అమ్మ లాలా
రచన:: పావని చిలువేరు
కన్నప్రేగు తన్మయత్వంతో
పరవసించి పోసిన అమ్మ లాలా..
వేకువ జామున ఆరుబయట,
బుడ్డడి నలుగు స్నానాలకి ,
పంచభూతాల సాక్షిగా
పెరటిలో అరుగు వేసే
చిన్ని బొజ్జకి దిష్టి తగలకుండా
తుండుగుడ్డ చుట్టి ,
ప్రకృతితో మంతనాలు జరిపే ,
అష్టదిక్కులను కాపలాగా మార్చే ,
చిలిపి చేష్టలు, కొంటె బడాయిలతో
ప్రారంభమైయే కనీవినీయెరుగని జలకాలాట .
చెంబెడు వెచ్చని నీటి చుక్కలు
తనువు తాకే
అదును చూసి అందుకున్న
చిరుగాలి సందడి చేస్తే
అంతే బుడుతడు చిందులేసే
చలితో వాని తనువంతా వణుకుపుట్టే
బుడిబుడి అడుగులతో పరుగులు తీసే .
అదును చూసి అమ్మ అందుకోబోతె,
ఆముదం రాసిన మేని జర్రున జారే,
ఆగపట్టి సున్నిపిండితో మర్ధన చేసే,
ముత్యపు కాంతితో మెరిసిపోతున్న
బుడుతని…. మేని చాయని చూసి
అడుగుబొడుగు నీటితో దిష్టి తీసి మురిసిపోయే.
తన బొటనవేలిని తగిలి
నుదుట బొట్టుపెట్టే.
సామ్రాని వేసి బజ్జో పెడితే
ఓ మూడు గంటలు
ఆదమరచి నిదురపోయే
అంతలో అమ్మపనులన్ని చక్కబెట్టే .
***