నిన్ను నీవు మలచుకో

నిన్ను నీవు మలచుకో

రచన::చంద్రకళ. దీకొండ

ఉలి దెబ్బలకు ఓర్చుకుంటేనే…
శిల శిల్పంగా మారేది…
అనుభవాలతో రాటుదేలితేనే…
జీవన పోరాటంలో గెలిచేది…!

నీ బలాలేవో గుర్తించి…
నీ బలహీనతలేవో గుర్తెరిగి…
మసలుకుంటే మనిషౌతావు…
సద్గుణాల మనీషవుతావు…!

ఎదురు దెబ్బలకు ఓర్చుకొని…
ఓటమి పాఠాలతో గుణపాఠం నేర్చుకొని…
కిందపడినా బంతిలా లేచి నిలబడి…
అలుపెరుగక సాగించే ప్రయత్నమే…
విజయ శిఖరాన్ని చేర్చేది…!

ఇతరుల అనుభవాల నుంచి సందేశాలు అందుకుని…
నీలోని సామర్థ్యాలకు సానపెట్టుకుని…
నైపుణ్యాలకు పదును పెట్టుకుని…!

నీ లక్ష్యం ఏమిటో నిర్దేశించుకుని…
నీ గమ్యం ఏమిటో నిర్ధారించుకుని…
ఆటంకాలు ఎదురైనా తట్టుకుని…
బండరాయి వంటి బ్రతుకులో చైతన్యం నింపుకొని…
ఎంచుకున్న బాట వెంట అడుగులేయాలి…!

పుస్తక పఠనంతో…
సజ్జన సాంగత్యంతో…
చెడు వ్యసనాలకు వదిలించుకుని…
చక్కని గుణాలను పెంపొందించుకొని…!

కష్టాలకు క్రుంగక…
భయాలు,సందేహాలను పారద్రోలి…
ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని…!

నిన్ను నీవు మలచుకోవాలి…
ఉన్నత వ్యక్తిత్వం మూర్తీభవించిన చక్కని మానవతా శిల్పంలా…
అందమైన జక్కన కళాఖండంలా…!!!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!