ఆత్మ జ్ఞానం
రచన: లహరి
అసలు నేను ఎవరిని???
చూపులకందని శూన్యాన్ని,
రెక్కలు రాలిపడ్డ నక్షత్రాన్ని,
విషాదపు ఘంటికలో
వినపడుతున్న ఆత్మఘోషని
గుండె లోతుల్లో పేరుకొన్న మౌనాన్ని,
ఏ వెలుతురూ దరి చేరని చీకటిలో
కొడిగడుతున్న దీపాన్ని,
ఎడారిలో ఎండమావిలాంటి,
ప్రేమానురాగాల, ఆప్యాయతల
నిత్యాన్వేషినై నడక సాగిస్తున్న
బహుదూరపు బాటసారిని,
నేను యువ తరాన్ని,నవ తరాన్ని,
భావితరాలను నడిపించే మరో తరాన్ని,
అలలు లేని కడలి వైపు
ఆలోచనలు లేని ప్రశాంతత వైపు
గుర్తుకురాని జ్ఞాపకాల వైపు
కన్నీరింకిన హృదయం వైపు
ప్రయాణిస్తూ నేను ఎవరో
తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నదాన్ని…
ప్రతి నిమిషానికి లెక్క చూస్తూ
నన్ను నేను గుర్తు చేసుకుంటున్నదాన్ని..
జీవితం నేర్పే విలువైన పాఠాలు నేర్చుకుంటూ..
నన్ను నేను మార్చుకొంటూ.. !
Superb
Thank u sis