కలిసిన మనసులు

కలిసిన మనసులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: తిరుపతి కృష్ణవేణి.

చాలా కాలం తర్వాత తన ఒక్కగానొక్క మనుమడు వంశీ పెళ్లి పేరుతో బయట ప్రపంచం లోకి అడుగు పెట్టింది భారతమ్మ. పెళ్లిలో భారతమ్మను చూసిన బంధు మిత్రులు అందరూ, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. ఇన్నేండ్ల తరువాత, బంధువులను,కలుసుకోవటం మూలంగా తన తరపు, భర్త తరపు బంధువులు అమ్మమ్మా! నానమ్మా! పెద్దమ్మా! పిన్ని! అత్తా! అంటూ రకరకాల వరుసలు పెట్టి పలుకరిస్తూఉన్నారు. భారతమ్మ, వాళ్ళు గుర్తు చేస్తే తప్ప,కొందరిని పోల్చు కోలేక పోతూంది. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే పొడి, పొడిగా సమాధానమిస్తూ! తెలిసిన వారిని పలుకరిస్తూ, పెళ్లి మండపంలో అటూ ఇటూ తిరుగుతుంది. ఆమె మనసులో గతకాలపు చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మాటల సందర్భంలో ఎవరైనా! ఆ విషయాలు జ్ఞాపకం చేస్తే, వాటి గురించి చెప్పటం ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు? అందుకే అందరితో చాలా తక్కువగా మాట్లాడుతుంది.

పెళ్లికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. కొద్దిసేపటి లోనే హాలంతా క్రిక్కిరిసిపోయింది. ఎవరెవరో పలకరిస్తూ ఉన్నారు. ఇంతలో ఓ పెద్దాయన బాగున్నావా భారతమ్మ? అంటూ పలుకరించాడు. హా బాగున్నానండి, అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చింది. నిజానికి ఆమె ఆయనను గుర్తించలేదు. ఎవరు మీరు? అని అడుగుదాం అంటే ఆయన ఎక్కడ బాధపడతాడో? అని ఆమె ఉద్దేశ్యం.
ఆయన పక్కనే మరో పెద్దాయనను చూసిన ఆమెకు, ఆయనను ఎక్కడో చూసినట్లే ఉందే? కళ్ళద్దాలు లేక సరిగా ఆనటం లేదు గానీ, మొత్తానికి చూసిన ముఖమే? నున్నటి గుండుతో పాత సినిమాలో విలన్ లా ఉన్నాడు.
పెళ్లి కూతురు తరపువాడై ఉంటాడు అనుకుంటా! ఏమోలే! వయసు మీద పడే కొద్దీ సరిగా పోల్చుకోలేని పరిస్థితి. ఆయన కూడా నా లాగా గుర్తు పట్టలేక పోతున్నాడేమో? నాకైతే తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది అనుకుంటూ, చిన్నగా మండపం వైపు అడుగులు వేస్తూ మరలా ఒక్కసారి వెనుతిరిగి చూసిన భారతమ్మ కు ఆ పెద్దాయన ఇంకా తన వైపే చూస్తూ ఉండటం గమనించింది.
పెద్దవాళ్ళము అయిపోయాము. తరచూ బయటకు వచ్చేవాళ్ళు అయితే ఒకరినొకరు గుర్తు పెట్టుకుంటారు. నాలాగ ఓ పాతిక సంవత్సరాల తరువాత బయటకు వస్తే ఇలానే ఉంటుంది అనుకుంది. మనుమడు వంశీ కూడా పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడు. అన్నీ నా బుద్దులే అని మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ నా ఒక్కగానొక్క మనుమడు పెళ్లి కాబట్టి ఇంత కాలానికి ఇలా బయటకు వచ్చాను.

