మగువా మేలుకో..

మగువా మేలుకో..

 

రచన:సిరి

ఆకాశం  నక్షత్రాలు అనే చమ్కీలు అద్దిన నల్ల రంగు చీరలా మెరిసిపోతుంది. చిన్న పిల్లవాడు అమ్మ చీరకొంగు వెనుక దాక్కున్నట్టుగా చంద్రుడు మబ్బుల మాటున వుండిపోయాడు.
ఊరంతా చీకటి దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది.
ఒక గుడిసెలో మాత్రం నడిరాత్రి కూడా గుడ్డి దీపం రెపరెపలాడుతూ వుంది. వెదురుగుంజకు అనుకుని  వాడిపోయిన పువ్వులా కూర్చుంది ఆమె ఒంటరిగా. 
తుఫాను వస్తే నరుక్కుపోయి నీటి గుర్తులతో వున్న నేలలా ఆమె ముఖం మీద కన్నీటి చారలు కనిపిస్తున్నాయి.ఆమెకి ఇది రోజూ అలవాటే.
     ఆమెకి నాలుగు అడుగుల దూరంలో కింద పరిచిన దుప్పటి మీద ఒక ముసలావిడ పడుకుని వుంది.
ముసలావిడ దగ్గడంతో తన ఆలోచనల నుండి ఒక్క క్షణం బయటకి వచ్చి ఒకసారి ఆ ముసలావిడని చూసి తన ఆలోచనల్లో కూరుకుపోయింది. గత జీవితం రోజూ కళ్లముందే గిర్రుమంటూ వుంటుంది.

*****

ఆమె పేరు స్వాతి. కడుపేదరికంలో పుట్టింది. ఆమె నాన్న శంకరం. వ్యవసాయంలో నష్టం వచ్చి సంసారం ఈదలేక పురుగులమందు తాగి చచ్చిపోయాడు. అమ్మ లక్ష్మి భర్త మీద బెంగతో, కూతురుని ఎలా పోషించి పెద్దదాన్ని చేసి పెళ్లి చేయాలో అన్న దిగులుతో కాటికికాళ్లు చాచింది. స్వాతి నాయనమ్మ భద్రమ్మే స్వాతికి అన్నీ అయి పెంచింది. పొలాన్ని అప్పులోల్లు జమకట్టేసుకున్నారు. కూలీనాలీ చేసుకుని బ్రతికేవారు స్వాతి,భద్రమ్మ.

ఇద్దరు ప్రశాంతంగానే వున్న దానితోనే తృప్తిగా జీవించేవారు. వారికి తెలియదు ఈ ప్రశాంతమైన జీవితం ఒక పెను తుఫానులా మారిపోతుంది అని.

ఆ తుఫాను చట్రంలోకి స్వాతిని తీసుకువెళ్ళడానికి వచ్చాడు శివరాజ్.

శివరాజ్ ఆ ఊరి సర్పంచ్ రామరాజు కొడుకు. ఆ ఊరిలో మొదటి డబ్బున్న కుటుంబం వారిదే. రామరాజు, అతని భార్య రాజ్యంకి పరువు ప్రతిష్టల పిచ్చి. 

శివరాజ్ చిన్నప్పటి నుండి పట్నంలోనే వాళ్ళ అమ్మమ్మగారి ఇంట్లో వుండి చదువుకున్నాడు.

సెలవులకు కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. తల్లి బెంగపడుతుంది అని దసరా పండుగకి ఊరు వచ్చాడు.

దసరా పండుగ రోజు అమ్మవారి గుడి దగ్గర జాతర జరుగుతుంది ఆ ఊరిలో. శివరాజ్ కి ఇవన్నీ అలవాటు లేక,  చిన్నప్పటి నుంచీ సరిగ్గా ఊరిలో వుండక, అతనికి ఎక్కువ మంది స్నేహితులు లేరు. జాతరలో అతనికి పాలుపోక ఊరివైపుకి నడుస్తున్నాడు ఒక్కడే. ఎక్కువమంది జనాలు గుడిసమీపానికి చేరిపోయారు. కొంతమంది ఇంకా ఊరిలో ఇళ్ళదగ్గర ముస్తాబు అవుతున్నారు.

