రాముగారి పాత కుర్చీ

రచన – తపస్వి

నిమ్మగడ్డ వారి వీధి.. సర్కార్ తోట.. మచిలీపట్నం.. చుట్టూ బిల్డింగ్స్, మధ్య కాంపౌండ్ వాల్ కూడా లేకుండా రోడ్డు పక్కగా పిచ్చి చెట్ల మధ్య మట్టి కొట్టుకుపోయిన గోడలతో, ఎగిరిపోయిన తాటాకు కప్పుతో గంభీరంగా ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలను తనలో దాచుకుని ఒంటరిగా నిలబడింది ఆ ఇల్లు. ఒకరి తర్వాత ఒకరు అర్ధాంతరంగా ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికీ ఎవరికి జవాబు తెలియని ప్రశ్న…

కావాల్సినవాళ్ళే వాళ్ళని ఒక పథకం ప్రకారం చంపారని కొందరు, తండ్రి చేసిన పాపాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి అని మరి కొందరు, లేదు.. ఆ ఇంటి కొడుకు అనుకోకుండా ఏక్సిడెంట్ లో, తల్లి వయసు అయిపోయి, కూతురు ప్రేమ విఫలం అయ్యి ఆత్మహత్య చేసుకుంది అని మరి కొందరు మాట్లాడుకుంటారు. నిజం ఏంటి అనేది ప్రపంచానికి తెలీదు, కాని కొడుకు తర్వాత తల్లి.. ఆ తర్వాత కూతురు.. అందరూ నెల సమయంలోనే, అదీ ఆ కుటుంబ పెద్ద చనిపోయిన 6 నెలల లోపే చనిపోయారు.

ఆ ఇంటికి ఎదురుగానే మా నాన్నమ్మ ఇల్లు ఉండేది, సెలవులకి వచ్చినపుడు ఎదురుగా ఉండే ఆ ఇల్లుని చూసేవాడిని. ఆ ఇంటి వెనకాల ఒక జామచెట్టు ఉండేది, అది విరగ కాసేది, అదేం చిత్రమో… కాయలు లేకుండా చూసింది లేదు ఆ చెట్టుని. అలాగే సపోటా, మామిడి, నారింజ చెట్లతో పచ్చగా కళ కళలాడుతుండేది ఆ ఇల్లు.

ఆ ఇంటి అరుగు మీద ఒక గుడ్డ వేసి.. కాసిన కాయలు, పూలు కోసి అక్కడ పెట్టి ఆ దారిలో వచ్చిపోయే పిల్లలకి.. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి పంపించేది ఇంటి ఇల్లాలు సీతమ్మ. ఆవిడ చేతిలోని ప్రేమ వలనో, ఆ కాయల వల్లో తెలీదు కానీ అవి చాలా రుచిగా ఉండేవి. అందరితో కలివిడిగా, సంతోషంగా ఉండే వాళ్ళని చూసి అందరూ కొంచెం సంతోషంగా, మరి కొంచెం ఈర్ష్యగా చూసేవాళ్ళు.

అపుడపుడు మేము క్రికెట్ ఆడుకుంటుంటే ఆ ఇంటి పెద్దాయన, సీతమ్మగారు అరుగు మీద కూర్చుని చూస్తూ మమల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను 10thకి వచ్చేసరికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను చదువుకోవటానికి. కాని ఒంటరిగా ఉన్న ఆ ఇల్లుని చూసి బాధ వేసేది. అప్పటికే ఆ కుటుంబంలోని వాళ్ళ గురించి, దెయ్యాలు అయి తిరుగుతున్నారు అంటూ చాలా పుకార్లు విహరించసాగాయి.

అపుడపుడు చేతిలో జామకాయలుతో ఆవిడ అటు వచ్చి పోయే పిల్లల్ని పిలుస్తుంది అని, ఇంటి పెద్దాయన రాముగారు ఏమో అరుగు మీద కూర్చుని ఉంటున్నారు అని. కొడుకేమో బండి వేసుకుని తిరుగుతున్నాడు అని, కూతురేమో పక్కింటి టీ.వి యాంటేనాకి ఉరి వేసుకుని ఒకసారి, జామచెట్టుకి ఉరి వేసుకున్నట్టు ఒకసారి కనపడింది అంటూ. అవన్నీ విని నైట్ 10 దాటిన తర్వాత ఆ ఇంటి వైపు చూసి నడవాలి అన్న చాలా మంది భయపడేవాళ్ళు.

మాకు ఏదో ఒక మూల భయంగా ఉన్న భయం లేనట్టు నటిస్తూ ఆ ఇంటి ముందే క్రికెట్ ఆడుకునేవాళ్ళం. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి జామకాయలు కోసుకుని వచ్చేవాళ్ళం. మా పిల్లలకి అయితే ఎప్పుడూ ఏ విధమైన అసహజమైన సంఘటనలు ఎదురు కాలేదు.

