లోభి 

అంశం: కొసమెరుపు కథలు

లోభి 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

       ‘వెధవ సంత..వెధవ సంతయని. ఎన్నిసార్లు చెప్పినా సమయానికి రాడు వీడు. ఇప్పుడింత లగేజి వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఖర్మ’ అనుకుంటూ మూట నెత్తిన పెట్టుకుని, ఒక చేత్తో ఇంకో సూట్ కేసును లాగుతూ నడవ సాగింది తాయారమ్మ. బస్సు బయలుదేరే ముందు ఫోను చేసింది మనవడు రంగేష్ కు. ‘నీకెందుకు నానమ్మా బస్సు రావడానికి అరగంట ముందే వచ్చి ఉంటాను. బైపాసు వద్ద దిగమన్నాడు. పావుగంట వేచి చూసినా రాకపోయేసరికి లగేజి తీసుకుని కాలికి పని చెప్పింది తాయారమ్మ. “అమ్మగారూ ఆటో కావాలా” వచ్చి ఆగాడు ఒక ఆటో కుర్రాడు.
“అయ్యప్ప గుడి దగ్గరకు ఎంతియ్యమంటావ్” అడిగింది కాస్త ఆయాసంతో “అమ్మో శానా దూరం కదమ్మా. నాకు తిరుగు బాడుగ కూడ దొరకదు. ఓ రెండు వందలివ్వండి” అడిగాడతను.”రెండు వందలా..నీదేమైనా పల్లెవెలుగు విమానమా..అంత అడుగుతున్నావు. అక్కర్లేదులే పో” “పోనీ ఎంతిస్తారో చెప్పండి. నూట యాభై ఇస్తారా. పాపం పెద్దావిడవని తగ్గిస్తున్నానమ్మా””ఓ ఇరవై రూపాయలు ఇస్తా” ఆటో మీరు నడిపినా ఆ రేటుకు ఎవరూ రారమ్మా తల్లీ. సందెవేళ గొప్ప బేరమే ” అని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆటో కుర్రాడు.
‘ఈ తాయారుతో వెటకారాలా వెధవకి’ అనుకుంటూ అతి భారంగా కదులసాగింది తాయారు. పది అడుగులు వేసిందో లేదో నీరసం ఆవహించింది. అక్కడే ఉన్న బండ మీద కూర్చుంది. ఎవరినన్నా సాయం అడుగుదామన్నా ఒక్క మనిషీ కనపడి చావలేదు. ఇక లాభం లేదనుకుని ఛార్జింగు అయిపోయిన ఫోనును తిట్టుకుంటూ నడవడానికి సిద్ధమయింది తాయారమ్మ. ఆపసోపాలు పడుతూ ఒక్కొక్క అడుగూ వేయసాగింది. నెత్తిన మూట క్షణక్షణానికీ బరువు పెరగసాగింది ఇంతలో ఒక కుర్రాడు తనవైపే వస్తున్నట్లు అనిపించి ‘నాయనా ఏడుకొండలవాడా..ఆ వచ్చే బడుద్ధాయి నా మీద జాలిపడి ఈ సామాన్లు మా ఇంటిదాక తెచ్చి దించేలా చూడు. “ఏంటి ఆంటీ..ఇంత బరువు మోసుకుంటూ ఇంత రాత్రి వేళ ఎక్కడికి” అని అడిగాడు. అతడిని నెత్తిమీద మూట దించమని కాసేపు ఆయాసం తీర్చుకుని ” నాయనా..నేను మా అమ్మాయి దగ్గరనుంచి వస్తున్నా. బైపాసులో బస్సు దిగు, నేను వస్తానన్న మా మనవడు రాలేదు. ఇక లాభం లేదనుకుని ఈ లగేజి నెత్తిన వేసుకుని నేనే బయలుదేరాను. పెద్దదాన్ని కదా నాయనా..ఈ మోత నావల్ల కావట్లేదు” అని ఊపిరి తీసుకుందామని మాట ఆపింది.”సరేలే ఆంటీ.. పెద్దవారు మీరు, ఇంత లగేజి ఎలా మోసుకు వెళతారు. రండి..నేను వచ్చి మిమ్మల్ని మీ ఇంటిదాక దించి వెళతాను” అంటూ మూటను నెత్తిన పెట్టుకున్నాడా కుర్రాడు. “అయ్యో నాయనా..నీకెందుకింత శ్రమ. పైగా ఏదో పని మీద పోతున్నట్లున్నావు. నేనే ఎలాగోలా వెళతాలే” అన్నది మొహమాటపడుతున్నట్లు తాయారమ్మ. పైకి మొహమాటంగా అన్నదేగానీ, లోలోపల సంబరపడింది.”ఇంతకూ నీ పేరేమిటి నాయనా”
