స్పర్శానందం
రచన: నెల్లుట్ల సునీత
ఇంద్రధనస్సు మురిపించును ప్రతి మనసును
శ్వేత వర్ణపు సమ్మిళితమై
ఏడు రంగులు ఏకమై
బ్రహ్మ సృష్టికి శ్రీకారమై
సప్త వర్ణాల సుందర హేల
ఆకాశవీధిలో అద్భుతాల మేళా
విశ్వంలో ఏడు వింతల సంకేతమై
వైజ్ఞాన అన్వేషికై
సైన్స్ సూచికగా
వరుణుడి విరామంలో
జాలువారుతున్న చినుకు దారల్ని ఛేదిస్తూ
అల్లుకున్న మెరుపుల కాంతి కిరణం
ప్రసరించిన రంగుల ఆకృతి
ప్రకృతి రహస్యాల స్వీకృతి
మబ్బు తెరలు తొలగిస్తూ
మనసు పరవశించే అపూర్వ వర్ణ చిత్ర సంయోగం
గగనతలమంతా శోభాయమానం
ప్రతి మదిని దోచే దొంతరలు
బాల్యపు జ్ఞాపకాల స్మృతులు
ఉప్పొంగిన హృదయాలు
రంగుల సాకారమైన కళలు
ప్రతి వర్ణానికి సందేశం
అందరికీ మార్గనిర్దేశం
ఆశల ఆశయ సాధనమై
హరివిల్లు స్పర్శనందాన్ని తాకాలనే ఈ ఆశ.