అక్షరమే ఆయుధం

“అక్షరమే ఆయుధం “

-బూర్గు గోపికృష్ణ

అక్షరంతో సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయులు వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీల స్ఫూర్తితో తన సొంత గృహంలో లీడ్ విజ్ఞాన భాండాగారాన్ని స్థాపించారు కాసుల రవికుమార్.

వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి చెందిన రవి కుమార్ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తూ మంచి కవిగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా పేరు గడించారు.

2007 సంవత్సరంలో “LEAD” కార్యక్రమాన్ని ప్రారంభించి గత 15 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ప్రతి వేసవిలో, సెలవుదినాల్లో ఉచితంగా విద్యను అందిస్తూ, వారికి కెరీర్ గైడెన్స్ అందిస్తున్నారు.

నిత్యం సామాజిక సాహిత్య కార్యక్రమాల్లో నిమగ్నంఅవుతూ, తన సొంత ఇంటిలో గ్రంథాలయాలన్ని నిర్మించి పిల్లలకు ఉపయోగపడే వివిధ రకాల పుస్తకాలను, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంచారు.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే విధంగా వివిధ అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహిస్తూ, ఇంగ్లిష్, సైన్స్ పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో” అని చెప్పిన కందుకూరి వీరేశలింగం గారి వారసత్వాన్ని మోస్తూ నూతన గ్రంథాలయాల స్థాపనకు పూనుకొని ఎందరికో పేద విద్యార్థులకు చేయూతనిస్తూ, గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకువస్తున్న రచయిత కాసుల రవికుమార్.

గ్రంథాలయ స్థాపన ముఖ్య ఉద్దేశం సామాజిక, సాహిత్య చైతన్యం అని, “పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం” అన్న లీడ్ నినాదమే ప్రధాన లక్ష్యంగా నిరుపేద విద్యార్థుల జీవితాల్లో చదువు ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుందని తెలియజేసే ప్రయత్నం నిరంతరంగా కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.

“ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం”. బతుకు భరోసానిస్తూ, ధైర్యాన్ని కల్పించి, చీకటి జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించే శక్తి గల పుస్తకాలను గొప్పగా ప్రేమించే వ్యక్తి కాసుల రవికుమార్.

* వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు,రచన ప్రవృత్తి, చదువులో విజ్ఞానాన్ని పంచుతూ విద్యార్థుల జీవితాల్లో మంచి స్థానం సంపాదించారు రవికుమార్ మాస్టర్.

* పుస్తకాలు అందుబాటులో లేక, సరైన మార్గనిర్దేశం చేసే వారు లేక పుస్తక పఠనం తగ్గిపోతున్న

నేటి డిజిటల్ ప్రపంచంలో “లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని స్థాపించి

తన ఇంటిని గ్రంథాలయంగా మార్చడమే కాక, లీడ్ లిటరరీ సెంటర్ మరియు తన కారుని లీడ్ కార్(సంచార) లైబ్రరీగా మార్చి మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు, ఆదివాసీ విద్యార్థులకు కూడా పుస్తకాలను చేరవేస్తున్నారు. పుస్తకం ద్వారా మేధస్సును, ప్రతిభను పెంచుతున్నారు.
లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ వేదికగా ఈ సంవత్సర కాలంలో వివిధ పాఠశాలలు మరియు పరిసరగ్రామాల్లో 14 గ్రంథాలయాలలో స్థాపించారు.

“పాలిటెక్నిక్ పూర్తి చేసినా సరైన ఆర్థిక వనరులు లేక ఇంజనీరింగ్ చదవలేకపోయినట్లు, అయినా నిరుత్సాహపడకుండా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేసి, ఎడ్ సెట్ లో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించినట్లు ఆయన అన్నారు. సరైన వనరులు, ప్రోత్సాహం లేక సివిల్స్ సాధించలేకపోయినట్లు, ఇప్పుడు లీడ్ ద్వారా వేల మంది విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఎంతో ప్రతిభ ఉండి కేవలం సరైన ప్రోత్సాహం, గైడెన్స్ లేని వాళ్లకు అన్ని విధాల సహకరించడమే లీడ్ ఉద్దేశమని రవికుమార్ తెలిపారు. లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ముఖ్య నిర్వాహకురాలిగా తన భార్య శోభా రవికుమార్ పూర్తి సహకారాన్ని అందిస్తున్న ట్లు ఆయన అన్నారు.

ఆకాశంలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న రాకెట్లకు అక్షరమనే నిప్పును అంటించడమే లీడ్ కర్తవ్యం అని వారు తెలిపారు. 

 గత ఐదు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

లీడ్ కార్యక్రమాల నిర్వహణకై ప్రతి నెలా తన వేతనంలో 33 శాతం కేటాయిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు పడుతున్నారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉచిత స్టడీ మెటీరియల్స్, ఉచిత ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు.

ఇంగ్లిష్ ఉపాధ్యాయునిగా పట్టుదల, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రవికుమార్. ఆంగ్లం అంటే అధైర్యపడకుండా అవగాహన పెంచుకుంటే దానిపై పట్టు సాధించవచ్చునని రవి కుమార్ గారు చాటిచెప్పారు.

*2021 నవంబర్ 21 ఆదివారం రోజున లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు, ఉత్తమ సమాజ సేవకులను గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు కాసుల రవికుమార్.

* కృషి వుంటే మనుషులు రుషులవుతారు అన్నటువంటి నినాదంతో ఎదిగిన వ్యక్తి కాసుల రవికుమార్. ఇతరులకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే తత్వం ఆయన చేతల్లో కనిపిస్తుంది.

విద్యార్థులకు లీడ్ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించి, విద్యార్థులలో ధైర్యాన్ని నింపుతూ గ్లోబల్ ఇంగ్లిష్ గ్రామర్ బుక్ సిద్ధం చేశారు. ఈ పుస్తకాన్ని 3,000 మంది విద్యార్థులకు ఉచితంగా అందజేశారు.

 పేదరికం పై యుద్ధానికి చదువే ఆయుధం అని సమాజంలో అసమానతలను రూపుమాపుతూ గ్రంథాలయాన్ని స్థాపించి విద్యార్థులను నేటి యువతను చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.

లీడ్ వెల్ఫేర్ సొసైటీ నర్సంపేట వ్యవస్థాపకులుగా,లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ, లీడ్ లిటరరీ సెంటర్, గత 15 సంవత్సరాలుగా లీడ్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహిస్తున్నారు.

* జిల్లా స్థాయి ఉత్తమ యువ పురస్కారం- 2016, గోక లీలావతి మెమోరియల్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు, లయన్స్ క్లబ్ వారి బెస్ట్ టీచర్ అవార్డ్ పొందిన కాసుల రవికుమార్ ప్రముఖుల అభినందనలు, ప్రశంసలు పొందడం గర్వించదగ్గ విషయం.

* లీడ్ లైబ్రరీ వేదికగా మరిన్ని గ్రంథాలయాల స్థాపన, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఆయన తెలిపారు .

* ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అట్టడుగున ఉన్న ప్రతి విద్యార్థికి నైపుణ్యం కూడిన విద్య అందేలా సేవా భావంతో పరితపిస్తున్న వ్యక్తి రవికుమార్

*లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ నిరంతర కృషి అనతికాలంలోనే చెప్పుకోదగ్గ గ్రంథాలయ ఉద్యమంగా ఏర్పడింది. గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా నూతన ఉద్యమానికి నాంది పలికారు. సమాజ పరిస్థితులను ప్రతిబింబించే విజ్ఞాన గ్రంథాలను ప్రజలకు చేరవేస్తూ, రేపటి తరాన్ని చైతన్య పరుస్తున్న రవికుమార్ కొనసాగిస్తున్న ఆశయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆశిస్తూ, ప్రతి మారుమూల పల్లెలో కూడా ఒక గ్రంథాలయం ఉండాలని కోరుకుందాం!

గ్రంథాలయ విజ్ఞాన అభినందనలతో….

-బూర్గు గోపికృష్ణ

You May Also Like

2 thoughts on “అక్షరమే ఆయుధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!