భరోసా

భరోసా

రచన:: కమల ముక్కు (కమల’శ్రీ’)

“ఎందుకలా ఆలోచిస్తున్నారు ఓసారి ఫోన్ చేసి కదపండి.” అంటూ రామలింగం పక్కనే కూర్చుంది అతని భార్య శారద.

“కానీ ఎలా అడిగేదే. వాళ్లేమనుకుంటారో ఏంటో?.” తటపటాయిస్తూ అన్నాడు రామలింగం.

“ఎందుకు అనుకుంటారండీ.మంచి సంబంధం వచ్చింది. పిల్లాడు మంచివాడు. గుణవంతుడు. అంత మంచి సంబంధం ఎంత వెతికినా దొరకదు?. ఆలోచించకుండా ఫోన్ చేయండి.” అంటూ ఫోన్ తెచ్చి రామలింగం చేతిలో పెట్టింది శారద.

“హుమ్ సరే.” ఫోన్ అందుకుని తన తమ్ముడు ఆనంద రావు కి ఫోన్ చేశాడు.

“హాలో అన్నయ్యా చాలా రోజులకి ఫోన్ చేశావు. ఎలా ఉన్నావు? వదినా, స్రవంతీ ఎలా ఉన్నారు?.” అంటూ కుశల ప్రశ్నాలు వేశాడు ఆనంద రావు.

“బాగానే ఉన్నాము రా.నువ్వెలా ఉన్నావు?.రజనీ, పిల్లలూ బాగున్నారా?!.” అంటూ పరామర్శించాడు.

“బాగున్నాం అన్నయ్యా.”అంటూ ఆ మాటా ఈ మాటా మాట్లాడి “హా అన్నయ్యా చెప్పడం మరిచాను. మా రజనీ వాళ్ల అన్నయ్య గారి కొడుకు సంపత్ ఉన్నాడు కదా.మంచి వాడూ, బుద్దిమంతుడు, అంతకు మించి మనకి తెలిసిన వాడు, మన స్రవంతి కి ఈడూ జోడూ. రజనీ ఎప్పటి నుంచో చేసి మీ అభిప్రాయం కనుక్కోమని చెప్పింది. మీరేమంటారు అన్నయ్యా?.” అన్నాడు ఆనంద రావు.

తమ్ముడు ఆ మాట అడగ్గానే చివుక్కుమంది. ‘ఆ సంపత్ ఎలాంటి వాడో అందరికీ బాగా తెలుసు. తాగుతాడనీ, పెద్దలంటే గౌరవం లేదనీ, ఆడపిల్లల్ని ఏడిపించే రకం అనీ వినికిడి. అలాంటి వాడికి తన కూతుర్ని అడగమని ఎలా చెప్తారు అసలు.అయినా వాళ్ళకీ ఓ కూతురు ఉందిగా ఆమెనే వాడికి ఇచ్చి చేయొచ్చు గా. వారికైతే మంచి పిల్లాడు కావాలి. మాకైతే అవసరం లేదా. నా కూతురు వాడికీ కూతురే కదా. ఎలా అడగగలిగాడు అసలు.వాడికి మాత్రం తెలీదా ఆ సంపత్ కోసం.’అనుకుంటూ

“నేనూ అదే విషయం మాట్లాడుదామని ఫోన్ చేశానురా. మన స్రవంతి కి మంచి సంబంధం వచ్చింది. మంచి వాళ్ళు, ఇద్దరికీ ఈడూ,జోడూ బాగా కుదిరింది. వాళ్ళకి మన స్రవంతి బాగా నచ్చింది. కాకపోతే కట్నమూ, లాంఛనాలు, బంగారం, పెళ్లి ఖర్చులూ అన్నీ కలిపి ఓ కోటి వరకూ అవుతుంది రా. నా దగ్గర ఉన్నవీ, అప్పుడప్పుడూ స్రవంతి పేరు మీద దాచినవీ, పి.ఎఫ్. డబ్బులు అన్నీ కలిపితే యాభై లక్షలు అవుతుంది రా. మన ఊరిలో నాన్న మన పేరున రాసిన పొలం ఉంది కదా దాన్ని అమ్మకానికి పెడితే…” అంటూ అసలు విషయం చెప్పాడు రామలింగం.