పేరంటాలు అందరూ, మేళతాళాల హోరులో పుజాసామాగ్రిని మండపంలోకి హడావుడిగా తీసుకొని వెళ్తున్నారు. నా చిన్న కూతురు క్రాంతి వచ్చి నాకు ఏవేవో పనులు పురమాయించి, మండపంలో నుండి ఎక్కడికి కదలవద్దు అని చెప్పి నా చేతికి ముఖ్యమైన కవర్ ఒకటి ఇచ్చి అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోయింది.
అలాగే మనుమడు వంశీ కూడా పెళ్లి అయ్యేంత వరకూ నువ్వు నా దగ్గరే కూర్చోవాలి అని ఆజ్ఞ వేశాడు. వాళ్ళ తాతగారు కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది ఇద్దరం కలిసి ఎంతో హుందాగా పెద్ద తరహాలో పెళ్లి జరిపించి ఉండే వాళ్ళం కదా!
ఆయన్ను చూడక చాలా కాలం అయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? ఏమి చేస్తున్నారో? వంశీ తాతగారిని కూడా పెళ్ళికి పిలిచాను అని చెప్పాడు కానీ ఆయన రాను అంటే రాను అని ఖరాకండిగా అన్నారట. చాలా మొండి మనిషి. నా గురించి కాకపోయినా తన పిల్లలు, మనుమడు, మనుమరాళ్లు గురించి అయినా రావచ్చు కదా? అని మనసులోనే అనుకొని గత స్మృతులను
తలచుకుంది భారతమ్మ.

భారతి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కగానొక్క చెల్లెలు ఎంతో గారాబంగా పెరిగింది. ఇంట్లో అందరూ ముద్దుగా భారతమ్మ అని పిలిచేవారు.
చదువులో, ఆటపాటల్లో అన్నింటా ముందుండేది. చాలా తెలివైన,చురుకైన పిల్ల. భారతికి ఇరవై ఏళ్లు వచ్చే సరికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు, తల్లి దండ్రులు. ఆ విషయమై ఒక రోజు నాన్న పార్వతీశం గారు, అమ్మ భారతీ నీకో మంచి సంబంధం చూసాము తల్లి,అబ్బాయి మంచి వాడు, బుధ్ధిమంతుడు. ఈ మధ్యనే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందట. వెంటనే భారతి ఆలోచనలో పడింది. నేను మన పక్క ఊర్లోనే వున్న సుబ్బూ (సుబ్రమణ్యం)ని ప్రేమిస్తున్నానని నాన్నకు చెప్పాలా వద్దా. చెప్పితే నాన్న, అన్నయ్యలు ఎలా స్పందిస్తారో. చెప్పకపోతే నాన్న చూసిన సంబంధం ఒప్పుకోవాలి. చిన్నతనం నుండి అమ్మ, నాన్న , అన్నయ్యలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసారు వాళ్ళని ఎదిరించ గలనా? ఇలా ఆలోచనలతో తన మనసంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