“త్యాగభీమ్” “చక్కగా ఉంది. పేరుకు తగ్గ మనస్తత్వం. ఏం చదువుకున్నావు””డిగ్రీ ఆంటీ”
“ఉద్యోగం ఇంకా రాలేదా” “లేదు ఆంటీ..ప్రయత్నం చేస్తున్నా. అప్లై..అప్లై..నో రిప్లైలా ఉంది నా పరిస్థితి. దరఖాస్తు పెట్టడమే తప్ప శుభం కార్డుకు నోచుకోలేదు నా బ్రతుకు” “బాధపడుకు నాయనా. కష్టేఫలి అన్నారు పెద్దలు. తప్పకుండా నీ ప్రయత్నం ఫలిస్తుంది. అవును ఇటువైపుగా వచ్చావు..మీ ఇల్లు కూడ ఈ ప్రాంతంలోనేనా” “లేదు ఆంటీ మా ఇల్లు గాంధీనగరులో. ఇంటి దగ్గర ఉంటే మనసంతా ఏదోగా ఉంటుంది. అందుకే సాయంత్రం ఆరు నుంచి పది వరకు ఊరంతా తిరుగుతాను. ఈరోజు ఇలా వచ్చాను. ఏదో నా అదృష్టం కొద్దీ మీకు సేవ చేసే భాగ్యం కలిగింది” “ఎంత మంచి మనసు నాయనా నీది” ఈ సంభాషణల మధ్య మలుపు మొదలు రానే వచ్చింది. నెత్తిన మూటను కిందికి దించి, సూట్ కేసును పక్కనబెట్టాడు త్యాగభీమ్. నాయనా..నీఋణం తీర్చుకోలేను. దేవుడిలా వచ్చి నా కష్టాన్ని నెత్తిన వేసుకుని నా ఇంటికి చేర్చావు. నువ్వు చల్లగా ఉండాలి బాబూ” అని త్యాగభీమ్ భుజం తట్టింది తాయారమ్మ. “ఆంటీ..నా ప్రయత్నం ఫలించాలని, నేను కోరుకున్నది దక్కాలని దీవించండి” అంటూ ఆమె పాదాలను అంటాడు త్యాగభీమ్. అతని వినమ్రతకు ముచ్చటపడి వంగి అతని తలమీద చేయిపెట్టి ‘తథాస్తు’ అని దీవించింది తాయారమ్మ. అదే సమయంలో త్యాగభీమ్ తలెత్తాడు. సరిగ్గా అతని తల దగ్గరగా వచ్చింది తాయారమ్మ మెడలోని గొలుసు. దాన్ని గబుక్కున అందిపుచ్చుకుని, తాయారమ్మను నెట్టి మెడలోని గొలుసును తెంచేసుకుని పరుగు లంఘించాడు త్యాగభీమ్. ఆ హఠాత్పరిణామానికి మ్రాన్పడిపోయింది తాయారమ్మ. అంతలోనే తేరుకుని ‘దొంగ..దొంగ’ అని అరిచింది. కానీ ఎవరున్నారు అక్కడ. పెద్దగా ఏడుస్తూ కూలబడింది కాసేపు. ‘దొంగ చచ్చినోడు. ఎంత మంచివాడులా నటించాడు. ఆంటీ..ఆంటీ అంటూ ఎన్ని మాటలు చెప్పాడు. మోసం.. అంతా మోసం.
“వెధవ కక్కుర్తి కాకపోతే. ఆ ఆటోవాడిని నమ్మి ఎక్కివుంటే నూటయాభైతో పోయేది. అందుకే పెద్దలంటారు “లోభికి మూటనష్టి” అని ఏడుస్తూ ఇంటివైపుకు దారితీసింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు” అన్న సామెతగా, గొలుసు పోయిన దాని కంటే కొడుకు ఎన్ని సహస్రనామాలు చదువుతాడో అనే భయంతో బిక్కచచ్చిపోయింది తాయారమ్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!