కోరలు చాచిన డిజిటల్ భూతాలు

కోరలు చాచిన డిజిటల్ భూతాలు 

రచన  :: నాగ మయూరి

లాస్య, మధు దంపతులకు ఏకైక సంతానం పవన్. దంపతులు ఇద్దరూ అయిదంకెల జీతం సంపాదించే ఉద్యోగస్థులు.పైగా ఒక్కడే బిడ్డ కావడంతో పవన్ ని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు.

వాళ్ళు ఆఫీసు నుంచి వచ్చేలోపు బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదని అన్ని సౌకర్యాలు ఏర్పర్చడంతో పాటు ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారు.
సాయంత్రం పూట తను ఇంటికి రావడం లేటయితే కొడుకు ఆకలితో బాధ పడకూడదు అనే ఉద్దేశ్యంతో లాస్య కొంత పాకెట్ మనీ కూడా పవన్ కి ఇచ్చేది.

ఒకసారి లాస్యకి నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లు చూడగానే గుండెల్లో రాయి పడినట్లయింది.
కరోనా లాక్ డౌన్ కారణంగా దంపతులు ఇద్దరూ గత రెండు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. గడప దాటి ఎవరు అడుగు బయట పెట్టలేదు.
అలాంటిది తన బ్యాంక్ ఖాతా నుంచి దాదాపు మూడు లక్షల బిల్లు చూసి ఆశ్చర్యపోయింది.
వెంటనే భర్తకి ఈ విషయం చెప్పింది. సందేహం వచ్చిన మధు తన క్రెడిట్ కార్డు చెక్ చేస్తే .. దాంట్లోంచి కూడా ఆరు లక్షల వరకు ఖర్చు చేసినట్టు చూపించింది.

అనుమానంతో వారిద్దరు ఆన్లైన్ లో తనిఖీ చేస్తే ఏవేవో రకరకాల సైట్లకు డబ్బు పంపినట్లు ఉంది.
ఖచ్చితంగా తమ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని నిర్థారించుకున్న వారు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ లను సంప్రదించారు.

పోలీస్ ల విచారణలో ఇదంతా చేసింది టెన్త్ క్లాస్ చదువుతున్న తమ కొడుకే అని నిపుణుల ద్వారా తెలిసింది….

పవన్ తల్లి ఇచ్చిన పాకెట్ మనీ అంతా స్నేహితుల కోసమే ఖర్చు చేసేవాడు.దానితో అతని చుట్టూ చాలామంది స్నేహితులు చేరేవారు.

ఈ మధ్య తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండటంతో లాస్య కావల్సినవన్నీ అమర్చి పెడుతూ, కొడుకి డబ్బులు ఇవ్వటం మానేసింది.

దానితో పవన్ స్నేహితుల ప్రోద్బలంతో గేమింగ్ యాప్ ఇచ్చే పాయింట్ ల ద్వారా అయితే ఎక్కువ డబ్బులు సంపాదించచ్చు అని వాటిని వాడటం మొదలు పెట్టాడు.

ఆ యాప్ లు కూడా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మొదట్లో ఎక్కువ పాయింట్ లు ఇస్తాయి. దాంతో స్కూల్, కాలేజీ స్టూడెంట్స్‌ గంటల కొద్దీ గేమింగ్‌ చేస్తూనే ఉంటారు. ఎక్కువ పాయింట్స్‌ పొందాంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో ఆ డబ్బును ఎక్కడి నుంచి రాబట్టాలా అని దారులు వెతుకుతారు.

పవన్ కూడా అలా వాటి మాయలో పడి డబ్బుల కోసం తల్లిదండ్రులకి తెలియకుండా వారి అకౌంట్ ని వాడుతూ, వారి ఫోన్ లకు ఓ.టి.పి వచ్చే సమయానికి స్నేహితులకి ఫోన్ చేయాలనో, ఆన్లైన్ క్లాస్ లకి తనఫోన్ లో సిగ్నల్స్ లేవనో… రకరకాల కారణాలు చెప్పి ఫోన్ తీసుకుని వచ్చిన ఓ.టి.పి లని వెంటనే డిలేట్ చేసేసేవాడు.

ఓటీపీ డెలిట్‌
విషయం తెలిసి లాస్య, మధులు ఆశ్చర్యపోయారు. స్మార్ట్‌ఫోన్‌ తమ జీవితాల్లో నింపుతున్న అల్లకల్లోలాన్ని తెలుసుకున్నారు. తమ కంటి పాపని జాగ్రత్తగా చూసుకోలేకపోయామే అని బాధపడ్డారు.

తమ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి, నిపుణుల కౌన్సెలింగ్‌తో కొడుకులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

పిల్లలు వారి మానాన వారు ఫోన్లో ఉన్నారు కదా అనో, వీడియో గేమ్స్‌ ఆడుకుంటున్నారు కదా అనో పర్యవేక్షణలో లోపం జరిగితే “కోరలు చాచిన డిజిటల్ భూతాల” వల్ల కోలుకోలేనంత అనర్థాలు తలెత్తుతుతాయి.కాబట్టి ముందే గుర్తించి కట్టడి చేయడం మేలు చేస్తుంది.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!