“ఆ భూమి కి ఇప్పుడు రేటు తక్కువ ఉంది.ఇప్పుడు అమ్మితే మనకి తక్కువకే వస్తుంది.మరో ఏడాది ఆగితే మంచి ధరలు పలుకుతాయి.అందుకనీ ఓ ఏడాది వరకూ ఆగుదాం అన్నయ్యా. పోనీ నేనే మన్నా అడ్జస్ట్ చేద్దామని అనుకుంటే మొన్ననే ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి అంత మొత్తం లేవు.” అన్నాడు ఆనందరావు.

“సరే రా.” అని ఫోన్ పెట్టేశాడు రామలింగం.

“ఏమన్నాడండి ఆనందు?.”అంది శారద.

అతడు అన్నది మొత్తం చెప్పి “ఎలా అడగాలని అనిపించిందో వాడికి నా బంగారు తల్లి ని ఆ సంపత్ గాడికి ఇవ్వమని, పోయి పోయి అలాంటి వాడికి పిల్లనిస్తే చేతులారా జీవితం నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఆ పిల్ల తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసే అడిగాడు.” అన్నాడు భాదగా.

“అయినా ఆ భూమి మీ ఇద్దరు అన్నదమ్ములకు చెందుతుంది.అతను వద్దంటే అమ్మకుండా ఉంటే మరి మిగతా సొమ్ము ఎలా సర్దుతారు?.”

వాడు కాదన్నప్పుడు అమ్ముతానని అంటే తక్కువ ధర పలికెలా చేస్తాడు. అసలే వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళు అమ్మాలని అనుకుంటే ఎక్కువ వస్తాయి డబ్బులు, వారికి అవసరం లేనప్పుడు తక్కువ ధర పలికేలా చేస్తాడు. ఏదైనా అంతా రియల్ ఎస్టేట్ వాడి చేతుల్లోనే ఉంటుంది. నేనే ఏదో మార్గం ఆలోచిస్తాను.” అని ఫోన్ అందుకుని ఎవరెవరికో ఫోన్ లు చేస్తూ ఉన్నాడు.

ఇంతలో తన ఫోన్ మ్రోగడం తో లిఫ్ట్ చేసి హాలో అంది శారద.

“అక్కా! బాగున్నావా?.” అంటూ చెల్లెలు సావిత్రి పలకరింపు.

“హా బాగున్నానే.” అంది నీరసం గా.

“ఏమయింది అక్కా ఎందుకు అలా ఉన్నావు?.” కంగారుగా అడిగింది సావిత్రి.

“ఏం లేదు సావిత్రీ మన స్రవంతికి ఓ మంచి సంబంధం వచ్చింది.” అని విషయం మొత్తం చెప్పింది శారద. అంతా విన్న సావిత్రి “అక్కా! నేను మళ్లీ చేస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసింది.

“ఇదేంటిది మొత్తం వింది. కనీసం ఓ మాటైనా అనకుండా మళ్లీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. దాన్ని ఏదైనా సహాయం అడుగుతానని అనుకుందో ఏమో?. అయినా ఎలా అడుగుతాను దానికీ ఓ ఈడొచ్చిన కూతురు ఉందిగా.” అనుకుంటూ రామలింగం వైపు చూసింది. ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

కాస్త తలనొప్పి గా అనిపించి రెండు కాఫీలు కలిపి రామలింగానికి ఒకటి ఇచ్చి తనూ త్రాగుతూ చైర్లో కూర్చుంది. ఇంతలో ఫోన్ మళ్లీ మ్రోగడంతో లిఫ్ట్ చేసి హలో అంది.

“మేమున్నామని అనుకున్నావా లేమనుకున్నావా. నువ్వు కష్టంలో ఉంటే ఓ చేయి వేయలేమనా నీ అభిప్రాయం?!.” చిన్న చెల్లెలు శాంభవి.

“అసలేం మాట్లాడుతుందో అర్థం కాక…ఏమంటున్నావే శాంభవీ?.!” అంది ఆశ్చర్యంగా.