పక్షులు గూళ్ళవైపు తమ ప్రయాణం చేస్తున్నాయి. కనుబొమ్మల మధ్య బొట్టుబిళ్ళలా సూర్యుడు లేలేత ఎరుపు వర్ణంతో రెండు పడమటి కొండల మధ్య నుండి ఊరుని చూస్తున్నట్టుగా వున్నాడు. సరిగ్గా అదే సమయంలో చూసాడు శివరాజ్ అందాల బొమ్మలా వుండే స్వాతిని.

ఆ లేలేత సూర్య కిరణాల మీద పడుతుంటే పచ్చని పసుపుకొమ్ములా మెరిసిపోతుంది. తొలిచూపులోనే అతనికి స్వాతి నచ్చేసింది. ఆమె అతన్ని అలా దాటుకుంటూ వెళ్తుంటే… పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునికి అభిముఖంగా ఎలా తిరుగుతాడో అలా ఆమె వైపుకి తిరిగిపొయాడు. ఆ రోజు స్వాతి వెనుకే పచార్లు చేస్తునే వున్నాడు. అది స్వాతి కనిపెట్టిన ఊరికే వుంది.

  ఆ తర్వాత రెండు రోజులకి స్వాతి ఇంటికి కబురు వచ్చింది. అది ఏంటంటే! శివరాజ్ స్వాతిల పెళ్లి గురించి.భద్రమ్మ అయితే తన మనవరాలి జీవితం సుఖమయం అవబోతున్నందుకు సంతోషపడింది.

స్వాతి కూడా శివరాజ్ మీద ఇష్టాన్ని పెంచుకుంది.

స్వాతికి శివరాజ్ కి పెళ్లి జరిగిపోయింది.

      వాళ్ళ సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజే సరదాగా పొలం వెళ్లిన  శివరాజ్ కి పాము కరిచి అక్కడే చచ్చిపోయాడు. అప్పుడే ఒక పిడుగు నేల మీద పడినట్టు, ఆ వార్త ఊరంతా పాకింది… శివరాజ్ ఒంట్లో విషం పాకినట్టుగా. విషయం తెలిసిన స్వాతి కుప్పకూలిపోయింది. భద్రమ్మ మనవరాలి జీవితం చూసి విలవిలలాడిపోయింది.

రామరాజు, రాజ్యం  ఇద్దరూ స్వాతి దురదృష్టవంతురాలు అని, నష్టజాతకురాలు అని, తమ కొడుకు అందుకే ప్రాణం విడిచారు అని గ్రద్దల్లా పొడుచుకు తిన్నారు. అన్నిటినీ భరిస్తూ అత్తారింట్లో కాలం గడుపుతోంది స్వాతి.

*****

మేనక ఆ ఊరికి వ్యవసాయం రీసెర్చ్ పని మీద వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య ఆనంద్ కూడా వచ్చాడు. సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి మేనక. కాలానికి తగ్గట్టు మారిపోవాలని అనుకునే అమ్మాయి. మూడనమ్మకాలని కొట్టిపారేస్తుంది. సమాజానికి పనికివచ్చేవే ఆమెకి నమ్మకం. పనికి రాని విషయమే మూడనమ్మకం అని ఆమె ఉద్దేశ్యం.

        రామరాజు ఇంట్లో అద్దెకు దిగింది మేనక. అప్పుడే ఆమె కి స్వాతి గురించి తెలిసింది. ఆమె ముక్కుపచ్చలారని జీవితం వాడిపోయిన మల్లెలా ఉన్నందుకు బాధేసింది మేనకకి. స్వాతి చాలా బాగా నచ్చింది మేనకకి. తన అన్నయ్యకి స్వాతికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది. ఆనంద్ “సరే” అన్నాడు. 

