా కథ నడిపించారు..చక్కని కథ రాసిన భారతి గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!