“స్రవంతి నీకేనా కూతురు. మాకు కాదా. మా అక్క కూతురు సంతోషంగా ఉంటే మాకూ సంతోషమే గా. సంబంధం విషయం, కట్నం విషయం మాకు చెప్పనే లేదు. మేమంత కానివారిమైపోయామా అక్కా నీకూ.” నిష్టూరాలు మొదలుపెట్టింది.

“అదికాదు శాంభవీ మొన్ననే నీ కొడుకు మెడికల్ సీట్ కోసం చాలా డబ్బులు కట్టావు నిన్నెలా అడిగేది చెప్పు.”

“అయితే నాకు చెప్పాలా వద్దా. నీలో నీవే బాధపడుతూ ఉంటే సమస్య తీరిపోతుందా. పాపం బావగారు ఆ డబ్బుల కోసం ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారో ఏంటో. ముందు ఆ ఫోన్లు ఆపి ఓసారి బావ గారిని రమ్మను. స్పీకర్ ఆన్ చేయు నేను ఆయనతో మాట్లాడుతాను.” అంది శాంభవి.

శారద పిలవడం తో ఫోన్ ఆఫ్ చేసి వచ్చి శారద పక్కన కూర్చుని “చెప్పు శాంభవీ” అన్నాడు రామలింగం.

“బావగారూ అమ్మాయి పెళ్లి విషయమై మీరేమీ హైరానా పడిపోకండి. ఆ మిగిలిన డబ్బులు నేనూ, సావిత్రీ సర్దుతాము.” అంది శాంభవి.

“శాంభవీ ఏం మాట్లాడుతున్నావే. అంత డబ్బులు ఎలా సర్దుతారు?!.” ఆశ్చర్యంగా అడిగింది శారద.

అక్కా మా అనూష పెళ్లికని కొంత డబ్బు లు దాచిపెట్టాము, ఈ మధ్యే ఏదో ఫ్లాట్ బాగుంది కొందామని ఆయన కొంత అట్టే పెట్టారు. ఫ్లాట్ దేముందక్కా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు.మంచి సంబంధం మళ్లీ మళ్లీ రాదుగా… లైన్ లోనే ఉన్న అంది.

“మా ఆయనకి అడిగాను అక్కా ఓ పది లక్షలు ఉంటుంది తన దగ్గర అన్నారు.నా బంగారం కుదువ పెడితే ఓ ఐదు లక్షల వరకూ వస్తుంది. సరిపోతుంది కదా. చాలకపోతే ఆయనే ఎలాగోలా అడ్జస్ట్ చేస్తానని చెప్పారు. అవసరానికి అక్కాచెల్లెళ్లు సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు. రేపు మాకు అవసరం అయితే నువ్వు చేయవా ఏంటి?. శాంభవి అనడంతో భార్యాభర్తలిద్దరికీ ఆనందంతో నోట మాట రాలేదు.

అన్నదమ్ముడు నేనేమి చేయలేనని చేతులెత్తేస్తే, శారద అక్కాచెల్లెళ్ళు మేమున్నామంటూ చేయందిస్తా మంటుంటే వారిద్దరి ఆనందానికి అవధులు లేవు.

సరే మరి మీ ఆయనలతో ఓ మా…ట…” నెమ్మదిగా అన్నాడు రామలింగం.

“వాళ్లూ లైన్ లోనే ఉన్నారు. మాట్లాడండి.” అంది సావిత్రి.

“అన్నయ్యా మేమున్నాం. అందరం కలిసి మన స్రవంతి పెళ్లి ధూం ధాం మని చేద్దాం. మీరేమీ కంగారు పడకండి. పెళ్లి వాళ్లకి ఫోన్ చేసి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో కనుక్కోండి. ఆ రోజుకి మేమంతా ఇంటికి చేరుకుంటాం.” అన్నారు తోడల్లుల్లిద్దరూ.

వాళ్లకి ఫోన్ చేసి చెప్తామని ఫోన్ కట్ చేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్కరకు రారు, అక్కాచెల్లెళ్లే ఆపదలో చేయూత నిస్తారు.’ అనుకుంటూ పెళ్లి వారికి ఫోన్ చేశారు ముహూర్తం ఎప్పుడు పెడదామో కనుక్కోవాలని.

మరో నెల రోజుల్లో స్రవంతి పెళ్లి, రవికిరణ్ తో అంగరంగ వైభవంగా జరిగింది.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!