ఒకసారి నేను కొట్టిన బంతి ఆ ఇంటి పైనుండి లోపల పడింది. బంతి నేనే కొట్టా కాబట్టి నేనే తీసుకురావాలి అనటంతో, నా ఫ్రెండ్ ఒకడు తోడు రావటంతో భయం భయంగా, ఆ ఇంటి వెనుక తలుపుని బలవంతంగా తెరుచుకుని లోపలకి వెళ్ళాం. విచిత్రంగా ఆ ఇంటిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి బూజుపట్టి , దుమ్ము పట్టి. నాకు గుర్తు ఉన్నంత వరకు ఆ ఇంటిలో ఉండాల్సిన వస్తువులు అన్ని అక్కడే అలాగే ఉన్నాయి.

కాని వాళ్ళు అందరూ చనిపోయాక ఆ ఇంటి వస్తువులు చుట్టాలు పంచుకుని పట్టుకుపోయారు అని మా నాన్నమ్మ చెప్పినట్టు గుర్తు. మరి ఇవన్నీ ఇలాగే ఎందుకు ఉన్నాయి అనిపించింది కాని,  బహుశా కావాల్సిన వస్తువులే తీసుకెళ్ళి ఉంటారులే అని అనుకున్నాం. బంతి తీసుకుని నేను, నా ఫ్రెండ్ బయటకి వస్తుండగా.. నా ఫ్రెండ్ చూపు హాల్ మధ్యలో ఉన్న కుర్చీ మీద పడింది. “రేయ్… ఈ కుర్చీ చూడు చెక్కది కదా, రేపు భోగి మంటల్లో వేయటానికి పనికి వస్తుంది” అంటూ నేను చెబుతున్న వినకుండా అది మాతో బయటకి పట్టుకు వచ్చి, భోగి మంటలు వేయటానికి మేము కావాల్సిన చెక్కలు, ఇంకా ఏవేవో పెట్టిన చోట పెట్టాడు.

మేము ఆడటం ముగించి.. అందరం తెల్లారి 4 గంటలకల్లా వచ్చి భోగి మంట వేయటం మొదలు పెట్టాలి అని అనుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్ళాం. అనుకున్నట్టే 4 గంటలకి భోగి మంట వేయటానికి సిద్ధం అయ్యాం, కాని తెచ్చిన అన్ని ఉన్నాయి కానీ.. ఆ పాత కుర్చీ లేదు, అది చూసి మొదట ఆశ్చర్యపోయాం తర్వాత… చూడటానికి బాగున్న కుర్చీ కదా రాత్రి ఎవడన్నా పట్టుకు పోయి ఉంటారులే అనుకుని మా పనుల్లో మేము పడిపోయాం.

సాయంత్రం వరకు పండగని బాగా గడిపి సాయంత్రం మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాం, మళ్ళీ అనుకోకుండా బంతి ఆ ఇంట్లో పడటంతో.. ఈసారి ఏ భయం లేకుండానే నిన్న నాతో వచ్చిన నా ఫ్రెండ్ తో కలిసి లోపలకి వెళ్ళాం. కానీ…… అక్కడ ఊహించని చిత్రాన్ని చూసి మా కాళ్ళు బిగుసుకుపోయాయి… మాకు మాటలు రాలేదు… భయంతో చెమటలు పట్టాయి.. ఇంకొక్క క్షణం అక్కడ ఉండలేక ఇద్దరం పరిగెత్తాం.. ఏ బంతి కోసం అయితే మేము లోపలకి వెళ్ళామో, ఆ బంతి మేము పరిగెడుతూ ఉండగా మా కాళ్ళ ముందు పడింది.

మేము అలా రావటం చూసి ఏమైందీ… అంటూ అందరూ మా చుట్టూ మూగారు.. ఏమైంది చెప్పూ అంటూ ఒకటే గొడవ… ఏమని చెప్పాలి… నిన్న మేము తీసుకొచ్చిన కుర్చీ లోపలే ఉందని.. ఆ కుర్చీలో రాముగారు కూర్చుని ఉంటే, సీతమ్మగారు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు అని.. మేము లోపలకి వెళ్ళగానే.. “ఏరా నా కుర్చీనే తీసుకెళ్తారా? మీ బంతి ఇవ్వను” అంటూ ఆయన నవ్వుతుంటే… “పాపం మన పిల్లలే కదా ఇవ్వండీ ” అంటూ ఆవిడ ఆయన చేతిలో బంతి తీసుకుని మా వైపే నవ్వుతూ చూస్తుంది అని…

చెప్తే ఎవరైనా నమ్ముతారా….??

అంటే….??? వాళ్ళ ఇంటి నుండి తీసుకెళ్లిన వస్తువులని వాళ్ళే తిరిగి తెచ్చేసుకున్నారా…???

***

You May Also Like

2 thoughts on “రాముగారి పాత కుర్చీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!