నన్ను వదలని నా కల

రచన – తపస్వి

సిక్స్త్ సెన్స్… ఇది మనుషుల అందరికీ ఉంటుంది. అలాగే కొంత మందికి తమ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ముందే కలల రూపంలో కనపడతాయి. అలాంటి ఒక ఆలోచన ఆధారంగా ఇది రాస్తున్నా. కలలో వచ్చిన మృత్యువుని ఎదిరించాలి, మోసం చేయాలి అని ప్రయత్నిస్తే ఎదురయ్యే పరిస్థితి ఏంటి అని ఒక ఊహ మాత్రమే ఇది.

“ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?”

“ఏదో కీడు జరుగుతుంది అని భయంగా ఉంది?”

“మళ్ళీ కల ఏమన్నా వచ్చిందా?” టీ అందిస్తూ అడిగింది నా భార్య…

“అవును…” అంటూ కప్ అందుకుని వచ్చిన కలని పూర్తిగా గుర్తు తెచ్చుకుని కలని డీకోడ్ చేయటానికి ప్రయత్నిస్తున్నాను.

“ఎలాంటి కల?” తన కంగారు అర్థం అయింది నాకు…

నాకు వచ్చే చాలా కలలు నిజం అవుతుంటాయి. అంటే వచ్చిన ప్రతిదీ అని కాదు. కొన్ని కొన్ని కలలు నాకు చాలా ప్రత్యేకంగా వస్తుంటాయి… అవి కలలో జరుగుతున్నపుడు నాకు తెలుస్తుంది, ఇది రాబోవు రోజుల్లో నాకు జరగబోయేది అని… వినటానికి చిత్రంగా ఉన్న, నేను చెప్పేది ముందు అబద్ధం అనుకున్న, నాకు కలలో కనపడి నిజం అయిన సంఘటనల ఆధారంగా నా గురించి తెలిసిన వాళ్ళు చాలా మందికి నా కలలపై నమ్మకం కుదిరింది.

“మన కుటుంబంలో ఎవరో చనిపోతున్నారు ఇంకో 3 రోజుల్లో…”

“కుటుంబంలోనా…?” అని కంగారుగా మా అత్త, మామ, నా కూతురు వైపు చూసింది.

“అంటే మా అమ్మ, నాన్నలో ఎవరైనా?”

“తెలియట్లేదు…” నిస్సహాయంగా అన్నాను. కళ్ళు మూసుకుని ఆ కలని పూర్తిగా గుర్తు చేసుకోవాలని ట్రై చేస్తూ…

“ప్లీజ్ కాస్త గుర్తు తెచ్చుకోండి. మన కుటుంబంలోనేనా…? లేక బంధువులలోనా?”

తన భయం అర్థం అవుతుంది, వయసు అయిపోయిన తల్లితండ్రులు ఒక పక్క, కూతురు ఒక పక్క… తను, నేను… ఉన్నది 5 మంది… ఇంకో మూడు రోజుల్లో మాలో ఎవరో చనిపోతున్నారు అంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను.

కాస్త ఆలోచించగా… ఆలోచించగా… అర్థం అయింది, అది ఖచ్చితంగా రోడ్డు యాక్సిడెంట్… జనాలు గుంపుగా ఉన్నారు… నేను ఫోన్ చేతిలో తీసుకుని… ఇంకా… మా ఇంటి ముందు టెంట్… నా కూతురు, భార్య ఏడుస్తున్నారు శవం మీద పడి… కాస్త కష్టపడితే అంత వరకూ గుర్తు వచ్చింది.

“సరే, కంగారుపడకు… జరిగేది ఏదో జరుగుతుంది, వచ్చే గురువారం అత్తయ్యా, మామయ్య ఎక్కడకైనా బయటకి వెళ్తారా?”

“హ్మ్మ్… సాయిబాబా గుడికి వెళ్తారు కదా… అయినా వాళ్ళ గురించే ఎందుకు అడుగుతున్నారు అంటే!?”

“హ్మ్మ్ అవును… ఆ కలలో నువ్వు, పాప, బ్రతికే ఉన్నారు… మీరు ఏడవటం నేను చూస్తున్నాను. ఇక నా కలలో జరిగేవి ఎప్పుడూ జరుగుతుండగా నేను చూస్తున్నాను కాబట్టి… నాకు ఏమి కాదు… ఇక మిగిలింది వాళ్ళు ఇద్దరే కదా…” అన్నాను.

నా మాట పూర్తి కాక ముందే తను “అమ్మా…నాన్నా…” అంటూ ఏడవటం మొదలుపెట్టింది.

