అతితెలివి

అతితెలివి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అద్దంకి లక్ష్మి

గోపాల్ రావుకి ఒక్కతే కూతురు రాధ. గారంగా పెంచుకున్నాడు. చెల్లెలి కొడుకు వేణు ఇంజనీర్ చేసి, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చాలా తెలివైనవాడే. అయితే పై చదువులు చదవడానికి బాధ్యతలు అడ్డు వచ్చాయి. ఈ మధ్య చెల్లెలి భర్త పోవడంతో, వేణుకి ఇంటి బాధ్యత పైన పడింది. తమ్ముడుని చదివించాలి.
వేణు, రాధ పక్క ఇంట్లో ఉండే శ్యామ్ ముగ్గురు కలిసి చదువుకుంటూ ఉండేవారు. ఒకే స్కూలు. ఒకే కాలేజీ. బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. వేణు వీళ్లిద్దరు కన్న రెండు సంవత్సరాలు పెద్ద. ‘రాధ తల్లి, శ్యామల తన అమ్మాయిని వేణు కిచ్చి మేనరికం  చేద్దామనుకుండేది’. ‘కానీ ఇప్పుడు ఆమె మనసు మారిపోయింది. ఆడబొడుచు భర్త పోయాడు కాబట్టే, ఆ ఇంటి బాధ్యత తన ఒక్కగానొక్క కూతురు మీద పడుతుంది. ఈ చదువులు అయిన తర్వాత ఆ పక్క ఇంటి వాళ్లు మంచివాళ్లే వాళ్ళ అబ్బాయి శ్యాముతో చేస్తే బాగుంటుంది అని మనసులో ఊహించుకుంది’. “రాధకి చదువుతప్ప మరో ప్రపంచం తెలియదు. పైగా తండ్రి మొదటే చెప్పాడు చదువు అయ్యే వరకు ప్రేమ, పెళ్ళి  మాట్లాడకూడదని, జీవితంలో ముందర ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలని. రాధకి కూడా చదువు ముఖ్యం మరే ధ్యాస లేదు. ఫైనల్ ఎగ్జామ్స్ రాసేశారు. శ్యాము, రాధకి పరీక్షలు అయిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా శ్యాము పెళ్లి కార్డు పట్టుకొనివచ్చాడు. రాధా, శ్యామల ఆశ్చర్యపోయారు. “ఆంటీ !మా నాన్న ఫ్రెండ్ కూతురు శోభ. ఆయన మా నాన్న గారితో ఇలా అన్నారు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా మీ అబ్బాయికి ఇద్దరూ వెళ్లి యూఎస్ లో చదువుకుంటారు, మీ అబ్బాయి చదువుకి అయ్యే ఖర్చు నేను భరిస్తాను అన్నారు. మా తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకున్నారు, నాకు ఇష్టమే యూఎస్ వెళ్లి చదువుకోవచ్చు కదా! పెళ్లి ఫిక్స్ అయింది. మీరు తప్పకుండా రావాలి. రాధా..నువ్వు వేణు వచ్చి పెళ్లి లో మజా చేయాలి మన స్నేహితుల అందరితో”
అంటూ యుఎస్ వెళ్లే ఆనందంలో ఉన్నాడు శ్యాము. తల్లి నిర్ఘాంతపోయింది. శ్యామల మనసులో అనుకున్నది. ‘ఇంకా నయం ఈ విషయం కూతురు రాధతో చెప్పలేదు. పక్కన జీవనదులు పెట్టుకుని, ఎండమావుల గురించి పరిగెత్తినట్లు ఉంది తన తెలివి’. రక్త బంధాలలోని అనుబంధాల కన్నా డబ్బు శాశ్వతం కాదు అని తెలుసుకుంది శ్యామల.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!