అతనిది మన ప్రక్క ఊరే. పేరు సుబ్రహ్మణ్యం, ఏమంటావు తల్లీ ? అన్న నాన్న మాటలకు తేరుకొని అయ్యో! నాన్న చెప్పేది సుబ్బు గురించా? అనుకొని లోలోపలే సంతోషిస్తూ ఏమీ తెలియని దానిలా నాకు ఇప్పుడే పెళ్లి ఎందుకు నాన్న? నేను చదువుకుంటాను అంది గారాలు పోతూ.
“చూడు తల్లీ ఎంత చదివినా ఆడపిల్లకు పెళ్లి చేయక తప్పదు? మంచి సంబంధం వచ్చినప్పుడే చేసుకుంటే బాగుంటుంది. దగ్గర ఊరు, మా కళ్ళ ముందే ఉంటావు.తెలిసిన సంబంధం కాబట్టి నిన్ను బాగా చూసుకుంటారు” అని నచ్చచెప్పుతూ “ఓసీ! పిచ్చి తల్లీ నువ్వు సుబ్రహ్మణ్యంను ఇష్టపడుతున్నావని నాకు ముందే తెలుసురా, అందుకే నేనే వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడి వచ్చాను. నాకు ఏమీ తెలియదు, అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు మా ప్రాణం నీ మనసులో వున్న ప్రతీది మాకు తెలుస్తూనే ఉంటుంది.” అని తనలో తాను అనుకుంటూ ఏమీ తెలియని వాడిలా కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు పార్వతీశం గారు. అబ్బాయి తల్లిదండ్రులలో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. అమ్మాయికి పెళ్ళిలో పెట్టవలసిన లాంఛనాలన్నీ పెట్టి, ఎంతో ఘనంగా వివాహం జరిపించి, భారతిని అత్తారింటికి పంపించారు. కాలం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.
చూస్తుండగానే అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. భారతి ఇద్దరు ఆడ కవలలకు జన్మనిచ్చింది. వారికి కళ్యాణి, కావేరి అని పేర్లు పెట్టారు. భారతి ఆనందానికి అవధుల్లేవు. వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. అప్పుడప్పుడూ తను ఇష్టపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినందుకు తన పుట్టింటి వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకునేది భారతి. నాన్న తన మనసును ఎలా తెలుసుకోగలిగాడో అని ఒకింత ఆశ్చర్యపోయేది కూడా. అలా వారి అన్యోన్యతను చూసి పుట్టింటి వారు కూడా ఎంతో ఆనందించే వారు. ఇద్దరూ అమ్మాయిలు అవడం వలన మగ పిల్లాడు కోసం ఎంతో ఆశగా ఎదురు చూసాడు సుబ్రమణ్యం. మూడో బిడ్డకు కూడా జన్మనిచ్చింది భారతి. మళ్ళీ ఆడపిల్ల అవటంతో సుబ్రహ్మణ్యం ఆశలన్నీ కుప్పకూలిపోయాయి చాలా బాధపడ్డాడు. భారతి ఎన్నో రకాలుగా సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. ఆడ అయినా! మగ అయినా! ఇద్దరూ సమానమే. మగ పిల్లల కంటే ఆడ పిల్లలేమీ తీసిపోరు? అది మన పెంపకంలోనే వుంటుంది అండి. మగ పిల్లలకు ధీటుగా మన పిల్లల్ని తయారు చేసుకుందాం. దానికి అంతలా బాధపడాల్సిన అవసరం లేదు. బాగా చదివిదాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారుచేద్దాం. అయినా వాళ్ళు మన పిల్లలండీ వాళ్ళ మీద మనమే అలా కోపం పెంచుకుంటే ఎలా? ఆడపిల్లలు గా పుట్టడమే వాళ్ళ తప్పా? అంటూ భర్తకు సర్ధిచెప్పింది.
అయినా మనం చదువుకున్న వాళ్ళం. ఒకరికి చెప్పే విధంగా ఉండాలి కాని, ఒకరితో చెప్పించుకునే విధంగా వుండకూడదు? అంటూ ఎన్నో రకాలుగా భర్త మనసు మార్చటానికి ప్రయత్నం చేసింది భారతి. కానీ రాను రానూ సుబ్రమణ్యం ప్రవర్తనలో చాలా మార్పులు రాసాగాయి. అయినదానికి, కానిదానికి, చిరాకు పడుతుండే వాడు. చీటికి మాటికి గొడవ పడటం, పిల్లలపై, విసుగుదల ప్రదర్శించటం, కేకలు వేయటం చేసేవాడు. ఇలాంటి మార్పులను భర్త నుండి ఊహించని
భారతికి అంతా అయోమయంగా ఉండేది. రోజులు కష్టంగా గడవ సాగాయి.

