మారుతీ స్తుతి
రచయిత :: డా.అడిగొప్పుల సదయ్య
జననమొందుతు నీవు వినువీధి నెగిరితివి
రవిని ఫలమని తలచి చవులూర మింగితివి
అంజనీ వాయులకు అనుగుపుత్రుడవీవు
వాలిసుగ్రీవులకు మేలు మేనల్లుడవు
సుగ్రీవు మంత్రివై సునిశితంబగు బుద్ధి
శ్రీరామమూర్తితో చెలిమి చేయించితివి
సింధువును లంఘించి సింహళము జేరితివి
శింశుపావనములో సీతమ్మ గాంచితివి
రామముద్రికనిచ్చి లంక దహనము జేసి
రయముగా నేతెంచి రామునికి తెలిపితివి
రావణుని చెరనుండి రామ సీతను కావ
రాతి సేతువు గట్టి లంకలో చొచ్చితిరి
నాగాస్త్రమున పడిన నాలక్ష్మణుని లేప
సంజీవి పర్వతము సత్తువను తెచ్చితివి
కుంభకర్ణుని సహా కుటిల రావణు ద్రుంచి
సీతమ్మ చేతిగొని శ్రీరామచంద్రుండు
నిజపురికి వెళ్ళుటకు నెయ్యమును నెరిపితివి
జయ వీర! హనుమంత! జయ భక్తి శ్రీమంత!