వానలు-వరదలు

వానలు-వరదలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కొల్లూరు నాగమణి

రామాపురంలో రంగయ్య ఓ మధ్య తరగతి రైతు. తలిదండ్రులు కాలంచేసేసినా, తన ఊరిలో చాలామంది పట్నానికి వలసపోతున్నా సరే తను మాత్రం భార్య లక్ష్మమ్మ, కొడుకులు నాగేషు, సోమేషులతో సహా అదే ఇంట్లో ఉండిపోయి, తలిదండ్రులుకి సరైన వారసుడై నిలిచాడు. వారిచ్చిన ఎడ్లబండి, రెండెకరాల మాగాణి, మూడెకరాల మిట్టభూములను, రెండు ఎడ్లను, ఆవునీ, కోళ్ళనీ చక్కగా చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ, మిగులు పంటను పట్నంలో అమ్ముకుంటూ, బీదబిక్కీలకు సాయపడుతూ తృప్తిగా రోజులు వెళ్ళదీస్తున్నాడు. పిల్లలిద్దర్నీ ఊర్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చదువులు పూర్తి చేయించేసి, తన వెంట వ్యవసాయం పనిలో తనకి ఆసరాగా ఉంచేసుకున్నాడు. అలా సాఫీగా జరిగిపోయే వారి జీవితంలో ఒకసారి హటాత్తుగా పెనుమార్పు చోటుచేసుకొని, అంతా అస్తవ్యస్తమైంది. ఆ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొంత వరిపంట, మిర్చిపంట వేశాడు. చక్కగా ఏపుగా పెరిగిన వరిపైరు నిండుగర్భిణీలాగ పొట్టతో ఉంది. దాగియున్న వరి వెన్నుల్లో గింజలు సిద్ధమవడానికి ముందు పాలుపోసుకుంటున్న రోజులు అవి. మరో చేనులో మిరప పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమై, ఆకు పచ్చటి రంగులో పుష్టిగా పొడవాటి మిరపకాయలు చిలుకల సమూహంలా కానవస్తుంటే, అక్కడక్కడ బాగా ముదిరిన కాయలు పండ్లు అయి, ఎర్రగా అందంగా చిలుకముక్కుల్లా ఉండి, మరింత గొప్పగా అనిపించేయి. అవి చూసి ఎంతో పొంగిపోయిన రంగయ్య ఈ సంవత్సరం ఎలాగైనా లక్ష్మమ్మకు బంగారు గాజులు కొనగలననుకున్నాడు. ఇంట్లోకి టీ.వి., ఒక సైకిలు, ఒక మోటర్బైక్, ఒక మంచి బీర్వా, ఇలా ప్రతీ సంవత్సరం ఏదో ఒకటి కొనగలుగుతున్నానని హాయిగా తృప్తిగా కాలం గడిపేస్తున్నాడు అంతవరకూ. అయితే, ఇపుడు ఈసారి ఘోరం జరిగిపోయింది. బ్రతుకే దుర్భరమైపోయింది. ఎప్పుడూ లేనిది భారీ వర్షాలు చోటు చేసుకొని, వారి బ్రతుకుల్ని చిందరవందర చేసేశాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా వారం పది రోజుల పాటు కురిసిన ఆ వానల్లో వరిపంట అంతా గర్భస్రావం అయిన చూలింతరాలిలా నేలకూలింది. చిలుకల గుంపులాంటి మిరపపంట అంతా యుద్ధభూమిలో శత్రువుల చేతిలో ప్రాణాలొదిలిన సైనిక సమూహంలా అయ్యింది. ఇల్లు కాస్తంత పర్వాలేదనుకుంటే, వంట వసారా గోడలు నానిపోయి, కూలిపోయింది. గాదె కూడా తడిసిపోయి, దాచుకున్న కాసిన్ని ధాన్యమూ పాడైపోయాయి. కోళ్ళు, ఎడ్లు కూడా బిక్కుబిక్కుమంటూ ఉసూరుమని ఉండిపోయాయి తన భార్యా పిల్లల్లాగే. వరదల కారణంగా రోడ్లన్నీ బాగా పాడైపోయాయి. ఎరువులకై పట్నం వెళ్ళిన తాను అతి కష్టం మీదగాని ఇంటికి తిరిగి రాలేకపోయాడు. భార్యకు దగ్గు జ్వరం వచ్చేసి, తీవ్రంగా బాధపడుతున్నాసరే వైద్యానికై ప్రక్కనున్న పట్టణానికి కూడా తీసుకెళ్ళలేక చాలా కుమిలిపోయాడు. బంగారు గాజులు కాదుకదా కనీసం తిండి గింజలైనా సరిగా సమకూర్చలేకపోయానని, భార్యకు మందులు ఇప్పించలేక ఓ వారం రోజులపాటు తీవ్రంగా బాధతో సతమతమయ్యే దీన స్థితిలో ఉంచాల్సివచ్చిందనీ వాపోయాడు. ప్రభుత్వం వారు వీళ్ళ ఊరికి వచ్చి, సహాయకార్యక్రమాలు చేస్తారేమోనని, ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. ఇలాగే ఎందరో కుదేలైన రంగయ్యలు. ఈసారి అర్ధంతరంగా కురిసిన వానలు వాటి కారణాన వచ్చిన వరదలు ఇలాంటి రైతులపాలిట శాపాలయ్యాయి ఇలా. ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటూనే ఉన్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!