      ఆనంద్ కి స్వాతి అందం, అణుకువ బాగా నచ్చాయి. అదే విషయం మేనకి కూడా చెప్పాడు. దానికి మేనక ఎగిరిగంతేసింది. విషయం స్వాతికి చెప్పింది. స్వాతి ససేమీరా ఒప్పుకోలేదు. “నేను వితంతువును ఇలాగే వుండాలి ఇంకో పెళ్లి చేసుకోను”  తెగేసి చెప్పింది.

*****

‘ఆనంద్ ఎంత ప్రేమగా మాట్లాడేవాడు…. తనని బాధ నుండి బయటకి రప్పించడానికి ఎంత ప్రయత్నించేవాడు. నవ్వించేవాడు. అవును ఆనంద్ ప్రేమ వుంటే జీవితాంతం ఇంకేం కావాలి అంత కంటే!

నువ్వు.. నీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు నవ్వుతూ వుండు’ ఇలా చెప్పేవాడు.

     ఆమెని వితంతువు ఇలాగే ఉండాలి. ఎవర్నీ కలవకూడదు, ఎవరితో సరిగ్గా మాట్లాడకూడదు, నవ్వకుడదు, మంచి బట్టలు వేసుకోకూడదు ఇలా ఎన్నో మూడనమ్మకాల నుంచి బయటకి తీసుకురావడానికి ఎన్నో చేసేవాడు. అతను ఇలా కూడా చెప్పేవాడు “ఈ ఊరిలో అమ్మాయిలకి చదువు చెప్పించాలి, అపుడే వారు ముందుకు వెళ్ళగలరు, అన్నిటి గురించి తెలుసుకోగలరు, ముందు తమ గురించి తాము తెలుసుకోగలరు, జ్ఞానం సంపాదించ గలరు”.

ఎంత గొప్పగా వున్నాయి అతని ఆలోచనలు. అతని ఆలోచనలు, మాటలు ఇంత ఉన్నతంగా వున్నాయి.

అతనితో జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో… అన్న తలపు రాగానే చిరునవ్వు విరిసింది స్వాతి ముఖంలో. మళ్లీ అత్త మామ గుర్తు రాగానే నీరుగారి పోయింది.

వారి గురించి ఆమెకి పూర్తిగా తెలుసు. సంవత్సరం పొడుగునా చూస్తూనే ఉంది వారిని.

     “నలుగురు ఏమనుకుంటారో అని భయపడొద్దు జీవితం నీది ఇలా ఎన్నాళ్ళు అని ఉంటావ్, వితంతువులు పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడా రాసి లేదు. నీ జీవితం ఎలా వుండాలో నువ్వే నిర్ణయం తీసుకో ” ఇలా ఎన్నో చెప్పి స్వాతిని ఆనంద్ తో పెళ్లికి ఒప్పించింది మేనక.

బీటలువారిన నేలలో చిరుజల్లులా… స్వాతి జీవితంలోకి వచ్చింది మేనక. కానీ! పొలంలో కలుపు మొక్కలు పంటని బాగుపడనీయవు అన్నట్టుగా… రామరాజు, రాజ్యం స్వాతి పెళ్లికి ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టించాలి అని గొడవచేసారు. స్వాతి వెనక్కి తగ్గిన మేనక ఒప్పుకోలేదు.

         తర్వాతి రోజు ఉదయమే పంచాయితీ. ఏం జరుగుతుందా అన్న ఆందోళన, బాధతో అలాగే గుడిసెలో గుడ్డి దీపం వెల్తురులో కన్నీరు కారుస్తూ తన జీవితం ఇంతేనా అనుకుంటూ వుంది స్వాతి.