“అబ్బా… ఆపు… ఇపుడు నువ్వు ఇలా ఏడవటం మొదలుపెడితే ఇప్పుడే పోతారు వాళ్ళు భయంతో…”

“ఏడవకుండ ఎలా ఉంటా…” తన మాటలు పూర్తికాక ముందే…

“నా మాట విను అపుడపుడు నా కలలు నిజం అవ్వకుండా కూడా ఉన్నాయి… పైగా తప్పించటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది, నేను ఆలోచిస్తా” అన్నాను తనని ఊరడించాలి అని…

“చాలా భయంగా ఉంది” అంది హాల్లో ఉన్న అమ్మ, నాన్న వైపు చూస్తూ…

“సరే, ఒక పని చెయ్… నాకు వచ్చిన కల రోడ్డు యాక్సిడెంట్… కాబట్టి ఆ రోజు కుదిరితే మీరు ఎవ్వరూ ఇల్లు దాటి బయటకి వెళ్ళవద్దు… అపుడు కల నిజం అవ్వదు అన్నాను”

“చావుని తప్పించుకోగలం అంటారా?”

“ఇది చావు గురించి కాదు… కలని అబద్ధం చేయగలిగితే చావుని కూడా అబద్ధం చేయగలం”

ఏదో మూల నమ్మకంతో చెప్పానే కాని నాకు పూర్తి నమ్మకం లేదు.

ఆ క్షణం నుండి మాకు ప్రతి క్షణం భయం భయంగా గడిచింది. పిల్లని స్కూల్ కి పంపలేదు… అత్తమామలని గుమ్మం దాటనీయలేదు.

***

గురువారం రానే వచ్చింది. నాకు, మా ఆవిడకి భయం మొదలయింది… గుడికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళని వద్దు అని ఆపేసాను. ఎవ్వరినీ ఇల్లు దాటనివ్వలేదు. నాకు వచ్చిన కలలో టైమ్ పగలు కాబట్టి… సాయంత్రం అయ్యే వరకు అలాగే ఇంట్లో గడిపాము. ఇక టైమ్ 5:30 అవుతుంది అనగా… ఇక కలని అబద్ధం చేయగలిగా అన్న సంతోషం వేసింది.

అపుడే నాకు తెలిసిన ఫ్రెండ్ నుండి ఫోన్ రావటంతో, తప్పని సరై వెళ్ళాలి అని… “ఇక నేను బయటకి వెళ్లి వస్తా మీరు జాగ్రత్త… ఏదన్నా ఉంటే వెంటనే ఫోన్ చెయ్యి” అన్నాను.

“ఇవాళ అందరినీ వద్దు అని మీరు బయటకి వెళ్ళటం…”

“పిచ్చిదానా… కలలో నాకేం కాలేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నాను… భయపడకు… కాకపోతే చీకటిపడే వరకు ఎవరిని బయటకి పంపకు అని…” కీస్… తీసుకుని బయటకి బయల్దేరాను.

ఇంటి నుండి బయల్దేరానే కాని ఆలోచనలు అన్నీ… ఆ కల మీదే ఉన్నాయి. నాకు తెలిసి… నాకు వచ్చిన కల నిజం అవ్వకుండా ఉండటం ఇదే మొదటిసారి… కొంచెం గర్వంగా కూడా ఉంది… చావుని మోసం చేయగలిగినందుకు. ఆలోచనల మధ్య మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. నేను ఇంటి నుండి వచ్చిన పది నిముషాలకే మళ్ళీ ఫోన్ రావటంతో మెయిన్ రోడ్డు మీద, అదీ ట్రాఫిక్ మధ్యలో ఉన్నాను అనే విషయం మర్చిపోయి కంగారుగా ఫోన్ తీసి హల్లో… అన్నాను.

కాని… ఆ ప్రాసెస్ లో… యూటర్న్ తీసుకుందాం  అనుకుంటూ… నాకు తెలీకుండా నేనే ఒక బస్ కిందకి వెళ్ళిపోయా… అది నన్ను గట్టిగా గుద్దటం… నా చేతిలో ఫోన్… నేను… నా బండి ఎగిరిపడ్డాం… నా తల నేలకి గట్టిగా తగిలింది… రక్తం కారుతోంది… నా కళ్ళు మూతబడుతున్నాయి… అంటే ఫోన్లో మాట్లాడుతూ… నా కళ్ళు ఫోన్ కోసం వెతుకుతూ మూతబడ్డాయి.

ఇపుడు ఈ క్షణం… నేను మా ఇంటి ముందు ఉన్నాను.

నా శవం మీద పడి నా కూతురు, నా భార్య ఏడుస్తున్నారు. ఒక పక్కగా కూర్చుని ఏడ్చే శక్తి లేక… మౌనంగా చూస్తున్నారు మా అత్త… మామ… నేను మౌనంగా అక్కడ జరిగేది చూస్తున్న.

కలని… చావుని ఎదిరించలేకపోయానా? లేక అత్త, మామలని కాపాడాలి అనే ప్రయత్నంలో నన్ను నేను బలి చేసుకున్నానా…? తెలియదు.

కాని చివరగా ఒక్కటి అర్థం అయింది మృత్యువుని మోసం చేయలేము అని… నాకొచ్చిన కల అబద్ధం అవ్వలేదు అని…!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!