ఈ విషయాలు అమ్మ, నాన్నకు తెలిస్తే, ఎంత బాధ పడతారో అనుకొని లోలోపలే కుమిలిపోసాగింది .
వారికి తెలియకుండా నేనే జాగ్రత్త పడాలి. అని మనసులోనే అనుకొని ఎలాగొ కుటుంబాన్ని సర్దుకుంటూ నెట్టుకోస్తూంది. ఇంతలో సుబ్రహ్మణ్యం ఉద్యోగ రీత్యా చాలా మారు మూల ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఆ నెపంతో భార్య పిల్లలను పుట్టింట్లో వదలి ఉద్యోగం చేసే ప్రాంతానికి ఒంటరిగానే వెళ్ళాడు. అంతే! అప్పటి నుండి ఆయన రాకపోగా, పిల్లలను తీసుకుని భారతి వస్తానన్నా వద్దనే వాడు. కుటుంబ భాద్యతలను పట్టించుకోకుండా ఏదో ఒక కారణం చెబుతూ భారతిని పుట్టింట్లోనే ఉంచుతూ, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అలా పిల్లల్ని పట్టుకొని, కన్నీటిని దిగమింగుతూ పుట్టింట్లోనే ఉండిపోయింది భారతి. పుట్టింటి వారి సహాయంతోనే పిల్లల అన్నివేడుకలు జరుగుతున్నా, చుట్టపుచూపులా, అలా వచ్చి ఇలా వెళ్ళేవాడు. అసలు ఏమీ పట్టించుకునేవాడు కాదు సుబ్రమణ్యం.
ఏమి జరిగిందో! అలా ఎందుకు తయారయ్యాడో అంతుపట్టని విషయంగా మారింది. అమ్మా, నాన్నలు, అన్నయ్యలు, ఒకటి రెండు సార్లు పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పారు. ఆయిన వారి మాటలను ఖాతరు చేయలేదు. పెద్దలతో పంచాయితీ పెట్టి చెప్పించారు. ఆయినా, ఆయనలో మార్పు రాలేదు.
పెద్దల్లో పెట్టి నా పరువు తీశారని, అమ్మా వాళ్ళ ఇంటికి రావటం మానివేసి వారిపై వైరం పెంచుకున్నాడు. పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.పుట్టింటివారి సహాయంతో పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసింది. స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. మంచి స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. భారతి పుట్టింటి వారే అన్నిరకాల సహాయాలు చేసి పిల్లలను ప్రయోజకుల్ని చేసారు. పాతిక సంవత్సరాలు గడచి పోయాయి.
ఇప్పటికీ, భారతి సుబ్రమణ్యంలు ఒకరికొకరు ఎదురు పడ్డ సంఘటనలు లేవు. ముగ్గురు ఆడ పిల్లలకు జన్మ నిచ్చిన తల్లిగా భారతమ్మకు పడిన శిక్ష అది. అప్పటి నుండి భారతమ్మ చుట్టాలు బంధువుల ఇళ్లల్లో పెళ్ళిళ్ళకు గానీ పేరంటాలకు గానీ వెళ్ళటమే మానేసింది. బజంత్రీలు వాయించండీ! అన్న పురోహితుడి మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది భారతమ్మ. ఇంతలో పెద్ద వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి! అంటున్న పురోహితుని మాటలకు మనుమడు వంశీ, తాతాగారు ఇలా రండీ అంటూ పిలిచాడు. ఎవరా! అన్నట్టు అందరూ ఒక్కసారి తాతాగారి వైపు చూసారు. అంతే భారతమ్మ అవాక్కయి ఈయన అమ్మాయికి తాతగారు అనుకుంటా? ఆ గుండు అది చూసి ఈయనేంటి విలన్లా వున్నాడు అనుకున్నా.మీ తాతాగారు కూడా వచ్చి, నిన్ను దీవిస్తే ఎంత బాగుండేదిరాఖన్నా అని మనుమడి తో అంటుండగానే, అమ్మా! భారతమ్మ గారు మీరు కూడా వచ్చి ఇలా ఈయన పక్కన నిల్చోండి! అంటూ పిలిచాడు పురోహితుడు.
ఛీ! ఛీ!నేను, ఈయన ప్రక్కన నిలుచుండటమేమిటి? మీకు మతి గాని పోయిందా? అంటూ దూరంగా జరిగింది భారతమ్మ. కూతుర్లు, అల్లుళ్ళు, మనుమరాళ్లు అందరూ ఒకటే నవ్వులు. వాళ్ళ నవ్వులు చూసిన భారతమ్మ కి ఏమీ అర్థంకాక అయోమయంగా చూస్తుండి పోయింది. పెళ్ళికొడుకు వంశీ, పెళ్లి కూతురు వాసవి అమ్మమ్మా! ఆయన ఎవరో కాదు, మన తాతాగారే! ఆయన్ను నువ్వు గుర్తు పట్టలేదు? ఆయన నిన్ను ఎప్పుడో గుర్తుపట్టారు.
అనవసరమైన అవివేకంతో కుటుంబానికి ఇంతకాలం దూరమయ్యానని, తాతయ్య ఇప్పుడు ఎంతో బాధ పడుతున్నాడు. అని చెప్పిన వెంటనే, ఒకరి నొకరు పట్టుకొని ఇన్నేళ్ళ తమ ఎడబాటుకు కన్నీటి పర్యంతమయ్యారు వృద్ధ దంపతులు. ఇప్పటికైనా పిల్లల ఔదార్యంతో మనం కలుసుకున్నామండి అంటూ కళ్ళనీరు తుడుచుకుంది భారతమ్మ. వృద్దదంపతులు ఊహించని విధంగా, మనుమలు, మనుమరాళ్లు, బంధువులు కలసి, పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా, మంగళవాయుద్యాల నడుమ వాళ్ళిద్దరిచేత దండలు మార్పించి అక్షింతలు వేశారు. అక్కడున్నావారంతా హాయిగా నవ్వుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!