****

కోడి కూతతో ఊరంతా మేల్కొంది. అందరికీ ఒకటే ఆత్రుత ఏం జగబోతోంది అని. అంతా పంచాయితీ జరిగే చోటకి చేరిపోయారు. రామరాజు పెద్దలందరని అనుకూలంగా మార్చుకుని స్వాతిని దోషిగా చేసి నిందిస్తూ వున్నాడు. తన పరువు ప్రతిష్ట కోసం. కోడల్ని కూతురిగా చేసుకుని పెళ్ళి జరిపిస్తే… ప్రతిష్ఠ పెరుగుతుంది అని తెలియక. మేనక వాదిస్తూ వుంది ఆనంద్ తో పాటు.

“వితంతువులు పెళ్లి చేసుకోకూడదు” ఒకరంటే.

“మళ్ళీ పెళ్ళా?” అని మరోకరంటే.

” ఇది ఎక్కడి చోద్యం!” అని ఇంకొరు అంటుంటే, తల ఎత్తుకోలేక పోయింది స్వాతి.

మేనక తోక తొక్కిన త్రాచులా లేచింది. బాధగా వున్న స్వాతిని చూసి, “మీరు మనుషులేనా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే… వాదించక నలుగురు తలో ఒక మాట అంటారా? మీ కూతుళ్లకు ఇలా జరిగితే! ఊరుకుంటారా?” మేనక . 

ఏ ఒక్కరూ జవాబు చెప్పలేదు. అందరిలోనూ ఒకటే గుసగుసలు.

అప్పుడే… సరిగ్గా అదే సమయంలో… 

ఒక పోలీస్ జీపు అక్కడ ఆగింది. ఊరంతా  ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ చూస్తున్నారు.

“స్వాతి పెళ్లి విషయంలో అడ్డుగా వచ్చినవారి అందర్నీ స్టేషన్ కి తీసుకు వెళ్తాం, వితంతు వివాహం చేయడం ఉత్తమం” ఎస్సై మోహన్ గారు వివరించారు.

ఊరిలో జనం కూడా వితంతు వివాహానికి మద్దతు పలికారు. ఒక్క రామరాజు, రాజ్యం తప్ప.

     ఎస్సై మోహన్ గారు రామరాజు దంపతులతో ఇలా అన్నారు… “చూడండి మీ పరువు ప్రతిష్ట కోసం ఒక అమాయకురాలు జీవితం దారపోయ్యకండి. మీ కోడల్ని కూతురిగా చేసుకొని పెళ్లి జరిపించండి. మీ పరువు ప్రతిష్టలు వందశాతం పెరుగుతాయి.

స్వాతికి పుట్టిన బిడ్డ మీ కూతురు బిడ్డగా మీ వారసునిగా మీ కొడుకు లేని లోటు తీర్చుతాడు” చెప్పడం ముగించాడు.

రామరాజు, రాజ్యంలో మార్పు వచ్చింది. రామరాజు స్వాతి ఆనంద్ ల పెళ్ళి దగ్గరుండి జరిపించాడు. భద్రమ్మ దేవుడికి దణ్ణం పెట్టుకుంది. తన మనవరాలి జీవితం బాగుపడినందుకు.

రామరాజు తన దగ్గర ఉన్న ఆస్తితో వితంతువులకి ఉపాధి కల్పించేలా కుట్టు మిషన్ లు, బుట్టల అల్లికలు, వస్త్రాలు నేయడం… ఇలాంటి ఉపాధి పనులతో ఆశ్రయం కల్పించాడు.

ఇప్పుడు రామరాజుకి పరువు ప్రతిష్టతో పాటు కీర్తి పెరిగింది అతని మంచి పనులతో. స్వాతిలాంటి ఎందరో అమ్మాయిలకి (వితంతువులకు) మంచి జీవితం అని అందించాడు.

ఇదంతా… మేనక ఆనంద్ లాంటి మానవత్వం వున్న మనుషుల మూలంగానే.

రామరాజులో మార్పు, ఎండిపోయిన పైరు వానజల్లుకి పెరిగిన పచ్చని పైరులా, స్వాతిలాంటి ఎందరో వితంతువుల జీవితం చక్కబడింది.

***

You May Also Like

One thought on “మగువా మేలుకో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!